డైలీ సీరియల్

పంచతంత్రం-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే గోపిక తన గదిలోకి వెళ్లి కార్తీక్‌కి ఫోన్‌ చేసింది.
ఆ సమయంలో బైక్‌మీద నిరంజన్‌ను వెంబడిస్తున్నాడు కార్తీక్. అతడు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు.
గోపిక కంగారుగా చెపుతోంది.
‘‘కార్తీక్!... ఎవడో గుండా.... మా ఇంటికి వచ్చాడు... కొండాపూర్ రిజిస్ట్రేషన్స్ వెంటనే పూర్తి చెయ్యాలి అంటున్నాడు. ముందు గదిలో కూర్చుని ఉన్నాడు. మా నాన్నతో మాట్లాడుతున్నాడు. కార్లో తీసకుపోతాట్ట.’’
కార్తీక్ వేగంగా ఆలోచించాడు గోపికని అడిగాడు.
‘‘మా ఫాదర్ వాళ్ళు కూడా ఆ కార్లో ఉన్నారా?’’
‘‘ఉన్నారు.’’
‘‘ఓకే!.... భయపడకు...!! ... మనకు ఇంకా రెండుమూడు గంటల టైము ఉంది.’’
‘‘ఆ టైం సరిపోతుందా?’’
‘‘ఆ టైములో ఎంతో చెయ్యవచ్చు..! వాడు వచ్చిన ఇన్నోవా నంబర్ ఎంత...? చూడకపోతే చూసి చెప్పు.. లైన్లో ఉంటా!’’
నిమిషం తర్వాత గోపిక ఇన్నోవా రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పింది.
‘‘ఓకే...! నా ప్లాన్ విను...!’’ అంటూ గోపికతో ఏదోచెప్పి ఫోన్ కట్ చేసాడు కార్తీక్.
* * *
దుర్గారావ్, మహేంద్రలు ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ బైక్‌ను మహేంద్ర నడుపుతున్నాడు.
‘‘ఏమైంది?’’ వెనక సీట్‌లో కూర్చునివున్న దుర్గారావు అసహనంగా అడిగాడు.
‘‘తెలియదు సర్!’’ అన్నాడు మహేంద్ర.
వాళ్ళను బైక్‌మీద ఫాలోఅవుతున్న హరీష్ కూడా ఆగాడు.
ఆ ప్రాంతంలో జన సంచారం తక్కువగా ఉంది. ఆటోలు, బస్‌లు కూడా అందుబాటులో లేవు.
హరీష్ ఏదో ఆలోచించి కార్తీక్‌కి ఫోన్‌చేసి, దుర్గారావ్, మహేంద్రలు దారిలోనే ఆగిపోయిన విషయం చెప్పాడు. సమాధానంగా అన్నాడు కార్తీక్.
‘‘వీళ్ళకూ, ఆ బాల్‌రాజ్ గ్యాంగ్‌కూ గొడవ జరిగి, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలి. అందరూ మనకుమాత్రమే కాదు ఈ సమాజానికి కూడా శత్రువులు... పచ్చినెత్తురు తాగే రాక్షసులు. ఇలాంటివాళ్ళు బతక్కూడదు. అది జరగాలంటే వీళ్ళు అక్కడికి చేరుకోవాలి... ముఖానికి మాస్క్, తలకు హెల్మెట్ పెట్టుకున్నావా?’’
‘‘ఆ పెట్టుకున్నా!’’
‘‘వెంటనే వెళ్ళు... వాళ్ళ బైక్ సంగతి చూడు! అది స్టార్ట్‌అవ్వాలి.’’
‘‘ఓకే...!’’
తన బైక్‌ను స్టార్ట్‌చేసి ముందుకుపోనిచ్చి, దుర్గారావ్, మహేంద్రల దగ్గర బైక్ పక్కన ఆపి, వాళ్ళని అడిగాడు హరీష్.
‘‘బైక్ ట్రబులా?’’
‘‘అవును!’’అంటూ అసహనంగా చెప్పాడు మహేంద్ర.
హరీష్ తన బైక్ కిట్‌లో ఉన్న స్పార్క్‌ప్లగ్ స్పాన్సర్‌తో మహేంద్ర బైక్ దగ్గరికి వచ్చాడు.
తన బైక్‌కి మహేంద్ర సైడ్ స్టాండ్ వేసాడు.
