ఫోకస్

ఇంకెన్నాళ్లీ వివక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామూహిక గుర్తింపు ఉండి, సంఘటితమైన అనేక ప్రజా సముదాయాలతో కూడిన సమాహారమే సమాజం. సమాజ పరిణామంలో చతుర్వర్ణ వ్యవస్థ అనేక పరిణామాలకు గురై అగ్రకులాలు, నిమ్నకులాలు అనే వివక్ష ఏర్పడింది. నిమ్న కులాల వారిని అంటరాని వారిగా సమాజం చూడటం మొదలుపెట్టింది. అంటరాని వారిని గాంధీజీ హరిజనులు అని వ్యవహరించారు. కులవ్యవస్థ అణచివేత సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కుల ప్రాతిపదికన అస్పృశ్యతను పాటించడం నేడు నేరం. అయినా అనేకచోట్ల నేటికీ దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూమతంలో అణగారిన ఈ వర్గాలపై దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని దాడులు జరిగాయి. భారతదేశంలో ఇతర మతాల్లో కూడా దళితులున్నా వారి మూలాలు మాత్రం హిందూ మతానికి సంబంధించి మాత్రమే ఉన్నాయి. దళితులు జన్యుపరంగా ఇతర అగ్రకులాలను పోలి ఉన్నా సామాజికంగా తరతరాలుగా తక్కువ జాతిగా భావించబడటంతోనే అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. మతంనుండి పుట్టి పెరిగి వర్థిల్లుతున్న కులం, అందులో నుండి విషపుత్రికగా అవతరించిన అంటరానితనాన్ని అంబేద్కర్ చాలా చక్కగా వివరించారు. మూల సమస్య పరిష్కారం కావాలంటే మూల దోషాల నుండి దళితులు బయటపడాలని అంబేద్కర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం దళితులకు ఎన్నో ప్రత్యేక వసతులు, సౌకర్యాలను కల్పించింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించే సౌలభ్యం కూడా కల్పించింది. అంటరానితనం, వర్ణ వివక్ష వ్యతిరేక చట్టాలను తెచ్చింది. అయినా దళితులను రాజకీయ ఓటు బ్యాంకుగా పార్టీలు చూడటంతో గ్రామాల్లో ఘర్షణలకు కారణమవుతోంది. దళితుల వౌలిక సమస్యలను పరిష్కరించాలని ఏ రాజకీయ పార్టీ భావించడం లేదన్నది నిర్వివాదాంశం. తెలంగాణలో నేరెళ్ల ఘటన, ఆంధ్రప్రదేశ్‌లో గరగపర్రు ఘటనలతో మరో మారు దళితుల ఆందోళనలు ప్రధాన అంశంగా మారాయి. గతంలో 1985 జూలై 17న జరిగిన కారంచేడు ఘటన, 1991 ఆగస్టు 6న జరిగిన చుండూరు ఘటన, తోట త్రిమూర్తులు శిరోముండనం కేసు, శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేటలో 2012 జూన్ 12న జరిగిన నరమేధాన్ని ఎవరు మరిచిపోగలరు?
రాజకీయ పార్టీల నుండి ఒత్తిడి రాగానే ప్రభుత్వం తూతూమంత్రంగా కొద్దిమందిపై చర్యలు తీసుకుని రికార్డులను మూసివేసినా, జరిగిన ఘటనలపై దళితుల ఆత్మ క్షోభిస్తూనే ఉంది. అది మాయకముందే మరో ఘటన జరగడంతో సామాజిక అసమానతలకు దారితీసినట్టవుతోంది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దళితులపై ఆకృత్యాలు సాగడం సిగ్గుతో తలదించుకోవల్సివస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పేర్కొన్నారు. దళిత సోదరులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దాడుల గురించి వింటున్నపుడు సిగ్గుతో తలదించుకుంటున్నానని, ఇక ఎంతమాత్రం వేచి ఉండకూడదని, మనం సాగుతున్న మార్గంపై దృష్టి మరింత మెరుగుకావాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా దళితులపై దాడులకు మూలాలను అనే్వషించి తగిన చర్యలు తీసుకోవాల్సిన రోజు వచ్చింది. ఈ అంశంపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.