డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిన్ను హర్ట్ చేయాలని కాదమ్మా నా ఉద్దేశ్యం’’ అన్నాడు.
‘‘నాకు తెలుసు. నువ్వు ఉద్దేశపూర్వకంగా నన్ను ఎప్పుడూ హర్ట్ చేయలేవు’’ అన్నాను చెయ్యి నొక్కుతూ.
తలుపు చప్పుడయింది.
సంభాషణ మారిపోయింది.
కానీ ఆ రాత్రి నా మనసులో వౌళి మాటలు తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ లేనిది వౌళికి అలా ఎందుకు అనిపించింది.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. రఘురాం పేరు మా ఇంట్లో తలచుకుని, ఎవరి మనసులోకి వచ్చినా ఎవ్వరూ పైకి మాట్లాడేవారు కాదు. అనవసరంగా పాత విషయాలు తవ్వడం ఎందుకన్నట్లు.
కానీ ఇవాళ వౌళి అడిగాడు.
నాకు రఘుని కలవాలని ఉందా అని?
‘‘ఉందా?’’ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సమాధానం దొరకలేదు. మనిషి ఎలా ఉన్నాడో చూడాలని కొన్నిసార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కోరిక కూడా లేదు. పైగా 2, 3 సార్లు ఫొటోస్‌లో కూడా చూశాను కూడా! ఎటువంటి స్పందన లేదు. అయినా ఆలోచనలు తిరుగుతూనే వున్నాయి.
ఎప్పటికో నిద్రలోకి జారిపోయేను.
మూర్తిగారు, సావిత్రి ఆ రోజే రావడం, ఎయిర్‌పోర్టుకి వెళ్లడానికి వౌళి రెడీ అవసాగాడు.
‘‘నువ్వెళ్లు వౌళి! నేను లంచ్‌కి అత్తయ్యకు హెల్ప్ చేస్తాను’’ అంది తేజా!
‘‘వద్దు తేజా. నువ్వూ వెళ్లు. వాడొక్కడూ కాదు, ఇద్దరూ వెళ్లండి’’ అన్నాను.
వాళ్ళందరూ తిరిగి వచ్చేటప్పటికి టేబుల్ మీద ప్లేట్స్ పెడుతున్నాను.
ఈ అమెరికాలో నాకు అన్నీ మొదటి అనుభవాలే. నా కొడుకు ఇంట్లో అతిథులకు భోజనం ఏర్పాటు చేయడం నాకు కొత్తే! అసలు నేనెప్పుడూ ఇంటికి వచ్చిపోయే వ్యవహారాలలో జోక్యం చేసుకునేదాన్ని కాదు.
మూర్తిగారు, సావిత్రి చాలా రిలాక్స్డ్‌గా ఉన్నారు. క్రితంసారి వాళ్ళతో టైం గడిపినపుడు వాళ్లంతా పెళ్లి హడావిడితో చాలా తీరిక లేనట్లుగా ఉన్నారు.
‘‘అప్పుడే ఆరువారాలు ఎలా జరిగిపోయాయండీ, మీరు ఇంకా వస్తారు వస్తారు అనుకోవడంలోనే ఉన్నాము రెండు నెలల క్రితం. రావడం, వెళ్లడం కూడా జరుగుతోంది’’ అంది సావిత్రి.
నవ్వుతూ అంగీకరించాను.
‘‘మీ వంటలో మాత్రం ఒక ప్రత్యేకత ఉందండీ!’’ అంది భోజనం చేస్తూ!
‘‘మీ వంటకంటేనా?’’
‘‘తప్పకుండా!’’ అంది.
‘‘అది కల్తీలేని కృష్ణా జిల్లా భోజనం’’ అన్నాడు వౌళి. అందరూ నవ్వారు.
తేజా కూడా ఎప్పుడూ అంటూంటుంది నీ వంటలో రుచులు వేరని. శని, ఆదివారాలు నా పక్కన నుంచుని అన్నీ రాసుకునేది. ఎన్ని నిమిషాలు వండాలో కూడా.
భోజనం ఎక్కువైంది, కాస్త వాకింగ్ వెళ్లాలి అంటూ మూర్తిగారు క్రిందకు వెళ్లారు. నేను, సావిత్రి పెళ్లి కబుర్లు తలుచుకుంటూ ఫొటో ఆల్బమ్స్ తిరగేస్తూ కూచున్నాం. అందులో నాదీ, వౌళీదీ ఓ చక్కని ఫొటో వుంది. అసలు నాకు, వౌళికి కలిసి ఫొటోలు లేవు. ఏవో, ఒకటో రెండో వాడి గ్రాడ్యుయేషన్ అప్పుడు తప్ప.
దానివంకే చూస్తూ ఉండిపోయాను.
‘‘చాలా చక్కని ఫొటో. మీరు చాలా బావున్నారు ఇందులో’’ అంది సావిత్రి.
నవ్వి ఊరుకున్నాను.
‘‘మీరు అన్ని చోట్లా బానే ఉంటారు’’ అంది మళ్లీ.
‘‘.....’’
‘‘మూర్తిగారు అసలు ఎవరిని గురించీ ఎటువంటి కామెంట్స్ చేయరు. కానీ మిమ్మల్ని గురించి మాత్రం అన్నారు. ఇనే్నళ్ళలో ఆయన ఒకరిని గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు’’ అంది సావిత్రి.
నా మనసు ఎందుకో చివుక్కుమంది. కానీ అది సావిత్రి ఉద్దేశం అని అనుకోను. నన్ను గురించి చేసిన ఒక మంచి ప్రశంస నాకు చెప్పాలని అనుకుందేమో.
నేను ఏమీ మాట్లాడకపోవడం చూచి ఆవిడే అంది.
‘‘మూర్తిగారు ఏమన్నారో తెలుసా?’’
నాకు తెలియకుండానే ఊపిరి బిగపెట్టాను. ‘‘మీ అంత బ్యూటిఫుల్, కల్చర్డ్ లేడీని రఘురాంగారు ఎలా వదులుకోగలిగారో?’’ అని.
ఒక్కసారి శ్వాస వదిలాను.
ఆల్బమ్స్‌లో పేజెస్ తిరగేస్తూ ఉండిపోయాను. ఇలాంటి మాటలు నా జీవితమంతా ఎన్నోసార్లు విన్నాను. ‘‘రఘురాం మస్ట్ బి ఎ ఫూల్ టు లివ్ ఎ వైఫ్ లైక్ యూ’’.
మండోదరి లాంటి భార్యనుంచుకుని ఆయనకి ఇదేం బుద్ధి.
ఒకటికాదు, ఇలాంటివి ఎన్నో! ఈ మాటలు అనేవాళ్ళందరి మనసుల్లోనూ ఒక రకపు బాధ ఉంది. సానుభూతి ఉంది. నేను ఒంటరిదాన్నయిపోయానని. కానీ ఒక జీవిత బంధం ఎలా కలుస్తుందో ఎలా విడిపోతుందో పైవాళ్ళకి ఎలా అర్థం అవుతుంది. ఒక బంధం నిలబడాలంటే దానికి కావలసింది కేవలం అందం, ఆకర్షణ, మంచితనం కాదు. బాధ్యత! బంధాన్ని నిలుపుకోవలసిన బాధ్యత, కర్తవ్యం అని ఉంటే వాటితోపాటు ప్రేమ కూడా జత అవుతుంది.
నా మనసు మూగగా ఆలోచనల మధ్యకు చొచ్చుకుపోతూనే ఉంది.
‘‘మీరేం అనుకోకండి! ఇలా అడుగుతున్నానని. కానీ, నా మనసెందుకో ఈ ఆలోచనలు వదులుకోలేకుండా ఉంది. రఘురంగారు మీకసలు ఎందుకు దూరం అయ్యారు?’’ అడిగింది.
తల ఎత్తి ఫొటో మీంచి దృష్టి ఆవిడ మీదకు మరల్చాను.
చిన్నగా నవ్వి, వాతావరణం తేలిక చేయాలనుకున్నాను.
‘‘ఏమిటీ తరచుగా అంటారు మీ అమెరికన్లు- మిలియన్ డాలర్ క్వశ్చన్! అదే ఇది’ అన్నాను.
కానీ సావిత్రి నవ్వలేదు. ఆవిడ మొహం సీరియస్‌గానే ఉంది.
ఆవిడ వంక చాలా ప్రశాంతంగా చూచాను.
‘‘ఈ ప్రశ్నకి సమాధానం కోసం 30 ఏళ్ళుగా వెదుకుతున్నాను’’ అన్నాను.
‘‘అందరూ అనుకున్నట్లు మా ఇద్దరిమధ్య ఏమీ జరగలేదు. వియ్ జస్ట్ డ్రిఫ్టెడ్ అపార్ట్. నీటిలో దుంగల్లాగా’’ అన్నాను.
కానీ అది సంతృప్తికరమైన సమాధానం కాదని తెలుసు. కానీ నాకు నేను చెప్పుకుంటున్న సమాధానం. అది నిజమైనా, కాకపోయినా అదొక్కటే నా దగ్గర ఉన్న సమాధానం.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి