రాష్ట్రీయం

వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాద్రి రాముని సన్నిధిలో భక్తుల ఆనందహేల
ఖమ్మం , డిసెంబర్ 21: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం సోమవారం వైభవంగా జరిగింది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వైకుంఠ ఉత్తర ద్వారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అర్ధరాత్రి 12గంటలు దాటాక గర్భగుడిలో భక్తరామదాసు పేరిట స్థానిక రెవెన్యూ అధికారులు మూలవరులకు అభిషేకం చేశారు. అనంతరం దేవస్థానం వారు మరో గంట పాటు ఆర్జిత అభిషేకం నిర్వహించి స్వామికి బాలభోగం, నివేదన ఇచ్చారు. అనంతరం స్వామి గర్భగుడి నుంచి ఉత్తర ద్వారంలోకి వచ్చారు. స్థానాచార్యులు స్థలసాయి వైకుంఠ ఏకాదశి వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. రామభజనలు చేశారు. అనంతరం సరిగ్గా ఉదయం 5గంటల సమయంలో జేగంటలు ధ్వనిస్తుండగా వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాలు, గుగ్గిలం పొగల మధ్య వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారంలో స్వామివారు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై రాముల వారు, గజవాహనంపై సీతమ్మ వారు, ఆంజనేయస్వామి వాహనంపై లక్ష్మణమూర్తి, చలువ చప్పరంపై ఆళ్వారు, గోదాదేవిని గీతాజయంతి వేళ భక్తులు దర్శించుకున్నారు. ముందుగా గంట పాటు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామతారక నామ అష్టోత్తర పూజలు చేసి మంత్రపుష్పం సమర్పించారు. రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, అధర్వణ వేద పఠనం చేశారు. అనంతరం స్వామికి ఏక, పంచ, ద్వాదశ హారతులిచ్చారు. 108 వత్తులతో నక్షత్ర హారతి ఇచ్చారు. శరణాగతి, దండకం అయ్యాక భక్తుల ఆనందహేల నడుమ స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారు గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలందుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్, వరంగల్ రేంజ్ డిఐజి మల్లారెడ్డి, ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఐటిడిఎ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ భాస్కరన్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వారం ద్వారా మూలవరులను దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. (చిత్రం) బద్రాద్రి రాముని ఉత్తర ద్వార దర్శనానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తకోటి

సింహాచలంలో పోటెత్తిన భక్తజనం

సింహాచలం, డిసెంబర్ 21: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున 4 గంటల 45 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు వరాహనారసింహుడు వైకుంఠ ద్వారంలో భక్తుల కోసం వేంచేసి ఉన్నారు. దేవాలయ సంప్రదాయం ప్రకారం వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పూసపాటి ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతితో ఈవో రామచంద్రమోహన్, అర్చక పరివారం తొలి దర్శనం చేయించారు. వైకుంఠ నారాయణుడి అలంకరణలో ఉభయ దేవేరుల సమేతులగా ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన సింహాద్రినాథుడ్ని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు.
ఉత్తరద్వార దర్శనం అనంతరం స్వామివారు దేవేరులతో కలిసి సింహగిరి పురవీధుల్లో ఊరేగారు. భక్తులు వెంటరాగా అర్చకులు నాలుగు దిక్కులలో స్వామివారికి మంగళ హారతులిచ్చారు. క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామివారి తరపున అర్చకులు పళ్ళు, పూలమాలికలు స్వామివారికి సమర్పించారు. ఉత్సవం ముగించుకున్న అనంతరం స్వామివారి ఆర్జిత నిత్యకల్యాణం సంప్రదాయంగా జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలేశుని మూలవిరాట్‌కి స్వర్ణ నృసింహకవచ అలంకరణ చేశారు. భక్తులకు విశేష పొంగలి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహరావు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. డిసిపి రామ్‌గోపాల్‌నాయక్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

గరుడవాహనంపై కోదండరాముడు
ఒంటిమిట్ట, డిసెంబర్ 21: మరో భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి మూలవరులకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి గరుడవాహనంపై ఆశీనులను చేసి ఉత్తరద్వారం వద్ద ఉంచి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఉత్తరద్వారం గుండా శ్రీకోదండరాముడిని దర్శించుకుని పునీతులయ్యారు.

శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం
శ్రీశైలం, డిసెంబర్ 21: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి వార్లను రావహ వాహనంపై ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరచారు. పూజాదికాల అనంతరం జామున ఉత్సవ మూర్తులను ఆలయ ముఖమండపంలో ఉత్తరాభిముఖంగా ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. రావణ వాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మేళళాల నడుమ గర్భాలయం గుండా గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చారు.