డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనం వాళ్ళతో తూగలేం, వదిలేయడం మంచిదన్నారు మూర్తి’’ అన్నాడాయన.
‘‘మరీ అంత డబ్బు మనుషులైతే ముందు ఆదర్శాలనీ అంటూ కబుర్లు చెప్పడమెందుకు? గొప్ప కాకపోతే?’’ ఎకసెక్కంగా అంది సుమతి.
హరిత మాత్రం అతనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.
***
చూస్తూండగానే మరో సెమిస్టర్ పరీక్షలు కూడా అయిపోయాయి. ఎప్పటిలాగానే పరీక్షల ముందు చదివేసి ఏదో రాసేసింది హరిత. పాసవుతానన్న నమ్మకం ఆమెకి వుంది. మర్నాటినుంచీ కాలేజీలకి సెలవులు. ఆ రోజు కూడా క్లాస్‌లు లేవు. కానీ తల్లికి ఏదో చెప్పి ఇంటినుంచి బయటపడి వరుణ్ ఇంటికి చేరుకుంది.
‘‘వరుణ్.. ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా పెళ్లి చేసేయాలని మా అమ్మ ఆలోచన’’ చెప్పింది హరిత. తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న వరుణ్ జుట్టు సవరిస్తూ.
వాళ్ళ ఇంట్లో వరుణ్ గదిలో వున్నారిద్దరూ.
ఈమధ్యకాలంలో వరుణ్ ఇల్లు ఆమెకి బాగా అలవాటైపోయింది. ఒకసారి వరుణ్ ఆమెని వాళ్ళింటికి తీసుకువెళ్ళి తల్లికి పరిచయం చేశాడు. వాళ్ళది సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ. ఆమె వాళ్ళ స్నేహాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
హరిత ఎప్పుడు వెళ్లినా ఇంట్లో వరుణ్ తల్లిదండ్రులిద్దరూ వుండరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా వుంటారు. కేవలం చుట్టాలు, పని మనుషులు మాత్రమే వుంటుంటారు. దాంతో వారిద్దరి ఏకాంతానికీ అడ్డుండదు.
‘‘ఊ’’ అన్నాడు వరుణ్ ఆమె ఉదరంలో తల దాచుకుంటూ హరిత మాటలకి. అతని చేతులు ఆమె శరీరంలో సున్నితమైన భాగాలని స్పృశిస్తున్నాయి.
ఈమధ్యకాలంలో మానసికంగానే కాదు శారీరకంగానూ వారిమధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. తరచుగా ఆమె వాళ్ళింటికి రావడం.. అయాచితంగా దొరికే ఏకాంతం.. ఇద్దర్నీ దగ్గిరయ్యేలా చేస్తోంది.
ఒకప్పుడు పార్కులు, హోటల్స్, సినిమా హాళ్ళలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడంలో ఆనందం లభించేది. కానీ ఇప్పుడు కబుర్లు చెప్పుకోవడంలో థ్రిల్ కనపడటంలేదు. ‘స్పర్శ’లోని ఆనందం, దగ్గిరతనం అనుభవించడానికి ఇద్దరూ తహతహలాడుతున్నారు.
ఏ మాత్రం ఏకాంతం దొరికినా వరుణ్ చేసే అల్లరికి అంతుండదు. హరితకి కూడా ఆ ‘అల్లరి’ ఎక్సయిటింగ్‌గా వుండడంతో కాదనదు. కానీ చిన్నప్పటినుంచీ పెరిగిన వాతావరణం వల్లో.. తల్లి చేసే హెచ్చరికల ప్రభావంవల్లో.. అతని అల్లరిని శృతిమించకుండా కట్టడి చేస్తుంది. ఎప్పుడూ తన జాగ్రత్తలో తనుంటుంది.
తన మాటలు అతను వినడంలేదన్న అనుమానం వచ్చి హరిత అతని భుజంమీద చిన్నగా గిచ్చింది.
‘‘ఏయ్.. ఏమిటది?’’
‘‘నా మాటలు వింటున్నావా లేదా?’’’
‘‘వింటున్నాను చెప్పు’’
‘‘మీ అమ్మా నాన్నలతో మన విషయం మాట్లాడావా?’’ అడిగింది.
‘‘చెప్పాను కదా మమీకి మన విషయం సూచాయగా తెలుసు. తెలిసీ మనం కలిసి తిరగడానికి అభ్యంతరం చెప్పడంలేదంటే ఆమెకి ఇష్టమై వుంటుందని నా అభిప్రాయం’’ చెప్పాడు.
‘‘మరి డాడీ?’’
‘‘మా డాడీకి ఈ విషయం అప్పుడే చెప్పడం మంచిది కాదు. ఆయనకసలే నా మీద సదభిప్రాయం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే నా పని అవుట్..’’
‘‘ఏమిటి వరుణ్ నువ్వుకూడా అలా మాట్లాడతావు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంలో తప్పేముంది?’’
‘‘తప్పేముందో నాకు తెలియదు.. కానీ జీవితంలో స్థిరపడకుండా ఆయనకలాంటివి ఇష్టముండవు’’
‘‘మరెలా? ఆయనె్నలా ఒప్పిస్తావు?’’
‘‘నీకిదివరకే చెప్పాను కదా? చదువులో నా పెర్ఫార్మెన్స్ ఆయనకి నచ్చడంలేదు. అయినా ఆయనకి ఈ చదువులమీద నమ్మకం లేదు కూడా. త్వరలోనే ఆయన నన్నొక బిజినెస్‌లో వుంచే ప్రయత్నంలో వున్నారు. ఆయన చెప్పిన వర్క్ జాగ్రత్తగా చేసి, బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూపించి.. ఆయన దృష్టిలో నా ఇంప్రెషన్ మార్చి అపుడు చెబుతాను మన విషయం. అపుడాయన కాదనరు’’.
హరిత అతని వంక భావరహితంగా చూసింది. అతను చెప్పేది బానే వుంది కానీ.. అదంతా జరిగే పని కాదనిపించింది. అందులోనూ ఒక్క సంవత్సరంలోపులో...
ఆ విషయం అతనికి చెప్పినా వినిపించుకోడు. ఒక్కోసారి బాగా కోపం తెచ్చుకుంటాడు.
‘‘నామీద నమ్మకం లేదా?’’ అంటాడు ఆవేశంగా.
హరితకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మరింత రెట్టిస్తే అతనికి మరింత కోపం వస్తుందన్న ఉద్దేశ్యంతో నెమ్మదిగా అంది.
‘‘వరుణ్, ప్రస్తుతం మనం వున్న పరిస్థితులకి కారణం ఏదైనా, మనం జీవితంలో కలిసి బ్రతకాలంటే మాత్రం ఇప్పుడు ధైర్యం చేసి ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఇదివరకూ సరదాగా నాతో అనేవాడివి గుర్తుందా? మనిద్దరం లేచిపోదామని?! ఆ పనే మనిద్దరం ఇపుడు చేయాలి. మనిద్దరం మేజర్లం. నువ్వుకూడా చదువుకున్నావు. నీ చదువుకి ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. కొంచెం ప్రయత్నించి ఉద్యోగం సంపాదించి నీ కాళ్ళమీద నువ్వు నిలబడవచ్చు కదా? అపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం వుండదు’’.
అతడామె వంక విసుగ్గా చూసాడు. తర్వాత పకపకా నవ్వాడు ఏదో జోక్ విన్నట్టు.
‘‘మేజర్లమా? మనం ఒక్కసారి ఇంట్లోంచి బయటికి అడుగుపెడితే, ఒక్క రాత్రిలో అర్థమవుతుంది మనమెంత పెద్దవాళ్ళమో. మనమెంత? మన వయసెంత? ఉద్యోగం?... నేను చదివిన చదువుకి నాకిచ్చే జీతం మా ఇంట్లో నాకిచ్చే పాకెట్‌మనీకన్నా తక్కువ వుంటుంది తెలుసా?’’
‘‘జీతం గురించి కాదు.. నువ్వు ఉద్యోగం చేస్తూ నీ కాళ్ళమీద నిలబడితే ఎవరికీ భయపడాల్సిన అవసరం వుండదని చెబుతున్నాను. ఇంక డబ్బంటావా? నాకు డబ్బుతో పనిలేదు. నీకు వచ్చే జీతంతో ఒక పూట తిని చిన్న రేకుల షెడ్డులో నీతో వుండడానికి సిద్ధంగా వున్నాను నేను’’ చెప్పింది.
‘‘హరితా, సిల్లీగా మాట్లాడకు. అవన్నీ నవలలు సినిమాలలోనే తప్ప నిజ జీవితంలో జరిగే పనులు కావు. నేను నిన్ను ప్రేమించిందీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నదీ నిన్ను ఒక మహారాణిలా చూసుకోవడానికి తప్ప రోజుకోపూట పస్తులుంటూ నీతో రేకుల షెడ్డులో కాపురం చెయ్యడానికి కాదు’’ ఆవేశంగా అన్నాడు.
హరిత అసహనంగా చూసిందతని వంక. అతడు చెబుతున్నవన్నీ నిజాలే. కాదనలేదు. కానీ, అతడిని విడిచి తను ఉండలేదన్నది కూడా అంతే నిజం. అతడు కూడా తనని విడిచి వుండలేనంటాడు. కానీ, జీవితాంతం కలిసుండడానికి ఒక చిన్న ‘రిస్కు’ కూడా తీసుకోలేడు. ఏదైనా అద్భుతం జరిగి తమని కలపాలే తప్ప, తనంత తానుగా ఏ ప్రయత్నాన్నైనా చేయడానికి అతడు సిద్ధంగా లేడన్న విషయం అర్థమై బాధగా అనిపించిందామెకి. అతన్ని కన్విన్స్ చేయడం ఎలాగ?!

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