వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతాళ స్వర్గానికి కాపలాగా భైరవి, భైరవుడు అనే దంపతులు ఉంటారు. నేనెలాలో వెళ్లి మీరు లోపలికెళ్లే మార్గం చూస్తాను. మీరు కందకం పక్కన ఉన్న చెట్లలో వుండి నేను సంకేతం ఇచ్చిన వెంటనే రండి’ అని మరికొన్ని జాగ్రత్తలు చెప్పి నడక వేగం పెంచింది చిన్ని.
అతి ప్రయాసగా పల్లంలోకి దిగి కొండ దగ్గరికి చేరుకున్నారు ప్రభు, నాయక్. అప్పటికే కందకం దగ్గరికెళ్లిపోయింది చిన్ని. అడుగుల శబ్దం గ్రహించాయేమో మొసళ్లు భయంకరంగా నోళ్లు తెరిచి నీళ్లని అల్లకల్లోలం చేస్తున్నాయి. తోడేళ్ల లాంటి రెండు కుక్కలు విరుచుకు పడబోయి ఆమెని చూసి తోకాడిస్తూ దగ్గరికొచ్చాయి. వాటిని నిమురుతూ కొంగున కట్టుకున్న మూట విప్పి ఆకులోని మాంసపు ముక్కలు తీసి వాటికి వేసింది. అవి ఆనందంగా తిని రెండు నిమిషాల్లో పడిపోయాయి. అవి ఇప్పట్లో లేవవన్న నమ్మకం కుదిరాక ప్రభూ వాళ్లకేవో సూచనలిచ్చి మెయిన్ ఎంట్రన్స్ కేసి నడిచింది చిన్ని.
‘తాతా’ అంది అరిచినట్టు. మరుక్షణం, కొండకున్న సన్నని ద్వారంలోనించి ఇద్దరు వృద్ధ దంపతులు పరిగెత్తుకొచ్చి చిన్నిని చూసి ఆశ్చర్యపోయారు.
‘నువ్వా? ఇదేంటి తల్లీ ఇలా వచ్చావ్?’ అన్నారు.
‘తాతా! నాకు హఠాత్తుగా అమృత ఫలాలు తినాలనిపించింది. అవి ఇక్కడ తప్ప ఎక్కడా దొరకవుగా. బావ కూడా లేడు. అందుకే నాలుగు కాయలు కోసుకుని వెళ్లిపోతాను. ఒక్కసారి గేటు తియ్యవూ?’ అంది చిన్ని వేడికోలుగా.
‘పళ్ల కోసమా? ఇంకా మమ్మల్ని చూడ్డానికొచ్చావేమో అనుకున్నానే’ నవ్వుతూ అన్నాడు భైరవుడు అన్న వృద్ధుడు.
‘లేదు తాతా! మిమ్మల్ని చూద్దామనీ, మీతో కాస్సేపు కబుర్లు చెప్పాలనీ కూడా వచ్చాను. కేవలం పళ్ల కోసమే అయితే ఎవర్నయినా పంపేదాన్ని కదా!’ అంది చిన్ని అమాయకంగా.
‘నిజమేనయ్యా! దీనికి మనమంటే చాలా ఇష్టం’ మురిసిపోతూ అంది అతని భార్య భైరవి.
వాళ్లిద్దరికీ వొంటరితనంతో విసుగెత్తిపోయింది. అందుకే ఆనందంగా గొలుసులతో బిగించి చెక్క వంతెన తెరిచారు. వంతెన మీదుగా కొండ దగ్గరికెళ్లింది చిన్ని.
‘తొందరగా కోసుకెళ్లు. మళ్లీ చీకటి పడితే తాచులు తిరుగుతుంటాయి’ అన్నాడు భైరవుడు.
‘ఏంటి తాతా! నువ్వెంతో ధైర్యస్తుడివని బాబా చెప్తూంటాడు. పాముల గురించి కంగారు పడుతున్నావేంటి’ అంది చిన్ని నవ్వేస్తూ.
భైరవుడి గుండె గర్వంతో పొంగింది. ఒక్కసారిగా యువకుళ్లా ఫీలైపోతూ-
‘నిజమేనమ్మా! ఆ రోజుల్లో సింహాన్ని వట్టి చేతులతో కొట్టి చంపాను’ అన్నాడు మీసాలు సవరించుకుంటూ.
మాటలతో బురిడీ కొట్టి కొండ వెనగ్గా వున్న అమృత ఫల వృక్షాలున్న చోటికి తీసుకెళ్లింది. వాళ్లని చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టెక్కింది కబుర్లు చెప్తూనే. కోయిలల గురించి మాట్లాడుతూ చిలిపిగా అరిచినట్టు కోయిలలా అరిచింది.
‘దీనికింకా చిన్నతనం పోలేదే’ నవ్వుతూ అన్నాడు భైరవుడు. కానీ దూరంగా పొదలో వున్న ప్రభూ వాళ్లకా సంకేతం అంది, గబగబా వంతెన మీదుగా లోపలికొచ్చి, సన్నని ద్వారంలోంచి కొండ గుహలోకెళ్లారు. అది గమనించిన చిన్ని చెట్టు దిగి వాళ్ల మధ్య కూర్చుని కబుర్లు మొదలుపెట్టింది.
తమని తాము మర్చిపోయి, చిన్ని చెప్పే కబుర్లతో చిన్నవాళ్లలా గతంలో కెళ్లిపోయారా దంపతులు. చిన్ని వాళ్లతో కబుర్లు చెప్తోంది గానీ లోపలికెళ్లిన ప్రభూ వాళ్లని గురించే కంగారు పడుతోంది.
గంటలో బైటికొచ్చెయ్యాలని హెచ్చరించింది. కానీ రెండు గంటలు గడిచినా వాళ్లు బైటికొచ్చిన జాడ లేకపోవడంతో ఆమెలో కంగారు మరింత పెరిగిపోయింది.
మొసళ్ల హంగామా పెరగడంతో-
‘చాలాసేపైంది. ఆ పళ్లు తీసుకుని వెళ్లమ్మా! లేకపోతే ఈ పాతాళంలో ఏ పాము వాత పడ్డావో అని మీ అత్తా వాళ్లు కంగారు పడతారు’ అంది భైరవి.
‘ఎవరూ కంగారు పడరు. నేనిక్కడికొచ్చినట్టు వాళ్లకి తెలియదుగా!’ నవ్వింది చిన్ని.
తుళ్లిపడ్డారా దంపతులు.
‘ఎవరికీ చెప్పకుండా వచ్చావా?’ అన్నారు ఏకకంఠంతో.
‘అవును మామ్మా! బాబాని కాపాడిన డాక్టరమ్మకి అమృత ఫలాలు తెచ్చిస్తానని మాటిచ్చాను. బైటివాళ్లిటుకేసి రాకూడదు కదా అందుకే నేనొచ్చాను. నేనిలా వచ్చానని ఎవరికీ చెప్పకండేం’ దీనంగా అంది చిన్ని.
‘నువ్వు తొందర పడ్డావు చిన్నీ! దొరకి తెలియకుండా రావడం చాలా తప్పు. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు’ అంటూ పళ్లన్నీ ఏరి ఓ బుట్టలో వేసి-
‘ఎవరికీ చెప్పంలే. ఇంక నువ్వెళ్లిపో’ అన్నాడు భైరవుడు. చిన్నిలో వణుకు మొదలయింది. తప్పనిసరిగా వాళ్లతోపాటు నడిచింది. గుమ్మం దగ్గర ప్రశాంతంగా ఉండడంతో వాళ్లు బైటికొచ్చేశారనిపించి తేలిగ్గా వూపిరి తీసుకుంది.
భైరవి ఆమెని వంతెన మీదుగా బైటికి తీసుకొచ్చింది. అప్పటికే నలుమూలలా చీకట్లావరించేశాయి.
