డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పైగా నీకు ఆ మగ్‌ని బహుమతిగా కొనలేదు నాకోసమే కొనుక్కున్నాను. లేకపోతే రోజు పొద్దునే్న నీతోపాటు కాఫీ తాగటానికి నా నిద్రను డిస్టర్బ్ చేస్తావని అంది టీజ్ చేస్తూ!
‘‘ఓ.. నో! నీ నిద్రను డిస్టర్బ్ చేసేది కాఫీకి మాత్రం కాదు’’ అన్నాడు.
‘‘చాల్లే పక్క గదిలో మీ అమ్మ ఉన్నారు’’ అంది తేజ.
ఏం ఫరవాలేదు. మా అమ్మ విన్నా విననట్లే ఉంటుంది’’ అన్నాడు నవ్వుతూ!
అక్కడే వుంటే ఇంకేం వినాల్సి వస్తుందో అని గబగబా ఎలివేటర్ దగ్గరకు నడిచాను.
ఎయిర్‌పోర్ట్ చేరాం. ఒక్కసారి ఆరువారాల క్రితం మద్రాస్‌లో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన విషయం గుర్తుకువచ్చింది. వెంటనే అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న అందరూ గుర్తుకువచ్చారు. మనసు ఇండియా వెళ్లిపోవాలని తొందర చేసింది.
అందరం గేట్ దగ్గరకు వెళ్లాం. నేను లోపలకు వెళ్లాల్సిన టైం వచ్చింది. మనసంతా ఒక్కసారి నిశ్శబ్దమయిపోయింది.
వౌళిని వదలి వెళ్లాలనిపించలేదు. ఇప్పుడు వాడితోపాటు తేజా కూడా!
ఉయ్యాలలాడే నా మనసును చూచి నేనే నవ్వుకున్నాను. ఒక పక్క ఇండియాలో నా వాళ్ళందరినీ చూడాలనిపిస్తోంది. మరోపక్క వీళ్ళను వదిలి వెళ్లాలనిపించడంలేదు.
సావిత్రి వైపు తిరిగి ‘‘చాలా థాంక్స్ సావిత్రి! చక్కని, తియ్యని జ్ఞాపకాలను తీసుకువెడుతున్నాను. మా కోడలిని మీకు అప్పగించి వెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి’’ అన్నాను. నాకా సమయంలో ఏ విధంగానూ సంభాషణ సీరియస్‌గా మారడం ఇష్టం లేదు.
ఆవిడ నవ్వుతూ ‘ఒక్క మీ కోడలినేనా? మీ అబ్బాయిని చూసుకో అక్కరలేదా?’’’ అంది.
‘‘మా అబ్బాయిని కోడలు చూసుకుంటుంది’’ అన్నాను.
‘‘చూశావా? మీ అత్తగారు ఎంత స్మార్ట్‌గా నీ డ్యూటీ నాకు చెప్తున్నారో’’ అంది కూతురి వంక చూచి నవ్వుతూ.
‘‘మా కోడలికి ఎవరూ చెప్పనవసరం లేదు’’ అన్నాను.
మూర్తిగారి వైపు తిరిగి రెండు చేతులు జోడించాను.
ఆయన కూడా తిరిగి నాకు నమస్కారం చేస్తూ ‘హావ్ ఎ సేఫ్ ట్రిప్’. ‘‘మీరు మళ్లీ త్వరలోనే మరో విజిట్‌కి రావాలి’’ అన్నారు.
‘‘ఈసారి విజిట్ మీది. అందరూ కలిసి ఇండియా రండి’’ అన్నాను.
‘‘తప్పకుండా. మూడొంతులు వచ్చే సంవత్సరం’’ అన్నాడు వౌళి ముఖం చూస్తూ!
వౌళి ఏమీ సమాధానం ఇవ్వకుండా తల ఆడించాడు.
తేజ అమెరికాలో పెరిగిన పిల్ల. తన మానరిజంవేరు. చటుక్కున నన్ను గట్టిగా కౌగిలించుకుని ‘వియ్ విల్ మిస్ యు’’ అంది.
‘‘నేను కూడా’’ అన్నాను తేజ చెంపమీద నా చెయ్యి ఉంచి.
వౌళి నా భుజాల చుట్టూ చెయ్యి వేస్తూ ‘హెల్త్ జాగ్రత్తగా అమ్మా’’ అన్నాడు.
తల ఊగించి వాడి చెంప మీద చేయి ఉంచి లోపలకు వెళ్లాను. చివరగా వెనక్కి తిరిగి చూచాను.
వౌళి రెండు పాకెట్స్‌లో చేతులు పెట్టుకుని నుంచుని ఉన్నాడు. పాకెట్‌లో పెట్టుకున్న చేతి వంపుల్లో తేజ చెయ్యి చుట్టుకుని వౌళి పక్కనే నుంచుని ఉంది.
వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చాలా సంతృప్తిగా అనిపించింది. నా వౌళి ఇంక వంటరివాడు కాదు అనిపించింది.
విమానంలో అడుగుపెడుతుంటే కొంచెం నెర్వస్‌గా అనిపించింది, వస్తున్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకువచ్చి.
విమానంలో సర్దుకు కూచున్నాను. మళ్లీ ఎయిర్ హోస్టెస్ తన పని మొదలుపెట్టింది. సేఫ్టీ సూత్రాలను చెప్పడం.
ఆ.. ఏదో చెప్తారు. వీటి అవసరం ఎంతుంటుంది? అని అనుకున్నాను ఇదివరలో. అటువంటిది ఈసారి తు.చ తప్పకుండా విన్నాను ఆ అమ్మాయి చెప్పే ప్రతి ఒక్కమాట. అంతేకాదు సీట్ కింద ఎయిర్ కుషన్ ఉందో లేదో చూచుకున్నాను.
నాకే నవ్వు వచ్చింది నన్ను చూచుకొని. ప్రాణం అంటే ఎంత తీపి? చావు అంటే ఎంత భయం. కానీ ప్రతి జీవికి తెలుసు చావు తథ్యమని. కానీ తన టైం వచ్చిందని అనుకోరు.
అందుకే నాకు టెర్మినల్ పేషెంట్‌ని చూస్తే చాలా బాధ. దీర్ఘవ్యాధికి గురి అవ్వడం చాలా దురదృష్టకరం. అటువంటిది తన జీవిత పరిధిని తెలుసుకుని గడిచే ప్రతిరోజూ తరిగే తన జీవిత ప్రమాణాన్ని తలచుకుంటూ బతకాల్సి రావడం. ఎందుకిలాంటి శిక్షవేస్తాడు భగవంతుడు? తీసుకుని వెళ్లదల్చుకున్నవాడు గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లచ్చుగా ఈ అనౌన్స్‌మెంట్స్, సఫరింగ్ ఎందుకు? ఆ మాటంటే మా మామ్మ పూర్వజన్మ ఫలమే అనేది.
కానీ అది నాకు ఇనే్నళ్లు వచ్చినా అర్థం కాదు. పూర్వజన్మలో మనం ఏం చేశామో గుర్తు ఉండనపుడు దాని ఫలితాలు అనుభవిస్తూ మళ్లీ ఆ తప్పులే చేయకుండా ఎలా ఉండగలం.
ఒక్కసారి తల విదుల్చుకున్నాను. ఏమిటిది. విమానం ఎక్కగానే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నాను. వెంటనే లేచి హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న పెళ్లి ఆల్బం తెరిచాను, మనసు మళ్లించుకోవాలని.
ఒక్కొక్క ఫొటో మెల్గగా చూస్తూ పేజెస్ తిప్పుతున్నాను. నా కళ్ళకు నా వౌళి ఓ రాజకుమారుడిలాగానే కనిపించాడు.
మా వదిన ఏమంటుందో? అనుకోకుండానే పెదిమలమీద నవ్వు వచ్చింది. ఏమంటుందో నాకు తెలుసు. సూటు, బూటు వేస్తే కోతి కూడా ముద్దుగానే కనిపిస్తుంది. నవ్వుకున్నాను. థాంక్ యు వదినా అనుకుకున్నాను అభిమానంగా. నా పెదిమలమీద నవ్వు మాయకుండా ఉండటానికి మా వదిన ఏదైనా చేస్తుంది.
మరో పేజీ తిరిగింది. మళ్లీ నేను వౌళి ఫొటో చూస్తూ ఉండిపోయాను సావిత్రి మాటలు గుర్తుకు వచ్చాయి.
రఘుని కలవడం విషయం వౌళి అడిగాడు. సావిత్రి సజెస్ట్ చేసింది. కానీ నా మనసులోకి ఆ ఆలోచన రాలేదు. అతి స్వల్ప పరిచయం, అతి చిన్న సంఘటన మనిషి జీవితాన్ని శాసించగలదా?
ఏమో! తులసీదాసుగారి జీవితం భార్య అన్న ఒక్క మాటే మర్చిందట. వేమన జీవితంలో ఒక్క రాత్రి యోగిగా చేసిందట.
వాళ్లంతా మేధావులు. కారణజన్ములు. కానీ మామూలు మనుషుల జీవితాలు?
రఘురాం మేధావే! అతని జీవితాన్ని ఏం మార్చింది? నిజమే! కలిస్తే తెలిసేదేమో! కానీ తెలుసుకుని ఏంచేయాలి?
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి