డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారు సందు తిరగంగానే అమ్మలో అంతవరకు ఆపివున్న భావాలు అదుపు తప్పాయి. కళ్ళంబడి నీళ్ళు బొటబొటా రాలిపడ్డాయి. నాన్నతో కోపంగా ఏదో అనబోయింది. నాన్న కళ్ళతోనే వారించారు.
‘‘ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం’’ అన్నారు గంభీరంగా.
అమ్మ ఆగిపోయింది.
పరిగెడుతున్న చెట్ల వంక చూస్తూ కూచున్నాను. వెలుతురు పారిపోతోంది. చీకటి తరుముకొస్తోంది. సూర్యుడు అలసిపోయాడు. చంద్రుడు వెలవెలబోతున్నాడు మబ్బుల వెనుక. భూమండలం ఆవిర్భవించినప్పటినండి జరుగుతున్న ప్రక్రియ- సూర్య చంద్రోదయాలను చూడటానికి విసుగు కలగదు ఎన్నటికీ- ఆ క్షణంలో ఆకాశం కూడా మా అందరి మనస్సులాగానే ఉంది.
పగలు రాత్రుల సంధి.
తప్పుఒప్పుల సంఘర్షణ.
పాప పుణ్యాల బేరీజు.
అవసరాలు, నమ్మకాల మధ్య అలజడి.
గెలుపు ఓటమి లేని సమస్య.
అలసిపోయాను. కళ్ళు ఎప్పుడు మూతలు పడ్డాయో తెలియదు. మళ్లీ కళ్ళు తెరిచేసరికి సూర్యాపేట వచ్చింది. నాన్న కారు దిగి వేడి వేడి కాపీ తెచ్చారు.
విజయవాడ చేరేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంటికి వెళ్లి స్నానం చేసి వదిన సిద్ధంగా ఉంచిన అన్నం తినేసి గదిలోకి వెళ్లిపోయాను.
నేను వెడితే వాళ్ళు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయని నాకు తెలుసు. ఎప్పుడూ పెందలాడే నిద్రపోయే మామ్మ మెలకువగానే ఉంది. అన్నయ్య వదిన అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అని ఎదురుచూస్తున్నారు.
ఇక ఆ రోజు ఏమీ వినాలనిపించలేదు. ఆ రోజంతా విన్నది చాలు. అమెరికా వెళ్ళాక మొదటిసారిగా రఘుతో మాట్లాడాను. అందులో సంతోషం మిగలలేదు, నిరాశ తప్ప. రెండు నెలల తర్వాత, కొత్తగా పెళ్లిచేసుకున్న ఇద్దరు మాట్లాడుకోవలసిన స్వీట్ ఫీలింగ్స్ లేవు. భవిష్యత్తు గురించి తప్ప.
ఆ రోజు డాక్టర్‌గారితో నా సంభాషణ మనసులో మెదులుతూనే ఉంది. బాధ్యత, కర్తవ్యం మధ్య ఎంత తేలిగ్గా ఆవిడ పనులను ఆవిడ సమర్థించుకోగలిగింది.
కాని నాకున్నది ఇప్పుడు బాధ్యతా లేక కర్తవ్యమా? సడెన్‌గా నేను చాలా ఎదిగిపోయాననుకున్నాను. ఒక్క రోజులో నా వయసు 10 సంవత్సరాల పెద్దదయిందనిపించింది. నా మనసులో బాధ్యత, కర్తవ్యం మధ్య సంఘర్షణ మెదులుతూనే ఉంది నా మనసు.
నా భర్త మాట వినడం నా కర్తవ్యమే! కాని నా కడుపులో పెరిగే బిడ్డ సంరక్షణ నా బాధ్యత కూడా!
కర్తవ్యపాలనలో పాపపుణ్యాలు లేకుండా ఎలా ఉంటాయి? ఇదేం కసాయివాడి ఉద్యోగం కాదుగా! బాధ్యతల్లో బరువు లేకుండా ఎలా ఉంటుంది? ఇదేం తాత్కాలికమయిన బాధ్యత కాదుగా! ఇవాళ్టి పరిస్థితికి ఇద్దరం సమానంగా బాధ్యులమే! కాని బాధ్యత నా పట్లే ఎక్కువగా కనిపిస్తోంది.
అలా ఆలోచనలు వచ్చిపోతూనే ఉన్నాయి. మర్నాడు మామ్మ రియాక్షన్ చూస్తే తెలుస్తూనే ఉంది. హైదరాబాద్‌లో జరిగిన విషయాలు ఆవిడను ఎంతగా బాధించాయో!
ఆవిడకి అది పూర్తిగా అనూహ్యమయిన ఘటన. అది ఆవిడకు ఊహకందని పరిస్థితి.
లక్షణంగా పెళ్లిచేస్తే తొలిసారిగా పుట్టబోయే బిడ్డను గురించి అసలు మీమాంసపడాల్సింది ఏముందో ఆవిడకు అర్థం కాలేదు. పిదప మనుషులు పిదప కాలాలు, బుద్ధులు అని బుగ్గలు నొక్కుకుంది.
ఆ తరువాత వారం రోజులూ ఇల్లంతా నిశ్శబ్దం. అందరి మనసుల్లోను కావలసినంత అలజడి. కానీ ఎవరూ ఎవరితోనూ అవసరం మించి మాట్లాడటంలేదు.
అందరి మనసుల్లోనూ ఒకే ఆలోచన. ఈ సమస్యను ఎలా పరిష్కరించడం- ఇందులో సంధి లేదు. రాజీ లేదు. గెలుపు లేదు. ఎవరిదో ఒకరి మాట మాత్రమే నెగ్గాలి.
వారం తిరగకుండానే రఘు దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. తెరవాలనిపించలేదు. అందులో ఏముంటుందో తనకు తెలుసు. దానిని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు.
మళ్లీ వదినే అన్నది. ‘‘తెరవకుండా ఎంతసేపు చూస్తూ కూర్చుంటావు’’ అంది. తెరవనంత మాత్రాన ఆ ఉత్తరంలో ఉన్నది మారిపోదుగా? సమస్యలను ఎదుర్కోవాల్సిందేగానీ తప్పించుకుందామంటే తొలగిపోయేవి కాదు అంది. మెల్లిగా ఉత్తరం తెరిచాను.
కల్యాణి!
రెండు నెలల తరువాత నీతో మాట్లాడటం ఎంతో బాగుంది. కాని, ఇదే మరో కారణంగా అయితే ఇంకా సంతోషంగా వుండేది.
అమ్మ మొదట చెప్పగానే షాక్ అయ్యాను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. కొంచెం సిగ్గనిపించింది కూడా! ఇంత చదువుకున్నవాడిని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నానని. నన్ను నేనే తిట్టుకున్నాను. నిన్నీ పరిస్థితిలోకి నెట్టినందుకు బాధగా అనిపించింది కూడా!
అయామ్ సారీ! నువ్వు ఈ పరిస్థితిని అంతా ఒంటరిగానే ఎదుర్కోవలసి వస్తోంది. నాది పొరపాటే! పర్యవసానం ఆలోచించకపోవడం తప్పే. మన ఇద్దరిలోనూ కాస్త ప్రపంచ జ్ఞానం ఉన్నవాడిని నేనే కదా మరి!
అయినా భయపడకు. నీకు డాక్టర్ వసుంధర అన్నీ చెప్పారు కదా! ఆవిడ చాలా అనుభవము ఉన్న డాక్టర్.
కాని బాగా సీరియస్‌గా ఆలోచించు. నా రిసెర్చి దెబ్బతింటుంది. పైకి బాగా చదవాలన్న నీ కలలన్నీ చెదిరిపోతాయి.
మన భవిష్యత్తు గురించి ఆలోచించు. మనం ఈ బాధ్యతకు రెడిగా లేము. ముఖ్యంగా నా వైపునుంచి చూస్తే, నాకు అమెరికాలో వచ్చే స్కాలర్‌షిప్‌తో నిన్ను, నన్ను పోషించుకోవడమే కష్టం. ఇప్పుడు మరో చైల్డ్ కూడా అంటే!
మనం ఎంత త్వరలో కలుసుకోగలమో నాకు తెలియదు. రిసెర్చ్ కూడా ఒక లాటరి లాంటిదే! అయితే పూర్తిగా విజ్ఞానంమీద అదృష్టంమీద ఆధారపడుతుంది. ఎంతోమంది ఎన్నో దేశాలలో రిసెర్చి చేస్తూ ఉంటారు ఒకే సబ్జెక్టుమీద. ఎవరు సరైన ఫలితాలు ఎంత ముందరగా సాధించగలరో భగవంతుడికే తెలుసు. సమయం చాలా ముఖ్యం వాటిల్లో.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి