వినమరుగైన

అతడు -ఆమె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో మంచి రచయితలూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులూ ఉంటారు. కానీ మంచి రచయితగా, గొప్ప వ్యక్తీ ఒకరే కావటం చాలా అరుదుగా జరిగే విషయం. అటువంటి అరుదైన మనిషి ఉప్పల లక్ష్మణరావుగారు. అరుదైన రచన అతడు - ఆమె. ఆయన రచనలు ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఆయన రచనల సారాంశమే ఆయన వ్యక్తిత్వం.
అతడు - ఆమె నవలలో లక్ష్మణరావుగారు ఎన్ని విషయాలో చర్చించారు. ఎన్ని విషయాల గురించో మన కళ్లు తెరిపించారు. కానీ ఆ నవల మొత్తంగా సాధించిన ప్రభావం ఏమిటి? ఆ నవల చదవకముందూ, చదివాకా పాఠకుని స్థితిలో వచ్చే మార్పులేమిటి అని ఆలోచించినపుడు అతడు-ఆమె మనిషి సంస్కారాన్ని పెంచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. సంస్కారమంటే మనం మామూలుగా అనుకునే సంస్కరణవాదం, పైపై సంస్కరణలూ కాదు. జీవితంలోని కష్టాలనూ సమస్యలనూ చూసి భయపడడమో, చిరాకుపడటమో కాకుండా ఆ సమస్యల పరిష్కార మార్గాలను అనే్వషించగల శక్తి సంపాదించుకోవటమే సంస్కారం. కొడవటిగంటి కుటుంబరావు గారు ఒక వ్యాసంలో ఇలా అంటారు. ‘‘పాములను చంపటం అవసరం కావచ్చుగాక, పాము విషానికి విరుగుడు కనిపెట్టడం సంస్కార దృష్టిలో ఇంకా ముఖ్యమైనది. జీవితాన్ని గురించిన నిర్లిప్తమైన సాంస్కారిక దృష్టి పెరిగినకొద్దీ జన సామాన్యం జీవిత సమస్యలతో సరిగా పోరాడగలుగుతుంది’’. అతడు - ఆమె నవల ఇటువంటి సంస్కార దృష్టిని పాఠకులకు కలిగిస్తుంది.
అతడు-ఆమె ప్రధానంగా రెండు విషయాలమీద కేంద్రీకరించింది. ఒకటి జాతీయోద్యమం, రెండు స్ర్తి పురుష సంబంధాలు. 1920ల నాటి సహాయ నిరాకరణోద్యమం నుండీ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్టింటియా ఉద్యమం వరకూ అన్నిప్రధాన ఘట్టాలనూ, ఆ సమయంలో వివిధ పార్టీల నాయకుల ఆలోచనా ధోరణులనూ, వాటి బాగోగులనూ లక్ష్మణరావుగారు అతడు-ఆమె నవలలో మనకు పరిచయం చేస్తారు. జాతీయోద్యమ వివరాలను విసుగెత్తించే ధోరణిలో చెప్పటంకాకుండా జాతీయోద్యపు లోతుపాతులు తెలుసుకోవాలనే ఆలోచననూ, ఆసక్తిని మనలో కలిగిస్తుంది అతడు-ఆమె. మనకోసం ఆలోచించిపెట్టే రచయిత కంటే మనలో ఆలోచనలు రేకెత్తించగల రచయితే సమర్థుడు. ఉద్యమ నవలలు ఆ ఉద్యమాన్ని గురించిన ప్రధానమైన వివరాలను స్పృశించాలి. లోటుపాట్లను వివరించాలి. ఉద్యమంలోని కీలకాంశాలనూ, ప్రశ్నలూ పాఠకుల ముందుంచి వారిలో ఆసక్తిని కలిగించి భవిష్యత్ ఉద్యమాల గురించి ఆలోచించేలా చేయాలి. జాతీయోద్యమం నవలగా అతడు - ఆమె ఆ పనులన్నీ చేసింది. ఉప్పు సత్యాగ్రహం అర్థంతరంగా ఆపెయ్యటం గురించీ, క్విట్టిండియా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలోని అతివాదుల, మితవాదుల ఆచరణ, కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన పంథానూ, సుభాష్ చంద్రబోస్ దేశభక్తియుత కార్యాచరణనూ పొగడటమో, విమర్శించటమో కాకుండా విశే్లషించమని మనల్ని ప్రేరేపిస్తుంది అతడు-ఆమె.
అతడు-ఆమె నవలలో స్ర్తిపురుష సంబంధాలను గురించిన చర్చ చాలా ఉంది. స్ర్తి పురుష సంబంధాలంటే ఒక్క భార్యాభర్త సంబంధమేగాక సమాజంలోని అన్ని సంబంధాలూ తండ్రీ కూతుళ్లకూ, అన్నా చెల్లెళ్ళకూ, ఆడ-మగ స్నేహితులకూ ఉన్న సంబంధాలను గురించి చర్చచేశారు. నవలలో ప్రధాన పాత్రలైన శాంతం- శాస్ర్తి ఇద్దరూ చదువుకున్నవారే అయినా శాస్ర్తీ చాలా విషయాలలో శాంతను తనకంటే తక్కువగా చూస్తాడు. శాంత తన వ్యక్తిత్వంతో అతని ఆటలు సాగనివ్వదు. ఐనా చిన్న చిన్న విషయాలలో కూడా అతని స్వభావం బైటపడిపోతుంది. పేపర్ చదువుతూ ప్రకటనల పేజీ శాంతకిచ్చి వార్తలు తాను చదువుకుంటాడు. ప్రపంచ వార్తలు స్ర్తిలకెందుకు? ఏ సినిమా బొమ్మలో, చీరెల ప్రకటనలో చూసుకుంటారులే అన్న పురుషాహంకారం అతనిది. చలం నవలలోని లైంగికత్వ విషయాల గురించి తనతో సమానంగా శాంతం చరిచస్తుంటే శాస్ర్తీ ‘‘ఇలాంటి విషయాల్లో నా పెళ్లానికి అమాయకత్వం, అజ్ఞానం ఉండటమే నాకిష్టం’’ అనుకుంటాడు. అతడు-ఆమె నవల ప్రారంభంలోనే స్ర్తిపురుష సంబంధాలలోని కీలకమైన విషయాన్ని లక్ష్మణరావుగారు ప్రస్తావించారు. శాంతం ఇంట్లో పనిచేసే లక్ష్మి కూతురు ఆదెమ్మను తాగుబోతు భర్త హింసిస్తుంటాడు. అంత హింసను భరించి ఎందుకు అతని దగ్గర ఉంటున్నావని శాంతం అడిగితే ఆదెమ్మ ‘‘కొడుతూ తిడుతూంటే ప్రేమ మోహం ఒక్కనాటికీ నిలవ్వు అమ్మా. అయితే ఆడ పీనుగులం, ఎక్కడికి పోగలమమ్మా. డబ్బులేక ఒకరిమీద ఆధారపడింతర్వాత, తల్లిదండ్రులకీ, తోబుట్టువులకీ, మీలాంటి స్నేహితులకీ కూడా బరువైపోతాం. స్ర్తి జాతి బతుకే అంతయిపోయిందమ్మా-డబ్బు కోసం ఒకరిమీద ఆధారపడకుండా ఉన్నామో-మన బతుకు మనం బతకొచ్చు’’ అంటుంది. శాంతం కూడా ‘‘స్ర్తికి ఆర్థిక స్వాతంత్య్రం లేకపోయేకంటే ఉరిపోసుకుంటే మేలు’’ అంటుంది. ప్రేమ గురించీ, ప్రేమకూ డబ్బుకూ, ప్రేమకూ భావైక్యతకూ, ప్రేమకూ అందానికీ వున్న సంబంధాలను గురించి ఈ నవలలో ఎంతో విశే్లషణ జరిగింది.
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఓల్గా