డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మరి నాకు రానివి అవే’’ అనేది అమాయకత్వం నటిస్తూ!
ఇద్దరూ నే పని చేసే ప్రదేశం చూడాలంటూ మా వూరు వచ్చారు. ఆ పల్లెటూరి వాతావరణం తేజాకి నచ్చింది. రోజూ ముగ్గురం కలిసి నడిచి వచ్చేవాళ్ళం. వాళ్ళిద్దరూ రాగానే మా కాలేజీలో పనిచేసే వారికి, వూరి పెద్దలకి అందరికి డిన్నర్ ఏర్పాటుచేశాం.
వౌళి, తేజ తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
నేను నా రొటీన్‌లో పడిపోయాను. కాలేజీ బాధ్యతలు, మధ్యమధ్య క్లాస్ తీసుకోవడం.. చాలా మామూలుగా రోజులు వెళ్లిపోతున్నాయి. పని చేయడానికి, ప్రత్యేకమైన శ్రమ ఏమీ లేకపోవడంవలన నా ఆలోచనలు, బాగా నా రైటింగ్‌మీదకు వెళ్లిపోతున్నాయి. వౌళి అమెరికానుంచి తెచ్చి నా కోసం అమర్చిన కంప్యూటర్ బాగా ఉపయోగపడుతోంది. దాన్ని నేర్చుకోవడంలో, తేజా చాలా సహాయపడింది. నా వ్యాసాలు ఇప్పుడు తరచుగా, పత్రికలలో రావడం మొదలయ్యాయి. అవి చాలా మంది పెద్ద వాళ్ళ దృష్టిలోకి వెళ్లడం మొదలయ్యాయి.
వెస్ట్రన్ ఎకానమిని బాగా స్టడీ చెయ్యడం ఎక్కువైపోయింది. ఫ్రీడ్‌మ్యాన్ ఆర్టికల్స్ ప్రభావం ఎక్కువయిపోతోంది. ఫ్రీ ఎంటర్‌ప్రైజెస్ పురోభివృద్ధికి ఎంత ముఖ్యమో అర్థవౌతుంది. వెనుకబడిపోతున్న మన ఆర్థిక వ్యవస్థకు ఎంత అవసరమో వెల్లడౌతుంది.
కాపిటలిజమ్, మన దేశాల్లో చాలా ప్రమాదమే! మనిషిలో నిజాయితీ లోపించినప్పుడు ఫ్రీ ఎంటర్‌ప్రైజెస్, ఎదుటి మనిషిని ఎక్స్‌పాయిట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాని అది పురోభివృద్ధికి కూడా చాలా ముఖ్యం. పాశ్చాత్య దేశాల్లో మనిషిలో నిజాయితీ ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకని? మనిషి అవసరాలన్నీ తీరబట్టా?
కాని మన దేశంలో పెద్ద మోసాలన్నీ పైనుంచే ఎక్కువ జరుగుతున్నాయి. వారి అవసరాలకు చేసే మోసాలు కాదు, కేవలం అత్యాశ, గ్రిడినెస్.
మనసు వెతుకుతూనే వుంది. సమన్వయం ఎలా జరుగుతుంది. స్వార్థ చింతన, పురోభవృద్ధి రెండిటికి?
అందుకే పాపం ఆ రోజుల్లోనే మొత్తుకున్నారు గురజాడవారు. స్వంత లాభం కొంత మానమని. అంతా మానమని ఆయన అడగనే లేదు. అది విన్న వారు, అర్థం చేసుకున్నవారు మాత్రం లేరు.
నాకు అమెరికా చూసి వచ్చినప్పటినుండి మనసులో ఒక ప్రశ్న వదలకుండా వుంది. మన వాళ్ల తెలివితేటలు ప్రతి రంగంలోనూ ఎంతో స్పష్టవౌతున్నాయి. ప్రపంచ ఖ్యాతి చెందుతున్నాయి. తెలివి తేటల్ని మనం ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం. మన ప్రభుత్వం ఎందుకు దోహదం చేయడం లేదు? ఒకప్రక్క ఫ్రీ ఎంటర్‌ప్రైజెస్ సిస్టమ్‌ని ప్రోత్సహిస్తూనే గవర్నమెంటు సపోర్టుని గురించి ఆలోచిస్తున్నానా?
ఈ రోజుల్లో ఏ ఒక్క సిస్టమ్ నెగ్గుకురాదు. ఫ్రీ ఎంటర్‌ప్రైజెస్ గవర్నమెంటు సపోర్టు ఒక భాగస్వాములు అవ్వాలి. అందుకు సరైన మార్గాలు కావాలి.
నా మనసులో కొన్ని ఆలోచనలు తిరుగుతూనే ఉన్నయి. వాటిని గురించి నేను రీసెర్చి చేస్తూనే ఉన్నాను.
తెనాలి తాలూకు వాళ్ళు తరచుగా నన్ను పిలుస్తూనే ఉన్నారు. వారి కాలేజి ప్రోగ్రెస్ అంతా వివరిస్తూనే ఉన్నారు.
నేను, నా నిర్ణయం వాళ్ళకి తెలపాల్సిన రోజులు దగ్గర పడుతూనే ఉన్నాయి కదా. తేజా మాటలు మనసులో మెదులుతూనే ఉంటాయి. పొగడ్తకి ప్రతీ హృదయం స్పందిస్తూనే ఉంటుందేమో.
‘‘మీ అమ్మది మామూలు ఇంటిలిజెన్స్ కాదు. ఏదో ప్రత్యేకత ఉంది. ఆవిడ అవగాహన ఒక్క డైరెక్షన్‌లో పోదు. చాలా కోణాలనుంచి ఒకే సబ్జెక్టు గురించి ఒకేసారి ఆలోచిస్తుంది. ఆవిడకి మంచి అవకాశాలు వచ్చి వుంటే గొప్ప స్కాలర్ అయ్యేది’’ అనేది తేజ.
వౌళికి నన్ను గురించి ఎవరైనా మంచిగా మాట్లాడితే మరీ సంతోషంగా కనిపించేవాడు. వౌళికి తేజమీద గౌరవం అంతా పెరగడానికి కారణం ఆ అమ్మాయి దృక్పథమేమో!
తేజ ఎప్పుడు మాట్లాడినా, కొత్త ఉద్యోగం చెయ్యమనే ప్రోత్సహించేది. వౌళి మాత్రం నీ యిష్టం అమ్మా, నీ ఓపిక చూసుకో’’ అనేవాడు.
అన్నయ్య ‘‘ఎందుకే ఈ శ్రమ, హాయిగా యిందులో రిటైరైపోయి, నీ కొడుకు కోడలు దగ్గరకు వెళుదుగాని’’ అనేవాడు.
ఆ మాట మాత్రం మనసులో ముల్లులా గుచ్చుకునేది. తను మాత్రం ఎవరికీ బరువు కాకూడదు.
నేను అప్పుడే రిటైర్‌మెంట్ గురించి ఆలోచించకూడదు. తను ఏదన్నా చెయ్యాలి అన్న ఆలోచన మొదలయింది. నాకు తెలియకుండానే తెనాలి ప్రాజెక్టు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మొట్టమొదట ఆ ప్రస్థావన రాగానే ‘వద్దు’ అనుకున్నదాన్ని ఆలోచించేవరకు వచ్చింది.
మా పాత రిటైర్డ్ ప్రిన్సిపాల్‌గారితోకూడా మాట్లాడాను. ఆయనకూడా అందులో పాలు పంచుకోవాలనుకుంటున్నారు. ఆ మాటతో నాకు చాలా ధైర్యం వచ్చింది.
నా దృష్టిలో ఆయన చాలా బ్యాలెన్డ్ మనిషి. ఆయన రిటైర్ అయ్యాక ఇంత ఉత్సాహంగా వున్న వూరు వదిలేందుకు సిద్ధవౌతుంటే తనెందుకు వెనకాడాలన్నా ఆలోచన మొదలయింది.
మళ్లీ నా ఆలోచనాస్రవంతి మారిపోతోంది. తరచుగా మీటింగ్స్‌లో పాల్గొనడం మొదలయింది. నా అభిప్రాయాలను కమిటీ చాలా విలువ ఇవ్వడం మొదలు పెట్టింది. అది నాలో ఉత్సాహాన్ని పెంచడం జరుగుతోంది. తేజ అన్నది అక్షరాల నిజం. వంటికి వ్యాయామం మెదడుకి మేత రెండు చాలా అవసరం. నా నిర్ణయం తేజాకి చాలా నచ్చింది. వౌళి తటస్థంగా వూరుకున్నాడు.
కాలేజీ మొదలయింది. తొలి ఒడిదుడుకులు తగ్గంగానే బాగా చురుగ్గా పరిగెడుతోంది. కాలేజీలో కొత్తమార్గం చాలామందిని ఆకర్షించింది. ముఖ్యంగా మూడు రకాలుగా పెంపొందించడంతో. అన్ని కాలేజీలలో బాగా ఇంటర్, డిగ్రీయే కాదు ఒక పక్కనుంచి ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు తర్ఫీదు, మరోప్రక్క ఒకేషనల్ ట్రైనింగ్ అన్ని అందించడంతో అక్కడ ఎకనామిక్స్‌కి, మ్యానేజ్‌మెంట్‌కి కూడా బాగా ప్రాధాన్యత ఇవ్వబడటంతో విద్యార్థికి మంచి అవగాహన ఎక్స్‌పోజ్ బాగా రావడం మొదలైంది. అక్కడనుంచి వెళ్లిన వాళ్లు బాగా మంచి సీట్సు సంపాదించుకోవడం, బాగా చేయగలగడం, ఒక పెద్ద ఎడ్వర్‌టైజ్‌మెంట్ అవసాగింది.
మా కాలేజీ మీద కళ్ళు చాలామందికి పడ్డాయి. పై రాష్ట్రాల వారు కూడా వచ్చి మా కాలేజీ మోడల్ని పరిశీలించడం జరిగింది. నాకు మరో రెండు చోట్ల నుంచి రెట్టింపు డబ్బుతో ఆఫర్స్‌కూడా వచ్చాయి.
నాకు మాత్రం యింక ఎక్కడికి వెళ్లాలన్న ఆలోచన రావడంలేదు. నా ఆంధ్ర రాష్ట్రాన్ని వదలాలని లేదు.
వౌళి పెళ్లి అయి ఐదు, ఆరు ఏళ్ళు అయిపోయింది. బంధువుల్లో ఎవరైనా మన వాళ్ళ గురించి అడిగినప్పుడు నాకు ఆ ఆలోచన రావడం మొదలయింది.
వీళ్లు పిల్లలు వద్దనుకున్నారా? పుట్టడం లేదా అని.
ఒకసారి అడుగుదామనుకున్నాను కానీ, అక్కడ తేజాకి తల్లిదండ్రులు వున్నారు. సావిత్రి చూసుకుంటుందని వూరుకున్నాను. ఎంతయినా అత్తగారిని కదా! అదీ మంచిదే అయింది. అనవసరంగా తొందరపడలేదు.
ఈరోజు నా పుట్టిన రోజు. వౌళి ఎప్పుడు నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పకుండా వుండడు.
ఈసారి వాడి కంఠంలో చాలా కొత్త ఉత్సాహం తొంగిచూసింది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి