డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవన్నీ పార్ట్ ఆఫ్‌ది వెడ్డింగ్. ఇది నీకు స్పెషల్ గిఫ్ట్.
వాళ్ళ సంభాషణ వింటూ తేజ కుటుంబం అంతా అక్కడే చేరింది.
‘‘ఓపెన్ ఇట్ వౌళి! ఓపెన్ ఇట్! అరిచారు శశి, లతా! సావిత్రి వాళ్ళిద్దరి పిలుపు బావగా మార్చాలని చూసింది. కానీ, వాళ్ళిద్దర్నీ వౌళి అని పిలిస్తేనే బాగుందిట.
మరదళ్ల వంక చూస్తూ ఓపెన్ చేశాడు. తేజాకి కొంత తెలుసు కాబోలు. ఏ భావాలు వ్యక్తపరచకుండా చూస్తూ నుంచుంది.
పైన రంగుల కాగితం విప్పి పెట్టె తెరవగానే అందులో రెండు తాళం చెవులు ఉన్నాయి.
వౌళి వాటిపైన వున్న పేరు చదివి మామగారి వంక చూస్తూ - ‘‘యు ఆర్ కిడ్డింగ్’’ అన్నాడు నమ్మలేనట్లు.
తల ఊగించాడు మూర్తిగారు కాదన్నట్లు.
వౌళి తల అడ్డంగా ఊగిస్తూ ‘‘ఇంత ఖరీదైన బహుమతి నేను తీసుకోలేను’’ అని తాళాలు తిరిగి పెట్టెలో పెట్టి మామగారికి ఇవ్వబోయాడు.
‘‘మామగారిచ్చే బహుమతులకు ఖరీదులు కట్టకూడదు’’ అంది సావిత్రి తల్లి.
‘‘ఏమిటర్రా ఆ బహుమతి ఇంతకీ?’’ అడిగాడు సావిత్రి నాన్నగారు.
లత, వౌళి చేతిలోంచి పెట్టె లాక్కుని ఆ తాళాల వంక చూచి-
‘‘ఇవి కార్ కీస్ తాతయ్యా! అంది. ఆ అమ్మాయి కళ్ళు మిల మిలా మెరిశాయి ఆశ్చర్యంతో’’.
అక్కడున్నవాళ్ళం అంతా ఆశ్చర్యపోయాం. సావిత్రి, తేజా తప్ప.
‘‘లేదండి! నేను ఇది మాత్రం అంగీకరించలేను’’ అన్నాడు.
‘‘ముందు బయటికి వెళ్లి ఎక్కి చూడండి’’ అంది సావిత్రి.
అందరం బయటకు వెళ్లాం. ఇంటి ముందు డ్రైవ్ వేలో ఎర్రటి పండు మిరప రంగులో మస్టాంగ్ కారు పార్క్ చేసి ఉంది. పొద్దునే్న మూర్తిగారు పని ఉందని వెళ్లింది ఇందుకే కాబోలు.
వౌళి ఆ కార్ దగ్గరకు నడుస్తూ తేజ వంక చూచాడు.
‘‘యు నో అబౌట్ దిస్’’ అన్నాడు.
తేజ మాట్లాడలేదు.
నువ్వెందుకు మీ నాన్నగారిని ఆపలేదు అన్నాడు.
నీకు తెలుసు కదా మా డాడ్ గురించి. తన ఏదైనా అనుకుంటే ఎవరి మాట వినరు.
‘‘నాకు చెప్పాల్సింది, నేను ఆపేవాడిని’’ అన్నాడు వౌళి.
‘‘దీనికి ఆర్డర్ చేసి చాలా రోజులయింది’’ అంది తేజ.
‘‘ఏమిటోయ్ అంత మొహమాట పడుతున్నావ్?’’ అన్నారు తాతగారు.
వౌళి మూర్తిగారి వైపు తిరిగి- వెడ్డింగ్, రిసెప్షన్, గిఫ్ట్స్ మీరు చాలా ఖర్చు చేశారు. దిస్ ఈజ్ టూ మచ్! అన్నాడు.
‘‘ఇంతకంటే ప్రెషస్ గిఫ్ట్ తీసుకుపోతున్నావు. దీనిదేముంది?’’ అన్నారు తాతగారు తేజాని ఉద్దేశించి.
అందరూ నవ్వారు. వౌళికి మరేం మాట్లాడాలో అర్థం కాలేదు.
‘‘పాతికేళ్ళు పైగా ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాను. కనీసం ఒక్కళ్ళ చేతయినా ఫారిన్ కారు కొనడం మాన్పించకపోతే నా స్వామి భక్తి వృధా అవుతుంది కదా!’’ మూర్తిగారు అన్నారు.
వౌళి, ఇదివరకు మరో దేశంలో తయారైన కారు వాడేవాడుట.
వౌళి నవ్వాడు ‘‘బ్యూటిఫుల్ కార్’’ అన్నాడు ఇంకేం అనాలో తెలియక.
లత మాత్రం ‘‘డోండ్ వర్రీ వౌళి! నీకు అక్కర్లేకపోతే ఐ విల్ బి గ్లాడ్ టు టేక్ ఇట్! అంది. తేజ లత తలమీద ఒక జెల్లకాయ కొట్టింది. నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు అంది.
అందరం పిట్స్‌బర్గ్ బయలుదేరాం.
‘‘మీ న్యూలీ వెడ్స్ మీ కొత్తకారులో రండి’’ అంటూ లతా, శశి కూడా మా అందరితో మూర్తిగారి కారు ఎక్కారు.
‘‘ఐ కెన్ యూజ్ ఎ డ్రైవర్!’’ అన్నాడు వౌళి మరదవళ్ల వంక చూస్తూ.
‘‘నో లక్! నీ పెళ్లిలో చాలా అలసిపోయాం. కారులో హాయిగా నిద్రపోవాలి’’ అంటూ చెవులకు ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని పాటలు వింటూ కారు ఎక్కింది. శశి, లతకి ఇంకా లైసెన్సు లేదు.
అందరం కలిసి సరాసరి పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాం.
అక్కడ మొదటగా మూర్తిగారు కారుకి పూజ చేయించారు.
వీళ్ళందరూ అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్నా చీమంత కూడా సెంటిమెంట్స్‌ని మార్చుకోలేదు. మూర్తిగారింట్లో ఎప్పుడు కొత్త కార్ కొన్నా, మొదటి ట్రిప్ భారతీయ టెంపుల్‌కి వెడతారుట.
ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని పూర్తిగా మన పద్ధతుల్లో కట్టుకున్నారు. ఇది అమెరికాలో మొట్టమొదటి వెంకటేశ్వరస్వామి గుడి. తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతున్నాయి. అక్కడి పురోహితులను కూడా తిరుపతివాళ్ళే పంపిస్తారు. మొట్టమొదటి గుడి కావడంతో ఆ గుడికి తిరుపతికి ఉన్నంత ప్రాధాన్యత ఉంది. ప్రతి ఊరిలోనూ ఓ వెంకటేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నా సరే, ఈ గుడికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తరగదుట.
ఆశ్చర్యం మెట్లన్నీ ఎక్కుతూ పరిసరాలు చూస్తున్నాను. ఆ లొకాలిటీకి పేరు కూడా పెన్ హిల్స్. కొంచెం ఎత్తుగా కొండమీద ఉన్నట్లే ఉంటుంది.
వెంకటేశ్వరుడు కూడా అమెరికా వచ్చేశాడు. నా చిన్నప్పుడు మాకు తెలిసిన వారింట్లో ఒకాయన ఇంగ్లాండ్ వెళ్లి వస్తే ఆయనకు విడిగా భోజనం పెట్టేరుట. సముద్రం దాటినవాడు, మడికి పనికి రాడని.
ఇపుడు దేవుడే దాటివచ్చేస్తే ఇక శాస్ర్తియులు చింతించరేమో.
హాయిగా దేవుడి ముందు నుంచుని సర్వం చూడగలుగుతుంటే చాలా హాయిగా అనిపించింది. ఎక్కడా జన సందోహం ఉండదు. గడబిడ, శబ్దాలు, తోసుకోవడాలు ఉండవు. ప్రతి ఒక్క పూజ శాస్త్రోక్తంగా వివరంగా జరగడం చూస్తూ వుంటే మన దేశంలో చూడటానికి ససేమిరా సాధ్యపడదు అనిపించింది.
అసలు ఈ అమెరికాలో స్థిరపడిపోయిన వాళ్లకి ఇండియాలో ఉన్నది అమెరికాలో లేనిది అంటూ ఏమీ లేదు. వాళ్ళు సర్వం, ఏర్పాటుచేసుకున్నారు. మన దేశం కంటే అన్నీ సులువుగా అందుబాటులో ఉన్నాయి.
కావలసినంత స్వేచ్ఛ, అవసరాలకు మించిన ఆదాయం, చాలా పెద్ద లెవెల్ ఉద్యోగాలు, పిల్లల చదువులకు, తాపత్రయపడక్కరలేదు. ఈ రోజు వరకూ బాగా చదివే విద్యార్థికి సీటు దొరకదేమో అన్న భయం లేదు. రికమెండేషన్స్ అక్కరలేదు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి