ఆంధ్రప్రదేశ్‌

ఉద్యమమా! రాజకీయమా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 11: నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించాలన్న కాపునేత ముద్రగడ పద్మనాభం పిలుపుపై కాపువర్గాలు రెండుగా చీలిపోయాయి. కాపు రిజర్వేషన్ డిమాండు పేరుతో ఒక పార్టీకి అనుకూలంగా, మరొక పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల కాపునాడు ఉద్యమం పక్కదారి పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో టిడిపిని ఓడించమంటే, వైసీపీని గెలిపించాలన్నదే ముద్రగడ పిలుపు వెనుక అసలు లక్ష్యమని కాపు-బలిజ వర్గాలు చెబుతున్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కాపుల బలమేమిటో చూపించాలి కాబట్టి, ఆ రెండు ఎన్నికల్లో టిడిపిని ఓడిస్తే అప్పుడే చంద్రబాబునాయుడు దిగివచ్చి, కాపుల డిమాండ్లపై దృష్టి సారిస్తారన్న ముద్రగడ వ్యాఖ్యలపై కాపువర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి నుంచీ ముద్రగడను సమర్థిస్తున్న వర్గం మాత్రం ఆయన పిలుపులో తప్పేమీ లేదని, ఓడిస్తే తప్ప బాబు దారికిరారని స్పష్టం చేస్తోంది. తమ లక్ష్యసాధనకు రాజకీయ నిర్ణయమే సరైనదని వారు వాదిస్తున్నారు. అయితే, మెజారిటీ కాపునాడు నాయకులు, ఏ పార్టీకి చెందని వర్గాలు మాత్రం ముద్రగడ వ్యాఖ్యలను ఆక్షేపిస్తున్నాయి. కాపు-బలిజల్లో అన్ని పార్టీలకూ చెందిన వారున్నారని, ఎన్నికల్లో ఎవరి నిర్ణయం వారు తీసుకుంటారని చెబుతున్నారు. అలాంటిది కేవలం టిడిపిని ఓడించాలని ముద్రగడ పిలుపునివ్వడం ఆయన స్థాయికి, నాయకత్వానికి హుందాతనం ఇవ్వదంటున్నారు. ఒకరకంగా ముద్రగడ పరోక్షంగా వైసీపీని గెలిపించాలనే పిలుపునిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఆయనకు చంద్రబాబునాయుడుతో ఉన్న వ్యక్తిగత విభేదాలకు, ఉద్యమాన్ని పణంగా పెట్టడం మంచిదికాదంటున్నారు. దీనివల్ల ముద్రగడకు వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్ఠ దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ముద్రగడను జగన్ అద్దెమైకుగా టిడిపి నాయకులు విమర్శిస్తున్నారని, దానికి తెరదించి తానెవరి పక్షం కాదని చాటుకోవలసిన ఆయన, నేరుగా టిడిపిని ఓడించాలని పిలుపునివ్వడం వల్ల.. ఇప్పటివరకూ టిడిపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని కాపుజాతి నమ్మే అవకాశం ఉందని విశే్లషిస్తున్నారు. ఉద్యమం గురించి కాకుండా రాజకీయాలు మట్లాడితే ముద్రగడ ఒక పార్టీకి అనుకూల నేతగా మిగిలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసే సమయంలో, ఆ వర్గానికి చెందిన నాయకులు చాలా లౌక్యంగా వ్యవహరించి కార్పొరేషన్‌కు నిధులు ఏర్పాటుచేసుకున్న విషయాన్ని పలువురు కాపునాడు నేతలు గుర్తు చేస్తున్నారు. బీసీల హక్కుతో ముడిపడి ఉన్న కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో లౌక్యంగా వ్యవహరించి, ప్రభుత్వం వద్ద లక్ష్యం సాధించుకోవలసిన నాయకులు ఈవిధంగా ఒక పార్టీకి అనుకూలంగా, మరొక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లక్ష్యం ఎలా సిద్ధిస్తుందని ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలం నుంచీ ఉద్యమం పేరుతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని, ముద్రగడ చేస్తున్న విమర్శలను బలిజ, కాపునాడులోని మెజారిటీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘మేం పద్మనాభం గారిని వ్యక్తిగతంగా గౌరవిస్తున్నాం. జాతి కోసం ఆయన పోరాడుతున్నారన్నది కాదనలేం. కానీ ఆయన చాలాకాలం నుంచి తప్పుదోవలో వెళుతున్నారు. ఉద్యమ నేతలు కులం, కులానికి జరగాల్సిన న్యాయం గురించే మాట్లాడాలి తప్ప రాజకీయాలెందుకు.. అంటే ఆయనకు సొంత అజెండా ఉన్నట్లేకదా.. టిడిపిని గానీ, కాంగ్రెస్‌ను గానీ, వైసీపీని గానీ గెలిపించాలని, ఓడించాలని చెప్పేందుకు ఆయనకు ఏం అధికారం ఉంది.. బలిజ, కాపుజాతేమైనా ఆయనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందా.. టిడిపిని ఓడించాలని ఆయన ఎవరిని అడిగి నిర్ణయించారు.. మమ్మల్ని సంప్రదించారా.. ఉద్యమం ముసుగులో రాజకీయ నిర్ణయాలు తీసుకుని ఆయన ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నట్లు.. సరే టిడిపిని ఓడించాలన్నారు.. మరి ఎవరిని గెలిపించాలని.. వైసీపీని గెలిపించాలనే కదా ఆయన ప్రయత్నం.. అదేదో నేరుగా చెబితే సరిపోతుంది కదా.. కులానికి నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ సంప్రదించి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలి.. అలా లేనప్పుడు ఆయన ఉద్యమ నేతగా పనికిరారు.. రాయలసీమలో వైసీపీ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించే బలిజ వర్గానికి టిడిపిని ఓడించి, పరోక్షంగా వైసీపీని గెలిపించాలని ముద్రగడ ఏవిధంగా పిలుపునిస్తార’ని బలిజనాడు రాష్ట్ర అధ్యక్షుడు బి.శివశంకర్ సూటిగా ప్రశ్నించారు.