డైలీ సీరియల్

పూలకుండీలు 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్న ప్రకారం మూడవ రోజు గురువారం రాత్రి ప్యాసింజర్ బండికి బయలుదేరి శుక్రవారం జుమ్మా సమయానికి ఎల్లయ్య కుటుంబం మొత్తం బేగంపేట హాస్పిటల్ ముందుకి చేరుకుంది.
చేరుకున్న మరు నిమిషంలోనే ‘‘మా మనిషిని మాకు చూపించండి’’ అంటూ రోడ్డుమీద బైఠాయించింది.
***
అప్పటిదాకా జరిగిన తన కథనంతా ఏ మాత్రం దాచకుండా గల్లీ నాయకులకు చెప్పుకొచ్చాడు ఎల్లయ్య.
అతని కథ విన్న వాళ్ళు ‘‘అరే భయ్యా! నీ ఎనక ఇంత కతుందా!?’’ అంటూ తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు.
‘‘ఔను నాయినలారా! అందరుగూడి మా బతుకులతోని ఆడుకున్నారు. ఇక మీరే ఏదో ఒకటి జేసి మా కోడల్ని మాకు అప్పగిస్తే మీ పేరు చెప్పకుంట రోజూ మా ఇంట్లో దీపం బెట్టుకుంటాం’’ రెండు చేతులూ జోడించి దండం బెడుతూ ఆ గల్లీ లీడర్లను బ్రతిమాలింది ఎల్లయ్య తల్లి కమలమ్మ.
‘‘ఔనవ్వా! ఏం జేస్తాం, దునియా ఇట్ల తయారయ్యింది’’ అంటూ గల్లీ లీడర్లు నలుగురూ మూకుమ్మడిగా ముసలివాళ్ళను ఊరడించారు.
ఉన్నట్టుండి వాళ్ళల్లో ఒకడు
‘‘అరే భాయ్ ఆ పోలీసోడు లోపలికిబొయ్యి చాలా సేపైతుంది. ఇంతసేపు లోపల వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏమో?’’ అదో విధమైన రంధి నిండిన స్వరంతో అన్నాడు.
‘‘ఔన్నిజమే ఏం బేరాలాడుతున్నాడో?’’ అన్నాడింకొకడు.
‘‘మరి మన సంగతేంది? ఇక్కడ ఇంకెంతసేపు కూర్చోవాలి?’’ అన్నాడు మరొకడు.
వాళ్ళు మాట్లాడుకుంటున్నదేంటో అర్థంగాక ఎల్లయ్య వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు.

13
ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఎల్లయ్య వాళ్ళు, గల్లీ లీడర్లూ లోపలికెళ్లిన ఎస్సైని గురించి మాట్లాడుకుంటున్న సమంలోనే-
చైర్మన్ ఛాంబర్లో ఇంటీరియర్ డెకరేషన్ని విస్తుబోయి చూస్తూ కూర్చున్న ఎస్సై ‘‘సార్! నేను వాళ్ళను కింద కూర్చోబెట్టి వచ్చి చాలాసేపైంది. వాళ్ళ విషయమేం చేద్దామో మీరే చెప్పండి’’ తన పోలీస్ దర్పాన్ని తీసి తాత్కాలికంగా పక్కన పెట్టి అడిగాడు మెల్లగా.
‘‘చెయ్యడానికేముందండీ! వాళ్ళంటున్న ఆ ఆడమనిషి మూడు లక్షలకు మాతో బేరం కుదిరించుకొని తన ఇష్టాపూర్వకంగా మా దగ్గరికొచ్చింది. మీకు తెలుసు మేం పేమెంట్ విషయంలో ఎంత నిక్కచ్చిగా వుంటామో. ఆవిడ విషయంలోనూ అదే జరుగుతుంది.
దేశంలో అన్ని రాష్ట్రాల్లోకన్నా గుజరాత్‌లోని ఆనంద్‌లో ఈ సరోగసీ మదర్స్ డీలింగ్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అసలక్కడ ఓ మదర్స్ ఫ్యాక్టరీయే వుంది తెలుసా?
దాని తరువాత మన హైదరాబాద్‌లో ఇంకా చెప్పాలంటే మా హాస్పిటల్లోనే్న ఎక్కువగా జరుగుతుంటాయి’’ అంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు చైర్మన్.
