ఆంధ్రప్రదేశ్‌

చిక్కుల్లో చంద్రుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశం, పశ్చిమ ఘటనల్లో ఎటువైపు? కరణం-గొట్టిపాటిలో ఎవరిని సమర్ధించాలి?
తణుకు ఎమ్మెల్యేపై కేసు పట్ల టిడిపి శాసనసభ్యుల నిరసన నిరసనగా గన్‌మన్లను వెనక్కిపంపిన వైనం
ఎమ్మెల్యే వైపా, పోలీసుల వైపా? ఎటూ తేల్చుకోలేని స్థితిలో సిఎం
ఎమ్మెల్యేలకు దన్నుగా ఉంటామన్న మంత్రి పుల్లారావు

అమరావతి, మే 21: రోడ్డెక్కిన సొంత పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పడేసింది. క్రమశిక్షణకు సంబంధించిన ఈ అంశంలో ఎవరిపై చర్య తీసుకోవాలి? ఎవరిని ఉపేక్షించాలన్న తర్జనభర్జనలో ఆయన ఉన్నారు. గత రెండు రోజుల్లో జరిగిన వరుస పరిణామాలు పార్టీ అధినాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రెండ్రోజుల క్రితం ఇద్దరు టిడిపి సీనియర్లు దారుణ హత్యకు గురికావడం వెనుక సొంత పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హస్తం ఉందని, మైనింగ్‌కు అడ్డువస్తున్నందుకే తన వర్గానికి చెందిన సీనియర్ నాయకులను పథకం ప్రకారం హత్య చేయిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కరణం బలరాం ఆయనపై బహిరంగంగానే ఆరోపించారు. బాబుకు మొదటి నుంచీ అత్యంత సన్నిహితుడైన కరణం ఆయనే్న లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. అటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, కావాలంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ హత్యలపై బాబు ఇద్దరితోనూ ఫోన్‌లో మాట్లాడారు.
కాగా ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, పార్టీకి ఇబ్బంది కలిగించవద్దని ఒక పత్రికాధిపతి హైదరాబాద్ నుంచి కరణం బలరామ్‌తో రాయబారం నడిపినట్లు పార్టీ వర్గాల సమాచారం. అద్దంకి వ్యవహారంలో ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిందితులను అరెస్టు చేయాలని బాబు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే అసలు ఈ వ్యవహారానికి మూలకారణమైన ఎమ్మెల్యే గొట్టిపాటి సంగతి తేల్చాలని కరణం డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ కేసులో గొట్టిపాటిని ఏ-1 నిందితునిగా నమోదు చేయాలన్నది కరణం వర్గీయుల వాదన.
దీనిపై బాబు ఏం చర్యలు తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. కరణం డిమాండ్‌ను గౌరవిస్తే గొట్టిపాటిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల పార్టీ ఫిరాయించి వచ్చిన 21 మంది (వైకాపా) ఎమ్మెల్యేలకు రాజకీయ రక్షణ ఉండదన్న సంకేతాలు పంపినట్లవుతుంది. ఒకవేళ బలరామ్ డిమాండ్‌ను పట్టించుకోకపోతే పార్టీ కార్యకర్తలను చంపిన వ్యవహారంలో నాయకత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు వెళతాయి. ఈ పరిణామాలపై చర్యలు తీసుకోకపోతే బలరామ్ వౌనంగా కూర్చునే అవకాశాలు కనిపించడం లేదు. నిందితుల అరెస్టు, గొట్టిపాటిపై చర్యలు తీసుకునేవరకూ గళం విప్పుతూనే ఉంటారని కరణం ధోరణి స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఏవిధంగా చర్యలు తీసుకోవాలన్న అంశం బాబుకు ఇబ్బందికరంగా మారింది.
అటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణను ఏ-1 నిందితునిగా గుర్తిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన వైనం ఆ జిల్లా ఎమ్మెల్యేలను ఆగ్రహానికి గురిచేసింది. విధినిర్వహణలో ఉన్న ఎస్‌ఐ, రైటర్‌ను దుర్భాషలాడిన వ్యవహారంలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయటం అధికార పార్టీ నేతల అహాన్ని దెబ్బతీసింది. దానికి నిరసనగా జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా తమ గన్‌మెన్లను వెనక్కి పంపాలని తీసుకున్న నిర్ణయం పార్టీ నాయకత్వానికి షాకిచ్చింది. ఇప్పటికే కేసు నమోదైన ఎమ్మెల్యేకు మద్దతుగా మంత్రి పుల్లారావు తన వాణి వినిపించారు. ఎమ్మెల్యేలను కాపాడుకుంటామని ఆయన ప్రకటించారు. దీనిపై అటు పోలీసు అధికారుల సంఘం కూడా పట్టుదలతో ఉండటంతో వ్యవహారం క్లిష్టంగా మారింది. తమపై దాడి చేసి దుర్భాషలాడటాన్ని పోలీసులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించిన పోలీసు అధికారుల సంఘం పట్టుబట్టి మరీ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించే వరకూ విశ్రమించలేదు. ఇప్పుడు కేసు నమోదయినందున ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇటు పోలీసులు ఉండటంతో ఎవరిపై చర్యలు తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో బాబు ఉన్నారు. ఇప్పటికే అధికారులపై పార్టీ నేతల దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు విపక్షాలు, మీడియా నుంచి వెల్లువెత్తుతున్నాయి. వారి డిమాండ్‌కు తలొగ్గితే ఎమ్మెల్యేపై చర్య తీసుకోవలసి ఉంటుంది. అదే జరిగితే ఎమ్మెల్యేల్లో నాయకత్వంపై వ్యతిరేకత ప్రారంభమవుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోని నాయకత్వం పట్ల విధేయతతో ఎందుకుండాలన్న ఆలోచన మొదలవుతుంది. పోనీ ఎస్‌ఐపై బదిలీ వేటు వేయాలనుకున్నా, ఈ తరుణంలో అది సాధ్యం కాదు. ఆ నిర్ణయం తీసుకుంటే పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో ఈ రెండు ఘటనల్లో ఎవరిని శిక్షించాలి? ఎవరిని రక్షించాలన్న దానిపై నాయకత్వం తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది.