వినమరుగైన

అసమర్థుని జీవయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు అక్షర జగతిలో చరమరాత్రులు చాలా హృదయ విదారకంగా గడిపినవాళ్లూ, అల్పజీవులూ, అసమర్థులూ, దగాపడిన తమ్ముళ్ళు, వెల్లువలో పూచికపుల్లలైన వాళ్లూ, నిరుద్యోగి వెంకటరావులూ వాస్తవ జీవనంలోంచి అధివాస్తవికతలోకి పారిపోయిన కోనేటిరావులూ, స్వగతాల్లోనే సతమతమైపోయిన క్లర్కు సూర్యారావులూ, గచ్చత్ శవాకార వికారులూ లెక్కకు మిక్కిలిగానే కన్పిస్తారు. వ్యష్టికి సమిష్టికీ స్నేహం కుదరనంతవరకూ సీతారామరావులూ, సుబ్బయ్యలూ ఇంకా ఉంటూనే పుట్టుకొస్తుంటూనే ఉంటారు. సక్రమ ఆలోచనాశక్తి లోపించినపుడు బుద్ధి వక్రమార్గాన పడి హత్యకో ఆత్మహత్యకో దారితీస్తుంది.
అసమర్థుని జీవయాత్ర నవల 1945లో అచ్చయింది. 1953లో ప్రచురితమైన రావిశాస్ర్తీ నవల అల్పజీవికి అది దారిచూపింది. గోపీచంద్, రావిశాస్ర్తీ రచించిన ఈ రెండు నవలలోనూ సంఘం ఒక బలమైన భూమికగా నిలబడుతుంది. ఆ రెండు సంఘాలూ ప్రధాన పాత్రలని అంతఃసంఘర్షణకి లోనుచేస్తాయి.
గోపీచంద్ రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి. నవలాకారుడు, కధారచయిత, నాటకకర్త, చలనచిత్ర సంభాషణా రచయిత. ఆకాశవాణిలో పద ప్రయోక్త. తండ్రి త్రిపురనేని రామస్వామి నేర్పిన ప్రశ్న ఎందుకు? నుండి ఏమిటి? అనే ప్రశ్నకు ప్రయాణించి అరబిందో సంపూర్ణ జీవనానుశీలము దాకా మళ్లిన ఆధ్యాత్మిక, దార్శనికవాది. 1962లో తన 52వ ఏటనే జీవితాన్ని అసంపూర్ణంగా ముగించిన ఆలోచనాశీలి.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది కాని మనుషులలోని అంతరంగిక యుద్ధం ఇంకా అంతం కాలేదు. నవ్య మానవవాదం సంగతలా ఉంచితే అసలు మానవత్వమే నశిస్తోన్న రోజులు. ‘‘దేశం ఏమయ్యేట్టు’’ అని ప్రశ్న. దానికి సమాధానం-దేశం ఏమయితే నాకేం? అని. గోపీచంద్ లాంటి గొప్ప రచయిత కూడా పోస్టు చెయ్యని ఉత్తరాలు రాసుకోవాల్సిన పరిస్థితి. స్వతంత్ర భారతదేశంలోనూ చీకటి మెరుపులే.
అభ్యుదయ రచయితలందరూ అనేక సంక్లిష్ట సమస్యలకు సమాధానాలు వెదుక్కుంటున్న రోజులవి. సంఘంలో వౌలికంగా వున్న లోపాలని వెదికి ఎత్తిచూపుతున్న రోజులి. బ్రాహ్మణీయ సంస్కృతిలోంచి వచ్చిన మేధావులూ, సంఘ సంస్కర్తలూ, రచయితలూ అసలు సాంఘిక చట్రానే్న తప్పుపడుతున్న కాలమది. నార్ల వెంకటేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, కొడవటిగంటి కుటుంబరావు ఇత్యాదులు సంఘాన్ని తప్పుపడుతున్న కాలమది.
భావవాదం నుంచి అభ్యుదయ వాదంలోకి మునుముందుకు మెల్లమెల్లగానైనా ప్రయాణం చేస్తున్న సంధికాలమది. అదే సమయంలో తెలుగు కాల్పానిక సాహిత్యంలో ఫ్రాయిడ్ నుండి కార్ల్ మార్క్స్‌కీ, మార్క్స్ నించి యాడ్లర్‌కీ, యాడ్లర్ నించి యూంగ్‌కీ రహదారి పలుదారులుగా చీలిపోతున్న వ్యవస్థ అది.
సాంఘిక చైతన్యానికీ, వ్యక్తి చేతనకూ జమిలిగా నేసిన కలనేత వస్త్రం- మొట్టమొదటి మనో వైజ్ఞానిక నవల, అంతరంగిక సంభాషణతో కొనసాగిన నవల -బహుశా గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర ఒకటేనేమో.అసలు ఈ అసమర్థుడంటే ఎట్లా ఉంటాడు? జీవితాన్ని నడిపించే నైతిక సామాజిక సూత్రాల్ని ఎదిరిస్తాడా? ఓడిపోతాడా? ఎదిరించే శక్తి కోల్పోయినపుడు తన అనే్వషణలో స్వీయగవేణకి లోనయి తనని తానే నశింపజేసుకుంటాడా? హేతువాదం ఎందుకు అంటుంది గానీ ఏమిటి? అనేదానికి సమాధానం చెప్తుందా? గ్రీక్ విషాదాంత నాటకాలలో చివరికి మిగిలేవి ఈ రెండు ప్రశ్నలే. ఎందుకు జరిగిందిలా? ఏమిటి జరిగింది ఎందుకు అనే. విధి పాత్రని మలుస్తుందా? పాత్ర కారణభూతుడవుతాడా విధికి? అని.
సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వేగుంట మోహనప్రసాదు