‘ఏవిఁటి చిన్నీ! ఏదో కంగారు పడుతున్నట్టున్నావ్? ఈ విషయం మీ వాళ్లకి చెప్పంలే’ నవ్వుతూ అన్నాడు భైరవుడు.
‘అబ్బే! నాక్కంగారా? నాకీ అడవి, తాచులూ కొత్తా! నేనెళ్లిపోతాను’ బలవంతంగా నవ్వుతూ అంది చిన్ని. బైట ఏ పొదలోనో దాక్కున్న ప్రభూ వాళ్లని భైరవీ వాళ్లెక్కడ చూస్తారో అని హడలిపోతోందామె.
‘నిజమే. ఆ జింబో అయినా బెదురుతాడేమో గానీ ఈ తాచులకీ, రేచులకీ ఇది బెదరదు’ అంది భైరవి కూడా నవ్వుతూ.
ఇద్దరికీ చెప్పి నాలుగడుగులు వేసింది చిన్ని. భైరవుడు గొలుసులతో చెక్కని ఎత్తేసి, యధాప్రకారంగా కట్టేశాడు. చిన్ని కాస్త దూరం వెళ్లగానే ఆ దంపతులు లోపలికెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయాక, మళ్లీ వెనక్కి వచ్చి పొదలన్నీ గాలించింది చిన్ని. అయితే వాళ్లు కనిపించలేదు. జాగిలాలు మాత్రం ఇంకా మత్తులోనే పడున్నాయి.
చిన్నిలో చిరాకు పెరిగిపోయింది. వాళ్లు లోపల వుండిపోయారని కాదు, తనతో మాట మాత్రం చెప్పకుండా వెళ్లిపోయి ఉంటారని. విసురుగా నడక సాగించింది. అయితే లోపలికెళ్లిన ఇద్దరూ బందీలుగా మారిపోయారని పాపం! ఆ పిల్లకి తెలియదు.
అనిల్ ఓ పెట్రోల్ బంక్ ముందు నిల్చుని కారులో పెట్రోల్ నింపిస్తున్నాడు. అతనితోపాటు డ్రైవర్ గానీ నౌకర్లు గానీ లేరు. మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తోంది.
‘హలో డాక్టర్ అనిల్!’ అన్న మాట విని తుళ్లిపడి చూశాడు. ‘లూసీ’ అన్నాడు గొణిగినట్లు.
‘ఏవిఁటి డాక్టర్? నన్ను గుర్తు పట్టలేదా?’ నవ్వుతూ అందామె దగ్గరగా వచ్చి.
‘ప్రియ.. చందన.. ఎలా ఉన్నారు?’ తడబడుతూ అన్నాడు అనిల్.
‘నేను బానే వున్నాను. మీరేవిఁటి మరీ డల్లై పోయారు? క్లినిక్ క్లోజ్ చేసేశారట. ఇంటి పట్టునే ఉంటున్నారట. ఇదంతా మా గౌతమి మీది బెంగేనా?’ చనువుగా అందామె.
‘అదేం లేదు. హాస్పిటల్ డెవలప్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాను. అందుకే అంకుల్‌ని చూడ్డానిక్కూడా రాలేకపోయాను. ఆయనెలా ఉన్నారు?’ అన్నాడు అనిల్ బలవంతంగా నవ్వుతూ.
‘అరె! మీకు తెలియదా? అంకుల్‌ని డిశ్చార్జ్ చేసేశారు. ఆయన కూడా బాగా కోలుకున్నారు’
‘డిశ్చార్జ్ చేశారా? అయితే ఆయన గుట్ట మీదికి వెళ్లిపోయారా?’ ఆతృతగా అన్నాడు అనిల్.
‘లేదు.. లేదు.. ఆయన అక్కడ ఉండటం క్షేమం కాదని ప్రయాగ గారు తమ ఇంటికి తీసుకెళ్లారు. అసలు సి.ఎం. గారింటికే వెళ్లేవారు. కానీ అంకుల్ మొహమాట పడుతుంటే ప్రయాగ గారు తీసుకెళ్లారు’
‘క్షేమం కాదా? అంటే...’
‘ఆయన మీద కూడా దాడి జరగచ్చని సి.ఎం.గారి అనుమానం. ఆయనే స్వయంగా వెళ్లి అంకుల్‌కి ధైర్యం చెప్తున్నారు’ అంది చందన.
‘నిజంగానే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈ సంగతి నాకు తెలియదు గానీ ఇటీవల ఆయనలో చాలా మార్పొచ్చిందని విన్నాను. మునుపటికన్నా ఉత్సాహంగా ప్రజాసేవ చేస్తున్నారుట. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఆయన జోక్స్ పేలుస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నారట. దోపిడీ దొంగల్ని పట్టుకు తీరతానని శపథాలు చేస్తున్నారట’ అన్నాడు అనిల్.
అతని మాటలోని వ్యంగ్యాన్ని గుర్తించినా, గుర్తించనట్టు ‘నిజమే! ఆయన గ్రేట్ సి.ఎం. ప్రాణ స్నేహితుడైన పి.ఏ. కనిపించకపోయినా ఆ బాధని అవతలికి నెట్టి ప్రజాపాలన సాగిస్తున్నారు’ అంది చందన. అతనికి ఒళ్లు మండిపోయింది.
‘అసలు తన పి.ఏ. అడవికెళ్తే కదా ఆయన దిగులుపడేది’ అన్నాడు వ్యంగ్యంగా.
‘ఏవిఁటి ప్రభుగారు అడవికెళ్లలేదా?’ విస్మయంగా అందామె.
‘అతనే కాదు. మీ గౌతమి కూడా అడవికేసి వెళ్లలేదు. ఇద్దరూ ప్లాన్డ్‌గా వెళ్లి జాలీగా తిరుగుతున్నారు’ తనని తాను మర్చిపోయి కసిగా అన్నాడు అనిల్.
అతను మాట్లాడిన తీరుకి బిత్తరపోయింది చందన.
‘ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అనిల్. ఇన్నాళ్లూ ఆమె కోసం తెగ ఆరాటపడి పోయిన మీరు ఇప్పుడు ‘మీ గౌతమి’ అంటూ ఆమె మీద దారుణమైన అభాండాలు వేస్తున్నారా?’ అంది సీరియస్‌గా. అప్పటిగ్గానీ తనెంత తొందర పడ్డాడో అర్థం కాలేదు అనిల్‌కి.
‘సారీ! తను కనిపించలేదన్న ఆవేదనతో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీడంలేదు. కానీ ఒకటి మాత్రం నాకు అనుమానంగానే ఉంది. ఏవిఁటంటే గౌతమి మాత్రం నిజంగా అడవిలోకి వెళ్లుండదు. విజయ నాయక్ కూడా అజ్ఞాతంలో వున్నారని అందరూ అనుకుంటున్నారు. అంటే ఇద్దరూ కలిసి ఆలయం దోపిడీ తాలూకు దొంగల కోసం, నగల కోసం గాలింపు చర్యలు చేపట్టారని నా నమ్మకం. అఫ్‌కోర్స్ అలా అనుకుంటే నాకూ ధైర్యంగానే ఉందనుకోండి. కానీ నా దగ్గర కూడా ఈ విషయం దాచడమే నాకు బాధగా ఉంది’ అన్నాడు సాధ్యమైనంత దీనంగా మొహం పెట్టి.
నిర్ఘాంతపోయింది చందన.
‘ఎందుకలా అనుకుంటున్నారు?’ అంది మెల్లగా.
అతను నవ్వాడు.
‘కూతురే ప్రాణంగా అనుకునే అంకుల్ ధైర్యంగా ఉన్నారు. ప్రాణ స్నేహితురాలు ఆ అడవిలో ఏమైపోయిందో అన్న బాధ మీ మొహంలోనూ లేదు. సి.ఎం. గారామె సంగతే ఎత్తడం లేదు. ఇవన్నీ గమనించాకే గౌతమి క్షేమంగా ఉందన్న నమ్మకం కుదిరింది. నా మాటలు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి’ అంటూ వెళ్లిపోయింది. ఆమె అలా నిల్చుండిపోయింది.
* * *
అతి విశాలమైన ఆ హాల్లో చిక్కుకున్న ప్రభు, విజయ నాయక్ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఆకలి వల్లో, ఆటవికుడు కొట్టిన దెబ్బల వల్లో ఇద్దరూ నీరసించిపోయారు.
సన్నని గుహ ద్వారా లోపలికొచ్చిన వాళ్లు పెద్ద ఆడిటోరియంలా అతి విశాలంగా ఉండటమే కాక అత్యంత వైభవంగా ఆధునికాలంకరణతో, ఖరీదైన ఫర్నిచర్, కార్పెట్స్‌తో కళ్లు చెదిరేలా వున్న ఆ హాలుని చూసి అవాక్కయిపోయారు. మరో అడుగు వేసేలోగానే బలాఢ్యుడైన ఓ ఆటవికుడు పిడుగులా వచ్చి పడ్డాడు. వాళ్లు తేరుకునేలోగానే ఒడుపుగా వాళ్ల మెడల మీద బలంగా కొట్టి, వాళ్లకి స్పృహ తప్పించి, వాళ్ళని బంధించి, వాళ్ల దగ్గరున్న బేగ్స్ తీసుకుని వెళ్లిపోయాడు.
మళ్లీ వాళ్లకి స్పృహ వచ్చి వాళ్ల పరిస్థితి గమనించి నీరుగారిపోయి బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు.
‘మనం ముందు వెనక చూడకుండా, లోపల ఎవరైనా ఉంటారేమో అన్న విషయం కూడా ఆలోచించకుండా వచ్చి పెద్ద రిస్క్‌లో పడిపోయాం. మన కోసం ఎదురుచూసిన చిన్ని, మనం రాకపోవడంతో ఎంత కంగారు పడిపోయిందో’ అన్నాడు ప్రభు బాధగా.
‘నిజమే. మనకి సాయం చేసి ఆ పిల్ల కూడా రిస్క్‌లో పడింది’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు విజయ నాయక్.
‘అందుకే ఈ స్వర్గం గురించిన ఆలోచనలు మానేసి ఇక్కణ్నించి తప్పించుకునే మార్గం చూడాలి. లేకపోతే ఆ దొర మనల్ని బతకనివ్వడు.

చిన్ని ఏదో చెప్పి తప్పించుకుంటుంది’ అన్నాడు ప్రభు.
‘చూద్దాం. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు జంకడం ఏమిటి? కానీ నాకో చిన్న అనుమానం’
‘ఏవిఁటి?’
‘ఇది చూస్తే రాజమహల్లోని దర్బారులా ఉంది. ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్నాయి. పులులు, సింహాలు జీవం వున్న జంతువుల్లా వున్నా స్ట్ఫ్ చేసినవైనా. జనరేటర్ కనిపించకపోయినా రైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఇది కచ్చితంగా ఆ బ్లాక్ టైగర్ ఏర్పాటు చేసుకున్నదే. ఇన్ని సౌకర్యాలున్న స్థావరం వదిలి ఆ బ్లాక్‌టైగర్ అక్కడెక్కడో గుహల్లోనో, గుడిసెల్లాంటి ఇళ్లల్లో ఉండటం ఏమిటి?
ఒకవేళ నాగరీక సౌకర్యాల మీద మక్కువతో ఏర్పరచుకుని అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడనుకుందామన్నా, ఎవరూ అడుగుపెట్టని విధంగా అడవిలో సెక్యూరిటీ పెట్టుకున్న వాడికి ఈ కందకాలు, కాపలాలు, రేచుకుక్కలూ దేనికీ? మొసళ్ల హంగామా లెందుకు?’ అన్నాడు విజయ నాయక్ తన పోలీసు ఆలోచనలతో.
‘తనిక్కడే ఉంటాడేమో. సుస్తీ చేసింది కదా. గౌతమి ట్రీట్ చేస్తోంది. బయటి వాళ్లకీ రహస్యం తెలియకూడదని అక్కడే ఉండి ఉంటాడు. కానీ దేనికీ లేని సెక్యూరిటీ ఇక్కడెందుకు పెట్టుకున్నాడో అర్థం కావడంలేదు. ఇదేదో పాతాళ లోకంలో ఉన్నట్టు దీనికి పాతాళ స్వర్గం అని పేరెందుకొచ్చిందో అంతకన్నా అర్థంకావడం లేదు’ విసుగ్గా అన్నాడు ప్రభు.
‘అదంతా మా స్వామి చెప్తాడు తొందరపడకండి’ వ్యంగ్యంగా అంది ఓ గొంతు. తుళ్లిపడి చూశారిద్దరూ. అంతకు ముందు వాళ్లని బంధించిన వ్యక్తే ఏవో పేకెట్లతో కనిపించాడు.
‘ఎవర్నువ్వు? ఇప్పుడు బ్లాక్‌టైగర్ ఇక్కడికొస్తాడా?’ ధైర్యంగానే అడిగాడు నాయక్.
అతను తెచ్చిన పేకెట్ ఓ పక్కగా వున్న టేబుల్ మీద పెట్టి వాటిలోని ఫలహారాలు ప్లేట్స్‌లో సర్ది
‘నా పేరు భక్తు. ఇక్కడే ఉంటాను. మిగతా విషయాలు మా స్వామి వచ్చి చెప్తారు. ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఫలహారం చేసి, పాలు తాగి పడుకోండి’ అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వాళ్ల కట్లు విప్పి వెళ్లిపోయాడు భక్తు.
కంగారుగా వాచీలు చూసుకున్నారు ప్రభు, నాయక్‌లు.
తొమ్మిది గంటలు దాటిపోయింది.
‘మైగాడ్! రాత్రంతా ఇలాగే పడున్నామన్నమాట!’ విస్మయంగా అన్నాడు నాయక్.
‘అందుకే కాబోలు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి’ అన్నాడు ప్రభు. ఆకలిగా వుండటంతో ఫలహారం చేసి పాలు తాగారు.
‘ఎలాగైనా బ్లాక్‌టైగర్ మర్యాదస్తుడే’ నవ్వుతూ అన్నాడు విజయ నాయక్. అయితే, ప్రభుకి మాత్రం నవ్వు రాలేదు. బలికి ముందు సిద్ధం చేస్తున్న గొర్రెలు గుర్తొచ్చాయి. అక్కడికొచ్చినందుకు తనని తానే తిట్టుకున్నాడు మనసులో. కానీ అక్కణ్నించి తప్పించుకోవడం సాధ్యం కాదని అర్థమై పోయింది ఇద్దరికీ.
‘నిజంగానే స్వర్గంలా ఉంటుందని వూహించి ప్రాణాలకి తెగించి మరీ వచ్చాం’ విసుగ్గా అన్నాడు ప్రభు.
‘అసలైన స్వర్గం నేను చూపిస్తాను’ ఖంగుమంది ఓ గొంతు. పిడుగు పడ్డట్టు తుళ్లిపడి చూశారిద్దరూ.
గుమ్మానిక్కాస్త అవతలగా ఓ వృద్ధుడు వాళ్లకేసి పరిశీలనగా చూస్తున్నాడు. అతని చూపులు సూదులకన్నా వాడిగా వున్నాయి, ఆరడుగుల పొడవుతో, దబ్బపండు ఛాయతో, తెల్లని పట్టుకుచ్చులాంటి ఒత్తయిన జుట్టు, గడ్డంతో.. చేతులెత్తి నమస్కరించాలనిపించేలా వున్నాడు. అప్రయత్నంగా లేచి నిల్చున్నారిద్దరూ.
‘కూర్చోండి’ అన్నట్టు సైగ చేశాడా వృద్ధుడు. అతని కుడిచేతికున్న నవరత్నపుటుంగరం, ఎడమ చేతికున్న ఖరీదైన వాచీ మిడిసిపడుతున్నట్టు మెరుస్తున్నాయి.
ప్రభు, నాయక్‌లు నమస్కరించారు.
‘ఎవరు మీరు?’ వాళ్లకెదురుగా కూర్చుంటూ అన్నాడు వృద్ధుడు. అతని రూపంలాగే గొంతు కూడా ఆకర్షణీయంగా ఉంది.
‘ఇతనా బ్లాక్‌టైగర్?’ మనసులో అనుకుంటూనే తనని తాను పరిచయం చేసుకున్నాడు నాయక్. ప్రభు కూడా పరిచయం చేసుకుంటుంటే అయోమయంలో పడిపోయాడు నాయక్. ఎందుకు ఆ వృద్ధుడే బ్లాక్‌టైగర్ అనుకుంటున్నాడతను. టైగర్‌కి పరిచయస్తుడే కదా, మళ్లీ ఎందుకు పరిచయం చేసుకున్నాడా అని.
‘ఇక్కడికెందుకొచ్చారు?’ అన్నాడాయన గంభీరంగా. వాళ్లకి సమాధానం తోచలేదు.
‘ఎందుకొచ్చారో తర్వాత, అసలీ చోటికి ఎలా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? భైరవుడు తీసుకొచ్చాడా?’ మళ్లీ అతనే అన్నాడు.
‘లేదు లేదు. మమ్మల్నెవరూ తీసుకురాలేదు. నా చిన్నతనం నించీ పాతాళ స్వర్గం గురించిన కథలు వింటూనే ఉన్నాను. ఈ మధ్య మాకు కావలసిన యువతి అడవిలోకెళ్లి దారి తప్పిందని, ధైర్యంచేసి వచ్చాం. ఇక్కడికి వచ్చాక పాతాళ స్వర్గం గురించి గుర్తొచ్చి, ఓసారి చూసి వెళ్దామని వచ్చాం. నిజంగా ఈ పాతాళ స్వర్గం చాలా బావుందంకుల్! మీ ఆతిథ్యం మరీ బావుంది’ అంటూ ఆయన్ని ఆకాశానికెత్తేశాడు నాయక్.
అతను పెద్దగా నవ్వాడు.
‘అబద్ధాలు అతికినట్టు చక్కగా ఆడగలవే. ఎందుకంటే మా వాళ్ల సహాయం లేదే కందకం దాటి ఎవరూ రాలేరు’ అన్నాడు.
‘నిజమే! చాలా కష్టపడ్డాం. ఎవరో చెక్కవంతెన వేశారు. రేచులని మచ్చిక చేసుకుని లోపలికి రాగలిగాం. కేవలం చూడ్డానికి మాత్రమే వచ్చాం అంకుల్. క్షమించండి. పర్మిషన్ తీసుకోకుండా రావడం మా పొరపాటే! అంకుల్ మీ పేరేమిటో తెలుసుకోవచ్చా?’ వినయంగా అన్నాడు నాయక్.
‘నా పేరుతో మీకు పని లేదు. మీ సంగతి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలు కాదని నాకు తెలుసు’ అన్నాడతను కఠినంగా.
‘మీతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదంకుల్! లీస ఆటవికులు కారని మీ వేష భాషల వల్ల తెలిసిపోయింది. పాతాళ స్వర్గ నిర్మాత మీరే అని కూడా అర్థమయింది. అడవిలోని కొండని తొలిచి, రాజదర్బారంత వైభవంగా తీర్చుదిద్దారంటే మీరు చదువుకున్న వారే కాదు, మేథావులని కూడా గ్రహించాం. అందుకే మీ పేరు అడిగాను. మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నప్పుడు మీరెవరో కూడా చెప్పడం సభ్యత కదా’ అన్నాడు నాయక్ నవ్వుతూనే. ప్రభుకి మాత్రం అతనలా మాట్లాడ్డం నచ్చలేదు.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్