‘‘దీని వెనుక ఇంత వ్యవహారం జరుగుతుందా!’’ అన్నట్టు అతని వంక చూశాడు ఎస్సై. ఎస్సై ముఖకవళికలను బట్టి మనసులో అతనేమనుకుంటున్నాడో ఇట్టే గ్రహించిన చైర్మన్ ‘‘అంతేగాదు, ఇప్పుడా రోడ్డుమీద కుటుంబంతో బైఠాయించి మా హాస్పిటల్ పేరు ప్రతిష్ఠల మీద మచ్చబడేలా చేస్తున్న ఆ వెధవ ఏడు నెలలకిందట మా దగ్గరికొచ్చి మాతో మాట్లాడి మేం పెట్టమన్న చోట సంతకాలు పెట్టి, మేం ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళాడు.
అలా వెళ్లినవాడు కాస్తా ఈ రంగంలో మాతో పోటీపడాలని చూస్తున్న ఆ గగనా హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ బంధువు దగ్గర ముంబైలో పనిచేస్తున్న వీణ్ణి వెదికి పట్టుకొని డబ్బులిచ్చి మా మీదకు ఉసిగొలిపారు. దాంతో వాడొచ్చి హాస్పిటల్ ముందు చేరి ఇంత గొడవ చేస్తున్నాడు’’ ఈ విషయంలో ఏ సంబంధమూ లేని ప్రత్యర్థి హాస్పిటల్ వాళ్ళమీద అబాండాలు వేస్తూ అబద్ధాలు చెప్పుకొచ్చాడు.
ఛైర్మన్ చెప్పిందంతా ఓపిగ్గా విన్న ఎస్సై ‘‘ఔనండీ! ఇవ్వాళ్ళరేపు ఏ వృత్తిలోనైనా ఇలాంటి పోటీ సర్వసాధారణమైపోయింది. ఆ గగనా హాస్పిటల్ వాళ్ళు నేరుగా వచ్చి మీతో పెట్టుకోలేక ఇలా డొంక తిరుగుడుగా కథ నడిపిస్తున్నారేమో? ఆ విషయమేదో మీరూ, మీరూ వృత్తిపరంగా తేల్చుకోండి. కింది బికారిగాళ్ళ సంగతి నేను చూసుకుంటాగాని’’ అంటూ విషయాన్ని పూర్తిగా చెప్పకుండా మధ్యలోనే ఆపేశాడు ఎస్సై.
‘‘నా దగ్గర చెప్పడానికి సందేహమెందుకు? విషమేమంటో చెప్పండీ!’’ అంటూ ఎస్సై వంక సాభిప్రాయంగా చూశాడు చైర్మన్. ‘‘కట్టుకున్నోడికంటే ఎక్కువ మధ్యలో అంటుకున్నోడికి భయపడ్డట్టు! ఎల్లయ్యవాళ్ళకన్నా ఆ గల్లీ లీడర్లతో ఏదన్నా ప్రాబ్లమొస్తుందేమో సార్!’’ తన అనుమానపు పోలీస్ తత్త్వాన్ని బయటపెట్టాడు ఎస్సై.
ఆ మాటలు విన్న చైర్మన్ చిద్విలాసంగా నవ్వుతూ ‘‘ఆ వాళ్ళ ముఖం వాళ్ళదేముందిలెండీ! మొరిగే కుక్కకు బిస్కెట్లు విసిరేసినట్టు నాలుగు నోట్లు పడేస్తే తోక వూపుకుంటూ ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్లిపోతారు. వాళ్ళ గురించి మీరేం కంగారు పడకండీ!’’ కంచెకే భరోసా ఇస్తున్న చేను మాదిరిగా ఎస్సైతో అన్నాడు. ఆ భరోసాతో సంతృప్తి చెందిన ఎస్సై ‘‘మరి నా సంగతేంటీ?’’ అన్నట్టు కళ్ళు వాల్చి చైర్మన్ వంక చూశాడు.
ఆ చూపులకు అర్థం ఏమిటో ఎరిగివున్న చైర్మన్ తనూ కళ్ళతోనే నవ్వుతూ ‘‘మీ ఆవిడ బ్యాంక్ అకౌంట్ నెంబరివ్వండి’’ అన్నాడు.
ఆసక్తిగా ముందుకు వంగుతూ ‘‘ఇస్తాను సార్!’’ అంటూ జేబులోనుండి పేపర్ తీసి నెంబర్ వ్రాయసాగాడు ఎస్సై.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు