రాష్ట్రీయం

భయపెడుతున్న కల్తీ మద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు - 2015 : ఆంధ్రప్రదేశ్
=====================
విజయవాడలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో జరిగిన కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు బడుగు జీవులు ప్రాణాలు కోల్పోగా మరో 28మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి బైటపడిన ఘటన యావత్ రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టించింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగా స్పందించినప్పటికీ మద్యం వ్యాపారంతో నిత్యం సంబంధాలుండే వివిధ ప్రభుత్వ శాఖల్లో మాత్రం నేటికీ ఎలాంటి స్పందన కన్పించడం లేదు.
======================
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా తీరని అన్యాయం జరిగినప్పటికీ, లోటుబడ్జెట్ భర్తీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నేటివరకు పూర్తిస్థాయిలో చేయూత లభించినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రపంచంలోనే అత్యద్భుత రాజధాని నిర్మించబోతున్నామంటూ ప్రకటనలు చేయటమే కాదు.. దీనికి సంబంధించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్, నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీంతో కొన్ని మాసాలుగా దేశ విదేశాల నుంచి పెట్టుబడులకు మేము సైతం సిద్ధమంటూ బడాబాబులు ఆంధ్రా వైపు పరుగులు తీస్తున్నారు. దీనికితగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరోజుకారోజు దేనికీ వెనక్కి తగ్గకుండా అవగాహన ఒప్పందాలు (ఎంవోయులు) కుదుర్చుకుంటున్నారు. అయితే విజయవాడలోని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబానికి చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో జరిగిన కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు బడుగు జీవులు ప్రాణాలు కోల్పోగా మరో 28మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి బైటపడిన ఘటన యావత్ రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టించింది. ప్రభుత్వం ముదుజాగ్రత్త చర్యగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న 4వేల 380 మద్యం దుకాణాలు, 730 బార్ అండ్ రెస్టారెంట్లలో ఒరిజినల్ ఛాయిస్, రాయల్ ఫ్లాగ్, డిఎస్పీ, ఓల్డ్ అడ్మియర్ బ్రాందీ, బాగ్‌పాపర్, ఓల్డ్ టావెరన్, ఎంసి నెం-1 విస్కీ, ఇంపీరియల్ బ్లూ, ఎంసి బ్రాందీ ఇలా అనుమానిత 9 రకాల బ్రాండ్లకు చెందిన 10వేల 800 శాంపిల్స్‌ను వివిధ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించింది. మృతుల ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్య శరీర అవయవాలను సైతం వైద్యపరీక్షలకు పంపించారు. ఈ కల్తీ మద్యం మరణాలు స్థానికులనే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చేవారిని సైతం హడలెత్తించాయి. మద్యం మరణాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగా స్పందించినప్పటికీ మద్యం వ్యాపారంతో నిత్యం సంబంధాలుండే వివిధ ప్రభుత్వ శాఖల్లో మాత్రం నేటికీ ఎలాంటి స్పందన కన్పించడం లేదు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినప్పటికీ మద్యం వ్యాపారంపైనే ప్రభుత్వ మనుగడ సాగుతోందంటూ ఆయా శాఖలు అటువైపు కనె్నత్తి చూడటం లేదు. ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరిపిస్తామంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వపరంగా మండలానికో దుకాణం చొప్పున రాష్ట్రంలో 430 దుకాణాలను తెరిపించారు. అయితే రాజకీయంగా ఒత్తిళ్లు రావటంతో ఐదు నెలలు కూడా గడవకముందే ఆ దుకాణాలను సైతం ప్రైవేట్ మద్యం లాబీకి అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఏదిఏమైనా ప్రభుత్వానికి ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ తర్వాత సిరులు కురిపిస్తున్నది మద్యం వ్యాపారం కావటం వల్లనే ఏ ఒక్క వ్యాపారిపైనా ఏ ప్రభుత్వ శాఖ కూడా చర్య తీసుకోకుండా కాపాడుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 12వేల కోట్ల రూపాయల రాబడి ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యి కోట్లు అదనంగా రాబడి సాధించాలంటూ ముఖ్యమంత్రి స్వయంగా హుకుం జారీచేయటమే కాదు, ఇందులో ఎక్సైజ్ శాఖ వల్లకాకపోతే పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటూ నేరుగా ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను హెచ్చరించారు. ఇంకేముంది మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ సంగతి దేవుడెరుగు, కనీసం బిల్లులు కూడా ఇవ్వటం లేదు.
ఇదిలావుంటే, నిబంధనల ప్రకారం కార్మికులు ఒకరోజు పనిచేసినా వారందరికీ పిఎఫ్, ఇఎస్‌ఐను వర్తింపచేయాల్సి ఉంటుంది. అసలు కనీస వేతనాలను వర్తింపజేయాల్సిన కార్మిక శాఖాధికారులే ఏడాదికాలంగా మద్యం దుకాణాల వైపు కనె్నత్తి చూడటం లేదు. దీంతో ఏ దుకాణంలోనూ అటెండెన్స్ రిజిస్టర్లు లేవు. అలాగే పిఎఫ్, ఇఎస్‌ఐ అధికారులు కూడా అసలు పట్టించుకోవటం లేదు. వాస్తవానికి వేతనం ఎంత ఉన్నప్పటికీ పిఎఫ్ వర్తించినవారు మరణిస్తే భార్యకు పెన్షన్, అనారోగ్యానికి గురైతే వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరించాలి. ఇవేమీ అమలు కావటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఏర్పాటైనా, మున్సిపాల్టీల నుంచి ట్రేడ్ అండ్ వో లైసెన్స్‌లు లేకపోయినా, ముఖ్యంగా రెస్టారెంట్లు లేకపోయినా ఎక్సైజ్ శాఖ గుడ్డిగా లైసెన్స్‌లను జారీ చేస్తోంది.
ప్రభుత్వానికి అత్యధిక రాబడిని సాధించిపెడుతున్న మద్యానికి సంబంధించిన మంత్రిత్వ శాఖను చేపట్టిన ఏ ఒక్కరు కూడా తమ హయాంలో ఏదో ఘనత సాధించామని చెప్పుకునేవారు కన్పించడం లేదు. నీతిమంతునిగా ముద్రపడిన కనుమూరి బాపిరాజు కృష్ణా జిల్లా కైకలూరు నుంచి వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఎక్సైజ్ శాఖ చేపట్టి అవినీతిపరునిగా చరిత్రకెక్కారు. మద్యం డిస్టిలరీల వ్యవహారంలో తన మంత్రి పదవికే గాక ఏకంగా శాసనసభకు రాజీనామా చేసి తిరిగి కృష్ణా జిల్లా వైపు కనె్నత్తి చూసే సాహసం చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జగ్గయ్యపేటకు చెందిన నెట్టెం రఘురామ్ సైతం అవినీతి ఆరోపణలతో శాశ్వతంగా రాజకీయాలకు దూరమయ్యారు. పొరుగునున్న గుంటూరు జిల్లావాసి మోపిదేవి వెంకటరమణ సైతం ఏకంగా జైలుపాలు కావాల్సి వచ్చింది. ఆయన హయాంలో జరిగిన ఎసిబి దాడుల్లో మద్యం సిండికేట్ల నుంచి లభ్యమైన పుస్తకాల్లో నిత్యం ఏ ప్రభుత్వ శాఖకు, ఏ నేతకు ఏమేర ముడుపులు అందుతున్నదీ స్పష్టమైంది. దీన్నిబట్టి చూస్తేనే ప్రజాప్రతినిధులు, పాలకులు, వివిధ శాఖల అధికారులకు మద్యం దుకాణాలపై ఎంతటి ప్రేమ వుందో ఇట్టే అర్థమవుతుంది.

- నిమ్మరాజు చలపతిరావు