వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని ఆవేశం చూసి శకుని కూడా కంగారుపడ్డాడు.
‘నువ్వెళ్లు టైగర్! నీ ఆరోగ్యం బాగోలేదు. మనల్ని గురించి ఎందరు ఎన్ని రకాలుగా కథలల్ని చెప్పుకుంటున్నారో ఇవాళ కొత్తగా వింటున్నామా? నువ్వెళ్లి విశ్రాంతి తీసుకో’ అన్నాడు అనునయంగా.
‘లేదు సామీ! నా గురించి ఎవరెన్ని కథలు అల్లుకున్నా నేను బాధపడను. కానీ దేవుళ్లాంటి నీ మీద, అందులో నీ కడుపున పుట్టిన బిడ్డే ఇంత దారుణంగా అభాండాలు వేస్తే.. ఛ! దేశభక్తికి మారుపేరైన నిన్ను దేశద్రోహి అంటాడా?’
టైగర్ గొంతు ఇంకా ఆవేశంగా కంపిస్తోంది.
‘అది కాదు దొరా! హఠాత్తుగా ఇనే్నళ్ల తర్వాత తండ్రిని ఇలాంటి పరిస్థితిలో చూస్తే ఎవరైనా ఇలాగే అనుకుంటారు. కాస్త కూల్‌గా ఆలోచించు. తను క్షేమంగా ఉండి చచ్చిపోయినట్టు చిత్రించి ఇక్కడికి చేరి మీతో చేతులు కలిపారంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదు?’ కాస్త ధైర్యం తెచ్చుకున్న ప్రభు అనునయంగా అన్నాడు.
‘చచ్చినట్టు ఆయన చిత్రించుకున్నాడా?’
‘మరి?’
‘అసలు నీకేం తెలుసు? ఈయన...’
‘టైగర్! ఇప్పుడవన్నీ ఎందుకు? జరగాల్సింది చూడు’ అతన్నాపాలని ప్రయత్నించాడు శకుని. అయితే అతను ఆగలేదు.
‘నువ్వుండు సామీ! గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు వీళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జరిగింది వీళ్లకి తెలియాలి’ అని, విజయ్‌కేసి తీక్షణంగా చూసి-
‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అనుకుంటాను. నేను నా అనుచరులతో కలిసి ఓ దోపిడీ కోసం నగరానికెళ్లాం. అప్పుడీయన ఓ నిజాయితీగల పోలీసాఫీసరు. దేశభక్తి ముసుగులో, దారుణమైన నేరాలు, దేశద్రోహ చర్యలు చేస్తున్న ఓ పెద్ద మనిషి గురించి కనిపెట్టిన ఈయన ప్రాణాలకి తెగించి అతన్ని దోషిగా నిరూపించే ఎన్నో ఆధారాలు సంపాదించాడు. అది తెలిసిన ఆ ద్రోహి ఈయన్ని చంపెయ్యాలని పథకం వేశాడు. ఆ ఆధారాలతో వెళ్తున్న అతన్ని చూసి మా కోసమే వస్తున్నాడనుకుని ఓ రాయి వెనక దాక్కున్నాం. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఆ ద్రోహి ఏర్పాటు చేసుకున్న దుండగులు హఠాత్తుగా దాడిచేసి కత్తులతో దాడి చేసి, అతను చచ్చిపోతాడనుకుని అతని దగ్గరున్న ఆధారాలతో సహా మాయమై పోయారు. చాటు నించి ఇదంతా చూస్తున్న మేం తేరుకుని వచ్చేసరికి నెత్తురుమడుగులో కొట్టుకుంటున్నాడు శకుని. మేము దొంగతనాలు చేశామే గానీ హత్యలు మానభంగాలు లాంటివి చెయ్యలేదు. అందుకే ధైర్యం చేసి అతన్ని అడవిలోకి తీసుకొచ్చి, మా మూలికా వైద్యంతోనే ఎలాగో కాపాడి అతని వివరాలు తెలుసుకున్నాం. ఇంక నగరానికెళ్తే బతకనివ్వరన్న ఉద్దేశంతో ఓ శవాన్ని సంపాదించి, ఈయన పోలీస్ డ్రస్ అవీ ఆ శవానికి వేసి ట్రైన్ పట్టాల మీద పడేశాం. చిన్నాభిన్నమైన ఆ శవాన్ని మీ తండ్రి శవంగా భావించి, నాలుగు సంతాప సభలు పెట్టి చేతులు దులుపుకుంది మీ ప్రభుత్వం.
నెల్లాళ్లగ్గానీ ఆయన మనిషి కాలేదు. తర్వాత మా గురించి తెలుసుకుని అగ్ని పర్వతమే అయ్యాడు. తిట్టాడు. మనుషులే కాదని చీదరించుకున్నాడు. ఇక్కడ క్షణం ఉండనని గొడవ చేశాడు. అయినా మేం పంపలేదు. పంపితే ఏం జరుగుతుందో చెప్పాం. కనీసం పూర్తిగా కోలుకునే దాకా అయినా వుండమని బతిమాలి ఒప్పించాం. మూడు నెలల పాటు కంటికి రెప్పలా చూసుకున్నాం. మా మనుగడ, మేం పడే ఇబ్బందులు కళ్ళారా చూసి, తండ్రి బిడ్డలకి చెప్పినట్టు చెప్పి మాలో మార్పు తెచ్చాడు. మృగాల్లో మృగాల్లా బతుకుతున్న మమ్మల్ని మనుషులుగా మార్చిన దేవుడీయన. ఏనాటి బంధమో ఈయన మాటలు మాకు వేదంలా వినిపించేవి. ఆనాటి నించీ ఈనాటి వరకూ దొంగతనాల జోలికి పోలేదు. మా కోసం తన జీవితానే్న పణంగా పెట్టాడు. చక్కగా మాట్లాడ్డం నేర్పి తల్లయ్యాడు. మంచి మాటలు చెప్పి తండ్రయ్యాడు. అక్షరాలు నేర్పి గురువయ్యాడు. అడవినే నగరాలకన్నా గొప్పగా తీర్చిదిద్ది దైవం అయ్యాడు. ఒక్క మాటతో చెప్పాలంటే.. ఈ సామే మా దేవుడు’ ఉద్వేగంగా శకుని గురించి చెప్పేశాడు.
నాయక్ వాళ్లకి మాట రాలేదు. దుఃఖం వచ్చేసింది.
‘డేడీ!’ అన్నాడు నాయక్ ఆర్తిగా.
‘చింటూ’ అని చేతులు చాచాడు శకుని.
తండ్రి చేతుల్లో పసివాడై పోయాడతను. బైట్నించి గమనిస్తున్న గౌతమి, చిన్నీ వాళ్లు నోట మాట రానట్టు నిల్చుండిపోయారు. అందరి కళ్లూ శ్రావణ మేఘాలయ్యాయి.
‘నా గురించి చెప్పి అలసిపోయావు గానీ, ఈ వేళప్పుడు హఠాత్తుగా ఎందుకొచ్చావో చెప్పు’ నవ్వుతూ అన్నాడు శకుని.
‘అది నేను చెప్తాను సామీ’ అంటూ లోపలికొచ్చింది చిన్ని.
చిన్నితోపాటు గౌతమి కూడా శకుని కాళ్లకి నమస్కరించింది. ఇద్దర్నీ ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించాడతను.
‘నువ్వేగా.. మా దొరని కాపాడిన డాక్టర్‌వి’ అన్నాడు నవ్వుతూ.
‘నేను బాబాని కాపాడ్డం ఏంటంకుల్! ఆయనే మా ప్రాణదాత’ అంది గౌతమి మనస్ఫూర్తిగా.
‘నన్ను మన్నించాలి సామీ! గౌతమి అక్క, ప్రభు బాబు, ఈ పోలీసన్నా బతిమాలితే నేనే తీసుకొచ్చాను. చూసి వెళ్లిపోతామని, దీన్ని గురించి ఎవరికీ చెప్పననీ ప్రమాణం చేస్తే కాదనలేకపోయాను’ అంటూ జరిగిందంతా చెప్పింది చిన్ని.
‘అవును సామీ! ఎంతసేపటికీ రాకపోయేసరికి కంగారుపడి నాకు చెప్పింది. అందుకే పరిగెత్తుకొచ్చాను. రావడం మంచిదైంది. నీ కొడుకుని కళ్ళారా చూశాను’ అన్నాడు దొర.
శకుని మొహం గంభీరంగా అయిపోయింది.
‘ఇంక మా బంధుత్వాన్ని మర్చిపోయి, అతి రహస్యమైన ఈ స్వర్గంలోకి అనుమతి లేకుండా వచ్చినందుకు ఏం శిక్ష వేస్తావో, దాని సంగతి చూడు’ అన్నాడు.
‘పెద్ద శిక్షే వేద్దాం సామీ! ఇలాంటి రోజు వస్తుందని ఊహించనైనా ఊహించలేదు’ అన్నాడు దొర.
‘బాబా! శిక్షవేస్తే నాక్కూడా వేయాలి. నేనే వీళ్లని తీసుకొచ్చింది’ అంది చిన్ని బిక్కమొహం వేసి.
‘నీకు వేరే శిక్ష ఉందిలే’ అని,
‘చూడు నాయక్ సామికి బిడ్డవైతే నాకూ బిడ్డవే. అందుకే నీకూ, నా ప్రాణాలు కాపాడిన గౌతమికి కాబోయే భర్త అయిన ఈ ప్రభుకి తలల మీద పెద్ద బండ వెయ్యబోతున్నాను. దాన్నించి తప్పించుకోవడానికి వీల్లేదు’ అన్నాడు దొర.
అందరికీ గుండెల్లో రాయి పడినట్టయింది.
‘తమాషా మాని వీళ్లకేం శిక్ష వేస్తావో చెప్పు’ విసుగు నటించాడు శకుని.
‘అలాగే. కానీ నేనడిగిన వాటికి నువ్వు సూటిగా జవాబు చెప్పాలి సామీ’ అన్నాడు దొర కండిషన్ పెడుతూ.
‘ఎందుకు చెప్పను? అడుగు’ అన్నాడు శకుని.
‘నువ్వు అవడానికి ఇంజనీర్, పోలీసాఫీసర్ అయినా గొప్ప సైంటిస్టుగా మారి ఈ స్వర్గాన్ని నిర్మించావు. అపరబ్రహ్మలా అడవిలోనే ఎన్నో సౌకర్యాలు ఏర్పరచావ్. ఇంత చక్కని స్వర్గాన్ని మీ నగరాలలోని లాకర్‌గా మార్చేసి నువ్వు కావలి కాస్తున్నావ్. నేను దొంగతనాలు మానేసి ఎన్నాళ్లయింది?’ క్షణం ఆగాడు దొర.
‘ఇప్పుడా గొడవెందుకు టైగర్? నువ్వు దొంగతనాలు చేస్తున్నావని ఎవరన్నారు?’
‘అది కాదు సామీ! మాని ఎన్నాళ్లయింది?’
‘నేనొచ్చాక మీరెవరూ ఒక్క దొంగతనం చెయ్యలేదు’
‘కదా? మరి.. ఈ నిధుల సంగతేవిఁటి?’
‘ఏవిఁటి టైగర్! కొత్తగా మాట్లాడుతున్నావ్?’ విసుక్కున్నాడు శకుని.
‘కొత్తగా మాట్లాడ్డం కాదు సామీ! ఆ నగలని ప్రభుత్వానికి అప్పగించాలలని ఎంత ప్రయత్నించాం! సాధ్యపడిందా? లేదే..? మనకక్కర్లేని నిధికి మనం కాపలాదారులుగా వుండడం దేనికి?’
‘ఆ ఇచ్చి చూశాంగా’ వ్యంగ్యంగా అన్నాడు శకుని.
వాళ్ల మాటలు ఏమీ అర్థం కాలేదు ప్రభు వాళ్లకి.
‘ఏవిఁటి? ఆ సంపద ఈ మధ్య దొంగిలించింది కాదా? ఎవరికో ఇవ్వడానికి ప్రయత్నించారా?’ విస్మయంగా అన్నాడు నాయక్.
‘అదంతా ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు’ చిరాగ్గా అన్నాడు శకుని.
‘అవసరం ఉంది సామీ! ఇతను నీ కొడుకని కాదు. నీలాగే నిజాయితీగల పోలీసాఫీసర్. ఇన్నాళ్టికి మన తలమీది భారం తగ్గే అదృష్టం కలిగింది’ అన్నాడు దొర.
‘చెప్పు దొరా! మాకు మరణశిక్ష వేసినా సరే జరిగిన నిజం తెలియాలి?’ ఉద్వేగంగా అన్నాడు ప్రభు.
