వినమరుగైన

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ కథలు -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1925 తరువాత ఆయన సంఘంలోని పాత్రల సంభాషణలను యధాతథంగా టేపు రికార్డు చేసి వినిపిస్తున్నారా? అన్నంత సహజంగా నాటకీయంగా రాస్తూ కథలు తయారు చేశారని చెప్పుకున్నాం కదా! ఈ సందర్భంలో వారే స్వయంగా ఒక చోట చెప్పిన ఉదంతం చెబుతాను. రాయవరం నుంచి వచ్చే రెడ్డిరాణి పత్రికకు శాస్ర్తీగారిని కథలు రాయమనడం అబ్బురం కాదు. చాలా కథలు ఆయన అందులోనే రాశారు. ‘‘శాస్ర్తీగారూ! బాల వితంతువయిన ఒక రెడ్డి యువతి, మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు ఒక కథ కల్పించండీ’’ అని అడిగారట వారిని ఒక రెడ్డి మిత్రుడు. ‘‘్భమంచి రెడ్లలో వితంతు పునర్వివాహ వాంఛ కూడా పొడసూపని రోజులవి’’. అంతట శాస్ర్తీగారు సాహసించి బుచ్చి వెంకయ్యమ్మ అన్న కడు రమ్యమయిన కథ రాసి యిచ్చారు. ఇక, భారతి వచ్చిన తరువాత శాస్ర్తీగారి కథలకి మరీ పెద్దపీట లభించింది.
వివాహ వ్యవస్థమీద శాస్ర్తీగారేనాడో దృష్టి కేంద్రీకరించారు. దృక్పథమున్నూ ఏర్పరచుకున్నారు. తన కథల ద్వారా పథ నిర్దేశం కూడా చేశారు. కులాంతర, మతాంతర, వర్ణాతర, శాఖాంతర వివాహాల ఆవశ్యకతా, ‘జాతీయత’కు అవసరమని అనేక నాటకీయమైన కథల ద్వారా చాటారు.
నాటికీ నేటికీ కూడా సన్నివేశ కల్పన పాఠకుడి ఊహలోనే జనించే విధంగా ఒక్క పలుకు, ఒక్క వివరణా ఏమీ తానై యివ్వకుండా కథను పరిగెత్తించడంలో ఆయనకు ఎవ్వరూ సాటిలేరు. ఆయనను మరొకరు అనుసరించను కూడా లేకపోయారు. సర్వసాక్షి కథన రీతి ఆయనది. వారి బాణీకి మనం పులకరించిపోతాం, చలించిపోతాం, కేవలం సంభాషణాత్మకంగా సాగిన కథలలో బ్రాహ్మణాగ్రహారం, కూతుళ్ల తల్లి, షట్కర్మయుక్తా, జాగ్రత్తపడవలసిన ఘట్టాలు లాంటివి శ్రవ్య నాటికల్లాగా వుంటాయి. ‘ఆకాశవాణి’కి కూడా ఆయన చాలా రాశారు.
ఇక నాటకం అన్న కథ అంతా హాస్యమయం! నాలుగు పాత్రలుండటం చేత స్వల్ప వివరణా, కథనం వుంటాయందులో. 1935 నాటి భారతిలో పడ్డ రుూ కథ ఆద్యంతం నాటి స్థితిగతులకు అద్దం పడుతుంది. రాజమండ్రి వూళ్లోకి రాఘవాచారి నాటకం వస్తుంది. కామేశ్వరీ, విశ్వనాథం పొరుగునున్న దంపతులతో నాటకం చూడ్డం కోసం తొందరగా సిద్ధమైపోతూంటే అనుకోని చుట్టం ఒకడు అదే నాటకం చూడవచ్చి భోజనానికని పూడిపడతాడు. ‘‘రావడం అయిదు గంటల బండిలోనే వచ్చాను’’ అంటాడు. కానీ ‘‘గోదావరి తీరాన గాలి పీల్చుకుని ఎనిమిది గంటలకు అలా తగలడ్డాడన్న’’మాట.
‘‘అప్పుడనగా వచ్చి, ఇంతవరకూ ఏ పెద్ద గుఱ్ఱానికి పళ్లుతోముతున్నావు మరిదీ?’’ అంటుందామె. ‘‘మీ అన్నయ్య దగ్గర కూర్చో నిముషంలో వంట చేస్తాను స్టవ్ మీద’’.
‘‘పాపం మళ్లీ నాకోసం..’’
‘‘పాపాలకు పోక.. కానీ, మరి రుూ నాటకానికి మా చెల్లాయిని ‘ఆగంతుకని భార్యని’ తీసుకుని వచ్చేవు కాదే?’’ అంటుందామె.
‘‘పెళ్లికి వెళుతూ పిల్లినీ.. అనీ’’ అని నవ్వుతూ చులకనగా అన్నాడో లేడో.. కామేశ్వరి ‘‘అవునులే కుక్కకి పిల్లి ఎందుకూ?’’ అని వాత అంటిస్తుంది. శ్రీపాదవారు ఆడవాళ్లమీద రుూగ వాలనివ్వరు. బహు స్ర్తిజన పక్షపాతి ఆయన. సరే చివరికి ఆ చుట్టం హోటలుకే పోతాడు. ఈ కథలో యిల్లాలు మొగానికి మంచుమీగడ రాసుకుంటుంది. అంటే స్నో అన్నమాట. తన భాగం చింతన చేసుకోవడం అంటే పోర్షన్ వల్లె వేసుకోవడం. ఝమాయించి అడగడం, ఖణాయించి కూర్చోడం, డచ్చీలు కొట్టడం, కజ్జకోరు పనులు, ధరణా చేయడం లాంటి విలక్షణమైన ప్రయోగాలెన్నో వారి కథలలో వుంటాయి.
ఇంగ్లీషు వాసనలు మచ్చుకయినా అంటని, నూటికి నూరుపాళ్లూ తెనుగు రమ్య కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు అనడానికో ఉదాహరణ యిదే! కొన్ని ఇంగ్లీషు మాటలకు వారు తయారుచేసిన తెనుగు పదాలు ఏరి కూర్చితే అదీ, ఒక రీసెర్చి గ్రంథమే అవుతుంది! అటు పాండీ ప్రకర్ష, యిటు సహజ ప్రతిభా పాటవం జోడు గుఱ్ఱాల రథం ఆయన రీతి!
సూదికోసం సోదికెళ్లినట్లు లాంటి సామెతలున్నాయి. సలగ-సలగ, సడే సంబడం లాంటి విరుపులూ వారివే. తోకమీద నిలిచిన ఊరు గాంగన, రూపేక్షణాలు లాంటి గంభీర పదప్రయోగాలున్నూ ఆయనే చెయ్యాలి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com