వినమరుగైన

వరవిక్రయము(-కాళ్లకూరి నారాయణరావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా, కంఠే బథ్నామి శుభగే సాజీవశరదాం శతం’’-
ఎంత చక్కని మాట ఇది. ఇలా సుఖంగా, శుభంగా జరగవలసినటువంటి వివాహాలు ఎవరింటి పిల్లని వాళ్లకి వాళ్లు ఎంతో కొంత ఇచ్చి, ఎవరో ఒకరికి కట్టేసి పని అయిపోయిందని మురిసిపోతున్నారు తప్ప ఈ వరవిక్రయం అనే అలవాటుని ఓ సంప్రదాయంగా, పరోక్షంగా మార్చేస్తున్నాం అని అనుకోవడం లేదు. అలాగే వరవిక్రయం లేదా వరకట్నం అనే విధానాన్ని తిట్టిపోసిన వాళ్లంతా తమ పిల్ల లేదా మనవరాలు పెళ్లయ్యాక ఆ ఊసు ఎత్తడమే లేదు. వెరసి ఎక్కడైనా ఈ వరవిక్రయ చర్చ సాగింది అంటే లేదా సాగుతోంది అంటే అవతలి వ్యక్తి ఇంట పెళ్లికెదిగిన కూతురు ఇంకా ఉందని, ఆమెకు వివాహానికి తగిన ఆర్థిక స్తోమతుకాని, యింకా సంబంధం కుదరలేదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏది ఏమైనా ఈ వరకట్న ఆచారాన్ని తెలిసో, తెలియకో పాటిస్తూ అంతా పాలు తాగుతున్న పిల్లల్లానే వ్యవహరిస్తున్నారు. ఈ దురాచారపు తీరు తెలిసినా, వ్యతిరేకించటం అనే పద్ధతి ద్వారా వాత పెట్టడం వచ్చినా కూడా దాదాపు కన్యాదాతలందరూ ఈ విషయానికొచ్చేసరికి పళ్లూడగొట్టుకున్న మంత్రగాళ్లలాగా అయిపోతున్నారు తప్ప, ప్రయోజన శూన్యులు అయిపోతున్నారు తప్ప, ధైర్యంగా ఎదిరిస్తున్నారు అనేందుకు తగిన ఆధారాలు హుళక్కి.
విషయం ఇలా ఉంటే తన నడిపి వయస్సులో అంటే 25 ఏళ్ల ప్రాయంలో తాను ఈ దురాచారాన్ని వ్యతిరేకించి, ఇతరులని కూడా వ్యతిరేకింపజేయాలని ప్రయత్నించిన సంఘ సంస్కర్త శ్రీ కాళ్లకూరి నారాయణరావు. 1871లో పుట్టినటువంటి ఆ మహనీయుని యొక్క రచన ఈ వరవిక్రయం. దాదాపు ఆయన జీవించిన 56 సంవత్సరాల వయస్సు కాలంలో చింతామణి మొదలైనటువంటి ఎన్నో నాటకాలను అందించినా ఆ వరవిక్రయానికి వుండేటటువంటి స్థానం అలాగే ఇప్పటికీ, ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. చింతామణి నాటకాన్ని ఆయన మరో అభిప్రాయంలో రాస్తే లోకం వేరు విధంగా దాన్ని స్వీకరించడం దురదృష్టకరం. ఆ రోజుల్లో ఎస్‌ఎల్‌సి వరుడికి రెండు వేలు, ఇంటర్ వరుడికి మూడువేలు, బిఏ వాడికి నాలుగు వేలు, ఇవికాక ఆస్తి ఉంటే దాన్ని బట్టి మరికొంత ఖచ్చితంగా ఇవ్వవలసిన పరిస్థితి దాపురించి ఉంది.
ఈ గంభీర సమస్యని చక్కని హాస్యంతో ఎలా అయినా తీర్చాలి అని అనుకున్నటువంటి ఆయన మంచి హాస్యాన్ని మేళవించి, నేను సైతం ఈ దురాశాగ్నికి అంటూ నడుం కట్టి కొంత అయినా ఆలోచించేలా చేశారు శ్రీ కాళ్లకూరి నారాయణరావు. పేరుకి తగ్గటుండే వ్యక్తి పురుషోత్తమరావు దీంట్లో నాయకుడిగా కనిపిస్తాడు. చిన్న ఉద్యోగం చేస్తూ, స్వాతంత్య్రకాలంలో సహాయ నిరాకరణ ఉద్యమం రాగానే, నిండు మనస్సుతో ప్రతిజ్ఞ చేసి, ఉద్యోగాన్ని తృణప్రాయంగా విడిచేసి ఇంట్లో రాట్నం తిప్పే పని చేపట్టాడు. అంతేకాదు, తన కూతుళ్లు కాళింది, కమలలకు తన ఆదర్శానే్న ఆస్తిగా ఇచ్చిన సగటు తండ్రి కూడా ఆయన. తలను ఎత్తాలని ఎప్పటికప్పుడు అనుకుంటన్న సమస్యా భారానికి కనీసం ముందున్న వస్తువుల్నికూడా చూడలేక భూమి మాత్రమే చూస్తూ నిలిచిపోయే కన్యాదాత పాపం పురుషోత్తమరావు. స్వదేశీ వస్తువు నిద్ర నుంచి మేల్కొని విదేశీ వ్యామోహపు కళ్లు తెరిచి పాశ్చాత్య ఊహలతో, స్వప్నలోకాలలో విహరించే వరుళ్లు బాగా వున్న రోజులవి. అప్పటి రోజుల ప్రకారం ఓ సైకిలూ, రిస్టువాచి, గోల్డ్ రింగూ, పక్క పాపిడి, ఓ బూటూ, సూటూ, అంతో ఇంతో కాఫీ హోటల్‌లో తినడం, కిళ్లీ, సిగరెట్టూ, చలువద్దాలు సరేసరి. ఇలాంటివి ఉంటే నిశ్చయంగా వాడు పాశ్చాత్య దేశపు దొరే అని నాటి వాళ్లు అనుకుంటుండేవారు. అలాంటి చకోర కుక్షులంతా ఒట్టి దద్దమ్మలనీ, బొమ్మ పులులని, చూపుడు గుర్రాలు అనీ భ్రమరాంబ, పురుష్తోమరావు దంపతుల అభిభావన.
అదుగో ఆ దంపతుల పుత్రికే జ్యేష్ఠ పుత్రిక కాళింది తన రాట్నం సాక్షిగా ప్రతిజ్ఞ చేసింది వరకట్నం గ్రహించిన వాడిని చస్తే పెళ్లాడను అని. అయితే దురదృష్టవశాత్తూ, తనకి తెలయకుండా తల్లిదండ్రులు వరకట్నానిచ్చి వరుడ్ని కట్టబెడుతున్నారని తెలియగానే చివరి స్నానం, మొదటి స్నానం ఈ జీవితానికి ఇదే అంటూ చరఖాకి చెప్పి చరఖా సాక్షిగా, అంటే ఆ రాట్నం సాక్షిగా నూతిలో దూకి, ప్రతిజ్ఞ్భాంగం చేయకుండా ఉన్నటువంటి యోగినిగా అయిపోతుంది. సమస్యకిది పరిష్కారం కాబోదు, కాదు అనే విషయాన్ని చెప్పదలచి కాబోలు కాళింది అంటే నల్లగా ఉండే యమునా నది పేరుని ఆవిడకి పెట్టి ఈ పాత్రకి ఈ మరణం తగదు ఇదొక మచ్చే అని చూపిస్తాడు కవి.
ఇక రెండవ పుత్రిక కమల ఎంత ఎండ వేడిమిని అయినా తట్టుకుని సాయంత్రం వరకు నిలిచి ఉండే కరుకుదనం ఉన్నా చూపులకి మాత్రం మెత్తగానే ఉండే పాత్ర ఈమె. తన అక్క వరకట్నాన్ని వ్యతిరేకించి ఆత్మహత్య చేసుకుంటే ఆ వరుడ్నే పెళ్లాడటానికి మనసారా అంగీకారాన్ని తెలిపిన ధైర్యశాలిని. అయిదు రోజుల పెళ్లిలో అష్టకష్టాలు అంటే ఏంటో చూపించిన అత్తగారు వాళ్లు, ఆత్మస్థైర్యాన్ని వీడకుండా అచంచల దీక్షా దక్షురాలిగా నిలుస్తుంది కమల. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-మైలవరపు శ్రీనివాసరావు