ఆంధ్రప్రదేశ్‌

కష్టాలే మనకు సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 2: రాష్ట్ర చరిత్రలో జూన్ రెండోతేదీ చీకటి రోజు. జీవితంలో మరువరాని, మరచిపోలేని రోజు. అయితే తెలుగువారిని అడ్డగోలుగా చీల్చిన సోనియాగాంధీ పుట్టిల్లు ఇటలీకి మాత్రం స్వాతంత్య్రం వచ్చిన రోజని సిఎం చంద్రబాబు ఆవేదనతో చెప్పారు. ‘కష్టాలున్నాయని దిగులుపడితే సమస్యల సుడిగుండంలో పడిపోతాం. అందుకే కష్టాలను సవాల్‌గా స్వీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నా’ అన్నారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో శుక్రవారం ఉదయం జరిగిన నవ నిర్మాణ దీక్షలో సిఎం చంద్రబాబు సభికులతో ప్రతిజ్ఞ చేయించి దాదాపు గంటపాటు ఉద్వేగంతో మాట్లాడారు. విభజన పేరిట తెలుగుజాతికి జరిగిన అన్యాయం, అవమానాలకు నిరసన తెలియచేసేందుకే రాష్ట్ర విభజన జరిగిన జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష ప్రారంభించానన్నారు. 1947లో దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవం.. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రాష్ట్రావతరణ దినోత్సవాలు జరిగాయి. అయితే మనం ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పునరంకితం అయ్యేందుకు మరింత సిద్ధపడాల్సిన రోజిది అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఏమాత్రం కనికరం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వినజన తప్పనిసరయితే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని, ఏ ప్రాంతానికీ అన్యాయం జరుగకుండా చూడాలని నెత్తీనోరూ బాదుకుంటూ చెప్పానన్నారు. తనపై కక్ష, కసి ఉంటే రెండు రాష్టల్ల్రోని పెద్దలు, ఉద్యమకారులను ఒకచోట కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకోవాలని ఎంత చెప్పినా నాటి కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదన్నారు. దివంగత ఎన్టీఆర్‌లా తెలుగువారి హృదయాల్లో తాను కూడా శాశ్వతంగా నిలచిపోవాలనే ఆకాంక్షతోనే ఈ వయస్సులోనూ రాత్రిపగలు శ్రమిస్తున్నానన్నారు. నాటి సమైక్యాంధ్ర ఉద్యమ వేదికలే నవ నిర్మాణ దీక్ష వేదికలుగా ప్రజల్లో స్ఫూర్తిని కొనసాగించేందుకే నేడు మీ ముందుకు వచ్చానని అన్నారు.
దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం, తరచూ తుఫాన్‌లు సంభవించే ప్రాంతాలు, అన్నింటికి మించి వ్యవసాయాధార ప్రాంతాలు ఆంధ్రలో ఉన్నా.. కనీసం రాజధాని కూడా లేకుండా విభజిస్తున్నారు.. దాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు అవసరమని నిక్కచ్చిగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ మాత్రం ఢిల్లీకంటే అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతామంటూ ఎన్నో కథలు చెప్పారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పినదీ పట్టించుకోలేదు. ఉవ్వెత్తున లేచిన ఉద్యమాలను కూడా పట్టించుకోకుండా ఎవరినీ సంప్రదించకుండా జరిపిన రాష్ట్ర విభజన తీరుకు అందరం నష్టపోయామన్నారు. విభజన బిల్లును యుద్ధ విమానంలో తేవడం ద్వారా ప్రజల్లో ఒక భయాన్ని తీసుకురావడాన్ని కూడా తాను పూర్తిగా వ్యతిరేకించానని అన్నారు. ఏ ప్రాంతంలోని ఆదాయం ఆ ప్రాంతానికే చెందేలా చట్టం చేయడం వల్ల ఆంధ్రకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. అసలు ఈ కాంగ్రెస్ పెద్దలకు ఆంధ్ర ప్రాంత ప్రజలంటే ఎందుకింత కక్ష. నాడు ఎన్టీఆర్ సింహస్వప్నంగా మారి వారిపై చేసిన పోరాటాలే దీనికి కారణమా అన్నారు.
రాజధాని లేదు. నగరాలు, పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు లేవు. అన్నింటికి మించి వౌలిక సదుపాయాలేవీ లేవు. హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ అక్కడే ఉంటే శాశ్వతంగా ఈ రాష్ట్రం అథమస్థితికి చేరుకుంటుందనే భయంతోనే ఆత్మవిశ్వాసంతో ఇక్కడకు వచ్చి బస్సు నుంచే పరిపాలన ప్రారంభించానన్నారు. అయినా కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. శివరామకృష్ణ కమిటీని ఊరూ వాడా పంపించి మీకు రాజధాని కావాలా? అంటూ దుర్మార్గంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈ సున్నిత సమస్య జటిలం కారాదనే భావనతో అందరికీ అందుబాటులో విజయవాడ- గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. లేనిపక్షంలో ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారేదన్నారు. ఈ పరిస్థితుల్లో నరేంద్రమోదీ ఆశాదీపంలా కన్పించి ఎన్నికలకు ముందుగానే ఎన్‌డిఎలో చేరామన్నారు. అయితే ఏనాడూ పదవులు ఆశించలేదు. వాజ్‌పాయ్ హయాంలో 29మంది ఎంపిలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పదవి ఆశించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం తెలంగాణాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయనిదే తాను సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనని పట్టుబట్టటం వల్లనే నరేంద్ర మోదీ తన తొలి మంత్రివర్గ సమావేశంలో విలీనంపై కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు.
పోలవరం, అమరావతి తనకు రెండు కళ్లు లాంటివి. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా ప్రతి ఒక్కరికీ నీటి భద్రత కల్పించేలా తీర్చిదిద్దాలనేది తన దృఢ సంకల్పంగా చంద్రబాబు చెప్పారు. జిల్లాకో నగరాన్ని సృష్టిస్తానన్నారు. ఎన్ని కష్టాలున్నప్పటికీ గత మూడేళ్లుగా అమలు చేస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో అభివృద్ధి సూచికలో ఐదో స్థానంలో ఉన్నామని అన్నారు. తలసరి ఆదాయం ఒక లక్షా 62వేలకు చేరుకున్నాం.. 2022 నాటికి రూ.3 లక్షలకు, 2029 నాటికి రూ.10 లక్షలకు, 2050 నాటికి ఒక కోటీ 75 లక్షలకు చేరాలనే దిశా నిర్దేశంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. 2022 నాటికి దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే పవిత్ర లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ ప్రత్యేక హోదా సాధ్యం కాని స్థితిలో ఆమేర అన్ని రకాలుగా లబ్ధి చేకూరేలా ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం అందిస్తున్నదన్నారు. 11 కేంద్ర విద్యా సంస్థల్లో ఇప్పటికి 9 మంజూరయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా ఏపి ఎన్‌జివో సంఘ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు సచివాలయ ఉద్యోగుల సంఘ కార్యదర్శి మురళీకృష్ణ, కృష్ణాజిల్లా జెఎసి చైర్మన్ ఎ.విద్యాసాగర్, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చంద్రబాబును ఘనంగా సత్కరించారు. వేదికపై శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ఎంపిలు కేశినేని నాని, కొనకొళ్ల నారాయణ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, డిజిపి నండూరి సాంబశివరావు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం: నవనిర్మాణ దీక్షలో సభికులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సిఎం చంద్రబాబు