‘అయితే వినండి. సామి అడవికొచ్చే ముందు చాలా దొంగతనాలు చేశాం. ఎక్కువగా పాతకాలం నాటి ఆలయాలనే ఎంచుకుని తెలివిగా విలువైన నగలు, వెండి బంగారు పాత్రలు దొంగిలించి కొండదేవర గుహ దగ్గర దాచాం. అప్పుడే సామి రావడం మమ్మల్ని మార్చడం జరిగాయి. చేసిన పాపాలు కొంతలో కొంతైనా తగ్గించుకోవాలని సామి సలహాతో కొన్ని గుళ్లల్లో వాటికి సంబంధించిన నగలు మూటగా కట్టి కొన్ని ఆలయాల్లో పెట్టాం. అయితే ఆ నిధులు భగవంతుడికి చేరలేదు. సంబంధిత వ్యక్తులే వాటిని సొంతం చేసుకున్నారు. అది తెలిసిన మేమా ప్రయత్నాన్ని విరమించుకున్నాం. నగల్ని తస్కరించిన దుర్మార్గులు అంతటితో ఆగలేదు. బ్లాక్‌టైగర్ గజదొంగగా పేరెలాగూ వుంది కదా అన్న ధైర్యంతో దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేస్తూ అవి మేమే చేస్తున్నామంటూ మా మీద మరింత బురద జల్లారు. పిచ్చి జనం అదే నమ్మారు. ప్రభుత్వం కూడా ‘జనవాక్యం కర్తవ్యం’ అన్నట్టు మమ్మల్ని నరరూప రాక్షసుల్లా చిత్రించి మామీద దారుణమైన కేసులు బనాయించారు. మే ఆనాడు దొంగతనాలూ దోపిడీలూ చేశామే గానీ హత్యలు చెయ్యలేదు. ఈ మేకవనె్న పులులు అది కూడా చేస్తూ వాటిని మా ఖాతాలోకి చేర్చారు.
అంతెందుకు? ఆ మధ్య కొండమీది ఆలయంలో జరిగిన దొంగతనం, హత్యలు మేమే చేశామని పుకార్లు పుట్టించి అందర్నీ నమ్మించారు. జనాలు హడలిపోతూ ఈ ఛాయలకే రావడానికి భయపడుతున్నారు. అదీ మాక్కాస్త మేలే చేసిందనాలి. దశాబ్దాలుగా గుండెల్లో నిప్పులా భద్రపరుస్తున్న నిధులకి కాస్త రక్షణ లభించింది. అందుకే మేము పట్టించుకోలేదు. ఇతరులెవరూ రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మా సామి ధర్మమా అని ఈ పాతాళ స్వర్గం వెలిసింది. ఇప్పుడు మేం నగరవాసులకన్నా హాయిగా, ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. అంతేకాదు ఎక్కువ కష్టపడి పంటలు పండించి చుట్టుపక్కల పేద ప్రజలకి పంపుతున్నాం. వాళ్లందరికీ తెలుసు. మేమెంత మారిపోయామో. అందుకే ఏ చిన్న వార్త తెలిసినా మాకందజేస్తారు. మాకెలాంటి చింతా లేకపోయినా ఈ ధనరాశులు తలనెప్పిగా తయారయ్యాయి. మాకుగా మేమెళ్లి ప్రభుత్వానికిస్తే ఏం జరుగుతుందో మీకూ తెలుసు. అసలు విషయం తెలియకుండా ఈ సామిని గురించి దారుణంగా మాట్లాడాన్ని సహించలేక పోయాను. ఇదీ ఓ కట్టుకథ అనుకుంటే మీ ఖర్మ!’ అంటూ ఉద్వేగంగా ముగించాడు దొర.
ఏదో మంత్రముగ్ధులైనట్టుండి పోయిన శ్రోతలు దొర చివరి మాటలు విని స్పృహలోకొచ్చారు. అందరి మనసులూ భారంగా అయిపోయాయి. నాయక్ అయితే మతిపోయిన వాడిలా అలా చూస్తూండిపోయాడు.

అతని కళ్లల్లో వూరిన నీరు చెంపల మీదుగా జారుతోంది. అతని పరిస్థితి గమనించిన ప్రభు -
‘సర్! మీ నాన్నగారి గురించి విన్నారుగా. ఇంక హేపీగా ఫీలవండి’ అన్నాడు బలవంతంగా నవ్వుతూ అప్పటి తేరుకున్న నాయక్-
‘అయామ్ సారీ డేడీ! మీ గురించి చాలా అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి’ అంటూ శకుని కాళ్లకి చుట్టుకుపోయాడు.
శకుని కళ్లు కూడా చెమర్చాయి. అతన్ని లేవదీసి కూర్చోబెట్టాడు. తడి కళ్లని తుడిచి -
‘నువ్వే కాదు అందరూ అనుకునేదదే. నరులకి తెలియకపోయినా ఆ నారాయణుడికి తెలుసు నిజం ఏమిటో?! ఇక్కడ తప్పించుకున్నా పైకెళ్లాక తప్పించుకోలేం కదా’ అన్నాడు బలవంతంగా నవ్వుతూ.
‘నిజంగానే బ్లాక్‌టైగర్ అంటూ జనాలు ఎంత హడలిపోతున్నారో చూసిన మేమూ అలాగే దొరని గురించి రాక్షసుళ్లానే ఊహించుకున్నాం. కానీ ఇక్కడికొచ్చాక గానీ తెలియలేదు. ఇక్కడున్న వాళ్లు రాక్షసులు కాదనీ, దేవతలనీ!’ ఒకలాంటి ఉద్వేగంగా అన్నాడు ప్రభు.
‘అంత పెద్ద మాటలొద్దు బాబూ! మేమూ మనుషులమే అని చూస్తే చాలు! ప్రజలకి చేతనైనంతలో సాయపడతామే గానీ ద్రోహం చెయ్యం’ అన్నాడు దొర బాధగా.
గౌతమికిదంతా వెర్రి ఆనందాన్ని కలిగించింది. కానీ, తరచూ గుర్రాల మీద ఆటవికులు కొండంతా తిరగడం, ఆలయ పరిసరాలన్నీ గాలించడం గుర్తొచ్చి అయోమయంలో పడిపోయింది. అది గ్రహించిన దొర పెద్దగా నవ్వి-
‘నీ అనుమానం ఏవిటో నాకర్థమయిందమ్మా. ఈ అడవన్నా, ఆ కొండ, కొండమీది దేవతన్నా మాకు ప్రాణం. కొండ మీది దేవుడి నగల మీద కొందరి కన్ను పడిందని మాకు వార్త వచ్చింది. అందుకే తరచూ కొండ మీద, ఆలయ పరిసరాల్లోనూ మా వాళ్లు రాత్రిళ్లు తిరిగేవాళ్లు. కానీ మాకన్నా ఆరితేలిన దొంగలు, అన్యాయంగా అమాయకుల్ని చంపి మరీ దోచుకుపోయారు. కొన్ని నగలు కొండ మీదే ఎవరో దాచడం చూసి వాటిని మా వాళ్లు తెచ్చి భద్రపరిచారు. ఆ నగల చరిత్ర ఈ గౌతమి ద్వారా విని ఆ నగల్ని ఈమెకిచ్చేశాడు మా జింబో. ప్రస్తుతం వాడే ఈ అడవికి టైగర్, మా వాళ్లకి నాయకుడు..’ అంటూ మరికొన్ని వివరాలు చెప్పాడు.
‘అవును. అవి నా దగ్గరే వున్నాయి’ అని, ఆ నగలని కాపాడడానికి తన తండ్రి ఎన్ని అవస్థలు పడ్డాడో, వాటి కోసం తెగించి తనెలా వచ్చిందో చెప్పింది గౌతమి.
‘కానీ మిగతా నగలు?’ అన్నాడు దొర ఆతృతగా.
‘అవన్నీ మీ దగ్గరే వున్నాయని చాలామంది నమ్మకం. కానీ ఎత్తుకి పైయెత్తు వేసిన మా ప్రియ ఈపాటికి వాటిని ఆ దుర్మార్గుల నించి తస్కరించే ఉంటుంది’ నవ్వింది గౌతమి. తర్వాత తమ పథకాలన్నీ వివరంగా చెప్పింది.
ఆమె సాహసానికి శకునీ వాళ్లే కాదు. నాయక్ వాళ్లు కూడా విస్తుపోయారు. అభినందించారు.
‘అంతా బానే ఉంది. మనం తప్పుచేసి వీళ్లకి బందీలుగా చిక్కిపోయాంగా’ అన్నాడు ప్రభు.
దొర నవ్వాడు.
‘ఏం సామీ! వీళ్ల నెత్తి మీద భారం పడెయ్యొచ్చుగా’ అన్నాడు శకుని కేసి ఓరగా చూస్తూ.
‘నువ్వో నిర్ణయానికొచ్చావుగా. ఇంక నా సలహా ఎందుకు?’ పసివాడు అలిగినట్టు అన్నాడు శకుని.
‘నీ సలహా లేందే అడుగు ముందు వెయ్యనని నీకు తెలుసు సామీ! నా అభిప్రాయం నీకు నచ్చిందనీ తెలుసు. పిల్లల్ని కంగారు పెట్టకుండా విషయం చెప్పెయ్యి’ అన్నాడు దొర.
‘చెప్తాను. చెప్పే ముందు వీళ్లు నాకో మాట ఇవ్వాలి’ గంభీరంగా అన్నాడు శకుని.
‘తప్పకుండా డేడీ! చెప్పు. మేమేం చెయ్యాలి?’ ఆతృతగా అన్నాడు నాయక్.
‘ఈ పాతాళ స్వర్గాన్ని, ఇక్కడ జరిగిన సంగతులని పూర్తిగా మర్చిపోవాలి. మళ్లీ మీరెవరూ అడవిలోకి రాకూడదు. వచ్చినా మామూలు అడవులు చూసినట్టు చూసి పోవాలే తప్ప పరిచయాలూ బంధుత్వాల గురించి మాట్లాడకూడదు’ అంటూ మరి కొన్ని కండిషన్స్ పెట్టాడు శకుని.
‘అన్యాయం డేడీ’ బాధగా అన్నాడు నాయక్.
‘అదంతా నాకనవసరం. మీ డేడీ చచ్చిపోయాడు. దట్సాల్’
‘ఇంతకీ మా నెత్తిన పడేసే బండ ఏంటో చెప్పు దొరా. కంగారుగా ఉంది’ అన్నాడు ప్రభు చిన్నపిల్లాడిలా. తమకి కఠిన శిక్షలేం వెయ్యరని అతనికి తెలుసు.
‘ఇక్కడ భద్రపరిచిన సంపదని ఎక్కడివక్కడికి భద్రంగా చేర్చాలి. మా ఉనికి చెప్పకుండానే, ఈ నగలు కాపాడటానికి మేమెంత కష్టపడ్డామో చెప్పాలి. అప్పుడు గానీ బ్లాక్‌టైగర్ అంటే ఏమిటో జనాలకీ, ప్రభుత్వానికీ కూడా అర్థమవుతుంది’
‘ఇంత మంచి పనులు చేస్తూ కూడా మీరు అజ్ఞాతంలో ఎందుకుండాలి అంకుల్?’ అంది గౌతమి.
‘నాకా జనారణ్యంకన్నా ఈ మృగారణ్యమే బావుందమ్మా! దీన్నీ స్థితికి తేవడానికి ఇరవై ఏళ్లు పట్టింది. నాగరికత నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిన అహంకారులు, కాసుల కోసం గొంతులు కోసే హంతకులూ ఈ నందనవనంలో అడుగుపెడితే ఇరవై క్షణాల్లో బూడిదై పోతుంది’ అన్నాడు శకుని గంభీరంగా.
వాదించి అలసిపోయిన నాయక్ కూడా ఇంకేం మాట్లాడలేక పోయాడు. చచ్చిపోయాడనుకున్న తండ్రి క్షేమంగా ఉన్నాడని ఆనందించినా, ఇంక అతన్ని చూడలేం అనుకుంటే అతని గుండె మరింత బరువెక్కి పోయింది.
రెండు మూడు గంటలు చర్చలయ్యాక అందరూ తృప్తిగా బైటికొచ్చేశారు. పాలిపోయిన మొహంతో కనిపించిన జింబోని చూసి కంగారుగా ఏదో చెప్పబోయింది గౌతమి.
‘ఏం చెప్పొద్దు గౌతమీ! నాకంతా తెలిసిపోయింది. నువ్వన్నట్టు మా చిన్ని లేకుండా నేను బతకలేను. నువ్వు ప్రభు బాబుని చేసుకుని హాయిగా ఉండు’ అన్నాడు. అందరూ విస్మయంగా చూస్తే చిన్ని కళ్లు ఆనందంతో తళుక్కుమన్నాయి.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్