డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇంక ఇండియన్ ఫుడ్ తినడం మా వల్ల కాదు’’ అంటూ తేజ చెల్లెళ్ళు డిన్నర్‌కి బయటకు వెడదామన్నారు. వౌళి వాళ్ళందరితో కలిసి పిజ్జా తినటానికి బయటకు వెళ్లారు.
మేం పెద్దవాళ్ళం మాత్రం ఇంట్లో ఉన్నాం. నేను ఆ రోజు సావిత్రిని బాగా ఆపేశాను కేవలం చాలా సింపుల్ భోజనం చేద్దామని.
తమాషా, అందరం హాయిగా తిన్నాం. బయట లాన్‌లో కూచున్నాం కుర్చీలు వేసుకుని. సావిత్రికి ఇల్లు అంతా గందరగోళంగా ఉంది, సర్దేయాలన్న తొందర ఎక్కువగానే ఉంది.
మూర్తిగారు మాత్రం గట్టిగా పట్టుపట్టారు. ‘‘నువ్వు ఇవాళ ఏమయినా పని చేశావంటే నేను ఊరుకోను’’ అని గట్టిగా కోప్పడ్డారు.
నా ముందు అంతకంటే ముందుకు వెళ్లనీయడం ఇష్టం లేక కాబోలు సావిత్రి మాట్లాడకుండా కూచుంది. లేకపోతే ఆయనతో పోట్లాడి తను చేయదల్చుకున్నది చేసేదే!
వాళ్ళిద్దరినీ చూస్తే నాకు మా అన్నయ్య వదిన గుర్తుకువచ్చారు. అదే మాట అన్నాను ఆవిడతో. మాకూ మీరు అలాగే అనిపిస్తున్నారు అన్నారు మూర్తిగారు.
కాసేపు హాయిగా కూచున్నాం. మరికాసేపు సందు చివర దాకా నడచి వచ్చాం.
మా వాకింగ్ పూర్తి అయ్యేసరికి పిల్లలు నలుగురు తిరిగి వచ్చారు. వాళ్ళు కూడా కుర్చీలు తెచ్చుకుని మాతో కూర్చున్నారు. రాత్రి తొమ్మిదయినా చీకటిపడటంలేదు, హాయిగా అనిపించింది.
అంతదాకా వినిపిస్తున్న చిన్న పిల్లలు పరుగులు వినిపించడం మానేశాయి. వాళ్లకి బెడ్ టైం అయింది కాబోలు. వౌళి, తేజ హోటల్‌కి వెళ్లడానికి లేచారు. నేను కూడా వాళ్ళతో నడుస్తూ కార్ దాకా వెళ్లాను.
‘‘మీరిద్దరూ మీ హనీమూన్ వెళ్లడం మానేశారని విన్నాను లోపల’’ అన్నాను.
‘‘మానేయలేదు, పోస్ట్‌పోన్ చేశాం’’ అన్నాడు వౌళి.
‘‘ఎందుకు? నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుందనా?’’’ అన్నాను. ఆ ఆలోచనే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
‘‘కాదు! అదేమీ కాదు’’ అన్నాడు వౌళి.
కాని నాకు నమ్మబుద్ధి అవ్వలేదు.
‘‘అదేం పని వౌళి. నేను ఎలాగూ శేఖర్, భాస్కర్ వాళ్ళను విజిట్ చెయ్యాలనుకున్నాను కదా! ఆ టైంలో వెళ్ళేదాన్ని’’ అన్నాను.
తల అడ్డంగా ఊగించాడు. ‘‘నేనే తీసుకువెతాను వాళ్ళిద్దరి ఇంటికి. నువ్వు ఈ దేశంలో ఉన్నన్నాళ్ళు నేను నీతో గడపాలి’’ అన్నాడు నిశ్చయంగా.
‘‘అదికాదు..’’ అని ఏదో చెప్పబోయాను, మధ్యలో వారించాడు.
‘‘అమ్మా!’’
వాడి వంక చూచాను. డెసిషన్ అయిపోయింది. ఇంక వాడు వినడు.
నేనూ ఊరుకున్నాను. కానీ తృప్తిగా అనిపించలేదు. తేజ గ్రహించింది.
‘‘అదొక్కటే కాదు ఆంటీ, పై వారంలో నాకు కూడా రెండు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి’’ అంది. అందుకని మీ మూలంగా పోస్ట్‌పోన్ అయిందని మీరు అనుకోకండి’’ అంది.
వౌళి చాలా సంతోషంగా తేజ వంక చూచాడు.
వాని కళ్ళు అప్రీసియేషన్‌తో నిండిపోయాయ.
ఇద్దరూ కారు ఎక్కారు. వౌళి రివర్స్ చేస్తూ ఆగిపోయాడు.
ఏదో అప్పుడే గుర్తుకొచ్చినట్లు తేజా విండో దించి..
మామ్! మేము రేపు ఇక్కడకు రావడంలేదు. వౌళి ఏదో ప్లాన్స్ వేశాడు అంది కొంచెం గట్టిగా.
సావిత్రి, ఫైన్. హావ్ ఏ గుడ్ ట్రిప్! అంది.
‘‘ఓకె ఆంటీ, సీ యు లేటర్!’’ అంది నన్ను ఉద్దేశించి.
‘‘ఆంటీ కాదు అత్తయ్యా వెళ్లివస్తానని చెప్పు’’ అంది సావిత్రి కూతురి వంక చూస్తూ!
‘‘ఓకె ఓకె’’ తల్లితో అని.
‘‘వస్తాం అత్తయ్యా!’’ నొక్కుతూ నాతో అంది. నేను, వౌళి ఇద్దరం నవ్వాం.
ఇద్దరూ వెళ్లిపోయారు.
నాకు నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను మూర్తిగారి ఇంటికి రావడంతో అనుకున్నాను. లేకుంటే నాకోసం వౌళి తన టైం ఖర్చు చేయాల్సి వచ్చేది.
‘‘ఏ భాషలో పిలిస్తే ఏముందండీ’’ అన్నాను. తేజాకి వత్తాసు పలుకుతూ.
అందుకు సావిత్రి ఒప్పుకోలేదు. దానికి పరిచయమైన మా స్నేహితులంతా ఆంటీస్. మీ ప్రత్యేకత మీకుండాలి కదా’’ అంది. నవ్వి ఊరుకున్నాను.
మర్నాడు పొద్దున వెడ్డింగ్ ఫొటో ఫ్రూప్స్ వచ్చాయి. ఏకంగా వందపైగా వాటన్నింటిలోంచి మనకు నచ్చినవి ఏరుకుంటే ఆల్బం చేసి ఇస్తారుట.
సావిత్రి వాటన్నిటినీ నా ముందు పెట్టి మీకు కావలసినవి మీరు సెలక్ట్ చేయండి. మీతో ఇండియా తీసుకువెళ్లడానికి అని తను ఇంటి పనులు చూసుకోవడం మొదలుపెట్టింది.
ఆ ఫొటోస్ ఒక్కొక్కటే తీసి చూస్తూ ఉండిపోయాను. అందులో వౌళి ఒక్కడూ చేతులు వెనక్కి పెట్టుకుని నుంచుని ఉన్నాడు. ఆ ఫొటో గుర్రం ఎక్కించే ముందు తీసినదిలా ఉంది.
దానివంకే చూస్తూ ఉండిపోయాను. దాదాపు ప్రతి పెళ్లికొడుక్కి ఆ పోజ్‌లో ఫొటో తీస్తారేమో ఈ ఫొటోగ్రాఫర్స్. అది తీసి పక్కన పెడుతూంటే ఇంచుమించు అలాంటి ఫొటో మరొకటి ఉంది, కొంచెం సైడ్‌కి తిరిగి. ఆ ఫొటో చూస్తూనే ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టు చూశాను. చుట్కున రఘురామ్ కనిపించాడు. నేనెప్పుడూ అంత పోలిక గమనించలేదు. వౌళి నవ్వు పూర్తిగా రఘురాందే! కానీ మిగిలిన ఫీచర్స్...
రఘుకు కూడా ఇంచుమించు ఇలాంటి ఫొటో వుంది. దాదాపు 30 ఏళ్ళ క్రితం ఎన్నిసార్లు ఆ పెళ్లి ఆల్బం చూచానో. రోజు గడిచేదికాదు కనీసం ఒక్కసారైనా చూడకుండా.. అటువంటిది ఆ ఆల్బం తెరిచి 20 ఏళ్ళు దాటిపోయింది. అసలు రఘు పెళ్లి ఫొటోస్ చూశాడో లేదో అనుమానమే!
వౌళి జీవితంలో ఆ అసంపూర్ణత నిండిపోయే ఉంది.
భార్యాభర్తల జీవితం జోడెద్దుల కాడిలాంటిది అంటారు. అది నిజమో కాదో కాని, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల అవసరం కాడిలాంటిదే. ఇద్దరిలో ఎవరికి లోటు జరిగినా రెండో వాళ్ళు భర్తీ చేయలేరు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. కాని ఆ లోటు వాళ్ళ జీవితంలో ప్రతిబింబిస్తూనే ఉంటుంది.
వౌళి ఎంతో తెలివైనవాడు. ఎంతో అడ్జెస్ట్ అయ్యాడు. కానీ, అప్పుడప్పుడు తన తండ్రి తమని వదిలేశాడన్న బాధ వాడికి కలుగుతూనే ఉంది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి