ఆంధ్రప్రదేశ్‌

ప్రజలే నా బాసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 3: ఆరుపదుల వయసులో అలుపెరుగని రాజకీయ బాటసారి. యంత్రాంగాన్నీ పరిగెత్తించే పని రాక్షసుడు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ నిధులు తెచ్చుకునే లౌక్యుడు. దారి తప్పుతున్న తమ్ముళ్లను అదుపు చేస్తూనే, ప్రత్యర్థులను ఊహించని దాడితో ఉక్కిరిబిక్కిరి చేసే యోధుడు. విభజన కారణంగా అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రపంచపటంలో నిలబెట్టాలని నిరంతరం పరితపిస్తున్న ప్రజాధినేత. టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయాలని తపించే దక్షుడు. సర్వం తానై పార్టీని, ప్రభుత్వాన్ని సవ్యసాచిలా నడిపిస్తోన్న ఆయనే చంద్రబాబు నాయుడు. ప్రజలే నా బాసులని గట్టిగా ప్రకటిస్తున్న చంద్రబాబు, జగన్ నాటకాలను జనం నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు. యూత్ పాలిటిక్స్‌లోకి రావాలని పులుపునిస్తూనే, తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినట్టు ప్రకటించుకున్నారు. మూడేళ్ల పాలన పూరె్తైన సందర్భంలో రాష్ట్భ్రావృద్ధి, పథకాలు, బిజెపితో సంబంధాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు తదితర అంశాలపై శనివారం ‘ఆంధ్రభూమి’తో ఏపీ సిఎం చంద్రబాబు పంచుకున్న అభిప్రాయాలు ఇవీ.
మీ పాదయాత్ర సమయంలో ‘అధికారులకు పెత్తనమిచ్చి తప్పుచేశా. ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకే ప్రాధాన్యం’ అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడూ అధికారులే పెత్తనం చేస్తున్నారన్న భావన కార్యకర్తల్లో ఉంది. ఏమంటారు?
- పెత్తనమనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఎవరి పని వారు చేయాలి. సీఎంగా నేను సంతకమే చేస్తా. మిగిలిన వ్యవహారాలు సీఎస్ చూస్తారు. మేం కొన్ని వేలమందికి పదవులిచ్చాం. ఎంపిటిసి, జడ్పీటీసి, సర్పంచులు అంతా వాళ్లే ఉన్నారు. ప్రభుత్వం చేసే పనులను జనం వద్దకు తీసుకువెళ్లే క్రమంలో అధికారులతో సమన్వయం చేసుకోవాలి. అది కాదని అన్ని పనులూ మేమే చేస్తామంటే వాళ్లతో పాటు నేనూ మునిగిపోతా.
కాంగ్రెస్ కంటే మీ పాలనలోనే అవినీతి ఎక్కువగా ఉందన్న విమర్శలున్నాయి?
- ఎవరు చెప్పారు? మీకు మీరనుకుంటే సరిపోతుందా? నేను ఎన్నోసార్లు అడిగా. రుజువులుంటే ఇవ్వమని. మిమ్మల్నీ అడిగా. ఒక్కరూ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టాం. ఏ పథకంలో కూడా అవినీతి జరగకూడదన్నదే నా తపన. అందుకే నేరుగా లబ్థిదారులకే కాల్‌సెంటర్లనుంచి ఫోన్లు చేసి అవినీతి గురించి ఆరా తీస్తున్నారు. ఇక అవినీతికి ఆస్కారమెక్కడ? కొన్ని పార్టీలు, పత్రికలు పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారమిది.
మరి ఇసుక, ఇప్పుడు మట్టిలో అవినీతి జరుగుతోంది కదా? ఇసుకను ఉచితంగా అందించి ఆదాయం కోల్పోయినా అవినీతి ఎందుకు జరుగుతోంది?
- మీరు ఇక్కడ ఉండి మీ ఊళ్లో ఇల్లు కట్టుకుని, ఇసుకకోసం వేరే వారిని ఆశ్రయిస్తున్నారు. మీరెళ్లి ఎంత ఇసుక కావాలంటే అంత తెచ్చుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపుతారో నాకు చెప్పండి. వాళ్ల సంగతి చూస్తా. సిస్టమ్‌ను దెబ్బతీయడానికి ప్రతిచోటా కొందరుంటారు. ఉదాహరణకు చౌకడిపోలనే తీసుకోండి. అందరూ కాకపోయినా కొంతమంది బయోమెట్రిక్‌ను అడ్డుపడుతున్నారు. మంచి ఉద్దేశంతో పెట్టిన వ్యవస్థపై విమర్శలు సరైనవి కాదు. మీరూ ఇలాంటి వాటిపై ఆలోచించాలి. గుడ్డకాల్చి నెత్తినేయడం మంచిదికాదు.

