వాసిలి వాకిలి

నేను.. మరణ వాంగ్మూలాన్ని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను..
చీకటిలో ముసుగు తన్ని నిద్ర నటిస్తున్నప్పుడు
నా మనసు మరింతగా తేజరిల్లుతుంటుంది
నా ప్రాపంచికతను జోకొట్టి పరుండబెడితే
నా మనసు శ్వాసలో ప్రాణం పోసుకుంటుంటుంది
అయినా, ప్రతిరోజూ
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

సంపన్న భోజనానికి ఖరీదు చెల్లిస్తున్నప్పుడు
స్వాగతం పలికిన ద్వారపాలకుడి
నెలసరి ఆదాయం కళ్లముందు మెదిలి
నా ఆలోచనను కప్పిపుచ్చుకున్నప్పుడు
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

సంతన బేరమాడి తక్కువకే కొనగలుగుతుండగా
తక్కెడ పట్టుకున్న బుడతడి చూపు
నన్ను చుట్టుముడుతుంటే
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

పట్టుబట్టల్లో నాకు నేనే షరాబునవుతుంటే
గుండె గదిలో బాంబు పేలినట్టయి తడుముకుంటే
నా కారు కిటికీ నుండి
చూపుల్ని పిండిన ఆ పిగిలిన బట్టల అందం
నా సంస్కారాన్ని బద్దలు చేస్తుంటే
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

నా చిన్నారి పుట్టినరోజుకి
సమాజం మెచ్చే కానుక కొన్నప్పుడు
మెరిసిన చిట్టితల్లి కనుపాపల్లో
ఎండిన డొక్కతో వీధినపడ్డ
నిర్జీవ చూపులు వెంటాడుతుంటే
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

మా వొల్లు అలవకుండా
అన్నీ తానే అయి నిర్వహించే పనిమనిషి
సలసల మంటున్న జ్వరంలోనూ
బడికెళ్లే తన పిల్లని
మా పనులకు పురమాయించినపుడు
నా చేతిలోని న్యాయశాస్త్ర పుస్తకాన్ని
తదేకంగా ఆ బేల కళ్లు ప్రశ్నిస్తుంటే
జిడ్డోడుతున్న నా జీవితం నిలదీసినప్పుడు
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

ఒక అత్యాచారం మరొక ఆత్మహత్య
న్యాయదేవత కళ్లకు గంతలు విప్పమన్నప్పుడు
ఖజానాలో వొళ్లు విరుచుకుంటున్న
కాసులమ్మ సమ్మోహనంగా పిలుస్తుంటే
నన్ను మరచిన ఆ క్షణాలలో
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

ఈ జీవనక్షేత్రంలో
మతాలు, కులాలు దాయాదులవుతుంటే
నాటి కురుక్షేత్రపోరు నాలో జరుగుతుంటే
నా నిస్సహాయత, చేతకానితనం
రాజకీయ అభిమన్యులకు ముసుగు తొడిగి
బాధ్యత మోసినట్టు మీసం మెలేస్తుంటే
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

నా నగరం.. కాలుష్య కాసారమయిందంటూ
నల్లద్దాల కారులో నా ఊపిరిని చల్లబరచుకుంటూ
ఆక్సిజన్ హబ్‌లో ప్రాణం నిలుపుకుంటూ
నా వాహనమొక్కటి నగరాన్ని రక్షించదనుకుంటూ
ఏసీ గదిలో విదేశీ బ్లాంకెట్లో వెచ్చబడుతూ
ఎంతో కొంత చస్తూనే ఉన్నాను కదూ!

అవును, చీకటి మరింతగా చిక్కబడుతూనే ఉంది
నా మనస్సాక్షి నిలదీస్తూనే ఉంది
తనలో తాను శ్వాసిస్తూనే ఉంది
ఆశ్చర్యం!
రోజుకింత చొప్పున
ఎంతలా చంపుకుపోతున్నా
ఇంకా సమాధి స్థితికి చేరుకోదేం?

-విశ్వర్షి 93939 33946