వినమరుగైన

పాండవోద్యోగ విజయాలు -తిరుపతి వేంకటకవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండవ విజయంలో మరొక గొప్ప సన్నివేశం గంగా, యమున, సరస్వతి నదుల సంభాషణ. నిజమునకు ఇదొక విష్కంభ సన్నివేశం. నదులతో విష్కంభ సన్నివేశం నడపడం ఒక ప్రయోగం. భీష్మవధకు గంగాదేవి విలపించడం, వధకు పూర్వాపరాలను నదులతో కలిసి చర్చించడం, హృదయవిదారకమై కరుణరసప్లావితంగా నడుస్తుంది. యుద్ధ సన్నివేశాన్ని గంధర్వులతో చెప్పించడం నాటక ప్రయోగ పరిణతికి నిదర్శనం. అభిమన్యువధాఘట్టం ద్రౌపదీ ధర్మరాజుల మధ్య కరండకుని సంవాదంతో చెప్పించి, తదనంతర అర్జున విచారం సన్నివేశంగా రాయడం రచనా నైపుణ్యానికి ఉదాహరణ. ద్రోణవధ, శల్యవధ సన్నివేశాల తర్వాత పాండవ విజయంలో పరాకాష్ట సన్నివేశం కర్ణవధ. కర్ణవధకు పూర్వం కర్ణుడు యుద్ధరంగంలో ధర్మరాజును పరాభవిస్తాడు. ఆ పరాభవాగ్నిలో మదనపడుతున్న ధర్మరాజు వద్దకు కృష్ణార్జునులు వస్తారు. కానీ అప్పటికే కర్ణుని చేత యుద్ధంలో తిరోగమింపబడిన అర్జునుణ్ణి చూసి నిందిస్తాడు. ఆ నింద చాలా లోతుగా ఉంటుంది. ఇప్పటిదాకా నువ్వేమీ యుద్ధం చేయలేదు అనేవరకు వస్తుంది ఆ సన్నివేశంలో.
ధర్మరాజు ఇలా అంటాడు. అర్జునా మరల నా ముందేటికి బీరములాడెదవు.
‘‘కుంభభవుండు నీ వలన గూలెనొ! భీష్ముని గూల్చి విక్రమో
స్తంభన మాచరించితివొ? తామరసాక్షిని తోడులేకయో
శంభువర ప్రసాది యగు సైంధవుదున్మితో? నీవు సంగరా
రంభమునుండి యిందనుక వ్రచ్చిన శూరుల పేరు దెల్పుమా!
నీ చేతపడుటచే గాండీవంబు పరువును,
నీకు సారధియగుటచే హరి మర్యాదయు కూడా రూపుమాసినది.
రథియై తామరసాక్షుడు ప్రధనము గావించు గాండీవంబొసగుము
సారధినై నడుపుము తేరు
ఈ విధమున గర్ణుండు గ్రుంకు వీరమ్మన్యా-
ఇంతటి పరుషమైన దూషణ ధర్మరాజు నోటి నుండి రావడం విశేషం. దీనికి అర్జునుడు ప్రతిగా-
‘‘మాలిమి మాలి ఈతడును మాటలకన్నిటి కింతసేపు నే
దాలిమి బూని యుంటి నిక దమ్ముడగా నితడన్నగాడువే
యేల శరాసనం బొరులకిమ్మను నెవ్వడు వాని కంఠమీ
వాలున ద్రుంపగా ప్రతినపట్టితి కావున ద్రుంతనీతనిన్
అనగానే కృష్ణుడు వారిస్తాడు. అయినా అర్జునుడు ధర్మరాజును దెప్పిపొడుస్తూ
నీ మూలమునగదా నెలతకు కొల్వులో కారాని ఇబ్బంది కలిగె నాడు
నీ మూలమునగదా నిన్నమొన్నటి దాక బడరాని ఇక్కట్లు పడితి మేము
నీ మూలమునగదా నిలువ నీడయులేక కుంత్రి మార్తురయింటగుడువ వలసె
నీ మూలమున గదా నేలభాసి తొలంగె పదిపదారేండ్ల నెంబడిన కొడుకు
భరతకుల గౌరవంబును పాండురాజు గౌరవంబును తమ్ముల గౌరవంబు
వొనడచెనేర - నీ పారుబోతుతనము - దళిత నిజయోధ బలతేజ ధర్మరాజ
ఇలా పరస్పరం దూషించుకొనే సన్నివేశం తిరుపతి వేంకటకవుల నాటక ప్రదర్శనోచితమైన దృశ్యం. అంత రెచ్చగొట్టగానే అర్జునుడు కర్ణుని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. మళ్లీ అన్నదమ్ములు ప్రేమతో కౌగిలించుకుంటారు. కర్ణవధ సమయంలో కర్ణునికి సాయపడటానికి అశ్వత్థామ రావడం విశేషం. బ్రాహ్మణుని సాయం నాకక్కరలేదు అనడం అతనిలోగల పూర్వవైరాన్ని గుర్తుచేయడం, శల్యుని యొక్క సారధ్యంలోని వ్యంగ్యం ఒక విధమైన సంవేదనకు పాఠకుణ్ణి గురిచేస్తుంది. కర్ణవథ తోటి రధచక్రంపైకి రావడం మరో విశేషం.
ఒక ద్వైపాయక హ్రదంలో దాగుకొన్న సుయోధనుని జలస్తంభ విద్య ఇందులో చక్కగా విశదీకృతవౌతుంది. మడుగులో దాగినప్పుడు కృపాశ్వద్ధామలు పిలిస్తే వస్తాడు తిరిగి మడుగులోకి వెళతాడు. పాండవ పంచకం వచ్చి నానారకాలుగా తమ వాగ్బాణాలు కురిపిస్తాడు.
భీముడు మడుగున దాగిన దుర్యోధనుణ్ణి ఇలా పిలుస్తాడు.
‘‘ఓయి దుర్యోధన మహారాజా మడుగులోనుండి దయచేయుము
దంభము పన్ని సంగర పదంబు తొలంగి హ్రదంబునన్ జల
స్తంభన విద్య దాగినను చావక యుందువె మూఢుఢా జలో
జ్ఞృంభణ చసి జాలరుల చేపలపట్టిన రీతిగా దురా
లంభుని నిన్ను నా భుజబలంబున నేడెటులేని పట్టెదన్
ఇక ధర్మరాజు బిగ్గరగా ఇలా అంటాడు.
చచ్చిరి సోదరుల్ సుతులు ఇచ్చిరి, చచ్చిరి రాజులెల్ల ఈ
కచ్చెకు మూలకందమగు కర్ణుడు మామయు జచ్చి రీగతిం
పచ్చని కొంప మాపితివి బాపురె కౌరవనాథ నీ సగం
బిచ్చెద జీవితేచ్ఛగలదేని బయల్పడు మయ్య గ్రక్కునన్
ఇక దుర్యోధనుడు రావడం- భీమునితో గదాయుద్ధం చేయడం అంతలో బలరాముడు రావడం- తర్వాత అపాండవం చేయడం ఎన్నో ముఖ్యమైన రసవంతమైన సన్నివేశాలు - పద్యాలు పాండవ విజయంలో ఉన్నాయి. ఇది ఈ రోజుల్లో ప్రదర్శించడం చాలా సాహసంతో కూడుకున్న పని. కాని పుస్తకాన్ని చదువుతుంటే ఒక చక్కని దృశ్యకావ్యాన్ని అనుభవించవచ్చు. మనోయవనిపైన భారతగాధ సజీవంగా దృశ్యమానం చేయగల ప్రఖ్యాత నాటకశ్రేణిలోనివి పాండవోద్యోగ విజయాలు.

-అయపోయంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-రాళ్ళబండి కవితాప్రసాద్