నన్నడ్డుకునే దెవరు?
పార్టీ క్రమశిక్షణ తప్పిదే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కొన్ని అంశాలపై మారతారనే సమయమిస్తున్నానని, దాన్ని అలుసుగా తీసుకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. గత పాలకుల విధానాల వల్ల ఇళ్లు నష్టపోయాని, తాను ఏర్పాటు చేస్తున్న ఫైబర్ గ్రిడ్‌తో జనం జీవనశైలే మారుతుందని, రాష్ట్రంలో ఎలాంటి సమస్యలూ లేవంటోన్న సిఎం చంద్రబాబుతో ఇంటర్వ్యూలోని మిగతా భావం..
* క్రమశిక్షణ గురించి మీరు చేస్తోన్న హెచ్చరికలు ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. తాజాగా మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ భూములపై మాట్లాడారు. మీరేమంటారు?
-అదేనండి నేను చెప్పేది! కొంతమందికి కొన్ని సొంత సమస్యలున్నాయి. వాటిని పార్టీ మీద రుద్దుతామంటే ఎలా? పిచ్చివేషాలేస్తే ఊరుకుంటానా? నేను యాక్షనంటూ తీసుకోవడం మొదలుపెడితే అడ్డుకునేదెవరు? కాకపోతే నేను ప్రజాస్వామ్యవాదిని. అందరిలో మార్పు ఆశించి సమయం ఇస్తున్నా. దాన్ని బలహీనత అనుకోవడం పొరపాటు. ఒక ఇంట్లో సమస్యలుంటే అంతా కలసి ఇంట్లోనే చర్చించుకోవాలి. కాదని రోడ్డునపడితే వాళ్ల నష్టపోతారు. ఏమైనా సమస్యలుంటే నాకు చెప్పాలి. నాకు ఆ వివరాలివ్వాలే గానీ ఎవరంతట వారు మాట్లాడితే నేనెందుకు సహిస్తా. నేను నిరంతరం ప్రభుత్వం, ప్రజలు, పార్టీ కోసం పనిచేస్తున్నా. నేనెవరికీ భయపడను. నాకు ప్రజలే బాసులు. అందుకే పీపుల్స్‌ఫస్ట్ అంటున్నాం. ఇకపై నేను ఎలా ఉంటానో మీరే చూస్తారు కదా?
* గృహనిర్మాణాల పురోగతి ఎలా ఉంది? కేంద్రానికి రాసిన లేఖ ఎంత వరకూ వచ్చింది?
- గత ప్రభుత్వాలు చేసిన మతిలేని ఆలోచన వల్ల ఇప్పుడు మన రాష్ట్రం ఇళ్ల కేటాయింపులో నష్టపోయింది. మన దగ్గర అందరికీ ఇళ్లున్నాయని గతంలో నివేదిక పంపారు. ఫలితంగా మనం నష్టపోయి యుపి, బీహార్ లాభపడుతున్నాయి. వాళ్ల సర్వే అశాస్ర్తియం. గూగుల్‌మ్యాప్‌తో అనుసంధానించి వాస్తవ నివేదిక పంపాం. దానిపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిజానికి మనకిప్పుడు నాలుగైదు లక్షల ఇళ్ల కంటే ఎక్కువ లేవు. ఇళ్ల నిర్మాణాలు ఆగకుండా పటిష్టమైన విధానం రూపొందించాం.
* మీరు తరచూ చెప్పే ఫైబర్ గ్రిడ్ పురోగతి ఎలా ఉంది?
- వచ్చే నెలలో లక్ష వచ్చేస్తాయి. సెట్‌టాప్ బాక్సుల ధరపైనే చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎంత తక్కువకు వస్తాయో అధ్యయనం చేస్తున్నాం. ఫైబర్‌గ్రిడ్‌తో రాష్ట్రంలో జీవనశైలి మారుతుంది. ప్రజలకు ఖర్చూ మిగులుతుంది. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే నా విధానం. నేను మొదట్లో టెక్నాలజీ గురించి మాట్లాడితే చాలామంది హేళన చేశారు. ఆ తర్వాతే ఎన్డీఏ హయాంలో నాటి ప్రధాని వాజపేయితో మాట్లాడి సెల్‌ఫోన్లు తెప్పించా. ఇప్పుడందరి చేతుల్లో రెండేసి ఫోన్లున్నాయి కదా?
* లక్షల సంఖ్యలో పింఛన్లు, 25 వేలకోట్ల రుణమాఫీ, వైఎస్ హయాం కంటే మూడింతల సీఎం రిలీఫ్‌ఫండ్ సాయం, కాపు-బ్రాహ్మణ కార్పొరేషన్లు, కుల వృత్తుల ఫెడరేషన్లకు నిధులు, విదేశీ విద్య ఇవన్నీ మీకు గుడ్‌విల్‌గా మారతాయా?
-కచ్చితంగా. మీరే చూస్తున్నారు కదా లబ్ధిదారుల నుంచి ఎంత స్పందన వస్తుందో? ఇప్పుడు పింఛన్లు జీతం మాదిరిగా వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఎంతమంది లబ్ధిపొందారో మీరే తెలుసుకోండి. అందుకే గర్వంగా చెబుతున్నా. మళ్లీ మేమే వస్తాం.
* మరి రాష్ట్రంలో సమస్యల మాటేమిటి?
- ఏం సమస్యలున్నాయండి? అన్ని వర్గాలకూ మేలు చేసే స్కీములు అమలు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా అన్ని వర్గాలకూ అడిగినవన్నీ ఇస్తున్నాం. మీకే సమస్యలు కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి రాయాలి. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మట్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య తీరిస్తే ఇక మీకు మా మీద రాయడానికి వార్తలు కూడా ఉండవు( నవ్వుతూ)
