డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డుమీద వేగంగా దూసుకుపోతున్న కార్లనీ స్కూటర్లనీ తప్పించుకుంటూ రోడ్ క్రాస్ చేసి బస్టాప్ దగ్గరకొచ్చి నిలబడింది హరిత.
యవ్వనం తాలూకు నిగారింపుతో మెరుస్తున్న పచ్చని శరీర వర్ణం.. పల్చని చెంపలు, అమాయకత్వాన్ని దాచుకోలేని ఆల్చిప్పల్లాంటి కళ్ళూ, చూసిన వాళ్ళెవరినీ ఆమె ముఖం మీద నుంచి చూపు తప్పించుకోనీయకుండా చేస్తే, ఆ ఆకర్షణ నుంచి తప్పించుకుని చూపులు క్రిందికి దింపగల ధీరోదాత్తుడెవరైనా వుంటే అంతటి అదృష్టవంతుడింకెవరూ వుండరనిపించేలా వుంటుంది ఆమె శరీరాకృతి!
బైక్‌మీద వెళ్తున్న ఒక టీనేజ్ కుర్రాడు యథాలాపంగా బస్టాప్ వైపు చూస్తూ ఆమెని చూసి చూపు తిప్పుకోలేక అలాగే చూస్తూ పక్కనే వెళ్తున్న మరో బైక్‌ని ఢీకొట్టబోయి సడెన్ బ్రేక్ వేసి దాదాపు స్కిడ్ అవబోయి నిలదొక్కుకున్నాడు. యాక్సిడెంట్ తృటిలో తప్పింది.
తలంటిపోసుకున్న ఆమె జుట్టు ఇంకా పూర్తిగా ఆరలేదు. తెల్లటి చుడీదార్లో మంచు స్నానం చేసిన మల్లెపూవులా వుందామె. జాగ్రత్తగా గమనిస్తే అంతటి అందమైన ఆమెలో ఒకే ఒక్క లోపం స్పష్టంగా కనిపిస్తుంది.. ముఖంలో ప్రశాంతత లేకపోవడం! కోటి భావాలని ఒక్కసారిగా పలికించగల కళ్ళలో జాగ్రత్తగా గమనిస్తే కనిపించే ఏవో నీడలు...
ఒకసారి వాచీ చూసుకుని తమ కాలేజీ వైపు వెళ్ళే బస్ వస్తోందేమోనని చూస్తున్న ఆమె తన పక్కనెవరో వచ్చి నిలబడ్డారని గమనించి తల తిప్పి పక్కకి చూసింది. అప్పుడే ఆమె పక్కకి వచ్చి నిలబడ్డ వ్యక్తి ఆమె తల తిప్పి తన వైపు చూడగానే చిన్నగా నవ్వాడు.
తనని చూసి నవ్వుతున్న ఆ అపరిచిత వ్యక్తి వంక అనుమానంగా చూసిందామె. ముప్ఫై ఐదేళ్ళుంటుందేమో అతడి వయసు. సన్నగా ఎక్సర్‌సైజ్ చేసిన శరీరంతో, మిలట్రీ కటింగ్ లాంటి హెయిర్ స్టైల్, కళ్ళకి ఖరీదైన నల్ల కళ్లద్దాలతో చూడగానే పోలీస్ మనిషని తెలిసేలా వున్నాడు.
‘‘హరిత అంటే మీరేనా?’’ అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూనే.
హరిత ఒక్క క్షణం తత్తరపడింది అతడి ప్రశ్నకి. ‘‘అవును. మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు?’’ అంది ఖంగారుగా.
అతడు చిన్నగా నవ్వి అన్నాడు ‘‘నా పేరు పాణి. డిటెక్టివ్‌ని. చిన్న పని వుంది. మీతో కొంచెం మాట్లాడాలి’’.
హరిత మరింత ఖంగారుగా చూసింది. ‘‘నాతో ఏం పని మీకు?’’ అంది.
‘‘మీ ఫ్రెండు భరణి మొన్ననే ఊరు చివరనున్న వాళ్ల గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ కేసును నేను పరిశోధిస్తున్నాను. మీరు అనుమతిస్తే ఆ కేసు గురించి మీతో కొంచెం మాట్లాడాలి’’.
ఆమె నుదుటి మీద చెమట పట్టడం స్పష్టంగా కనిపించింది. కర్చ్ఫీతో చెమటలని అద్దుకుంటూ అందామె, ‘‘్భరణి నా ఫ్రెండు కాదు. అతడి మరణం గురించి నాకేం తెలియదు. నేను మీకేరమైన సమాచారాన్నీ ఇవ్వలేను’’ అందామె గబగబా.
