వినమరుగైన

గయోపాఖ్యానము - చిలకమర్తి లక్ష్మీనరసింహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ
బంపు మామను బట్టి చంపగలమె
జలకేళి సవరించు జవరాండ్ర కోకల
నెత్తుకపోయి చెట్లెక్కగలమె
ఇల్లిల్లు దిరిగి వ్రేపల్లెలో మ్రుచ్చిలి
మిసిమి ముద్దలు తెచ్చి మ్రింగగలమె
గొల్లబొట్టెల గూడి కోలచేకొని ఆల
కదుపల నేర్పుతో కాయగలమె
తల్లిదండ్రుల పరులకీ దలచు కన్య
బలిమిమై దెచ్చి భార్యగా బడయగలమె
దుష్టులను వంక వీరుల ద్రుంపగలమె
అనపరాధుల దండింప నరుగ గలమె!
అనే గయోపాఖ్యాన నాటక పద్యం సుమారు నూరేళ్లుగా తెలుగువారి చెవుల్లో మారుమ్రోగుతోంది. ఈ నాటకానికి ‘ప్రచండ యాదవ’మనే పేరు కూడా వుంది.
ప్రసిద్ధ నాటకకర్తగా, నవలా రచయితగా, హాస్య రచయితగా, సంఘ సంస్కర్తగా, ఆంధ్రులకు చిరస్మరణీయులైన చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగు పెద్ద నాటకాల్లో తలమానికం కావటమే కాక మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకొంది. 1889 డిసెంబరులోనే ఈ నాటకం వ్రాయబడినా ఇపుడు మనం జూస్తున్న పుస్తక రూపంలో 1909వ సంవత్సరంలో ముద్రించబడింది. 1942 ప్రాంతానికే లక్ష ప్రతులకు పైగా అమ్ముడుపోయి నాటికీ నేటికీ కూడా ఒక రికార్డు నెలకొల్పింది.
వసురాయ కవిగారి వేణీ సంహారం, వేదంవారి ప్రతాప రుద్రీయం, శ్రీపాదవారి బొబ్బిలి యుద్ధం మొదలైన నాటకాలు కూడా గొప్ప నాటకాలుగా పేరు పొందినా, గ్రామగ్రామాన అసంఖ్యాక ప్రదర్శనలతో నేటికీ బ్రతికున్న నాటకంగా విమర్శకుల ప్రశంసలందుకొంటున్న నాటకం గయోపాఖ్యానం.
ఈ నాటకాన్ని చిలకమర్తివారు తన 22వ ఏట హిందూ నాటక సమాజం కోసం వ్రాశారు.
1880లో ధార్వాడ నాటక సమాజంవారు ఆంధ్ర దేశంలో పర్యటించి ఇచ్చిన ప్రదర్శనలు తెలుగు నాటక రంగానికి బీజావాపం చేశాయి. కందుకూరి మొదలైనవారు నాటక రచన, ప్రదర్శనలకుపక్రమించారు. క్రమంగా రాజమహంద్రవరం కేంద్రంగా ఎన్నో నాటక సమాజాలు, నాటకాలు, నాటక రచయితలతో నాటక రంగం ప్రకాశవంతమైంది.
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారి ఉపాధ్యాయులైన ఇమ్మానేని హనుమంతరావు గారు 1894లో హిందూ నాటక సమాజాన్ని స్థాపించారు. ఆ సమాజంలో చిలకమర్తివారు, ప్రకాశంగారు ప్రముఖులు. ఆ సమాజ ప్రదర్శనలకోసం చిలకమర్తి వారు కీచక వధ ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, పారిజాతాపహరణం మొదలైన నాటకాలు రచించారు.
1909లో గయోపాఖ్యానం అచ్చయ్యాక, దాని ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఈ నాటకాన్ని ప్రదర్శించని తెలుగు నాటక సమాజం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ నాటకంలోని అర్జున కృష్ణ పాత్రలకు పోటీలు పెట్టి బంగారు పతకాలు బహుమతులు ఇచ్చేవారు.
గయోపాఖ్యానంలోని సంభాషణలు, పద్యాలు సహజత్వానికి దగ్గరగా ఉండి తెలుగువారి మనోభావాలను ప్రతిబింబిస్తూ ఉండటంవల్లనే ఈ నాటకం అంతగా జనంలో అల్లుకుపోయింది. తిరుపతి వేంకట కవుల ఉద్యోగ విజయాల పద్యాలపై చిలమర్తివారి ప్రభావం కనబడుతుంది.
గయోపాఖ్యాన నాటక ప్రాచుర్యానికి పద్యాలే ప్రధాన పాత్ర వహించాయని పెద్దలు చెబుతున్నా, మొదట ఈ నాటకం దాదాపు వచన నాటకంగానే వ్రాయబడింది. ఇమ్మానేని వారికి గానీ, ప్రకాశం పంతులుగారికి గానీ పద్యాలు పాడటం రాదు. శ్రీకృష్ణ పాత్రధారి పాడగలవాడని ఆయనకు కొన్ని పద్యాలు పెట్టారు. నాటకాలలో పద్యాలు పాడటమనే విధానం రాజమండ్రిలోనే 1883లో వసురాయ కవిగారి వేణీ సంహారంతో మొదలైంది. జనాకర్షణ కోసం నాటకాల్లో పద్యాలు చేర్చడం అప్పటి నుండి ఆరంభమైంది.
చిలకమర్తివారి పద్య రచన, అతిలలిత సుందర పదాలతో సంభాషణకు తగిన కాకువులు వక్రోక్తులతో సహజత్వానికి దగ్గరగా ఉండటం చేత ప్రేక్షకుల ఇష్టాన్ని గమనించి క్రమంగా పద్యాల సంఖ్య పెంచుతూ, గయోపాఖ్యానం అచ్చేయ్యేనాటికి నాందీ భరతవాక్యాలతో కలుపుకొని 208 పద్యాలు చేశారు.
గయోపాఖ్యానం వ్యాసభారతంలో లేని కల్పిత భారత కథ. మరుత్తరాట్చరిత్రలోని నరిగొండ ధర్మన చిత్రభారతంలోను గయోపాఖ్యానాన్ని పోలిన కథలు ఉన్నా, మొదటిగా కృష్ణార్జున సంవాదం అనే పేరుతో క్రీస్తుశకం 1820 ప్రాంతంలో తిమ్మరుసు మేనల్లుడైన నాదెండ్ల గోపన్న ద్విపద కావ్యంగా వ్రాశాడు.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పాలపర్తి శ్యామలానందప్రసాద్