మెయన్ ఫీచర్

సంపద పంపిణీతో సాధికారత సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా యువతకు, విద్యార్థులకు ‘జాక్ మా’ పేరు ఒక ఉత్ప్రేరకం. ఆమాటకొస్తే అతను ఇప్పుడు ప్రపంచమంతటినీ ఆకర్షిస్తున్న వ్యక్తి. ఆయన కమ్యూనిజం బోధించడం లేదు, క్యాపిటలిజం గురించి చెప్పడం లేదు. వర్తమాన జీవితాన్ని ఆస్వాదించాలని బలంగా చెబుతున్నాడు. ఆయన ఎంచుకున్న మార్గం ఆన్‌లైన్ వ్యాపారం. ఆయన సంస్థ పేరు ‘అలీబాబా డాట్ కామ్’. ఒకప్పుటి అలీబాబా కథలో ‘ఒపెన్ ససేమ్’ అనగానే గుహ తలుపులు తెరుచుకుని విలువైన వస్తువులు కనిపించేవని అంటారు. ప్రస్తుతం ఈ ‘అలీబాబా టాట్‌కామ్’లోకి మనం ప్రవేశిస్తే లక్షలాది వస్తువులు కనిపిస్తాయి. కంప్యూటర్, ఇంటర్నెట్ ఆనుపానులు తెలుసుకున్న జాక్ మా చైనా ముఖ చిత్రం మార్చేస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. అత్యంత మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు అమెరికాలోని విలువైన వస్తువులను సైతం అతి తక్కువ వ్యవధిలో అందిస్తూ నాణ్యమైన సేవ చేస్తున్నారు.
అమెరికాలో ప్రభావశీలురుగా భావించే బిల్‌గేట్స్, బఫెట్, మార్క్ జుకర్ బర్గ్ లాంటి హేమాహేమీలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ చైనా వ్యాపార దిగ్గజంగా జాక్ మా ఎదిగారు. కేవలం వేళ్లమీద లెక్కపెట్టగలిగేంత సిబ్బందితో ఆయన ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు వేలమంది సిబ్బందితో, ఆధునిక టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతోంది. ఆ యన ప్రధాన సంస్థతోపాటు అనేక అనుంబంధ సంస్థలను స్థాపించి చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఇలు) సంస్థలకు ఊతం ఇస్తున్నాడు. కోటి మందికి పైగా తన సంస్థ ప్లాట్‌ఫాంపై పనిచేస్తున్నారని ఆయన అంటున్నారు.
అమెజాన్, ఈబే లాంటి బహుళజాతి సంస్థల కన్నా తన ‘అలీబాబా డాట్‌కామ్’ భిన్నమైన వ్యాపార సరళిని అనుసరిస్తూ దూసుకుపోతోందని ఆయన అనేక వేదికలపై జాక్ మా ప్రకటించారు. కేవలం తన సంస్థ మాత్రమే వృద్ధి చెందాలన్న భావనతో గాక తన సంస్థతో కలసి పనిచేసే చిన్న సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న ‘ఎకో సిస్టమ్’తో పనిచేస్తున్నానని, ఇదే తన ఫిలాసఫీ అని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాథమిక దృష్టి కోణం ఆయనను ప్రత్యేకంగా నిలిపింది.
ఆంగ్లంలో అక్షరం ముక్కరాని దశనుంచి ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించే దశకు చేరుకుని ప్రపంచ యువత దృష్టిపడేలా అలీబాబా సంస్థను నిలిపారు. ఈ-కామర్స్‌తో ప్రపంచంలోని దాదాపు 200 ప్రధాన నగరాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆయన ఈ-కామర్స్‌ను ఒక కొత్త లెవెల్‌కు తీసుకువెళ్లారు. రాబోయే రోజుల్లో తమ సంస్థ డేటా కంపెనీగా మారనున్నదని ఇప్పటికే ప్రకటించారు. ఆయనది ఎంతటి ముందుచూపో దీనివల్ల అర్థమవుతుంది. ప్రపంచం బిగ్‌డేటా వైపు ఎలా మొగ్గు చూపుతున్నదో జాక్ మా మాటలు చెబుతున్నాయి. ఇప్పటికే అలీబాబా సంస్థ వద్ద ఎంతో సమాచారం పోగై వుంది. దాన్ని మరింత క్రోడీకరిస్తున్నారు. మేలైన రీతిలో వర్గీకరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ డేటాను అనేక విభాగాలుగా విడగొడుతున్నారు.
ఎంతో సూక్ష్మగ్రాహి జాక్ మా. జాక్ అనేది చైనా పేరు కాదు. తన విదేశీ కలం స్నేహితులు పెట్టిన ఇంగ్లీషు పేరు. మా అనేది ఆయన సర్‌నేమ్. ఆయన చైనాలో సాంస్కృతిక విప్లవం (కల్చరల్ రెవల్యూషన్) ప్రారంభం కాక ముందు అంటే 1964లో సెప్టెంబర్ 10న హగ్జీ ప్రావిన్స్‌లో జన్మించారు. పాఠశాల చదువు రోజుల్లోనే ఆంగ్లంపై ఆసక్తి ఏర్పడినప్పటికీ నేర్చుకునే సౌలభ్యం లేకపోవడంతో తాను నివసించే ప్రాంతానికి 40 నిముషాలు సైకిల్‌పై ప్రయాణిస్తూ ఒక హోటల్‌కు వచ్చే విదేశీ పర్యాటకులతో మాటలు కలిపి వారికి స్థానిక పర్యాటక ప్రదేశాలను వివరించే గైడ్‌గా పని చేస్తూ ఆంగ్లభాషను నేర్చుకున్నాడు. నాలుగు సంవత్సరాలపాటు ఈ సాధన చేసాడు. 1988లో ఆంగ్లంలో బిఎ చదివాడు. 1995లో అమెరికా వెళ్లినపుడు ఆయనకు ఇంటర్నెట్ గురించి తెలిసింది. దాని లోతుపాతులు గ్రహించి చైనా సమాజానికి అదెలా అన్వయమవుతుందో ఆలోచన చేసి అడుగు ముందుకేశాడు. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఈ-కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసాడు. చైనాలో కొత్త గాలి వీచేలా చేసాడు. వర్తమాన సమాజం పోకడలను పరిచయం చేసి డిజిటలైజేషన్ వైపు కదిలించాడు. ఒక కొత్తతరం వ్యాపారానికి ప్రతినిధిగా ఎదిగాడు.
యువతకు, కొత్తతరానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారిదే ఈ ప్రపంచమని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రపంచీకరణ ఆహ్వానించదగ్గదని అయితే ఇన్ క్లూజివ్ ప్రపంచీకరణ అవసరమని ఆయన గట్టిగా వాదిస్తారు. ప్రపంచ ఆర్థిక వేదికపై వివిధ అంతర్జాతీయ సదస్సల్లో ఆయన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకేరకమైన వ్యాపార నమూనా కన్నా వివిధ నమూనాలు పరిఢవిల్లినపుడు సమాజం కళకళలాడుతుందంటారు. సంపదను పదిమందికీ పంచాలని, సాధికారత అందరికీ దక్కాలని ఆయన అంటారు. తమ సామాజిక బాధ్యతగా ఆయన ఈ విషయమై ఎంతో క్రియాశీలకంగా వున్నారు.
ఒకప్పటి వ్యాపార నిర్వహణకు, యజమానికి ఇప్పటి వ్యాపార నిర్వహణ-యజమానికి హస్తిమశకాంతరం తేడా కనిపిస్తోంది. ఈప్రాథమిక తేడాతో సంపద సృష్టి విశేషంగా జరగడమే కాక అంతే మోతాదులో వితరణ జరుగుతోంది. అనేక సమాజ ప్రయోజన కార్యక్రమాలకు భారీగా నిధులు అందుతున్నాయి. ఆ పనులకు చేయూతనివ్వడం తమ విధి అని భావించే వారి సంఖ్య పెరుగుతూ వుండడం విశేషం. అందులో జాక్‌మా మందు వరసలో ఉన్నాడు. కాలానుగుణమైన అవగాహన శక్తి, నైపుణ్యం, ముందుచూపు వున్నప్పుడే సంపదను సృష్టించే వీలుంటుంది. ఆంగ్లభాష రాని రోజుల నుంచి సాధన చేసి ఎదగడానికి అనేక అవమానాలు, హేళనలను భరించి అతి తక్కువ సమయంలో ఆసియాలోనే అత్యంత ధనికుడిగా ఆయన నిలిచారు. జాక్ మాను కేవలం ఆయన సంపదతో గుర్తించేవారు తక్కువ. ఆయన నైపుణ్యం, ముందు చూపు, వ్యాపార నిర్వహణ, కొత్త ఆలోచనలు, కొత్తపద్ధతులను ఆచరణలో పెట్టడం, కోట్లాది మందికి ఉపాధి కల్పించడంతో ఆయనను అనేకమంది గౌరవిస్తున్నారు. ఆసియా దేశాల్లోని యువతపై ఆయన ప్రభావం అపారంగా కనిపిస్తుంది. టెక్నాలజీ మానవ జీవితాన్ని ఏవిధంగా సౌకర్యవంతంగా మార్చుతున్నదో ముఖ్యంగా ఇంటర్నెట్ తీసుకొచ్చిన విప్లవం ఎంత విస్తృతమైందో ఆయన చెప్పడమే కాక ఆచరణలో నిరూపిస్తున్నారు.
ఓపెన్‌మైండ్‌తో వుండాలని, పాతికేళ్ల లోపు యువత సృజనాత్మకత, పని తీరుగొప్పదని ఆయన విశ్వాసం. చైనా కేవలం ఎగుమతులనే కాదు, దిగుమతులు కూడా చేసుకోవాలని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి ఆయన. వ్యాపారం విలువలతో జరగాలని ఏవో ప్రయోజనాలను ఆశించి చేయరాదని ఆయన అంటారు. అందులో భాగంగానే ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యారు. రానున్న ఐదు సంవత్సరాలలో అమెరికాలో పదిలక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విషయమై చర్చలు జరిపారు. ఈ చర్చ ఎంతో సానుకూలంగా జరిగిందని జాక్ మా ప్రకటించారు. ఈ ఒక్క విషయంతోనే ఆయన ఎంత ప్రభావశీలో తెలుస్తుంది. ఇంటర్నెట్‌ను శ్వాసగా భావిస్తున్న ఈరోజుల్లో దాన్ని మాధ్యమంగా మలుచుకుని విజయవంతంగా వ్యాపారం చేస్తూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ కొత్తదారులవైపు తనవారిని నడిపిస్తూ, పరిస్థితులకు అనుగుణమైన వ్యాపార మెలకువలు అందిస్తూ ప్రపంచ వ్యాపార దిగ్గజంగా జాక్‌మా అతి స్వల్పకాలంలోనే ఎదిగాడు.
భారతదేశంలో పేటీఎం ఉన్నట్టుగా చైనాలో ‘అలీ పే’ అత్యంత ప్రజాదరణ పొందింది. అలీబాబా క్లౌడ్ కంప్యూటింగ్, 1688డాట్‌కామ్ లాంటి సంస్థల ద్వారా కూడా ఆయన చైనా ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాల ద్వారా తన జ్ఞానాన్ని, అనుభవాలను పంచుతున్నారు. కొత్త తరాలకు స్ఫూర్తినందిస్తున్నారు. ప్రతి పెద్దకంపెనీ స్టార్టప్ కంపెనీయేనన్న విషయం గుర్తపెట్టుకోవాలని స్టార్టప్‌లతో కుస్తీపడుతున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ధీమా కలగజేస్తున్నారు.
రాబోయే రోజుల్లో కృత్రిమమేధకు ఎంతో ప్రాధాన్యత పెరుగుతుందని దాన్ని తన వ్యాపారానికి ఎలా అన్వయిచుకోవాలో తనవారికి వివరిస్తు వున్నారు. అలాగే ప్రస్తుతమున్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో)ను ఎలక్ట్రానిక్ వరల్డ్ ట్రేడ్ ప్లాట్‌ఫాంగా మార్చాల్సిన అవసరాన్ని ప్రపంచ వ్యాపారస్తులకు సూచిస్తున్నారు. మనమే లాభపడాలనే వైఖరి కాక మనతోపాటు ఇతరులు లాభపడాలన్న ఆకాంక్ష శ్రేష్టమైనదని, దాన్ని తాను నమ్మడమే కాక ఆచరిస్తున్నానని మిగతావారు కూడా ఆ పంథాను అనుసరిస్తే మానవాళికి మేలు జరుగుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఒక సాధారణ చైనా పౌరుడు ప్రపంచీకరణను స్వాగతించి ఇంటర్నెట్ పరిజ్ఞానంతో ఉత్తేజితుడై ఆన్‌లైన్ వ్యాపారంతో సరిహద్దులను చెరిపేసి మానవాళికి మేలు జరగాలని కలలు కనడం హర్షణీయం. అందుకోసం నిరంతర తపనతో అడుగులు వేస్తున్న జాక్ మా ఎందరికో మార్గదర్శకుడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

-వుప్పల నరసింహం, సెల్: 99857 81799