వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లూసీ? ఆమె ఎవరు?’ అందామె విస్మయంగా.
ఆమె మొహంలో కంగారు గానీ, మాటలో తడబాటు గానీ లేవు.
‘చెప్తాను. మీకు నేను తెలియదా?’ అన్నాడు అనిల్.
‘ఎందుకు తెలియదూ. మీ గురించి మా గౌతమి ఫోన్లలో ఊదరకొట్టేస్తూనే ఉంటుంది. మిమ్మల్నొకసారి చూడాలనుకున్నా కుదరలేదు. ఇదిగో అంకుల్‌కి సుస్తీ మూలంగా వచ్చి ఉండిపోయాను. లక్కీగా మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది. చూశాక మా గౌతమి చెప్పిందాంట్లో అతిశయోక్తి లేదని అర్థమై పోయింది’ గలగల నవ్వుతూ అందామె.
అయోమయంలో పడిపోయాడు అనిల్.
ఆమె వేషభాషలు పూర్తిగా భిన్నంగా ఉన్నా ఆమె కచ్చితంగా లూసీనే అని గ్రహించేశాడతను.
‘మీరు కేరళ నించి ఎప్పుడొచ్చారు?’ అన్నాడు కళ్లు చిట్లించి.
‘కేరళనా? ఈ మధ్య నేనెక్కడికీ వెళ్లలేదే. అంకుల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. ఏం? నేను కేరళ వెళ్లానని ఎవరైనా చెప్పారా?’ అందామె నవ్వుతూనే.
‘మీ ఫాదర్ పోలీస్ కమిషనర్ కదూ?’
‘అవును. గౌతమి చెప్పిందా?’
‘మీది హైదరాబాద్’
‘యా...’
‘మీ పేరు లూసీ ప్రియ చందన!’
‘ఈ లూసీ ఏవిఁటండీ బాబూ. నా పేరు ప్రియ చందన’ కాస్త విసుగాగ అంది చందన అన్నామె.
అతని మొహం వెలవెల పోయింది. అతని మొహం చూస్తే జాలేసిందామెకి.
‘నిజంగా నా పేరు ప్రియ చందన. బహుశా మీక్కాబోయే శ్రీమతి అల్లరికి అలా చెప్పిందేమో. ఆఁ తెలిసింది! దానోట్లో నువ్వు గింజ దాగదు. ఇదంతా చూస్తుంటే ఆ ఇడియట్ నా ఉడ్‌బి గురించి కూడా చెప్పేసి అతగాడి పేరు ఏ రాబర్టో, సలీమో అని కూడా మార్చేసుంటుంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు గానీ నా గురించి మొత్తం చెప్పేసింది’ అంటూ ముద్దుగా విసుక్కుంది.
లూసీనే ఈ చందన అని గట్టిగా నిర్ణయించుకున్నాక ఆమె వేష భాషలు, ఏ మాత్రం కంగారు పడకపోవడం అనిల్‌ని అయోమయంలో పడేశాయి.
‘సారీ! నేనే పొరపడ్డాను. అది సరే! ఇన్ని దారుణాలు జరుగుతుంటే, అంకుల్ మీలాంటి పెద్దల అండ వుండీ, దోపిడీ బ్లాక్‌టైగర్ చేశాడని తెలిసీ, ఇంకా దోషిలా ఇక్కడ పడేసి ఉంచడమే ఆశ్చర్యంగా ఉంద. ఆయన్ని ఇంటికి తీసికెళ్లచ్చుగా’ అన్నాడు కాస్త గట్టిగానే.
చందన మొహం గంభీరంగా అయిపోయింది.
‘మీకు తెలియదేమో. అంకుల్ ఇప్పుడు దోషిలా లేరు. ఓ విఐపిలా ఉన్నారు. బైటికన్నా ఇక్కడుంటేనే ఈయనకి క్షేమం అనే ఇక్కడుంచారు.’
‘తొందరపడి గౌతమి అడవిలోకెళ్లి ఆపదను కొని తెచ్చుకుంది’ భారంగా అన్నాడు శంకరయ్య.
‘అసలామె అడవిలోకే వెళ్లలేదని కొందరనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు లూసీ.. సారీ! డాక్టర్ చందనా’ ఓరగా ఆమెనే చూస్తూ అన్నాడు అనిల్.
‘నో! అది చాలా మొండి మనిషి. కచ్చితంగా అడవికి వెళ్లే ఉంటుంది. అవునూ ఎంతసేపూ లూసీ స్మరణ చేస్తున్నారు. ఇంతకీ ఆ లూసీ ఎవరండీ?’ కాస్త వ్యంగ్యంగా అంది చందన.
‘తను నా దగ్గర పని చేసింది’
‘ఓ! అయితే ఆమెనే నిలదీసి అడక్కపోయారా వివరాలన్నీ...’
‘అడిగేవాణ్నే. కానీ తప్పించుకుంది.’ కసిగా అన్నాడు అనిల్. అతనికేసి చిత్రంగా చూశారు శంకరయ్య, చందనా కూడా.
‘తప్పించుకుందా? మీకేదైనా ద్రోహం చేసి తప్పించుకు పారిపోతే పోలీసులకు చెప్పకపోయారా? క్షణాల మీద ఆవిడ్ని మీకప్పగించేవారు’ అంది చందన. ఆమె మాటల్లో వ్యంగ్యం కనిపించి-
‘నిజమే. కానీ ఇన్నాళ్ల నించీ గాలిస్తున్న గౌతమినే తీసుకొచ్చారు? కనీసం ఆమెని గురించిన వివరాలు కూడా తెలుసుకోలేక పోయారు’ కసిగా అన్నాడు అనిల్.
‘మీ లూసీ సంగతి నాకు తెలియదు గానీ, మా గౌతమి జాడ తెలుసుకుంటారు. తనని క్షేమంగా ఇల్లు చేరుస్తారు’ అంది చందన. ఆ మాటకి శంకరయ్య మొహంలోకి వింత వెలుగొచ్చింది.
‘అదేనమ్మా నా ఆశ!’ అన్నాడు భారంగా.
‘మీ నోటి వాక్యాన మన గౌతమి క్షేమంగా ఇల్లు చేరితే అంతకన్నా ఆనందించాల్సిందేం ఉంటుంది?’ అంటూ లేచాడు అనిల్.
‘కాస్త అప్పుడప్పుడూ వస్తూండు అనిల్. నాకు తృప్తిగా ఉంటుంది’ అన్నాడు శంకరయ్య.
‘ఎందుకు రారూ? మీకు ధైర్యం చెప్పడానికి ఇక నించీ రోజూ వస్తారు. కదా డాక్టర్’ నవ్వుతూ అంది చందన.
‘ఎస్. తప్పకుండా వస్తాను’ అంటూ ఎవరో తరుముతున్నట్టు వెళ్లిపోయాడు అనిల్. అతను వెళ్లగానే పడిపడి నవ్వింది చందన. ఆ నవ్వు చూసి బిత్తరపోయిన శంకరయ్యని చూసి ‘చిత్రమైన వ్యక్తి’ అంటూ మాట మార్చింది చందన.
* * *
చిన్నచిన్న కొండలు, లోయలు, సెలయేళ్లు నిజంగా చాలా అద్భుతంగా అనిపించాయా ప్రభూ వాళ్లకి.
ఓ పక్క జొన్నలు, రాగులు లాంటి పంట పొలాలు, మరోపక్క ఆవుల, గేదెల కొట్టాలు, మరోవైపు మేకల మందలు.. కోళ్ల గుంపులు.. అదో అద్భుత లోకంలా ఉంది. ఇంత చక్కని సంపద వుండగా, బైటికెళ్లి దారుణమైన పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు వాళ్లకి.
‘ఎలా ఉంది మా గూడెం?’ అంది చిన్ని ఓ పూల చెట్టు కింద కూర్చుంటూ.
‘్భతల స్వర్గంలా ఉంది. అందానికీ, ఆనందానికీ ఇవే స్థావరాలు అనిపిస్తున్నాయి’ అన్నాడు ప్రభు మనస్ఫూర్తిగా.
‘అవును ప్రభు బాబూ! ఇది నిజంగా మా పాలిటి స్వర్గమే. ఇక్కడ అందరం కష్టపడతాం. తిని కూర్చోవడం మా బావకి అస్సలిష్టం ఉండదు. చెమటోడ్చి పని చేస్తాం. కోరింది తిని హాయిగా బతుకుతున్నాం’ గర్వంగా అంది చిన్ని.
‘ఇంత చక్కని జీవితానికి అలవాటుపడ్డ మీరు ఐ మీన్.. మీ మగాళ్లు ఆ దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఎందుకు చేస్తున్నారు?’ అప్రయత్నంగా అనేసింది గౌతమి.
చిన్ని మొహం కందిపోయింది.
‘ఇదిగో! మళ్లీ అదేమాట. మేమిక్కడ మీకన్నా నీతిగా, నిజాయితీగా బతుకుతున్నాం. ఒకప్పుడు మా బాబా కొన్ని దోపిడీలు చేసిన మాట నిజమే. కానీ ఓ దేవుడి వల్ల పూర్తిగా మారిపోయాడు. మా బావకి ఆ దొంగతనాలంటేనే అసహ్యం. కానీ సరదాగా కొండ కిందికెళ్లడం గుర్రాల మీద కొండంతా షికార్లు కొట్టడం ఇష్టం. కానీ మీ జనారణ్యంలోని దుర్మార్గులు మరింత దారుణాలు చేసి ఆ నేరాలు ‘బ్లాక్ టైగర్’ అంటూ మా వాళ్ల మీదికి నెట్టెయ్యడమే కాక ఈ అడవిని గురించి భయంకరమైన కథలు ప్రచారం చేసి జనాలని భయభ్రాంతుల్ని చేసేస్తున్నారు. మేమే దుర్మార్గులమైతే మా అనుమతి లేకుండా వచ్చిన మీకింత ఆదరణ లభించేది కాదు’ అంది కోపంగా. ఆమె వాద్ధోరణికి విస్తుపోయారు గౌతమి, ప్రభు కూడా. తర్వాత ‘సారీ’ చెప్పేసి ఆమెని శాంతపరిచారు. మళ్లీ నడక సాగించారు.
మరి కొంతదూరం తీసికెళ్లి మరింత కిందుగా వున్న ఓ చిన్న కొండని చూపిస్తూ-
‘అదిగో అదే పాతాళ స్వర్గం’ అంది చిన్ని.
‘ఏవిఁటి ఆ చెట్ల మధ్య వున్న గుట్ట పాతాళ స్వర్గం అంటే?’ నీరసంగా అంది గౌతమి.
‘అవును. అమృత ఫలాలుండేవి’
‘వెళ్లి తెచ్చుకుందామా?’ చిన్నపిల్లాడిలా అన్నాడు ప్రభు. చిన్ని నవ్వింది.
‘పాతాళ స్వర్గం చూపిస్తానన్నాను గానీ, లోపలికి తీసికెళ్తాననలేదు. అక్కడికెళ్లాలంటే ఓ పట్టాన అనుమతి దొరకదు. అసలు మా వాళ్లెవరూ అటుకేసి వెళ్లరు. బాబా లాంటి వాళ్లు కూడా ఎప్పుడో తప్ప వెళ్లరు. బావా, నేనూ, కొందరు పిల్లలం కలిసి అమృతఫలాల కోసం వెళ్తుంటా. ఈ మధ్య అదీ కుదరడంలేదు. కావాలంటే ఎవరోకరు పళ్లు తెస్తారే తప్ప నేను వెళ్లడం లేదు’ అంటూ పెద్ద లెక్చరిచ్చింది.
ప్రభు వాళ్ల మొహాల్లో నిరాశ చూసి జాలేసిందేమో-
‘మీరు నిజంగా చూడాలనుంటే ఎవరికీ తెలియకుండా వీలు చూసుకుని నేనే తీసికెళ్తాను. కానీ వెంటనే వచ్చెయ్యాలి’ అంది.
‘అలాగే. ఇలా చూసి అలా వచ్చేస్తాం’ గభాల్న అన్నాడు ప్రభు. తర్వాత ముగ్గురూ తిరుగు ముఖం పట్టారు.
అప్పుడే ఎవరో పిల్చినట్టయి ఠక్కున ఆగిపోయాడు ప్రభు.
‘ఏవిఁటి?’ అన్నట్టు చూసింది చిన్ని.
‘మీరు వెళ్తుండండి. నేనొస్తాను’ అన్నాడతను. ఏమనుకున్నారో ఆడవాళ్లిద్దరూ నడక సాగించారు. వాళ్లు కాస్తా కనుమరుగవగానే గుబురు చెట్ల కేసి చూశాడు ప్రభు.
అంతే! అతని కళ్లు తళుక్కుమన్నాయి. అతన్ని పిల్చింది ఎవరో కాదు సాక్షాత్తూ విజయ నాయక్. ప్రభుకి మాట్లాడద్దన్నట్టు సైగ చేసి, అతని చెయ్యి పట్టుకుని చిక్కటి చెట్లలోకి తీసికెళ్లిపోయాడు.
* * *
అనిల్ మనసు నడిసముద్రం తుఫానులో చిక్కిన నావలా అల్లకల్లోలమై పోతోంది. ప్రాణ భయం వల్ల మొహం పాలిపోయింది. ఆలోచించి ఆలోచించి ధర్మారావుకు ఫోన్ చేశాడు.
‘ఏవిఁటి...’ ఆతృతగా అన్నాడతను.
‘వెంటనే మీరిద్దరూ హాస్పిటల్‌కొచ్చెయ్యండి’ అనిల్ గొంతులో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది.
‘వాట్‌హేపెండ్? ఎనీ ప్రాబ్లమ్?’ అంతకన్నా కంగారుగా అన్నాడు ధర్మారావు.
‘ఎస్! దేరీజె బిగ్ ప్రాబ్లమ్. బయల్దేరి వచ్చెయ్యండి’ అని హెచ్చరించి ఫోన్ కట్ చేశాడు అనిల్. అతనికి పిచ్చెక్కించేంత ఆవేశంగా ఉంది. గౌతమి మీది ప్రేమ కాలకూట విషంలా మారిపోయింది.
ఇంత జరిగినా తనతో మాట మాత్రం చెప్పకపోవడానికి కారణం ఇదన్నమాట. తన మీద అనుమానంతోనే, తనతో ప్రేమ నటించి, స్నేహితురాలినే సిఐడిలా తన దగ్గర పెట్టి విషయాలు రాబట్టాలని ప్రయత్నించిందంటే అది ఆడది కాదు. అసలది అడవికి వెళ్లలేదు. వెతికి వేటాడి మరీ చంపెయ్యాలి’ అని పళ్లు నూరుకున్నాడు. రామయ్య వస్తే కూడా అకారణంగా మండిపడుతూ పంపేశాడు.
మరికాస్సేపటికి కాంతారావూ వాళ్లు వచ్చేశారు. వాళ్లని తీసుకుని పర్సనల్ రూమ్‌లోకెళ్లి తలుపులు బిగించాడు.
‘ఏవిఁటనిల్! ఏం జరిగింది?’ హడలిపోతూ అడిగాడు ధర్మారావు.
‘మన పీకలకి ఉరి చుట్టుకోబోతోంది’ అన్నాడు అనిల్. ఎంత ఆవేశంగా అనాలన్నా అతని గొంతులో దిగులే ఎక్కువగా ఉంది. ధర్మారావూ వాళ్లు మరింత హడలిపోయారు.
‘ఏం జరిగిందనిల్! మన గురించి పోలీసులకి తెలిసిపోయిందా?’ అన్నారు ఆతృతగా.
‘దాదాపు!’
‘వ్వాట్?’ కెవ్వుమన్నారు ధర్మారావు, కాంతారావు.
‘అవును. దీనికంతటికీ సూత్రధారి ఎవరో తెలుసా?’
‘ఎవరు? ఆ లూసీయేనా?’
‘కాదు ఆ డెవిల్.. గౌతమే’ పళ్లు కొరుకుతూ అన్నాడు అనిల్.
‘వ్వాట్?’ అదిరిపడ్డారు రావులిద్దరూ.
ఆమెకేదో కొంత తెలుసనుకున్నారే కానీ అసలు మూలం ఆమే అనుకోలేదు ఇద్దరూ కూడా.
‘అవును. అంతా కలిసి మన దగ్గర డ్రామా ఆడి మనల్ని ఫూల్స్ చేశారు. ఆ చంద్రయ్యకి మతిపోయిందన్నది కూడా అబద్ధమే’ అంటూ హాస్పిటల్లో జరిగినవన్నీ చెప్పాడు. లూసీ సంగతి కూడా చెప్పి
‘దాన్ని బతకనియ్యకూడదు’ అంటూ అరిచాడు.
‘అంటే ఆ లూసీని మన గురించి తెలుసుకోవడానికి పంపిందన్న మాట. బానే ఉంది. కానీ ఏం తెలుసుకుంది? నాలుగు రోజులు నీ దగ్గర ఊడిగం చేసింది. మరి హఠాత్తుగా బావ వంక పెట్టి ఎందుకు పారిపోయింది?’ అన్నాడు ధర్మారావు.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్