వినమరుగైన

ఆంధ్ర పురాణము -మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1914వ సంవత్సరంలో పుట్టిన శాస్ర్తీగారు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిన కాల్పనికోద్యమ ప్రభావంలోగాని, అభ్యుదయోద్యమ ప్రభావంలోగాని పడలేదు. ప్రముఖ కాల్పనిక కవుల వరుసలో చెప్పదగిన కృష్ణశాస్ర్తీ, వేదుల, నాయని, విశ్వనాథ వంటివారి ఎవరి ప్రభావమూ ఆయన భావుకత్వ విధానంమీదగాని, శిల్ప సంవిధానంలోగాని లేవని నిరాఘాటంగా చెప్పవచ్చు. విద్యా వ్యాసంగంలోనూ, జీవితంలోనూ ఆయన ప్రాచీన సంప్రదాయదఘ్నంగా గడిపిన వ్యక్తి. పద్యరచనా శిల్పంలో తెలుగు మాటల పొందిక, దిద్ది తీర్చినట్టుండే పద్యధార, అనుద్రిక్తముగా, స్థిమిత సుందరమూ అయిన కథన చాతుర్యమూ ఆంధ్ర పురాణానికి - ఇతరులకు అనుకరణీయమైన శైలిని సమకూర్చిపెట్టాయి.
ఆంధ్ర పురాణ కావ్యం మొత్తంమీద కావ్య హోమం, భారతావతరణం, ప్రౌఢ దేవరాయల ముత్యాలశాల, భువనవిజయ సభ- అనే ఘట్టాలు మధునాపంతులవారి కవితా గౌరవ, రసికతల అభిరుచులకు దర్పణాలు.
శాస్ర్తీగారి పాత్ర చిత్రణ విధానం, మనోధర్మ చిత్రణ విధానం, కథన విధానం తెలిపే మూడు పద్యాలు మాత్రం ఉదాహరిస్తాను.
ఒకటి: విద్యానగరపర్వంలో శ్రీనాథుడి స్వరూపమిది-
‘‘కస్తూరికా పుండ్రకమ్ముదిద్దిన మేలి
పస చిందులాడు నెన్నొడలివాడు
తారహారముల ముత్యాల పేరుల మ్రోల
కొమరారు తెలి జన్నిదములవాడు
రత్నాంగుళీయక ప్రభకు శోభలు తీర్చి
విలసిల్లు కెంజేతి వ్రేలివాడు
చెలువారు పైడిపువ్వులు కుట్టినంచుల
పట్టు సాలువ పల్లెవాటు వాడు
ఠీవిగలవాడు- శంభుసేవావివేక
సాధుశీలమ్మువాడు శ్రీనాథ విబుధు
డచ్చమగు తెల్గునొడుపుముందడుగులిడగ
వెడలె కనకాభిషేకపుం బెండ్లికొడుకు’’’
రెండు: కాకతీయ పర్వంలో ప్రతాపరుద్రుడి మనోధర్మ చిత్రణమిది:
‘‘ఎన్నడు బెండుపల్కొదవ
నీయదు; పాయడు నాత్మగౌరవా
భ్యున్నతి; రోయడెప్పుడు ప
దోన్నతి కీయడు పూలు మొగ్గలున్...
మన్ననసేయు పెద్దలను;
మంచికి ముంగలి దారితీయు; భా
వోన్నతి కైతవ్రాయు; గొద
యున్నదె! రాజకిశోరమూర్తికిన్’’
మూడు: నాయక రాజపర్వంలో వీరవేంకట పతిరాయలు మనస్తత్వానికీ, అతని భార్య మనస్తత్వానికీ పొసగలేదని చెపుతూ చేసిన కథనమిది;:
‘‘బ్రతికినన్నాళ్లు వేంకటపతికి రాణి
కతుకుకొనలేదు హృదయమ్ము; లామెకొన్న
కొడుకుపై, కన్నబిడ్డ ప్రేముడి వెలార్ప
తరముకాలేదు కర్ణాట ధరణిపతికి’’
ఆంధ్రపురాణం, తొలిసారిగా 1955లో తొలి నాలుగు పర్వాలూ పూర్వార్థంగానూ, 1964లో మలి అయిదు పర్వాలూ కలుపుకొని పరిపూర్ణంగానూ ప్రచురితమైంది.
సాత్వికమూర్తి మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారి ఖండ కృతులు మూడు సంపుటాలుగా వెలువడినా, ఆంధ్ర రచయితలు పేరిట ఆయన కవి పరిచయ పరంపర గ్రంథరూపం దాల్చినా, ఆయన రేడియో ప్రసంగాలూ, వ్యాసాలూ కలిసిన సంపుటి వెలుగు చూసినా, శివపంచాశిక ఆయన మనోధర్మం వెల్లడించినా- మధునాపంతుల వారంటే వెంటనే జ్ఞాపకం వచ్చే రచన ఆంధ్రపురాణమే.

*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