రాష్ట్రీయం

ప్రకృతి సోయగాల నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెంచుల పూజలందుకునే లింగమయ్య నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు

లింగాల, మార్చి 27: నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య వెలసిన క్షేత్రం సలేశ్వరం. నింగినుండి నేలకు జాలువారే సెలయేరు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి నీరు మండువేసవిలోనూ చల్లగావుంటూ.. తాకితే ఎంతో హాయిని, ఆనందాన్ని కలిగిస్తుంది. చెంచులకు వేసవి విడిదిలా ఉండే ఈ ప్రదేశం సర్వేశ్వరంగా గతంలో ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా ఈ క్షేత్రమే శైలేశ్వరం, సలేశ్వరంగా పిలవబడుతోంది. శైలమంటే కొండ.. కొండలో ఈశ్వరుడు ఉన్నందున శైలేశ్వరం.. సెల అంటే జలపాతం (కొండవాగు) అని ఈ ప్రదేశంలో ఈశ్వరుడు ఉన్నందున సలేశ్వరం అని పిలువబడుతున్నట్లు తెలుస్తోంది. నీరుపారే పైభాగాన్ని పుష్కరతీర్థమని, మిగతా ప్రాంతాన్ని సర్వేశ్వర తీర్థంగా చెబుతుంటారు. ఈ తీర్థానికి పడమరవైపు 10 అడుగుల ఎత్తులో గుహాలయమే శనీశ్వరాలయం. ఇక్కడున్న గర్బాలయ ముఖమండపాలకు మధ్యగల గోడను చరిత్రకారులు పరిశీలించి క్రీ.శ 6-7 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు. ఆలయం కుడివైపున మూడడుగల వీరభద్ర విగ్రహం ఉంది. నల్లమల అడవుల్లోని లోయల మధ్య ప్రకృతి సోయగాల నడుమ చూడముచ్చటగా ఉన్న సలేశ్వర క్షేత్రంలో ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ రోజున బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయ. ఈ క్షేత్రం శ్రీశైలానికి 28కి.మీ. దూరంలో ఉంది. దట్టమైన అడవుల్లో ఉన్న సలేశ్వర క్షేత్రానికి ఇప్పటివరకు రోడ్డు నిర్మించలేదు. సలేశ్వర క్షేత్రానికి వెళ్ళేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. లింగాల మండల కేంద్రం నుండి 40 కి.మీ. నడవాల్సి ఉంటుంది. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలో పరహబాద్ గేట్‌నుండి లోపలికి వెళ్ళేందుకు మరోమార్గం ఉంది. రాంపూర్‌పెంట నుండి వాహనాలు కొద్దిదూరం వెళ్ళి ఆగిపోవాల్సి ఉంటుంది. అక్కడినుండి లోయలలో దిగుతూ సుమారు 5 కి.మీ. నడవాల్సి ఉంటుంది. పూర్తిగా అడవిలో ఆవరించి ఉన్నందున ఈ క్షేత్రంలో పూజా కార్యక్రమాల్ని చెంచులే నిర్వహిస్తారు. చెంచులే వలంటీర్లుగా ఉంటూ వచ్చిన భక్తులకు సహాయ సహకారాలను అందజేస్తారు. లోయల్లో సుమారు రెండు కి.మీ. దిగువన లింగమయ్య స్వామి వెలసి ఉన్నాడు. స్వామికి ఎదురుగా 300 అడుగుల ఎత్తునుండి జలపాతం దూకుతూ ఉంటుంది. భక్తులు అక్కడికి వెళ్ళి స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు. పగలు సైతం ఈ లోయ చీకటిగానే ఉంటుంది. అందువల్ల ఇక్కడ జనరేటర్లను ఏర్పాటుచేసి విద్యుత్ దీపాలను వెలిగిస్తారు. ఐటీడీఏ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఈ లోయ మార్గంలో ఒక్కొక్కరు నడువడానికి మాత్రమే దారి ఉంటుంది. సలేశ్వరానికి వచ్చే భక్తులు దారిపొడవునా ‘లింగమయ్య నీ దగ్గరకు వస్తున్నాం, ఓ నమః శివాయః’ అంటూ నినాదాలిస్తారు. దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు ‘వెళ్లొస్తాం లింగమయ్య’ అంటూ అప్పగింతలు చేస్తారు. మండువేసవిలో కాలినడకన ఈ క్షేత్రానికి తరలి వస్తున్నందున దారి పొడవునా మంచినీటి వసతి కల్పించడంతోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలవారు అన్నదాన కార్యక్రమాలను చేపడతారు. వయో లింగ భేదం లేకుండా రాత్రి పగలు కాలినడకన రావడం ఈ క్షేత్రం ప్రత్యేకత.