కడప

ఉక్కు పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, డిసెంబర్ 21: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వ హామీల్లో ప్రధానమైన కడప ఉక్కు పరిశ్రమకై నేతలు ఉక్కు పట్టుపట్టారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఉపరాష్టప్రతి ఛాంబర్‌లో ఉపరాష్టప్రతి వెంకటనాయుడు సమక్షంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు, జిల్లా నేతలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకై సమీక్షలో పాల్గొని చర్చించారు. సమీక్షలో చర్చించిన అంశాలపై రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, మత్స్యశాఖ, పశుసంవర్ధక, సహకారశాఖ మంత్రి సీ. ఆదినారాయణ ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకై సమీక్ష జరిగిందన్నారు. సమీక్షలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం త్వరగా ఏర్పాటు చేయాలని నేతలందరూ ఒకేతాటిపై కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్‌ను కోరామన్నారు. ఈ విషయంపై మంత్రి బీరేందర్ సింగ్ స్పందిస్తూ ఇప్పటికే టాస్క్ఫోర్స్ కమిటీ ప్రాథమిక నివేదిక అందిందన్నారు. మరో మాసం రోజుల్లో తుది నివేదిక అందేఅవకాశం ఉందన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం ఒనకూర్చే వనరుల వివరాలు, వసతులు తెలపాల్సి ఉందన్నారు. ఈనెల 27వ తేదీన నిర్వహించే సమావేశంలో ఎటువంటి కర్మాగారం ఏర్పాటు చేయాలి, ఎవరు ఏటువంటివి సమకూర్చాలి అన్న అంశాలపై రోడ్‌మ్యాప్ ఖరారయ్యే అవకాశం ఉందని కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ తెలిపారన్నారు. గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఉక్కు పరిశ్రమపై ఎంతో చొరవచూపారు. కేంద్రమంత్రి ప్రకటించిన విషయాల మేరకు ఈనెల 27వ తేదీన ఉక్కు పరిశ్రమపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, కడప జిల్లా ఇన్‌చార్జి, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా నాయకులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, ఎన్.వరదరాజులు రెడ్డి, ఎన్.రమేష్‌నాయుడు, పలువురు నేతలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రులను కలిసిన విప్ మేడా
రాజంపేట: జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై విప్ మేడా మల్లికార్జునరెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్, కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను కలసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ కడపజిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయడం వలన యువతకు ఉపాధితోపాటు జిల్లా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతుందని వివరించారు. అదేవిధంగా తిరుపతి నుండి న్యూఢిల్లీ వెళుతున్న ఎపి సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు రాజంపేటలో స్టాపింగ్ కల్పించాలని, మచిలీపట్నం నుండి తిరుపతి వస్తున్న మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగిస్తే రాజధాని అమరావతి వెళ్లేందుకు కడపజిల్లా వాసులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. చెన్నై నుండి హుబ్లివెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్‌శాఖ ఏఈ
* కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా అరెస్టు
ఖాజీపేట, డిసెంబర్ 21: కడప నగరంలోని ఇరిగేషన్ కార్యాలయం కడప డివిజన్-1లో పనిచేస్తున్న ఏఈ నియాజ్ అహ్మద్‌ను గురువారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ నందలూరు మండలానికి చెందిన పఠాన్ అక్బర్ ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం కింద రూ.4.98 లక్ష పనులు చేశాడన్నారు. వీటికి సంబంధించిన బిల్లుల కోసం కడప డివిజన్‌లో పనిచేస్తున్న ఏఈ నియాజ్‌ను కలిశాడన్నారు. బిల్లు చేయాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడన్నారు. దీంతో అక్బర్ గత్యంతరంలేని పరిస్థితిలో తమను ఆశ్రయించాడన్నారు. ఏఈ నియాజ్ పఠాన్ డబ్బు తీసుకుంటుండగా సిబ్బందితో కలిసి దాడులు జరిపి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈదాడిలో ఏసిబి సీఐలు రామచంద్ర, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆడపిల్లల నిష్పత్తి పెంచాలి
ఖాజీపేట, డిసెంబర్ 21: ప్రతి వ్యక్తికి మొదటి గురువు తల్లేనని ప్రతి ఒక్కరు ఆడపిల్లజననాన్ని ఆహ్వానించి ఆడపిల్లల నిష్పత్తి పెంచాలని జిల్లాకలెక్టర్ టీ.బాబూరావునాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సెన్సీటైజేషన్, సామర్థ్యనిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత శాసనాలు చేసే పార్లమెంట్‌చే ఆమోదించబడిన చట్టంపై అవగాహన కల్పించి దీనిపై సామాన్యులకు కూడా నియమనిబంధనలు తు.చ తప్పకుండా అమలుపరిచి ఆడపిల్లల నిష్పత్తి పెంచాలన్నారు. స్కానింగ్ ద్వారా పుట్టబోయే ఆడ, మగ అని తెలుసుకుని భ్రూణ హత్యలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆడమగ అంతా ఒకటేనని వివక్షత చూపించరాదన్నారు. జెసి-2 శివారెడ్డిమాట్లాడుతూ ప్రస్తుతం మంచి ఫలితాలు ఆశించి సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్నామని దాన్ని పెడదారిలో పెట్టి స్కానింగ్ ద్వారా లింగనిర్థారణ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మన సంస్కృతిలో ఆడపిల్లలను పండుగలకు, తదితర కార్యక్రమాలకు పిలిపించుకుని చేసే సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయన్నారు. మహిళలులేని సమాజమే ఉండదన్నారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ప్రసాద్ మాట్లాడుతూ పూర్వకాలం ఆడపిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా ఉండేందుకే బయటకు తెచ్చేవారుకాదని ప్రస్తుతం ఆడపిల్లలోకానికే కాకుండా నూతన సాంకేతికను ప్రయోగిస్తున్నారని, నైతిక విలువలు లేకుండా పోతున్నాయన్నారు. డీఎంహెచ్‌వో ఉమాసుందరి, పీసీ అండ్ పీఎన్‌టీడీ చట్టంలోని కీలక అంశాలపై వివరించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో రామేశ్వరుడు, మోక్షేశ్వరుడు, డీసీపీవో శివప్రసాద్‌రెడ్డి, డెమో ఈశ్వరయ్య, ప్రోగ్రాం అధికారి గుణశేఖర్, వైద్యులు, ఇతర శాఖల అధికారులు, స్వచ్చంధ సంస్థలు, స్కానింగ్ సెంటర్ల వైద్యులు పాల్గొన్నారు.
ఎర్రచందనం రవాణాపై ప్రత్యేక నిఘా
ఒంటిమిట్ట, డిసెంబర్ 21: జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం, ఇసుకలతో పాటు యువతను భ్రష్టుపట్టిస్తున్న మట్కాపై డేగకన్ను వేసినట్లు ఎస్పీ అడ్డాడ బాబూజీ అన్నారు. గురువారం సాయంత్రం ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం వృక్షాలకు నిలయమైన ఒంటిమిట్టతో పాటు జిల్లాలోని మిగతా ప్రాంతాలలో ఉండి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. తెర వెనుక ఉన్న బడా స్మగ్లర్లు, కూలీలపై ప్రత్యేకనిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలోని నాలుగు ముఖ్య పట్టణాలలో కమాండింగ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటి ఏర్పాటుతో గత 6 నెలలుగా కొంతవరకు స్మగ్లింగ్‌ను నిరోధించామన్నారు. ఇప్పటికే కడప, జమ్మలమడుగు, రాయచోటి, మైదుకూరులలో కమాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, మిగిలిన పట్టణాలలో కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అటవీశాఖ సహకారంతో కూంబింగ్ ఏర్పాటు చేశామన్నారు. హైవేలలో ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు ప్రజలకు చేరువగా ఉండాలని ఆయన సూచించారు. మట్కా, గ్యాంబ్లింగ్‌తో యువత చెడిపోతుందని, వీటిని నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంటిమిట్ట కోదండ రాముని సన్నిధిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ సమావేశంలో డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ రవికుమార్, ఎస్సై, పోలీసులు పాల్గొన్నారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేయద్దు
* మునిసిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి
ప్రొద్దుటూరు, డిసెంబర్ 21: రానున్న క్రిస్‌మస్, నూతన సంవత్సరం పండుగల సందర్భంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని మునిసిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తెలిపారు. 279 జీవో రద్దుకోసం కార్మికులు చేస్తున్న సమ్మె సందర్భంగా ఆయన గురువారం కార్మికులను కలిసి రానున్న క్రిస్‌మస్, నూతన సంవత్సరం పండుగల సందర్భంగా పట్టణంలో పారిశుద్దాన్ని మెరుగుపరచాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. కార్మికుల సమ్మె తమకు ఎటువంటి అభ్యంతరము లేదన్నారు.
గృహ మిత్రసభ్యుల ఎంపికపై నిరసన
చాపాడు, డిసెంబర్ 21: గృహనిర్మాణ సంస్థలో ఇంతవరకు వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేసిన వారిని గృహమిత్ర సభ్యులుగా ప్రభుత్వం ఎంపిక చేయడంపట్ల పలువురు సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గృహమిత్ర సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఇన్‌స్పెక్టర్లును గృహమిత్ర సభ్యులుగా నియమిస్తూ జీతం లేకుండా కమిషన్ ఏర్పాటు చేయడంపట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి ఇంతవరకు ప్రతినెల 12 వేల రూపాయలు జీతం చెల్లిస్తూ రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం గృహ మిత్ర సభ్యులుగా ఎంపికైన వారికి ఒక్కొ యింటికి 5 స్లాబులుగా విభజిస్తూ ఒక్కొక్క స్లాబుకు 150 రూపాయలు చొప్పున ప్రభుత్వం కమిషన్ ఇస్తాననడంలో మా గొంతు నొక్కేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ పద్దతిలోకాకుండా గతంలో మాదిరిగా జీతంను కొనసాగిస్తూ మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు.
నేడు ప్రజా సమైఖ్య సమావేశం
ప్రొద్దుటూరు, డిసెంబర్ 21: పట్టణంలోని విజయనగరం వీధిలో జీవనజ్యోతి పాఠశాలలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రజాసమైఖ్య సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ వ్యవస్థాపకుడు ఆత్మశ్రీ ధర్మతేజ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాసమైఖ్య సంఘం ఉద్దేశాలను, లక్ష్యాల గురించి ప్రజలకు తెలియజేయడానికి కరపత్రాలను విడుదల చేయనున్నామన్నారు. సంఘంలో సభ్యులగా చేరడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరు సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రకటనలో తెలిపారు.
కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
ప్రొద్దుటూరు, డిసెంబర్ 21: 279 జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని ఏపీ మునిసిపల్ వర్క్‌ర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి విజయకుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.సత్యనారాయణ డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా రాష్టవ్య్రాప్త పిలుపుతో భాగంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా 4వ రోజు గురువారం ఏపీ మునిసిపల్ వర్క్‌ర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు మునిసిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్ళపై వినూత్న నిరసణతో బైటాయించారు. వెంటనే 279 జీవో రద్దు చేయాలని కార్మికులకు 18000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని వారు డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మునిసిపల్ వర్క్‌ర్స్ , ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామాల్లో అధికారుల పల్లెనిద్ర
బి.మఠం, డిసెంబర్ 21: కలెక్టరు ఆదేశాల మేరకు ప్రతినెల చివరి వారంలో మండలస్థాయి అధికారులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి సోమిరెడ్డిపల్లె పంచాయితీలోని నరసనపల్లె, సోమిరెడ్డిపల్లె గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి కుటుంబం మరుగుదొడ్లు తప్పనిసరిగా కట్టించుకోవాలని, గ్రామాల్లో మురుగు నీరులేకుండా చూసుకోవాలని ప్రతివ్యక్తి మన ఇండ్లు, మన ఊరు అనే నినాదంతో వుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ దామోదర్‌రెడ్డి, ఈఓపిఆర్‌డి రామచంద్రారెడ్డి, పంచాయితీ కార్యదర్శి సురేష్‌బాబు, తదితర అధికారులు పాల్గోన్నారు.

దీర్ఘకాలిక సమస్యలపై చర్చా వేదిక
రైల్వేకోడూరు, డిసెంబర్ 21:రైల్వేకోడూరు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం త్వరలో చర్చావేదికను నిర్వహించనున్నట్లు సీపీఏం నాయకులు సీహెచ్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. గడిచిన మూడు దశాబ్దాలుగా కోడూరు దీర్ఘకాలిక సమస్యలను ప్రజాప్రతినిధులు కాని, అధికారులు కాని పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఏలాంటి అభివృద్ధి ఇక్కడ జరగడం లేదన్నారు. కోడూరు బైపాస్ రోడ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వెంకటగిరి రోడ్డు, పండ్లతోటలకు బీమా, రైల్వే అండర్‌బ్రిడ్జి, వాగులపై సర్ఫేస్ చెక్‌డ్యామ్‌లు, ఆర్టీసీ డిపో వంటి సమస్యలను పాలకులు పరిష్కరిస్తే జిల్లాలోనే రైల్వేకోడూరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు.
12 మందికి కంటి ఆపరేషన్లకు సిఫార్సు
పెనగలూరు, డిసెంబర్ 21:పెనగలూరు కొత్తపల్లె వినాయక మంటపం వద్ద గురువారం ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో తిరుపతికి చెందిన శ్రీనివాస శంకర నేత్రాలయం వైద్యులు 12 మంది రోగులకు అపరేషన్లకు సిపార్సు చేశారు. ఈ శిబిరంలో పెనగలూరు, రైల్వేకోడూరుకు చెందిన లింగాల రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ ఇవి ముని బృందం రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కందుల జయరామయ్య, సుబ్బారావు రోగులకు సహయ, సహకారాలు అందజేశారు.
కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
రాజంపేట రూరల్, డిసెంబర్ 21:రాజంపేటలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగు రోజులుగా కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఈ సమ్మె గురువారం నాటికి నాల్గవ రోజుకు చేరింది. ఈసందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి సి.రవికుమార్ మాట్లాడుతూ శుక్రవారం గాంధీ విగ్రహాం ఎదుట నిరసన కార్యక్రమం, శనివారం మున్సిపల్ కార్యాలయ ముట్టడి, 25న కొవ్వొత్తులతో ప్రదర్శన, 27న కార్మికుల కుటుంబాల రిలే దీక్షలు, 29న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమ్మెకు మద్ధతుగా వైకాపా నాయకులు పోలా శ్రీనివాసులరెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, సి.యల్లారెడ్డి, మురళిరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.