వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పిల్లకాకివి నాకు సభ్యత గురించి చెప్తున్నావా? అయినా పేరు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. నా పేరు శకుని’ అన్నాడతను గంభీరంగా.
‘శకునా?’ నాయక్, ప్రభూ కూడా ఒకేసారి అన్నారు విస్మయంగా.
‘ఎస్. నా పేరు శకుని. ఇక్కడి వాళ్లంతా స్వామి అంటారు. ఇప్పుడు చెప్పండి. మీరెందుకొచ్చారు? ఎలా వచ్చారు?’ అన్నాడు శకుని నిలదీసినట్టు.
కంగారు పడిపోయారు ప్రభు, నాయక్.
‘నిజంగానే మేము గౌతమిని వెతుక్కుంటూ వచ్చాం. ఇక్కడి పాతాళ స్వర్గం గురించి విని ఓసారి చూడాలన్న ఆశతో ఇలా వచ్చాం. క్షమించండి’ మరోసారి క్షమాపణలు చెప్పుకున్నాడు ప్రభు. అక్కడ్నుంచి ఎప్పుడు బైటపడదామా అని ఉంది.
‘స్వర్గం చూశారా?’
‘చూశాం. ఇంక సెలవిస్తే మేం వెళ్లిపోతాం’ అన్నాడు ప్రభు లేస్తూ. నాయక్ కూడా లేచాడు అయిష్టంగానే.
‘్థంక్స్ మిస్టర్ శకునీ’ అంటూ చెయ్యి చాచాడు. అయితే శకుని చెయ్యి అందించలేదు.
‘తొందరపడకు మిస్టర్ విజయనాయక్! స్వర్గాన్ని చూడాలని ఇంత కష్టపడి వచ్చి పూర్తిగా చూడకుండానే వెళ్లిపోతారా?’ అన్నాడు శకుని నవ్వుతూ.
‘చూశాంగా!’ కళ్లు చిట్లించి చూశాడు నాయక్.
‘అసలైన స్వర్గం చూడనే లేదు. అది కూడా చూశాక మాటాడదాం’ అంటూ ఓ మూలగా వున్న అందమైన చలువరాతి దగ్గరికి తీసుకెళ్లి చలువరాతిని పక్కకి లాగాడు శకుని. చక్రాల మీదున్నట్టు అది సులభంగా పక్కకి జరిగింది. అక్కడున్న సన్నని మెట్ల ద్వారా వాళ్లిద్దర్నీ కిందికి తీసుకెళ్లాడు. ఆ ప్రదేశం చూసి నిశే్చష్టులై పోయారు నాయక్, ప్రభు.
అది మరింత విశాలంగా అత్యంత మనోహరంగా ఉంది. అందమైన కార్పెట్లతోనూ, సోఫాలతోనూ, ఫ్లవర్ పాట్స్‌తోనూ, గోడలకి ఖరీదైన పెయింటింగ్స్‌తోనూ, స్టార్ హోటల్స్‌ని తలదనే్నలా ఉంది. ఆ అందాలని చూసి కాదు నాయక్ వాళ్లు విస్తుపోయింది. హాలు చుట్టూ ఉన్న గదులు, వాటిలోని సామాగ్రి, దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు, ఓ రూమ్‌లోని ముద్రణాలయం లాంటివి ఒక ఎత్తయితే, గదుల్లో రాశులుగా పోసి వున్న అమూల్యాభరణాలు, బంగారం, నోట్లకట్టలు, మణిమాణిక్యాలు లాంటివి వుంటే, మరో గదిలో గన్స్, రివాల్వర్స్ లాంటి మారణాయుధాలు ఒక ఎత్తు. చివరి గది ఓ ప్రయోగశాలలా ఉంది.
‘ఇది బ్రహ్మాండమైన ప్రయోగశాల. ఇంతకు ముందు చిన్ని చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్నమాట’ అనుకున్నాడు ప్రభు.
బ్లాక్‌టైగర్‌కి అక్షరం ముక్కరాదన్న మాట అబద్ధం. ఇక్కడ దేశద్రోహ చర్యలు చాలా జరుగుతున్నాయి. దొంగనోట్ల ముద్రణ ఇక్కడే ఎక్కువ జరుగుతోందన్నమాట. ఇంక వీళ్లని వదలకూడదు’ కసిగా అనుకున్నాడు నాయక్.
‘ఏవిఁటలా అయిపోయారు? ఇదే మా పాతాళ స్వర్గం’ అన్నాడు శకుని.
‘ఓహ్! ఇది నిజంగా స్వర్గమే. మీరు సైంటిస్టు కదూ?’ తేరుకున్న ప్రభు బలవంతంగా నవ్వుతూ అన్నాడు.
‘నువ్వేమనుకుంటున్నావ్ మిస్టర్ విజయ నాయక్?’ ఓరగా అతనికేసి చూస్తూ అన్నాడు శకుని.
‘నిజంగా ఇది అద్భుత శక్తి ఉపయోగించి ఏర్పరచిన స్వర్గం. అఫ్‌కోర్స్ ఆ స్వర్గంలో మారణాయుధాలూ, కరెన్సీలూ వుండవంటారు. ఆ దేవుడికన్నా మీ బ్లాక్‌టైగర్ గ్రేట్’ అన్నాడతను.
‘నిజం! బ్లాక్ టైగర్ చాలా గ్రేట్’ నవ్వాడు శకుని. నాయక్ మాట్లాడలేదు.
‘ఎన్నాళ్ల నించో చూడాలనుకుంటున్న పాతాళ స్వర్గాన్ని చూపించారు. చాలా థాంక్స్. ఇంక మాకు సెలవిప్పిస్తారా?’ అన్నాడు ప్రభు వినయంగా. అంత రహస్య స్థావరాన్ని, ఆత్మీయులకి చూపించినట్టు చూపించిన శకునిని ఎలా అర్థం చేసుకోవాలో అతనికర్థం కాలేదు.
‘మళ్లీ ఎప్పుడొస్తారు?’ ఓరగా చూస్తూ అన్నాడు శకుని.
‘మళ్లీనా? మళ్లీ ఎందుకొస్తాం?’
‘అదే నన్ను మా దొరని అరెస్టు చెయ్యడానికి’
‘్ఛఛ! మిమ్మల్ని అరెస్ట్ చెయ్యడమేంటి?’ కంగారు పడిపోయాడు ప్రభు.
‘ఆ మాట మీ ఫ్రెండ్‌ని అనమను’
‘తను మాత్రం ఎందుకొస్తాడు? జస్ట్ చూసి వెళ్దామనుకున్నాం అంతే’
‘చూడాలనుకున్నారు. చూశారు. వెళ్లాలనుకున్నారు. కానీ అది జరిగే పని కాదు.’ శకుని గొంతులోకి కాఠిన్యం వచ్చేసింది. హడలిపోయాడు ప్రభు.
‘అదేంటంకుల్! మేం వెళ్లాలిగా’ అన్నాడు కంగారుగా.
‘మిమ్మల్ని పంపి మా పీకల మీదికి తెచ్చుకునేంత పిచ్చివాళ్లం కాదు. మీమీ పేర్లు చెప్పారుగానీ మీ ఉద్యోగాలు దాచారు. అయినా మీ గురించి నాకు తెలుసు’ అన్నాడు శకుని.
ప్రభు కంగారు పడ్డాడు. కానీ విజయనాయక్ కంగారు పడలేదు.
‘నిజమే. మీరు అపార్థం చేసుకుంటారని చెప్పలేదు. అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని మాత్రం కాదు. నేనో పోలీసాఫీసర్ని. తను.. సి.ఎం.గారి దగ్గర పి.ఏ. కొన్ని కారణాల వల్ల గౌతమి ఎవరికీ చెప్పకుండా అడవికొచ్చింది. తన కోసం...’
‘ప్రభు వచ్చాడు. ఇతని కోసం నువ్వొచ్చావ్. మీ కోసం అడవి చుట్టూ పోలీసులు పహరా కాస్తున్నారు. మీరు కనిపించలేదని అడవి మీద దాడి చేస్తారు. ఆపై టైగర్‌ని అరెస్ట్ చేసి ఉరి తీస్తారు. అంతేగా?’ నాయక్ మాట పూర్తి కాకుండానే కఠినంగా అన్నాడు శకుని.
‘అడవి చుట్టూ పోలీసులున్నారా? ఇది నిజంగా మాకు తెలియదంకుల్. కానీ కేవలం మాకెలాంటి ఆపదా రాకూడదని అలా చేసుంటారే గానీ అడవి మీద దాడి చెయ్యాలని మాత్రం కాదు.’ అన్నాడు ప్రభు నచ్చచెప్తున్నట్టు.
పెద్దగా నవ్వాడు శకుని.
‘ఈ కథలు పాలుతాగే పసిపిల్లల దగ్గర చెప్పండి. మీ గురించి నాకంతా తెలుసు. కానీ మీకే ప్రాణాల మీద ఆశ వున్నట్టు లేదు’ అన్నాడు వ్యంగ్యంగా.
‘ప్రాణాల మీద ఆశ ఎవరికుండదు మిస్టర్ శకునీ! మీకు లేదా? మాకన్నా మీకే ప్రాణాల మీద ఆశ ఎక్కువ. అందుకే మారణహోమాలూ, దారుణాలూ చేస్తూనే ఇలా ప్రజలకి దూరంగా బతుకుతున్నారు’ అన్నాడు నాయక్ గంభీరంగా.
శకుని కళ్లు ఎర్రబడ్డాయి.
‘మేం చేసే దారుణాలు, మారణహోమాలూ నువ్వు చూశావా?’ అన్నాడు సూటిగా చూస్తూ.
‘మీరంటే మీరు కాదు. మీరు దొర అని కొలిచే బ్లాక్‌టైగర్ చేసినవన్నీ మా పోలీసులకి తెలుసు. ఎవరెలాంటి వాళ్లో తెలుసుకోవడం మా డిపార్ట్‌మెంట్‌కి వెన్నతో పెట్టిన విద్య’ గర్వంగా అన్నాడు నాయక్.
‘ఓ! మీ డిపార్ట్‌మెంట్ అంత గొప్పదా? మరి అన్నీ తెలిసే, మీ జనారణ్యంలో జరుగుతున్న దారుణాల్ని సమర్థిస్తున్నారా?’
‘లేదు. నేరం చేసిన వాళ్లని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం. కానీ మీలాంటి దోపిడీ దొంగలే మారణాయుధాలతో దేశాన్నీ, దేశ సంపదనీ దాచుకుంటూ అడవిలో దాక్కుంటున్నారు’ తనని తాను మర్చిపోయి ఆవేశంగా అన్నాడు నాయక్.
శకుని కళ్లు మరింత ఎర్రబడ్డాయి.
‘పశుగ్రాసం దగ్గర్నుంచి, పరదేశీయులు పంపిన పసిబిడ్డల పాలడబ్బాలను సైతం స్వాహా చేసి మేడలు, మిద్దెలు కట్టుకుని కులికేవాళ్లనేం చేస్తున్నారు? గుడిని, గుళ్లో లింగాన్నీ మింగే పెద్దల్ని, కులాల పేరిట సాటి మనుషుల్నే నడివీధిలో వూచకోత కోస్తున్న ప్రబుద్ధుల్ని ఏం చేస్తోంది మీ ప్రభుత్వం? అభయారణ్యాలంటూ చెప్పుకునే చోటే మూగ జీవాలని చంపి వాటి చర్మాలతో ధనాగారాన్ని నింపుకునే కిరాతకులు మీ పోలీసుల కంట పడలేదా?
ఆనాడు స్వాతంత్య్రం కోసం ధన ప్రాణాలు సైతం త్యాగం చేసిన త్యాగధనుల్ని పూర్తిగా విస్మరించి, కన్నతల్లినే కటికవాడి కమ్మినట్టు, కన్నతల్లి కన్నా మిన్న అయిన మాతృదేశాన్ని పరాయి దేశానికి హస్తగతం చెయ్యాలని ప్రయత్నించే దేశద్రోసుల కెలాంటి శిక్ష వేస్తోంది మీ సమాజం? స్వార్థం, లంచగొండితనం, మానభంగాలు, మారణహోమాలూ నిండిపోయిన జీవన స్రవంతిలో నించి వచ్చిన నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా? అసలు మమ్మల్ని నిలదీసే హక్కు నీకెక్కడిది?’ పిడికిలి బిగిస్తూ ఆవేశంగా అరిచాడు.
అతని మాటలకి ప్రభు, విజయ నాయక్ కూడా కొయ్యబారిపోయారు. ‘ఈయన సామాన్యుడు కాదు. మహా మేధావి వర్గానికి చెందినవాడు’ అనుకున్నాడు నాయక్.
‘అయితే మీ బ్లాక్‌టైగర్ గౌతమబుద్ధుడు అంటారా?’ అన్నాడు మెల్లగా.
‘గౌతమ బుద్ధుడు కాకపోవచ్చు. కానీ ఓ మానవతావాది, దయాదాక్షిణ్యాలు కలవాడు. చెట్టు చేమల్ని, జంతుజాలాన్ని, పశు పక్ష్యాదులని సైతం ప్రేమగా చూసుకునే అమృతమూర్తి. దశాబ్దాలకి ముందు ఆయన కొన్ని నేరాలు చేసుండచ్చు. అసలు తప్పంటూ చెయ్యని మనిషి వుంటాడా? కానీ తన తప్పు తెలుసుకుని ప్రజావళికి గుప్తదానాలు చేస్తూ ప్రజాసేవ చేస్తున్న వాళ్లెంత మందున్నారు? కిరాతక చర్యలు చేసిన వాల్మీకి గురించి నేను చెప్పక్కర్లేదనుకుంటాను. నా దృష్టిలో మా టైగర్ అంతకన్నా గొప్పవాడు. ఇంక వాదనలొద్దు. పదండి. రేపు దొర తీసుకురమ్మంటే ఆడకి పంపుతాను’ అంటూ వాళ్లు మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వకుండా, వాళ్లని తీసుకుని మునుపున్న హాల్లోకి వచ్చేశాడు శకుని.
* * *
అర్ధరాత్రి దాటినా ధర్మారావు ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అతని పర్సనల్ రూమ్‌లో అతను, కాంతారావు, అనిల్ కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అందరి మొహాల్లోనూ ఏదో భీతి ప్రవేశించింది.
‘ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది’ అన్నాడు అనిల్. అతని మాటలో నిష్ఠూరం ఉంది.
‘ఇది ఎప్పటి మాటో అనిల్! ఆ విషయాన్ని మేమే మర్చిపోయాం.. కానీ వాడికెలా తెలిసిందో’ దిగులుగా అన్నాడు ధర్మారావు. అనిల్ మాట్లాడలేదు.
అసలు జరిగిందేమిటంటే అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ధర్మారావు ఇంటి ఆవరణలో ప్రవేశించి పైప్‌లైన్ ద్వారా మేడ ఎక్కుతూ అలికిడి విని ఎవరో లేచి లైట్స్ వెయ్యడంతో, కంగారుగా దిగి బైటికి పరిగెత్తి ఓ పక్కగా ఆపి ఉంచుకున్న కార్లో ఎక్కి క్షణాల్లో మాయమై పోయారు. చీకటి వల్ల కారు కలర్ కూడా గుర్తించలేక పోయారు ఇంటి వాళ్లు. ఈ మాత్రానికే కంగారు పడే రకం కాదు ధర్మారావు. కానీ పరుగెత్తే కంగారులో ఆ దొంగ దగ్గర్నించి ఓ కాయితం జారి కింద పడింది. అందులోని మేటరే అతన్ని వణికించింది. అందులో-
‘శిరికొండ రామాలయంలో దోచిన నగలున్న చోటు’ అని ఏవో అంకెలు, యారో గుర్తులు, పిచ్చి గీతలు ఉన్నాయి.
ఆ నగలకి సంబంధం వున్న ధర్మారావు, పూర్తిగా తెల్లవారకుండానే కాంతారావుని రమ్మని ఫోన్ చేశాడు. కొండమీది నగల ఆచూకీ తెలిసిందేమో అన్న ఉత్సాహంతో అతను అనిల్‌ని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు. అదీ సాయంత్రం చీకటి పడ్డాక. కారణం అనిల్ అందుబాటులో లేకపోవడమే. విషయం తెలియని ధర్మారావు అతను వెంటనే రాకపోవడంతో చిందులు తొక్కుతున్నాడు. తీరా అనిల్‌తో కలిసి వచ్చేసరికి ముందు తెల్లబోయి, తర్వాత-
‘వీణ్ణి ఉపయోగించుకోవచ్చులే’ అనుకుని వాళ్లని తన పర్సనల్ రూమ్‌లోకి

తీసికెళ్లి విషయం చెప్పి, తనకి దొరికిన కాయితం చూపించాడు. అది చదివిన అనిల్ కళ్లు విశాలమయ్యాయి.
‘ఏనాడో జరిగిన శిరికొండ రామాలయం దోపిడీ నగలకీ మీకూ సంబంధం ఏవిఁటి?’ అన్నాడు ఆశ్చర్యంగా.
మొహాలు చూసుకున్నారు కాంతారావూ వాళ్లు.
‘ఏంటలా అయిపోయారు? కొంపతీసి ఆ నగలు తస్కరించింది మీరు కాదు కదా?’ కాస్త వ్యంగ్యంగా అన్నాడు అనిల్.
ఆ మాటకి పిచ్చి కోపం వచ్చింది ధర్మారావుకి.
‘ఏంటీ పెద్ద ధర్మరాజులా మాట్లాడుతున్నావ్? మాతోపాటు కొన్ని తస్కరణలు నువ్వూ చేశావని మర్చిపోకు’ అన్నాడు ఆవేశంగా.
‘ఆఁ! వాటితో మేడలు, మిద్దెలు కట్టుకున్నాను?’ అన్నాడు అనిల్ కోపంగా.
‘కట్టుకునేవాడివే. అనాలోచితంగా కోట్ల విలువ చేసే నగల్ని నీళ్లలో పడేసి నీటిపాలు చేశావ్. ఎన్నో ఏళ్లుగా పథకాలు వేసి, మమ్మల్ని ఏట్లో ముంచావ్? నానా అవస్థలూ పడి సంపాయించిన సొమ్ము పోయి, మింగలేక కక్కలేక ఇలా పడి ఏడుస్తున్నాం. నిన్ను నమ్మినందుకు మాకు మిగిలిందేవిఁటి?’ తనని తాను మర్చిపోయి అరిచినట్టు అన్నాడు కాంతారావు.
అనిల్ మొహం కోపంతో కందిపోయింది.
‘నన్ను నమ్మి మోసపోయారా? నానా అవస్థలూ పడుతున్నారా? నగల వివరాలు, విలువలు చెప్పి, తతంగమంతా నాకప్పగించి మీరు నిశ్చింతగా ఏ.సి రూమ్స్‌లో కూర్చున్నారు. కానీ నేను? ఆ రాక్షసి దగ్గర ప్రేమ నటించి, దాని బాబుని కాకా పట్టి ఆలయంలోని నగలు సంపాదించింది నేను. పోలీసుల కన్ను మీమీద పడకుండా డ్రామాలాడించింది నేను. ఆ గౌతమి ఇంత డేంజరస్ మనిషని తెలియక దాన్ని నిజంగా ప్రేమించి మోసపోయింది నేను. కానీ మీ ఆస్తులన్నీ నేనే దోచేసినట్టు మాట్లాడుతున్నారు. అయినా మీ దోపిడీల గురించి నాకెందుకు? ఇంక మీకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు. మీ పాట్లు మీరు పడండి’ అంటూ విసురుగా లేచాడు.
కంగారు పడిపోయారు రావులిద్దరూ.
‘ఏవిఁటి అనిల్! ఈ మాత్రానికే అంత కోపం వచ్చింది. అసలే టెన్షన్‌తో వున్న మా నీ వ్యంగ్యపు మాటలు బాధించాయి. ఆ బాధతోనే ఏదో వాగేశాం. నీ మీద కొండంత నమ్మకం, అభిమానం వుండబట్టే కదా ప్రతిదానికీ నీ సలహా తీసుకుంటున్నాం. ఏం చేసినా మన ముగ్గురం కలిసే చేద్దామని ప్రమాణం చేసుకున్నాం. అలాగే చేస్తున్నాం కూడా. ఏదో పెద్దవాళ్లం. కాస్త తొందర పడ్డామే అనుకో. ఆ మాత్రానికే మాతో సంబంధం తెంచేసుకుని పోతానంటావా?’ అన్నాడు ధర్మారావు దీనత్వం, అనునయం కలిసిన గొంతుతో.
‘అవును అనిల్! ఎంతో కష్టపడి, పథకాలు వేసి సంపాదించిన జహ్వారీ అంతా పోయిందని బాధపడిన మాట నిజమే. నువ్వూ బాధ పడుతున్నావని మాకు తెలుసు. నీతో సంప్రదించి ఆ నగలు కూడా చేజిక్కించుకుంటామన్న ఆశ కూడా ఉంది. చిరాకులో ఏదేదో మాట్లాడి నిన్ను నొప్పించిన మాట నిజమే. అందుకు మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాం. నువ్వు మా నిచి విడిపోతానని మాత్రం అనొద్దు’ దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు కాంతారావు.
వాళ్ల మాటల గారడీకో లేక ఆ నగల సంగతేమిటో తేల్చాలనో కాస్త మెత్తపడి లేచినవాడల్లా కూర్చున్నాడు అనిల్. బ్లాక్‌టైగర్ దోచిన ఆ నగలు మళ్లీ దొరుకుతాయనే అనుకుంటున్నారా?’ అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
‘నో! మీ టాంక్‌లోని నగలు ఆ టైగర్ దొంగిలించాడనిపించడం లేదు. ఆ లూసీ గౌతమీ కలిసి మన రహస్యాలన్నీ కనిపెట్టి తెలివిగా మాయం చేశారని నా అనుమానం. కాదు నమ్మకం.’
‘నిజానికి వాటిని గురించి బాధ పడినా, తర్వాత ఆ దోపిడీని గురించే మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాం కూడా. కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చేసరికి నాకేం తోచక నిన్ను తీసుకురమ్మని కాంతారావుకి ఫోన్ చేశాను. అసలానాటి నగల సంగతి గుర్తేలేదు.
ఇదిగో ఈ కాయితంతో మళ్లీ దడ మొదలయింది’ అంటూ వంద క్షమాపణలు చెప్పుకుని అనిల్‌ని శాంతపరిచాడు ధర్మారావు. నిజాని కతనికి తమ పాత చరిత్ర చెప్పడం ఇష్టంలేదు.
‘అయితే నాకు నిజాలు చెప్పండి. ఆనాటి దోపిడీ మీరే చేయించారా?’ అన్నాడు అనిల్ ఏదో ఆలోచిస్తూ.
‘నోనో! వాటిని మేం దొంగిలించలేదు.’
‘మరి! ఆ దేవుడే మీకు పంపాడా?’ కాస్త వ్యంగ్యంగా అన్నాడు అనిల్.
‘అనిల్! ఇప్పుడు జోక్స్ వేసుకునే సమయం కాదు. నిజంగానే వాటిని మేం దొంగిలించలేదు. బ్లాక్‌టైగర్ ముమ్మరంగా దోపిడీలు చేసే రోజుల్లో రాష్టమ్రే కాదు దేశమంతా కూడా అల్లకల్లోలమై పోయింది. అయితే హఠాత్తుగా ఏమైందో దోచిన కొన్ని గుళ్ల నగలని మూటలు కట్టి ఆయా గుళ్లల్లోకి చేర్చేశాడు టైగర్. పోయిన నగల గురించి ఆశ వదులుకున్నారంతా. విషయం తెలిసిన మేము కొంతమంది ఆలయాలకి సంబంధించిన వాళ్లతో కుమ్మక్కై కొన్ని నగలు సొంతం చేసుకున్నాం. వాటికి వెలకట్టి, అమ్మడం మాకు సాధ్యపడలేదు. అందుకే వాటిని భద్రంగా దాచాం. ఇప్పుడు వాటి గురించి ఎవరికి తెలిసిందో, నా ఇల్లు గాలించడానికి వచ్చుంటాడు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. జరిగిందిది’ దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు ధర్మారావు.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్