పాణి అలాగే నవ్వుతూ ఆమె వంక చూశాడు. అంతలో ‘‘నీవేనా నను తలచినదీ? నీవేనా నను పిలిచినదీ? నీవేనా నా మదిలో మెదిలీ హృదయము కలవరపరచినదీ...’’ అంటూ మాయాబజార్ సినిమాలోని పాట వినసొంపుగా వినిపించింది.
ఆమె చేష్టలుడిగినట్లు అలాగే నిలబడి ఉండిపోయి ఉంటే, ‘‘్ఫన్ రింగవుతోంది. మీదే అనుకుంటా, చూసుకోండి’’ అన్నాడు పాణి.
హరితకు తెలుసు. అది తన రింగ్‌టోనే. మళ్లీ ‘‘నీ..వేనా..’’ అంటూ వినిపించేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చినదానిలా గబగబా హ్యాండ్ బేగ్ తెరిచి ఫోన్ తీసింది. తన ఫోనే రింగవుతోంది. ఏదో తెలియని నెంబరు.
ఆమె ఆన్సర్ చేయబోయేలోగా వారిస్తూ అన్నాడు పాణి ‘‘ఎత్తకండి. నేనే చేస్తున్నది. ఇది మీ నెంబరో కాదో కన్ఫ్‌ర్మ్ చేసుకోవడానికి చేశాను’’ అంటూ తన చేతిలో వున్న సెల్‌ఫోన్ చూపించాడు.
హరిత అయోమయంగా, భయంగా చూసింది పాణి వంక. అతడు తన మీదనుంచి చూపులు మరలిస్తే చాలు, పరిగెట్టుకుని పారిపోదామా అన్నట్టుగా ఉంది ఆమె వాలకం.
‘‘చనిపోయిన భరణి ఫోన్లో సేవ్ అయి ఉంది మీ నెంబరు. అంతేకాదు, చనిపోయిన రోజు అతడి ఫోను నుంచి డయల్ అయిన ఆఖరి నెంబరు కూడా మీదే’’ నెమ్మదిగా అన్నాడు పాణి.
‘‘్భరణి నాకు స్నేహితుడే, చనిపోయిన రోజు భరణి కాల్ చేసిన చివరి నెంబరు కూడా నాదే కావచ్చు. కానీ భరణి మరణం గురించి నాకేం తెలియదు. నేను మీకేమి చెప్పగలను?’’ నిస్సహాయంగా అంటూ, తమనెవరైనా గమనిస్తున్నారేమో అన్నట్టుగా భయంగా చుట్టూ చూస్తోందామె.
‘‘నేను మీ దగ్గరనుంచి తెలుసుకోవాలనుకుంటున్నది కూడా భరణి మరణం గురించి కాదు. భరణి గురించి మాత్రమే’’.
‘‘నాకిప్పుడు కాలేజీకి టైమవుతోంది’’ వాచీ చూసుకుంటూ అంది ఆమె.
‘‘్ఫరవాలేదు. మీ క్లాసులు నాలుగ్గంటలకల్లా అయిపోతాయి. మిమ్మల్ని కాలేజీలో వచ్చి కలుస్తాను’’ అన్నాడు పాణి.
తన ఫోన్ నెంబరూ, తమ కాలేజీ టైమింగ్సూ అన్నీ కనుక్కుని వచ్చాడంటే అతడు తనని వదిలేలా లేడని అర్థమైంది ఆమెకి. ‘సరే’ అంది తలూపుతూ. ఆమెని రక్షించడానికా అన్నట్టుగా అపుడే వాళ్ళ కాలేజీ వైపు వెళ్ళే బస్ వచ్చి వాళ్ళ ముందు ఆగింది.
ఆమె బస్సు ఎక్కబోతుంటే అన్నాడు పాణి ‘‘ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో మనం దాచలేనివి మూడే. సూర్యుడూ, చంద్రుడూ, నిజం!’’
అతడివైపు వింతగా చూస్తూ బస్ ఎక్కేసింది ఆమె.
***
సరిగ్గా నాలుగ్గంటల పది నిమిషాలకి హరిత క్లాసునుంచి తిరిగి వస్తుంటే క్యాంటీన్ గుమ్మం దగ్గర నిలబడి కనిపించాడు పాణి. హరితని చూస్తూనే ‘హలో’ అంటూ పలకరించాడు.
అతన్ని చూసి హరిత కూడా చిన్నగా ‘హలో’ అంది.
‘‘క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుందామా?’’ అన్నాడు పాణి.
‘‘ఇక్కడొద్దు. బయట కాఫీ షాప్ ఉంది. అక్కడకి వెడదాం’’ అంది హరిత. ఆమెలో ఉదయం కనిపించిన బెరుకూ, భయమూ లేకపోవడాన్ని గమనించాడు పాణి.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