మెయన్ ఫీచర్
ప్రజల బతుకులు మార్చని సంక్షేమ పథకాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పేకాటలో గెలవడం ఎంత సహజమో ఓడడం అంతే సహజం. గెలవడానికి గల కారణాల్ని బేరీజు వేసుకున్నట్లే, ఓడడానికి గల కారణాల్ని వెతుక్కుంటాడు ప్రతీ ఆటగాడు. కాని, ప్రతీ పాలకపార్టీ అట్టహాసంగా తన ప్రణాళికను, విధి విధానాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తుంది. అయిదేండ్ల కాలపరిమితికై సిద్ధం చేసిన ఆ ప్రణాళిక, ఆచరణకు నోచుకోదు. మొదటి సంవత్సరమంతా అస్మదీయుల్ని బుజ్జగించడానికి, పాలనాపరమైన వ్యవహారాల్ని చక్కదిద్దడానికి, వివిధ రాష్ట్రాల్లో బలాన్ని పుంజుకోవడానికి, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయడానికి, అవసరమైతే గవర్నర్లను పావులుగా వాడుకోవడానికే సరిపోతుంది. ఇదే కాలంలో విదేశీ వ్యవహారాల్ని, సంబంధాల్ని సరిచూసుకోవడం, పెట్టుబడులకై పాకులాట సరేసరి. చివరి సంవత్సరం తిరిగి ఎన్నికలకు సిద్ధం కావడానికి మరింత మెజారిటీ సాధించి పార్లమెంట్‌లో తిరుగులేని పార్టీగా ఎదగాలని పాకులాడుతుంది. మధ్య మిగిలేది మూడు సంవత్సరాలే.
ఇదంతా చెప్పినంతగా సులభం కాదు. అందుకే ప్రచార ఆర్భాటం ఎక్కువ, పనితనం తక్కువ కనపడుతుంది. అన్నింటికీ మించి హామీలను నెరవేర్చడం, సంక్షేమ పథకాల్ని అమలు చేయడం ఓ కత్తిమీద సామే. పరిపాలనా సిబ్బందికి, పాలకుల మధ్య సయోధ్య వుంటే కొంత మెరుగైన ఫలితాలుంటాయి. లేదంటే అంతా గందరగోళమే. ఇచ్చిన హామీలు, చేపట్టిన పథకాలు కింది స్థాయిలో ఏమేరకు అమలవుతున్నాయో గత 70 ఏళ్లుగా పట్టించుకున్న వారు లేరు. ఏ పార్టీ తాను పాలన సాగించిన కాలాన్ని సమీక్షించుకోదు. విమర్శ, స్వీయ విమర్శ, ఏకోశానా జరగదు. జవాబుదారీ తనం గూర్చి మాట్లాడదు. ఇలాంటిదే బడ్జెట్ కథనం! వచ్చే బడ్జెట్ రూపకల్పనపై సెప్టెంబర్‌లో ప్రణాళిక రూపొందుతుంది. అన్ని మంత్రిత్వశాఖలు అక్టోబర్‌లో అధికారులతో చర్చలు జరిపి నవంబర్‌లో జమా ఖర్చులను రూపొందించుకుంటాయి. డిసెంబర్‌లో ముసాయిదా బడ్జెట్ కాపీ సిద్ధమై ఆర్థిక మంత్రిత్వశాఖను చేరుతుంది. ప్రధానమంత్రితో పాటు కీలక బాధ్యతల్లో ఉన్న పార్టీ పెద్దలు సాధ్యాసాధ్యాల్ని పార్టీ ప్రయోజనాలతో బేరీజు వేస్తారు. జనవరిలో ఉద్యోగ, కార్మిక, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు చెం దిన ప్రతినిధులు తమతమ డిమాండ్లను సూచనల రూపంలో అందిస్తారు. పార్టీ ప్రయోజనాలు దెబ్బతిననంతవరకు సూచనల్ని, సలహాల్ని వింటారు. అవసరమైతేనే పార్టీ పాటిస్తుంది. ఇలా తుది రూపం తీసుకున్న బడ్జెట్ ముద్రణకు వెళ్లి ఫిబ్రవరి చివరి రోజున పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడుతుంది. ఇలా అరునెలల కాలం బడ్జెట్ రూపకల్పనకే పోగా మిగిలేది ఆరునెలలే. బడ్జెట్‌లో రెండు పద్దులుంటాయి. ప్రణాళికేతర బడ్జెటు ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా ఖర్చుచేసే బడ్జెట్ కాగా, ప్రణాళికా బడ్జెట్ ఆ సంవత్సరానికి గాను, వివిధ పథకాలకై, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకై ఖర్చు చేసేదిగా ఉంటుంది. ఈ బడ్జెట్ వెంటనే మంజూరు కాదు. నెలలు పట్టవచ్చు. లేదా అసలు మంజూరే కాకపోవచ్చు. మంజూరైనా ఖర్చు చేయని స్థితి రావచ్చు. కొన్ని పథకాలైతే దీర్ఘకాలికంగా కొనసాగుతూనే ఉంటాయి. ఇందిరాగాంధీ ప్రవేపెట్టిన గరీబీ హఠావో చివరకు ‘పేదల నిర్మూలన’ పథకంగా రూపాంతరం చెందింది కాని, ‘పేదరిక నిర్మూలన’ పథకంగా ఎదగలేకపోయింది. దశాబ్దాలు గడుస్తున్నా ఉపాధి హామీ పథకాలు, ఆవాస్ యోజన పథకాలు, దీపం పథకాలు, గ్యాస్ పథకాలు, జన్‌ధన్ పథకాలు, అమృత పథకాలు ఈ కోవలోనివే. రూపం మారినా, అంతర్గత సారం మారని పథకాలు ప్రజల బతుకుల్ని మార్చలేకపోతున్నాయి. గత 70 ఏళ్లుగా ఇళ్లు కడుతున్నారు. కట్టిన ఇళ్లు ఎవరికి అందుతున్నాయో తెలియదు కానీ, ఇళ్లులేని వారు నిజంగానే ఉంటున్నారు. సంక్షేమ పథకాల పరిస్థితి ఇదీ!
