Others

ఆమె ఎవరు? (ఫ్లాష్‌బ్యాక్@ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
నృత్యం: తంగప్పన్ రాజ్‌కుమార్,
చిన్ని, సంపత్
కళ: ఎకె పొన్నుస్వామి
స్టంట్స్: సేతుమాధవన్
కూర్పు: ఎస్‌ఎ మురుగేష్
ఫొటోగ్రఫీ: డబ్ల్యుఆర్ సుబ్బారావు
దర్శకత్వం: బిఎస్ నారాయణ

నిర్మాత: పిఎస్ వీరప్పన్

ప్రముఖ హిందీ దర్శకులు రాజ్‌కోస్లా, సాధనా, మనోజ్‌కుమార్, ప్రేమ్ చోప్రాల కాంబినేషన్‌లో 1964లో రూపొందించిన హిందీ చిత్రం ‘ఓ కౌన్ ధీ’. ఈ చిత్రానికి మదన్ మోహన్ సంగీతం, ధంప చటర్జీ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
తొలుత నాటకాల్లో నటునిగా, తరువాత మద్రాసుచేరి సినిమాల్లో ప్రముఖ విలన్‌గా రాణించిన పిఎస్ వీరప్పన్ నిర్మాతగా మారి కొన్ని చిత్రాలు రూపొందించారు. హిందీ చిత్రం ‘ఓ కౌన్ ధీ’ ఆధారంగా ‘యార్ నీ’గా తమిళంలో జయశంకర్, జయలలిత, ఆనందన్‌లతో 1966 ఏప్రిల్‌లోనూ, అదే ఏడాది తెలుగులో జగ్గయ్య, జయలలిత జంటగా ఆమె ఎవరు?గా నిర్మించారు. తమిళ చిత్రానికి సత్యం దర్శకత్వం చేపట్టారు. తెలుగు చిత్రానికి బిఎస్ నారాయణ దర్శకత్వం వహించారు. రెండు భాషల్లోనూ సంగీతం వేదా సమకూర్చారు. తెలుగు చిత్రం అక్టోబర్ 20, 1966న విడుదలైంది.
***
ఒక తుఫాను రాత్రి డాక్టర్ ఆనంద్ (జగ్గయ్య) నడుపుతున్న కారుకు అడ్డంగా వచ్చిన యువతి (జయలలిత)ని, కారులో ఎక్కించుకుని ఆమె కోరికమీద స్మశానం వద్ద దింపుతాడు. హాస్పిటల్‌లో డాక్టర్ సింహ (నాగభూషణం) కుమార్తె డాక్టర్ లత (వాణిశ్రీ) ఆనంద్‌ను ప్రేమిస్తుంది. కానీ ఆనంద్, రాధ అనే ఆమెతో ప్రేమలోపడి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటారు. మరోసారి ఆనంద్, అంతకుముందు తుఫాను రాత్రి కలిసిన యువతి ఓ పాడుబడిన బంగళాలో మరణించటం చూస్తాడు. ఆనంద్‌కు తాతగారినుంచి విల్లు ప్రకారం 10 లక్షల ఆస్తి సంక్రమిస్తుంది. అతనికి మతిభ్రమణం కలిగినా, మరణించినా ఆ ఆస్తి మరో బంధువుకు చెందుతుందని తెలుస్తుంది. ఆనంద్ ప్రేమించిన రాధను ఎవరో సైనేడ్ ఇంజెక్షన్‌తో హత్య చేస్తారు. అతని మనశ్శాంతి కోసం తల్లి (మాలతి), తన సోదరి సూచించిన కన్యతో ఆనంద్‌కు వివాహం జరిపిస్తుంది. తొలిరేయిన భార్య సంధ్య (జయలలిత), తాను అంతకుముందు తుఫాను రాత్రి కలిసిన యువతి పోలికలతో ఉండటం చూసి ఆనంద్ షాకవుతాడు. నాటినుంచి ఆమె కదలికలు, ప్రవర్తన అతన్ని ఆందోళనకు, అసహనానికి గురిచేస్తాయి. ఆమెను పుట్టింటికి వెళ్లమని పంపించేస్తాడు. మరునాడు రైలు యాక్సిడెంట్‌లో ఆమె మరణించిందని వార్త వస్తుంది. మనశ్శాంతి కోసం డాక్టర్ లత, సింహ, తల్లితో కలిసి ఊటీ వెళ్లిన ఆనంద్‌కు తిరిగి సంధ్య కనిపిస్తుంది. అంతలో ఓ సాధువు (ప్రభాకర్‌రెడ్డి) కనిపించి వందేళ్ల క్రితం మరణించిన ఆత్మ అతనికోసం వెదుకుతోందని తెలియజేస్తాడు. ఈ ఆందోళనతో అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన ఆనంద్‌కు కనిపించిన సంధ్యను వెంబడించి బంగళాలోకి వెళ్ళటం, అక్కడ సంధ్య పోలికలతో మరొక యువతిని చూడటం, ఆనందపై ఓ వ్యక్తి దాడి చేయటం, అతడు ఆనంద్ కజిన్ రమేష్ అని తెలియటం, సిఐడి ఆఫీసర్ రాజనాల వచ్చి సంధ్య, ఛాయ కవల పిల్లలని, వారి తల్లిదండ్రులు విడిపోవడంవల్ల సంధ్య తల్లి వద్ద, ఛాయ తాగుబోతు తండ్రి వద్ద పెరిగారని, డబ్బు ఇబ్బందులవల్ల రమేష్ ప్లాను ప్రకారం తాను ఆనంద్‌కు ఇబ్బంది కలిగించిందని, అనుకోకుండా ఎత్తునుంచి పడటంవల్ల ఇప్పుడు మరచిపోయిందని, ఇదంతా ఆస్తికోసం రమేష్, ఆనంద్ ఇంటి నౌకరు మాధవ్ (రాజబాబు) కలిసి చేశారని తెలియజేస్తాడు. పోలీసులు వారిని అరెస్టు చేయగా ఆనంద్, సంధ్య అపార్థాలు తొలగి ఒకటవటంతో చిత్రం సుఖాంతమవుతుంది.
చిత్రంలో ఆనంద్‌గా జగ్గయ్య సన్నివేశానుగుణమైన భావాలను ఎంతో నిండుగా ప్రదర్శించి అలరించారు. తొలుత సంధ్యను రాత్రిపూట కలవటం, ఆమె మరణించటం చూసి విచలితుడు అవటం, తిరిగి సంధ్యను భార్యగా చూసి అనుక్షణం నుంచీ ఆమె కదలికలకు ముఖంలో రియాక్షన్స్ ఎంతో ఆకట్టుకునేలా కనబర్చారు. ఇక సంధ్యగా జయలలిత అటు తమిళంలో, ఇటు తెలుగులో ఎంతో ఈజ్‌తో, పరిపక్వత కలిగిన నటన చూపారు. ముఖంలో భావాలను ఏమాత్రం తొందరపాటుతనం చూపక, నిగ్రహంతో కూడిన గంభీరమైన చిత్రమైన పరిణతిని చాకచక్యంగా ప్రదర్శించి మెప్పించారు.
సన్నివేశాలను మరింత రక్తికట్టించే సంభాషణలను వ్రాసి మెప్పించారు రచయిత బొల్లిముంత శివరామకృష్ణ. దర్శకులు బిఎస్ నారాయణ తొలిసారి ‘మాంగల్యం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత కొన్ని చిత్రాలు వీరి దర్శకత్వంలో రూపొందాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ పురస్కారాలు కూడా అందుకున్న వీరు రూపొందించిన ఈ చిత్రంలో సన్నివేశాలు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి మూలానికి భంగం రానీయకుండా నడిపారు. చిత్రం చివరిలో రమేష్‌కు, ఆనంద్‌కు, ప్రభాకర్‌రెడ్డి, సీతారాం మొదలైన వారిమధ్య జరిగిన ఫైటింగ్ సన్నివేశాలు ఎంతో వివరంగా చిత్రీకరించారు. అదేవిధంగా పాటల చిత్రీకరణలో నూతనత్వాన్ని చూపారు. హిందీలోలేని ఓ గీతాన్ని ఆనంద్ ఊహలో చక్కని, అందమైన సెట్టింగ్స్‌తో, జయలలిత అలరించే నృత్యంతో వెరైటీగా సాగుతుంది. -అందచందాల చిన్నది ఈ రోజు పొందు కోరెను తీర్చవో రాజా (పి సుశీల-దాశరధి. ఈ చిత్రంలోని గీతాలన్నీ దాశరధి వ్రాయటం విశేషం). హందీ చిత్రంలో మదన్‌మోహన్ సంగీతంలో ప్రాచుర్యం పొందిన ఓ హిట్ హంటింగ్ సాంగ్‌కు ఏమాత్రం తగ్గకుండా, అటు తమిళంలో, ఇటు తెలుగులో వేదా సంగీతం సమకూర్చారు. హిందీలో ‘నైనా బర్‌సే రిమ్ జిమ్ రిమ్ జిమ్’ అంటూ సాగే పాటను తెలుగులో (సంధ్య జగ్గయ్యను నీడలా పలుమార్లు అనుసరించే సమయంలో) -ఓ నా రాజా రావో రావో చెలినే మరిచితివో (పి.సుశీల) అంటూ సాగుతుంది. జగ్గయ్య, జయలలితలపై చిత్రీకరించిన మరో గీతం -నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా (పి.సుశీల), చక్కని ప్రకృతిలో ఆహ్లాదకరంగా సాగుతుంది. జగ్గయ్య, జయలలితలపై తోటలో నైట్ ఎఫెక్ట్‌తో చిత్రీకరించిన మరో గీతం -నీవు చూసే చూపులో ఎనె్నన్ని అర్థాలు వున్నవో, నిండు జాబిలి (ఎల్‌ఆర్ ఈశ్వరి, పిబి శ్రీనివాస్). హాస్పిటల్ వార్షికోత్సవంలో ఆనంద్, రాధ, డాక్టర్ లత, డాక్టర్ సింహ, ఇతరులపై చిత్రీకరించిన గీతం (ఆనంద్ వెస్టరన్ స్టెప్స్‌తో సాగుతుంది) -టికిరికి టికిరికి టఠడడఢ కిలకిల నవ్వుల’ (ఎల్‌ఆర్ ఈశ్వరి-పిబి శ్రీనివాస్).
హరిహరన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఆమె ఎవరు’ చిత్రం యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇతర భాషల్లోలాగే తెలుగులోనూ విజయం సాధించింది. ఫొటోగ్రఫీ, సంగీతం ఈ చిత్ర విజయానికి వెన్నుదన్నుగా నిలవటం ప్రత్యేకాంశం.

-సివిఆర్ మాణికేశ్వరి