వినమరుగైన

చదువు -కొడవగంటి కుటుంబరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు కొకు అనుభవ ప్రపంచంలో రూపుదాల్చుకొన్న ఒక జ్ఞాపక విస్తారం. మనుషుల్ని త్రోసుకువస్తున్న మార్పులకు వాళ్ల రియాక్షన్‌ని, తనలో ఎదిగిన, తాను ఎరిగిన భావజాలంలోంచి ప్రెజెంట్ చేస్తాడు కొకు. చదువు నవలలలోని గొప్పతనం అదే. ఒట్టి డాక్యుమెంటేషన్ అనిపించే నవలలో- ఒక్కొక్క పాత్ర కదలి వచ్చి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన పీరియడ్‌లో తాము ఎలా ప్రయాణించామో, డిస్టర్బ్ అయ్యామో వివరించటం కనిపిస్తుంది. ఈ వివరించటము ఇద్దరు మనుషుల మధ్య సాగే సహజ సంభాషణలా ఉంటుంది. మెలోడ్రామాలు, అద్భుతమైన మలుపులు, పాఠకుడి చెవి పట్టుకుని తన వెంట నడిపించుకొనే శిల్పచాతుర్యాలు- అది కొకు పద్ధతి కాదు. నవల మొత్తం ఉధృతిగా ప్రవహించే నది పక్కన వౌనంగా నడుస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
అయితే కొంచెం దీక్షగా పరిశీలిస్తే నవలలోని సంఘటన మధ్య ఒక డ్రెమటిక్ ఆర్డర్ కూడా కనిపిస్తుంది. 1935 ఆర్థిక మాంధ్య తటాలున తగిలిన దెబ్బలా సుందరం ఉక్కిరిబిక్కిరి ఆవటం, చదువు ఆపేయవలసి రావటం అనే ట్రాజిక్ నోట్‌లో నవల ముగుస్తుంది. ప్రపంచంలోని గొప్ప క్లాసిక్స్ ఈ డిప్రెషన్ పీరియడ్‌లోనే పుట్టాయి. నవల అక్కడ ముగియటంలో చరిత్రలోని ఒక సింబాలిక్ మలుపును సూచించటమే! అయితే నవల చివరలో తన చదువు ఆగిపోయినా- తన పిల్లవాడు అక్షరాల్ని గుర్తుపడుతున్నాడంటూ సుందరం మురిసిపోవటం అనే ఒక ఆశతో ముగించటము కొకులోని చైతన్యస్ఫూర్తిని తెలియజేస్తుంది. చదువు మనిషిలో తెరుచుకుంటున్న తలుపులకు, వీస్తున్న కొత్త గాలులకు ప్రతీక! చదువు మానవుడి పురాతనమైన కల. తనకు తాను విముక్తం చేసుకోవడానికి మనిషికి అందుబాటులో వున్న పరికరం. ఈ విషయాన్ని అంతగా చదువుకోని సుందరం తల్లి సీతమ్మ ఆరాటంలోనూ, ఎంతో చదువుకొన్న సుందరం మురిసిపోవటంలోనూ ప్రదర్శితమవుతుంది. రిలే ఆటలో లాగ ఒక తరం నుండి మరో తరానికి సాగిపోయే మానవ స్వప్నం ఈ చదువు.
చదువు నవల ఒక సాంప్రదాయమైన సమాజం. లోపలా బయటా వస్తున్న శక్తులకు ఎట్లా రీకన్‌స్ట్రక్ట్ అయ్యిందో మనకు వివరిస్తుంది. ఒక పీరియడ్‌లోని, ఒక సమాజాన్ని అందులో సంచరించే మనుషుల్ని చూపించటము ఒక్కటే కొకు లక్ష్యం కాదు. ఒక లివింగ్ స్ట్రక్చర్‌లోకి కొంత్త విలువలు ఎట్లా చొప్పించబడుతాయో- దానిపై చరిత్ర ప్రభావం ఎంత బలంగా ఉంటుందో ఒక పర్సనల్ డ్రీమ్‌లోంచి చెప్పటం ఆయన ఉద్దేశం.
మార్పులు ఇంకా సంభవించని, ఒక స్టాటిక్ సమాజంలోంచి, సగటు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుందరం, తల్లీ తండ్రీ, ఆదినారాయణ లాంటి పెద్దలు సూచించే మధ్య తరగతి విలువలు జాతీయోద్యమ నాయకుడు శేషగిరి లాంటి కుహనా మేధావులు, రాఘవయ్య, మార్కండేయులు, శాస్ర్తీ, రంగారావు లాంటి నూతన ఆలోచనా ధోరణి ప్రదర్శించే పాత్రలు నరసు లాంటి ఔత్సాహిక కళాకారులు, నాగేశ్వర్రావు లాంటి యువకులు-వీళ్ల కుటుంబ జీవితాలు, సామాజిక సంబంధాలు క్రమంగా కొత్త ఆలోచనా ధోరణికి ఎక్స్‌పోజ్ అవుతున్న సమాజం నవలలో ప్రదర్శితవౌతుంది. సుందరం ఒక్కొక్క పొరనే వలుచుకుంటూ ఆధునిక భావాలున్న బుద్ధిజీవిగా ఎదగటం మనం గమనిస్తాము. బహుజనులను అంగీకరించని కులవ్యవస్థ ఒక అనవసరపు సంకెలలాగా భావించటం- అనే పరిణతిని కూడా మనం చూస్తాము.
నవల మొత్తం జాతీయోద్యమపు నేపథ్యం ఉంటుంది. తిలక్ మరణం గాంధీజీ వాల్యూ సెట్టర్‌గా ఒక మాజిక్ సోల్‌గా మారటం, సహాయ నిరాకరణోద్యమం, స్వదేశీ ఉద్యమం- శేషగిరిలాంటి శుద్ధ కాంగ్రెస్ వాదులు, శ్యామల కుటుంబం లాంటి అర్బన్ ఫాషనబుల్ కాంగ్రెస్ వాదులు- సుందరానికి ఈ ఉద్యమ తీవ్రతే కాదు అందులోని బోలుతనం కూడా అర్థమవుతుంది.
నవల పూర్తిచేసిన తరువాత సుందరంతోపాటు మనం వేసుకొనే కొన్ని ప్రశ్నలు-
చదువంటే ఏమిటి? పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ నేర్చుకొనేవా? పుస్తకాల్లోంచి పొందిన జ్ఞానమా? అనుభవంలోంచి పిండుకొన్న సారమా? సాంస్కృతిక జీవనంలోంచి వెలికి వచ్చిన కొత్త వెలుగులా? ఇంకా చదువు వ్యక్తిని పెంచేదిలా ఉండాలా? లేదా కేవలం జీవనభృతిని ఇస్తే సరిపోతుందా?
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వి.చంద్రశేఖరరావు