అసలు దారిద్య్ర రేఖకు, దిగువనెంత, ఎగువనెంతనో తెలియదు. ఏ స్థాయిలో రివ్యూ జరగదు. ఏ సంవత్సరం సమీక్ష ఉండదు. ఓ పథకం ప్రారంభమైన దశలోనే కొనసాగుతూ వుంటుంది. పనికోసం, ఆహార భద్రతకోసం ప్రజలు ఎందుకు ఎదురు చూడాల్సి వస్తుందో తెలియదు. పాలకులే కాదు, ఉన్నతస్థాయి ఐఏఎస్‌లకే ఇది తెలిదంటే మనం నమ్మాలి. నిజానికి ప్రతీ పాలకపార్టీ ఐదేళ్ల పాలనా కాలాన్ని కింది స్థాయినుంచి కేంద్ర స్థాయిదాకా రివ్యూ చేసుకొని తప్పుల్ని దిద్దుకోవాలి. అలాగే సంవత్సర కాలపు బడ్జెట్‌పై సాధ్యాసాధ్యాలపై, అమలు తీరుపై, నిజమైన సంక్షేమ పథకాలపై, ఖర్చు చేసిన తీరుపై, వైఫల్యాలపై పార్టీ స్థాయిలో,ప్రభుత్వ స్థాయిలో సమీక్ష జరగాలి. ఇది జరగడంలేదు. ఇక ముక్కుపిండి వసూలు చేస్తున్న పేదల పన్నులతో ఎలాంటి సేవలు అందుతాయో ఒక ఉదాహరణ చూ ద్దాం. పట్టణ ప్రాంతాల్లో పేద రైతులు పండించిన కూరగాయల్ని తెచ్చి మార్కెట్‌లో అమ్ముకుంటారు. స్థానిక మున్సిపాలిటీ బలవంతంగా తైబజారు పేరున వసూలు చేస్తుంది. అందుకుగాను వారికి షెడ్‌ను, తాగునీటి సౌకర్యాన్ని మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు రక్షణ కల్పించాలి. రైతు బజార్లతో సహా ఈ సౌకర్యాలున్న మార్కెట్లు దేశ వ్యాపితంగా వెతికినా కానరావు. పైగా పశువులు, పందులు, దళారుల బెడద వెంటాడుతూ ఉంటుంది. స్థానిక రాజకీయ నాయకుల్నించి, అసెంబ్లీ ముఖ్యమంత్రిదాకా ఎవరికీ పట్టదు. కాని, వౌలిక సదుపాయాల కల్పన పేరున కోట్లాది రూపాయలు ప్రతి బడ్జెట్‌లో కేటాయిస్తారు.
బస్టాండ్‌కు, రైల్వేస్టేషన్, ఓ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కార్యాలయం..ఏదైనా గాని, అన్నీ లేమితో కొట్టుమిట్టాడుతుంటాయి. సేవలపరంగా చూస్తే ఏ యంత్రాంగం ప్రజలకోసం పనిచేయదు. అసలు ‘సేవ’ అనే స్పృహే కార్యాలయ గుమస్తాకుండదు. పైనున్న అధికారి కుండదు. పైగా ఉన్నత స్థాయి వర్గాలతో పాటు, రాజకీయ నాయకులు ఈ సేవల పరిధిలోకి రాకుండా జాత్త్ర పడుతారు. వీరు అందుకునే సేవలు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఉదాహరణగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమే! ఇలా ఓ బస్సుస్టాండో, ప్రభుత్వ పాఠశాలనో, దవాఖా ననో ఈ స్థాయికి ఎదిగితే ఈ దేశ బడ్జెట్ నిజంగా సార్థకమైనట్లే. మరో ఉదాహరణ! 2008-09లో ఉపాధి హమీ పథకం ప్రారంభమైంది. నిజానికి ఇది అంతంకావాలి. అంటే ప్రజలు స్వయం పోషకులుగా, స్వంత ఆదాయ వనరులు సమకూర్చుకునేవారిగా ఎదగాలి. కాని సంవత్సర, సంవత్సరానికి దీనికి కేటాయింపులు పెరుగుతున్నాయి. అంటే రోగం ముదిరినట్టు కాదా? పోనీ ఇది విజయవంతంగా నడుస్తున్నదా? 2008-09లో వీరిని గుర్తించి ఇచ్చిన జాబు కార్డుల సంఖ్య 10కోట్ల ఒకలక్ష. 2014-15 నాటికి ఈ సంఖ్య 13 కోట్ల 22 లక్షలకు పెరిగింది. ఇందులో పని దొరికింది 2008-09లో 4.51 కోట్లకు కాగా, 2014-15లో 6.49 కోట్ల మందికే. పని కల్పించాల్సిన 100 రోజులకు గాను వీరికి దొరికింది 2008-09లో 48 రోజులు కాగా, 2014-15లో 40 రోజు లు మాత్రమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శించిన మోదీ ఈ పథకానికి గత ఏడాది బడ్జెట్ కన్నా రూ.3,999కోట్లను అధికంగా కేటాయించడం ఆశ్చర్యకరం. ఈ పథకం నడుస్తున్న తీరు గురించి, పొందుతున్న లబ్ది గూర్చి కాగ్ ఎన్నిసార్లు అక్షింతలు వేసిందో తెలిసిందే. ప్రజల స్వతసిద్ధ ఉపాధిని కూకటి వేళ్లతో పెకలించి, దిక్కులేని వారిగా మార్చి, పనికి ఉపాధి హామీ పేరున ఆదుకోవడమే ఓ పెద్ద రాజకీయం.
మరో అంశాన్ని చూద్దాం. విద్యాహక్కు చట్టంలో భాగంగా, యుపిఎ ప్రభుత్వం 3శాతం సెస్‌ను విధించింది. ఇలా పోగైన డబ్బులో ఖర్చు చేసింది 55.5 శాతం కాగా, రూ.64,183 కోట్లు (44.5%) ప్రభుత్వం దగ్గర ఇంకా మూలుగుతూనే ఉంది. విద్యాహక్కు చట్టం మొదలై అర్థదశాబ్దం కావస్తున్నా, వీధిలోని పిల్లలు, వీధిలోనే ఉండగా, ప్రభుత్వ పాఠశాలలు కొడిగడుతూనే ఉన్నాయి. అలాగే మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ సెస్ 0.5శాతం కాగా, బడ్జెట్ కేటాయించింది రూ.11,300 కోట్లు. అయినా ‘చెత్త’దేశంగా ముక్కులు మూసుకుంటూనే ఉన్నాం. ఇలా వివిధ సెస్‌ల ద్వారా వసూలైన సొమ్ము 2014-15 నాటికే ప్రభుత్వ దగ్గర రూ.1,44,522 కోట్లని మొన్నటి బడ్జెట్‌లో జైట్లీ చెప్పడం గమనార్హం. జిడిపిలో పోల్చినప్పుడు మనం ఖర్చు చేస్తున్నది స్వల్పంగానే ఉన్నా, మంజూరవుతున్న నిధులు మాత్రం ప్రజలకు సేవల్ని అందించాయి. రువాండా 105 శాతా న్ని, ఆఫ్ఘనిస్తాన్ 7.6 శాతాన్ని వైద్యానికై ఖర్చు చేసి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందిస్తుంటే మనం కేటాయిస్తున్నది కేవలం 1.04 శాతమే. అక్కడ సరాసరి వెయ్యిమందికి ఆరుగురు డాక్టర్లుంటే, మనదగ్గర 1278 మందికి ఒక్కరు మాత్రమే. ఈ వైద్యుడు కూడా ప్రైవేటు వైద్యం చేసుకుంటూ, ప్రజా వైద్యాన్ని ఖాతరే చేయడు. డిజిటల్ గ్రామాలు, పాఠాలు అంటున్న ప్రభుత్వానికి అసలు విద్యుత్తే చూడని 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ఇంకా వెయ్యి రోజులు (2018, మే 1) కావాలట. అయినా ప్రతీ గ్రామ పంచాయతీకి 80 లక్షలు, పట్టణ మున్సిపాలిటీలకురూ.21 కోట్ల చొప్పున ఈ బడ్జెట్‌లో కేటాయించడం ముదావహం. వచ్చే బడ్జెట్ నాటికి వీటి ఫలితాలు తేలుతాయి. కాగ్ శభాష్ అంటే, నిజంగా ఈ దేశ ప్రజలు ధన్య జీవులే.