వినమరుగైన

మృత్యుంజయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంఘటనను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కొమురయ్య హత్య వార్త నిజాం రాజ్యంలో జరుగుతున్న దౌర్జన్యాలను ఇతర ప్రాంతాలవారికి స్పష్టంగా తెలియజేసింది. దొడ్డి కొమురయ్య మరణంతో తెలంగాణ పోరాటం ప్రారంభమైనదని తలచవచ్చు. 1951 అక్టోబరు 21న కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించటంతో ఈ పోరాటం ముగిసింది.
పోరాటం ప్రారంభమైన సంవత్సరం తర్వాత బొల్లిముంత శివరామకృష్ణగారి మృత్యుంజయులు నవల వచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. తరతరాల దాస్యం తొలగిపోయింది. కాని నిజాం రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్రం రాలేదు. నిజాం పోలీసులు, రజాకార్లు, భూస్వాముల గూండాలు ప్రజలను చిత్రహింసల పాల్జేయసాగారు. ప్రజల పక్షాన నిలిచి ఆంధ్ర మహాసభ వారు దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ వారు వీరోచిత పోరాటం సలిపారు. ఇది నేటి చరిత్ర, నిన్నటి యదార్థం.
బొల్లిముంత శివరామకృష్ణ గారి మృత్యుంజయులు తెలంగాణ రైతాంగ పోరాటాన్ని యథాతథంగా చిత్రించిన మొదటి తెలుగు నవల. శ్రీ శివరామకృష్ణ తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కారు. తెలంగాణ పోరాటాన్ని గురించి పత్రికలు అందించిన వార్తాకథనాలు, అజ్ఞాతవాసం గడుపుతున్న నాయకులు తెల్పిన అంశాలు ఆధారంగా వీరి నవల రచించారు.
ఆజాద్ హైదరాబాద్ ముస్లిం సామ్రాజ్యమని, ఇత్తెహాద్ -ఉల్-ముస్లిమీన్ నాయకుడు కాశీం రజ్వీ నాయకత్వాన రజాకార్ సైన్యం ఏర్పాటుచేయబడింది.
రజాకార్లు తమ నెదిరించిన వారిని చిత్రహింసలకు గురిచేయసాగారు. రజాకార్లకు నిజాం నవాబు వద్దనుండి ధనమూ, ఆయుధాలూ, పోలీసు సహాయమూ అన్నీ లభిస్తుండేవి. కాని ప్రజలు సమైక్యంగా నిలిచి హిందూ ముస్లిము భేదాలు లేకుండా రజాకార్లను ఎదిరించి పోరాడారు. వారికి నాయకత్వం వహించింది ఆంధ్ర మహాసభ. గెరిల్లా పోరాట దళాలను నిర్మించి ప్రజల్ని సాయుధుల్ని చేసి పోరాటాన్ని సాగించటంలో ప్రతి గ్రామమూ ఒక దుర్బేధ్యమైన దుర్గమైంది. ఆనాటి పోరాటంలో కవుల నుండి కళాకారులనుండి, సామాన్య కార్యకర్తల నుండి ముఖ్యంగా ఆవేశపరులైన వీరుల నుండి ఎంతో సాహిత్యం వెలువడింది.
శ్రీ సుద్దాల హనుమంతు, యాదగిరి, తిరునగరి రామాంజనేయులు పోరాటంలో పాల్గొన్నారు. వీరు తమ పాటలతో ప్రజలను ఉత్తేజపరచారు. నైజాము సర్కరోడ నాజీల మించినోడ; బండెనక బండిగట్టి పదారు బండ్లు గట్టి ఏ బండ్లొ పోతవ్ కొడకో; ఆంధ్ర మహాసభ ఆంధ్రమహాసభ పిలిచింది మొదలైన పాటలు పోరాటకాలంలో వచ్చిన ఉత్తమ కవితలు. శ్రీ నాజర్ బుర్రకథలు, గేయాలు, పోరాటస్ఫూర్తిని ప్రజలలో వ్యాపింపజేశాయి. ప్రసిద్ధ కవులు కాళోజీ, దాశరథి ప్రజల పక్షం వహించి ఉత్తమ కావ్యాలు రచించారు. తరతరాల బూజు మా నిజాం రాజు, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే; ఎముకల్ నుసిజేసి మంచి మాగాణముల్ సృజించి పంటలు పండించిన రైతుదే తెలంగాణము రైతుదే; నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కవి వీరుడు దాశరథి ఎలుగెత్తి చాటారు. తెలంగాణ వెలుపలనుండి ఆరుద్ర త్వమేవాహమ్, సోమసుందర్ వజ్రాయుధం కుందుర్తి తెలంగాణకావ్యాలు రచించారు. ఇంకా రెంటాల గోపాలకృష్ణ, అనిసెట్టి సుబ్బారావు, గంగినేని వెంకటేశ్వరరావు, కె.వి.రమణారెడ్డి మొదలైనవారు కూడా పోరాటాన్ని సమర్థించే కవితలు రాశారు.
శ్రీయుతులు వట్టికోట ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు, కాళోజీ, సి.వి.కృష్ణారావు, గంగినేని వెంకటేశ్వరరావు తెలంగాణ పోరాటాన్ని, జన జీవితాన్ని చిత్రిస్తూ చాలా కథలు రాశారు.
(ఇంకావుంది)

-కడియాల రామమోహనరాయ్