* రాష్ట్రానికి అమిత్‌షా లక్షా 75 వేల కోట్లు ఇచ్చామంటున్నారు కదా? అది నిజమేనా? మీ పార్టీ నేతలు బిజెపిపై చేస్తున్న వ్యాఖ్యల మాటేమిటి?
- మేం మిత్రపక్షంగా ఉన్నాం. అన్నీ బయట మాట్లాడలేం. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాం. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకూ మన రాష్ట్రానికి సాయం చేయమని ఒత్తిడి చేస్తున్నాం. నేను ఎప్పుడో చెప్పా. మళ్లీ చెబుతున్నా. నాకు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచడమే ముఖ్యం. ఇక మా పార్టీ నేతలను పొత్తులపై మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చా. కొంతమంది అవగాహన లేక, మరికొందరు పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు. మేం మిత్రధర్మం పాటిస్తున్నాం. మా పార్టీ గెలిచిన తర్వాత నేను ప్రధాని దగ్గరకు వెళ్లి, పోలవరం పూర్తి కావాలంటే 7 ముంపు మండలాలను విలీనం చేయాల్సిందేనని చెప్పా. లేకపోతే నేను ప్రమాణస్వీకారం చేయనని, మళ్లీ ఎన్నికలొచ్చినా బాధ లేదని చెప్పా. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. ఆర్డినెన్స్ తర్వాత దానికి చట్టబద్ధత కల్పించారు. ఇవన్నీ నాకోసం కాదు కదా? రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా చేసింది? రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు, సాధించిన విజయాలను కూడా గుర్తించని వారిని ఏమనాలో మీరే చెప్పండి?
* ఓసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఎంతవరకూ వచ్చాయి?
- ఓసీ కాదు, ఈబీసీ కార్పొరేషన్. ఎంబీసీ కార్పొరేషన్ అవుతుంది. వైశ్యులకూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్లకూ ఈబీసీలో న్యాయం చేస్తాం.
* మీరు విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అవినీతిపై విచారణ చేస్తామన్నారు. ఎక్కడివరకూ వచ్చింది?
- కాంగ్రెస్ అని కాదు. వైఎస్ హయాంలో జగన్ సాగించిన అడ్డగోలు దోపిడీ, ఆ సమయంలో జరిగిన అవినీతి అక్రమాలు. ప్రస్తుతం వాటిపై సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. చూద్దాం! నేనేమంటానంటే జగన్ సాగించిన అవినీతి అక్రమాలతో పోగేసిన డబ్బును, రాష్ట్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయమంటున్నాం. ఇక్కడ ప్రజలను దోచిన డబ్బును మళ్లీ ప్రజలకే ఇవ్వాలంటున్నాం.
* మీ ప్రమేయం, ప్రోత్సాహం లేకపోయినా రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాల్లో గత రెండేళ్ల నుంచి, ఒక సామాజకవర్గం దూకుడుగా వెళుతోందన్న భావనతో మిగిలిన కులాలు దూరమయ్యే ప్రమాదం వచ్చింది? ఏమంటారు?
- మీ వాదన తప్పు. నేను అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నా. ఏ పదవులిచ్చినా అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో కులాల సమస్య పోవాలి. కొందరు కులాలు, మతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందుతున్నారు. సమాజంలో అన్ని కులాలు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలన్నదే నా తపన.
* మంజునాధ కమిషన్ నివేదిక ఎప్పుడు వస్తుంది?
- వర్కవుట్ చేస్తున్నారు. దానిపై అధ్యయనం జరుగుతోంది. .
* 200 కోట్చిచ్చిన బ్రాహ్మణ కార్పొరేషన్‌లో పథకాలకు సంబంధించి వెయ్యి కోట్ల ప్రచారం జరుగుతోంది. వెయ్యి కోట్లున్న కాపు కార్పొరేషన్‌లో పావు సగం కూడా ప్రచారం జరగడం లేదు. పైగా కాపు కార్పొరేషన్ పనితీరుపై అనేక అవినీతి ఆరోపణలొస్తున్నాయి. దానికి ఐఏఎస్‌ను నియమించే ఆలోచన ఉందా?
- అన్నీ క్రమబద్ధీకరిస్తున్నాం. దానిపై సీరియస్‌గా దృష్టి సారించి మెరుగైన పథకాలతో ఆయా వర్గాలకు మరింత లబ్థి చేకూరుస్తాం.

జగన్ నటించడం మానాలి!
‘జగన్ ఇక నటించడం మానాలి. ఆయనేమిటో, ఆయన మనస్తత్వమేమిటో జనం అందరికీ తెలిసిపోయింది. ఒకసారి జనాలను మోసం చేయవచ్చు. ఎల్లకాలం మోసం చేయలేరు. విశ్వసనీయత, స్థిరత్వం, చిత్తశుద్ధి లేని జగన్ ప్రజల ముందు మారినట్లు నటిస్తున్నారు. కానీ వారికి తెలుసు జగనేమిటో? జగన్‌ను ఇక్కడ ఉండకుండా బెంగళూరు పంపిస్తే ఆయన తండ్రిని అడ్డుపెట్టుకుని ఏం చేశారో అందరికీ తెలుసు. తండ్రి చనిపోతే ఎవరైనా ఎలా వ్యవహరిస్తారండీ? ఈయన అప్పుడు బెంగళూరు నుంచి ఏం చేశారండీ? సీఎం పదవి కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించిన విషయాన్ని ప్రజలు మర్చిపోతారా? నాకు జగన్ ఎప్పుడూ పోటీ కాదు. నేను ఎంతమందిని చూడలేదు?ప్రజలు ఎన్ని పార్టీలను చూడలేదు? ఎన్ని పార్టీలు మూతపడలేదు? గౌతులచ్చన్న లాంటి మహనీయులే నడపలేకపోయారు. నేను ఎప్పుడూ పక్క రాష్ట్రాలతో అభివృద్ధి విషయంలోనే పోటీ పడతా. విశ్వసనీయత లేని వారిని ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమ. నేను వయసును కూడా లెక్కపెట్టకుండా విదేశాలు తిరిగి పెట్టుబడుల కోసం శ్రమిస్తుంటే, అక్కడ వారికి రాష్ట్రంపై దురభిప్రాయం కలిగిస్తారు. పోలవరం ప్రాజెక్టును జీవన్మరణంగా తీసుకుని పనిచేస్తుంటే పక్క రాష్ట్రాలను రెచ్చగొడతారు. రైతులు పెద్దమనసుతో భూములిస్తే వారినీ రెచ్చగొడతారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ప్రజలు కోరుకోరు కదా?

పాలిటిక్స్ అంత ఈజీ కాదు!
‘రాజకీయాలు అంత సులభం కాదు. యువకులు పార్టీలోకి రావాలంటున్నారు. నిజమే ఇప్పుడు రామ్మోహన్‌నాయుడు, అఖిలప్రియ, లోకేష్ ఇంకా ఉన్నారు. నేను ఒకటే చెబుతున్నా. నేను కాలేజీ రోజుల నుంచే పాలిటిక్సులోకి వచ్చా. తర్వాత నా కుటుంబ జీవనం కోసం హెరిటేజ్ పెట్టా. మంత్రి అయ్యాక నా భార్యకు అప్పచెప్పా. ఆమె కష్టపడి దానిని అభివృద్ధి చేశారు. రాజకీయాల్లోకి వచ్చే యువకులు ముందు జీవితంలో నిలదొక్కుకోవాలి. ఆ తర్వాతే పాలిటిక్సులోకి రావాలి. రాజకీయాన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని, జీవనోపాథిని పట్టించుకోకపోతే దెబ్బతింటారు. సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాకూడదు. యూత్ రాజకీయాల్లోకి రావాలి. వచ్చే ఎన్నికల్లో చాలామంది యూత్ వస్తారు చూడండి’

లోకేషే కాదు... ఇంకా చాలామంది పోటీ పడాలి!
‘లోకేష్ నాకు పోటీ అంటారా? (నవ్వుతూ). ఒక్క లోకేషే కాదు. పనిలో, ప్రజలకు కావలసిన అవసరాలు కనిపెట్టి, వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించడంలో మా పార్టీలో నాతో ఇంకా చాలామంది పోటీ పడాలి (మళ్లీ నవ్వుతూ). మీరంటున్నారు, లోకేష్ మంచి టీము సెలక్టు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం పెట్టిన కాల్‌సెంటర్లు ఫలితాలిస్తున్నాయని! మంచిదే కదా?

దేవాన్షును మిస్సవుతున్నా!
‘ నా మనుమడు దేవాన్షును మిస్సవుతున్నా. ఏ తాతకైనా మనమడితో ఆడుకుని, ఎక్కువ సమయం గడపాలనుంటుంది కదా? ఏదీ నాకు ఆ సమయమే ఉండటం లేదు. లోకేష్ కూడా పరిపాలనలో బిజీ అయ్యారు. ప్రజల కోసం, కొత్త రాష్ట్రం కోసం త్యాగం చేయక తప్పదు’

సాంబశివరావుకు ఫుల్‌టైం డిజిపి ఇస్తాం
‘ఇన్చార్జిగా ఉన్న డిజిపి సాంబశివరావుకు త్వరలోనే ఫుల్‌టైం డిజిపిగా ఇస్తాం. అందులో అనుమానం లేదు.
ఈ వారంలో ఐఏఎస్, ఐపిఎస్ బదిలీలు
‘ఐఏఎస్, ఐపిఎస్‌లు చాలాకాలం నుంచీ ఒకేచోట ఉంటున్నారంటున్నారు కదా! ఈ వారంలో వాళ్లకీ బదిలీలుంటాయి’

ఇష్టంతో పనిచేస్తే...కష్టం ఉండదు!
‘నేను ఉదయం ఐదుగంటలకు లేస్తా. ఎక్సర్‌సైజులు చేసిన తర్వాత స్వల్పంగానే అల్పాహారం. మళ్లీ తొమ్మిదినుంచి సమీక్షలు. ఒక్కోసారి రాత్రి 11 గంటలు, కొన్నిసార్లు ఒంటిగంటయిన రోజులూ ఉన్నాయి. మితాహారం. ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకుంటా. ముఖ్యంగా అత్యాశ, మితిమీరిన కోరికలు, మంచి ఆలోచనలు, దుర్బుద్ధి లేకుండా ఉండటం, పాజిటివ్ థింకింగ్ చేస్తే ఎలాంటి సమస్యలూ రావు. ఇష్టంతో ఏ పని చేసినా కష్టం ఉండదు.

మార్తి సుబ్రహ్మణ్యం