డైలీ సీరియల్

బంగారుకల 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రభువు తనకు దూరమవుతాడా’ ఆలోచనకే ఆమె హృదయ వేదన మిక్కుటమయింది. అన్నింటికీ ఆ విరూపాక్షుడే సాక్షి అనుకున్నది. మంజరి ఎపుడు వచ్చిందో చిన్నాదేవి భుజంమీద చేయి వేసి పిలిచేదాకా తెలీలేదు.
‘‘చిన్నాజీ! నేనంతా విన్నాను. నీ నిర్ణయంలో ఎంత త్యాగముందో రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి’’.
‘‘ఏమో! నా ప్రభువు లేని జీవితం మాత్రం నేనూహించలేను’’ చిన్నాదేవి మంజరిని కౌగిలించుకుని రోదించింది.
‘‘అలా ఎన్నటికీ జరగదు. ప్రభువులు అనేక కారణాలతో ఎందర్ని చేసుకున్నా వారు అనుమతిస్తేనే భార్యగా చెలామణి అవుతారు. ప్రభువు నినే్ననాడో పట్టమహిషిని చేశారు. మరెందరు భార్యలుంటేనేం? దుఃఖించకు’’ అని ఓదార్చింది మంజరి. చిన్నాదేవి ఒకింత స్వాంతన పొందింది.
‘‘అవునుగానీ మంజరీ! నువ్వు మహామంత్రికి ఎలా తెల్సు. నువ్విక్కడ ఉన్నట్లు వారికి ముందే తెలుసా!’’ ఈ లోకంలోకి వచ్చినట్లుగా ప్రశ్నించింది చిన్నాదేవి.
‘‘విజయనగర సామ్రాజ్యంలో చీమ కదిలినా కూడా మహామంత్రికి తెలియకపోదు. శ్రీకృష్ణదేవరాయల ప్రభువుల పట్ట్భాషేక మహోత్సవంలో జరిగిన నాట్య ప్రదర్శనలో నీతోపాటు నేనూ నాట్యం చేశాను కదా! తిమ్మరుసు మంత్రివర్యులు ఆనాడే నన్ను పసిగట్టారు. మనలో మాట.. చంద్రప్ప సంగతి అడిగావుగాక! చంద్రాకు అప్పాజీగారు కొన్ని రాచకార్యాలు అప్పగిస్తుంటారు. ఈ పదిరోజులుగా అతను కన్పించలేదంటే అదే అనుకుంటున్నాను’’
చిన్నాదేవి ఆదరంగా మంజరి చెక్కిళ్ళు నిమిరింది. మేనా తెప్పించి ఆమెను ఆదరంగా సాగనంపింది.
చిన్నాదేవి రాయలను ఎలా ఒప్పించిందోగానీ, రాయల వివాహం తిరుమలాంబతో వైభవంగా జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగాంబ కోడల్ని ప్రేమతో అంతఃపురానికి ఆహ్వానించింది.
ముత్యాల హారతులు
ముదితలంతా ఈరె
.........................
పసిడి పళ్ళెమ్ములో
............................
తిరుమలదేవికి సాహిత్యమంటే బహు ప్రీతి. ఆమె చాలా అందగత్తె. వీణావాదనలో నిష్ణాతురాలు. రాజసం ఉన్న ధీరవనిత. అంతఃపురంలో నృత్యగాన వినోదాలతో పొద్దుపుచ్చుతున్నా తిరుమలదేవి మానసంలో ఏదో ముల్లులా ఒక బాధ. అది చిన్నాదేవి గురించి తెలియటమే!
ఆ రోజు సాయంత్రం తిరుమలదేవి అంతఃపురంలో కృష్ణలీలలు నృత్య సన్నివేశం జరుగుతోంది.
‘‘ఈమె ఎవరు? ఇంత అద్భుత సౌందర్యంతో తన్మయపరుస్తున్న ఈ నర్తకి విజయనగర సామ్రాజ్యానికే మణిదీపంలా ఉంది’’ అని మంజరిని చూస్తూ తలపోసింది మహారాణి.
నాట్య ప్రదర్శన ముగిశాక మంజరి గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమె చిన్నాదేవికి అత్యంత ప్రీతిపాత్రురాలని అవగతమైంది. మంజరి దేవదాసి అనీ ఆమె నర్తనంలో అలౌకిక దివ్యత్వం ఉందని అర్థం చేసుకుంది. ఆమెను అనేక బహుమతులతో సత్కరించింది.
తిమ్మరసు మహామంత్రికి తన మనసులోని ఆవేదన నివేదించిన తిరుమలదేవి చిన్నాదేవిని అంతఃపురానికి సకల లాంఛనాలతో రప్పించమని కోరింది.
తిరుమలాంబ ధీరత్వానికి అప్పాజీ లోలోపల సంతోషించాడు. సామ్రాజ్య పటిష్టతకు రాయల వ్యక్తిగత జీవన ప్రశాంతత కూడా చాలా అవసరం అని ఆయనకు తెలుసు.
చిన్నాదేవి రాజమందిరంలో చెలికత్తెలతో ప్రవేశించటం రాయలకు మహదానందంగా ఉంది. తిరుమలదేవి స్వయంగా ఎదురువెళ్లి హారతిచ్చి చిన్నాదేవిని ఆహ్వానించింది. తిరుమలదేవికి ఆమెను చూస్తుంటే తన ప్రతిబింబాన్ని చూస్తున్నట్లు అన్పిస్తున్నా మనసులో స్ర్తి సహజమైన కలత తొంగి చూస్తున్నది.
మంజరి చిన్నాదేవితో బాటు రాజమందిరంలోకి వచ్చిందే కానీ మొహాన చిరునవ్వు మాయమైంది. ఎప్పుడూ అన్యమనస్కంగా ఉంటున్నది. నాట్యం చేసినా ఆత్మ పలకటం లేదు.
***
అప్పాజీ రహస్య సమావేశ మందిరంలో దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉన్నాడు. వార్తాహరుడు వచ్చి అందించిన సమాచారంవల్ల ఆయన మనస్సు చాలా అశాంతిగా ఉంది. ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు కబురందింది. లోపలికి అనుమతించాడు మహామంత్రి. చంద్రప్ప వచ్చి వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
‘‘చంద్రప్పా! వెళ్లిన పని ఏమయింది’’ ఆయన మామలుగా అడిగినా అది ఉరుమంత గంభీరంగా ఉంది.
‘‘మహామాత్యా! మీ ఆనతి ప్రకారం ఉమ్మత్తూరు, శివసముద్రం ప్రాంతాలు పరిశీలించి వచ్చాను. అక్కడి మన వేగులతో సంప్రదించాను. ఆ పాలెగాళ్ళు మన విజయనగర ఆధిపత్యాన్ని లెక్కచేయటం లేదు. వాళ్ళు మనకి పన్ను కట్టరట. త్వరలోనే స్వతంత్రత ప్రకటించుకుంటారట అప్పాజీ!’’ నమ్రతగా చెప్పాడు.
‘‘ఆహా! ఎవ్వరికీ ఏమీ ఉప్పందించలేదు కదా!’’ అప్పాజీ లోతుగా ప్రశ్నించాడు.
‘‘లేదు అప్పాజీ! ఈ మాసం రోజులు నా వేణుగాన ప్రదర్శనలతో ప్రజల్లో ధారాళంగా సంచరించాను.
‘‘ప్రజలేమనుకుంటున్నారు?’’
‘‘ప్రజలంతా కృష్ణరాయలవారి పాలనే కోరుకుంటున్నారు అప్పాజీ!’’
‘‘మంచిది ఇక నువ్వు వెళ్ళవచ్చు’’ తిమ్మరుసు ఆజ్ఞ అయినందుకు వినమ్రంగా నమస్కరించి నిష్క్రమించాడు చంద్రప్ప.
సేనానాయకుడు దండపాణి ప్రవేశించాడు. మహామాత్యులు ఆసీనుడైనాడు. సుదీర్ఘ మంతనాలు జరిపాడు.
‘‘మహామంత్రీ! మనం అభివృద్ధి పరిచిన ప్రకారం మన సైన్యం ఏడు లక్షల కాల్బలం, ఐదు వందల యాభై గజబలం, ముప్ఫై రెండు వేల ఆరు వందల అశ్వికదళం, ఇది కాక కామానాయకుడు, తిప్పన్న నాయకుడు, కొండమరెడ్డి, మధుర నాయకుడి ఆధీనంలో వేల కాల్బలం, గుర్రపు దళం, గజబలం కేంద్రీకృతమై యుద్ధ సామగ్రితో సిద్ధంగా ఉంది.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి