వినమరుగైన

మా భూమి వాసిరెడ్డి - సుంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాంఘిక నాటక రంగంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించిన మాభూమి నాటకాన్ని వాసిరెడ్డి-సుంకర అనే జంట రచయితలు రచించారు. వాసిరెడ్డి భాస్కరరావుగారిది తెలంగాణ సరిహద్దులోని నందిగామ తాలూకా, వీరుల పాడు గ్రామం. వీరు 1914 సెప్టెంబరు 2న జన్మించి, 1957 నవంబరు 1న 43వ ఏట మరణించారు. సుంకర సత్యనారాయణగారిది విజయవాడ దగ్గర ఈడుపుగల్లు గ్రామం. వీరు 1909 మార్చి 23న జన్మించారు. తమ 66వ ఏట 1975 సెప్టెంబరు 9న మరణించారు.
వీరిద్దరూ రైతు కుటుంబాలనుంచి వచ్చినవారే. సామాన్యులతో మెలిగి, సామాజిక చైతన్యాన్ని పొంది సామాజిక మార్పు కొరకు ఒకరికొకరు తోడై నిలిచారు. నాటక రంగం ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. ‘‘సూర్యుని స్వయంప్రకాశంతో ధీటైన కాంతి వీరిరువురిదీను’’ అన్నాడొక సాహిత్య విమర్శకుడు.
వాసిరెడ్డి - సుంకర జంటగా రాసిన నాటకాల్లో మాభూమి మూడవది. మొదటిది ముందడుగు, రెండవది అపనింద సుంకర - వాసిరెడ్డిగార్ల మా భూమి. జమీందారీ వ్యతిరేక పోరాటం కథా వస్తువుగా వున్న ముందడుగు నాటకం 1946లో అచ్చువేశారు. మూడు వేల ప్రతులు మూడు నెలల్లో అమ్ముడైపోయాయి. మొదటిసారిగా ఈ నాటకాన్ని కోడూరి అచ్చయ్యగారి దర్శకత్వంలో 1945లో తెనాలి దగ్గర కఠెవరంలో ఆంధ్ర రాష్ట్ర రైతు మహాసభలో ఏభైవేల మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించారు. ఈ నాటకాన్ని పనె్నండు ప్రదర్శనల తర్వాత మద్రాసు అడ్వైజరీ ప్రభుత్వం నిషేధించింది. దీనికి నిరసన తెలియజేస్తూ ప్రజా నాట్యమండలి పిలుపునందుకొని 15-8-46న ఆంధ్రదేశమంతటా ముందడుగు దినోత్సవం జరిపారు. నిషేధానికి నిరసన తెలియజేశారు.
1946లో మొదటిసారిగా ప్రదర్శించిన మాభూమి నాటకం 1947లో ప్రజాశక్తి ప్రచురణగా వెలువడింది. అప్పట్లో దాని వెల ఒక రూపాయి. మొదటి ప్రచురణ రెండువేల ప్రతులూ ఒకటిన్నర నెలలో అమ్ముడయ్యాయి. 1948లో రెండవ ముద్రణ నాటికి ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి దాదాపు 125 నాటకదళాలు వివిధ జిల్లాలలో ఏర్పడి, అప్పటికే వేయికిపైగా ప్రదర్శనమిచ్చాయి. సుమారు 20 లక్షలమంది ప్రజలు ఈ నాటకాన్ని అప్పటికి చూశారు. ఈ నాటక ప్రదర్శనా, నాటక బృందాలూ ప్రపంచ నాటక రికార్డును బ్రద్దలు చేశాయని కె.ఎ.అబ్బాస్ రాశారు.
ప్రజా నాట్యమండలి రాష్ట్ర దళం, డా. రాజారావు నాయకత్వాన ఈ నాటకాన్ని బొంబాయి, అహమ్మదాబాద్, పూనా, షోలాపూర్‌లలో 1948 జనవరిలో ప్రదర్శించింది. బొంబాయి నగరం నడిబొడ్డున వున్న సుందరీబాయి థియేటర్‌లో మత కలహాల వాతావరణంలో ప్రదర్శించారు. అహమ్మదాబాదులో అక్కడ బట్టల మిల్లుల్లో పనిచేస్తున్న 20వేలమంది ఆంధ్ర కార్మికుల కోర్కెపై ఉదయం పది గంటలకు ప్రదర్శించారు. అటునుంచి పూనా ఆంధ్ర అసోసియేషన్ ఆహ్వానంపై పూనాలో ఉదయంపూట ప్రదర్శించారు. ఆ తర్వాత రోజు రాత్రి షోలాపూర్‌లో ఒక బట్టల మిల్లుకు చెందిన ఆరుబయట రంగస్థలంలో అర్థరూపాయి టిక్కెట్టు పెట్టి ప్రదర్శించారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన లక్షా ఏభైవేలమంది చేనేత కార్మికులు అక్కడి బట్టల మిల్లుల్లో పనిచేస్తున్నారు. వారు మరో ప్రదర్శనను కోరినా నటుల తీవ్ర అనారోగ్యంవల్ల రాష్ట్ర దళం తిరిగి వచ్చేసింది.
మాభూమి నాటకాన్ని, నాటక ప్రదర్శననీ, మద్రాసు ప్రభుత్వం 1948లో నిషేధించింది. ఈ నిషేధానికి ఒక చరిత్ర వుంది. ప్రజల్ని ఇంతగా ఆకర్షించిన మాభూమి నాటకాన్ని మంత్రుల కోర్కెపై మద్రాసులోని బాంక్వెటింగ్ హాలు (ఈనాటి రాజాజీ హాలు)లో ప్రజా నాటకమండలి ప్రదర్శించింది. ప్రదర్శనానంతరం మంత్రి బెజవాడ గోపాలరెడ్డి ‘‘నిద్రాణమై వున్న జాతి నేడు మేల్కొంటున్నది. ఈ నాటకంలో దినం దినం నిరుపేదలు పడే కష్టాలు చూశాం. హృదయాల ద్రవించాయి. కన్నీళ్లు కార్చాం’’ అని ప్రశంసించి అర్ధ నూట పదహార్లు బహూకరించారు. మరొక మంత్రి కళావెంకటరావు ‘‘ఓరుగల్లును మాభూమిగా చేసి ముక్కోటి తెలుగు బిడ్డలు ఏకమై విశాలాంధ్ర స్థాపించేందుకు ఇటువంటి నాటకాలు కృషి చేయాలని కోరుతున్నాను’’ అన్నారు. వేముల కూర్మయ్యగారైతే ‘‘ఈ నాటకం చూడకమునుపు ఇంత అద్భుతంగా వుంటుందని అనుకోలేకపోయాను. దునే్నవాడిదే భూమి అనే సత్యాన్ని ఇంత చక్కగా చూపించారు. ఈ నాటకం మన గ్రామాల్లో ప్రదర్శిస్తే బీద రైతులు, వ్యవసాయ కూలీలు, దునే్నవాడిదే భూమి అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టి తీరుతారు. త్వరలోనే అటువంటి శాసనం వస్తుందనీ, మధ్య దళారీలు తొలగింపబడతారని నేను ఆశిస్తున్నాను’’ అన్నారు. అందుకే కాబోలు, ఈ ప్రదర్శన చూసిన ఆరు నెలల్లోనే నాటకాన్ని నిషేధించారు.
ఈ నాటకాన్ని శాంతారాం, ఎల్.వి.ప్రసాద్, బి.యన్.రెడ్డి లాంటి దర్శకులూ, మేధావులూ, చిత్రకారులూ, విజ్ఞానవేత్తలూ ఎంతగానో కొనియాడారు. అంతేగాక ఆంధ్ర నాటక కళాపరిషత్తువారి 14వ పోటీలలో బహుమతిని అందుకొంది. వాసిరెడ్డి సుంకరలు ఈ నాటకానికి ముందుమాటగా రాసిన ‘మనవి’లో మొదట ఈ నాటక ప్రదర్శనను పశ్చిమ గోదావరి జిల్లాలో నిషేధించారని తెలియజేశారు. ఈ నాటక నిషేధాన్ని ఖండిస్తూ ఆంధ్ర ప్రజా నాట్య మండలి ఆనాటి ప్రధాన కార్యదర్శి డా. రాజారావు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నిషేధంపై ఆరుద్ర వ్యాఖ్యానిస్తూ ‘మాభూమి’ని వ్రాయవలసిన పద్ధతిలో రాశారు. ఆడవలసిన పద్ధతిలో ఆడారు. ప్రజలు చూడవలసిన పద్ధతిలో చూశారు. అందుకే నాటకాన్ని ప్రభుత్వం నిషేధించింది’’ అన్నారు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొత్తపల్లి రవిబాబు