హరీష్ స్పార్క్‌ప్లగ్ విప్పి, దాన్ని తనదగ్గరున్న కర్చ్ఫీతో క్లీన్‌చేసి, మళ్ళీ బిగించాడు.
మహేంద్ర కిక్ కొట్టాడు. బైక్ స్టార్ట్ అయింది. దుర్గారావ్ కూడా కూర్చున్న తర్వాత బైక్ ముందుకుపోనించాడు మహేంద్ర.
కనీసం అతడు హరీష్‌కి థాంక్స్ కూడా చెప్పలేదు.
వాళ్ళు కొంతదూరం వెళ్ళిన తర్వాత బైక్ స్టార్ట్‌చేసాడు హరీష్.
* * *
నిరంజన్ వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు.
‘‘ఎక్కడ కలవాలో నువ్వే నిర్ణయించుకో...! నువ్వు అక్కడికి వెళ్ళు... నేను నిన్ను కలుస్తాను...’’అంటూ చెప్పిన వేలాయుధం చెప్పిన మాటలు నిరంజన్‌కు గుర్తుకువచ్చాయి.
ఆ మాటలను కార్తీక్ కూడా మననం చేసుకుంటున్నాడు.
‘‘నిరంజన్‌ని వేలాయుధం ఫాలోఅవుతున్నాడా?...’’ ఆలోచిస్తున్న కార్తీక్‌కి సినిమా హాల్‌దగ్గర నిరంజన్ వెయ్యి నోటుకు చిల్లర తీసుకున్న విషయం కార్తీక్‌కి గుర్తుకువచ్చింది.
అప్పుడు ఎవరోవ్యక్తి నిరంజన్‌కు కొత్త ఐదొందల నోటుఇచ్చాడు.
కార్తీక్‌కి అకస్మాత్తుగా గుర్తుకువచ్చింది. అసలు ఇంతవరకూ కొత్త ఐదువందల నోటు సిటీలో దొరకడం లేదు. మరి ఆ వ్యక్తిదగ్గర ఆ నోటు ఎక్కడిది?’’
‘‘ఆ వ్యక్తి వేలాయుధం అయి ఉంటాడా...? లేక అతడు వేలాయుధం మనిషి అయి ఉంటాడా?’’
అంతలో కార్తీక్ దగ్గర ఉన్న సెల్ వైబ్రేట్ అయింది. ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు.
అవతలినుంచి గోపిక చెపుతోంది.
‘‘మనవాళ్ళు అంతా రిజిస్ట్రార్ ఆఫీసులో చెట్లకింద కూర్చుని ఉన్నారు. వాడు కాంటీన్లో టీ తాగుతున్నాడు. నేను ఫాలో అవుతూ వచ్చాను. హెల్మెట్ పెట్టుకున్నాను.’’
‘‘ఓ.కే.... రెడీగా ఉండు!’’
ఫోన్ కట్‌చేసి, జేబులోపెట్టుకుని మరో జేబులోంచి బాల్‌రాజ్ ఫోన్ తీసాడు కార్తీక్.
ఆ ఫోన్‌నుంచి నంబర్ వందకు రింగ్ చేసాడు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఫోన్ మోగింది.
ఆపరేటర్ లైన్‌లోకి రాగానే చెప్పాడు.
‘‘నోట్లమార్పిడి ముఠా గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలి.’’
‘‘లైన్లో ఉండండి...!’’
నిమిషం తర్వాత ఒక వ్యక్తి కంఠం వినపడింది.
‘‘చెప్పండి!’’
‘‘సర్కిల్ ఫైవ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర నోట్లమార్పిడి జరుగుతోంది. ఇన్నోవా కారులో పెద్దమొత్తంలో నోట్లు ఉన్నాయ్. వెంటనే వెడితే దొరుకుతాయి.’’
‘‘కారు నంబర్ ఎంత?’’
ఇన్నోవా నంబర్ చెప్పాడు కార్తీక్.
* * *
సర్కిల్ ఫైవ్ రిజిస్ట్రార్ ఆఫీస్.
అప్పటికి పోలీస్‌లకు కార్తీక్ ఫోన్‌చేసి అరగంట అయింది.
ఇంకా పోలీసులు రాలేదు. గోపికలో టెన్షన్ పెరిగిపోతోంది. ఆమె తమ వాళ్లకు తను కనపడకుండా దూరంగా నిలబడి ఉంది. రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ బయటకు వచ్చి-
‘‘వాసుదేవరావు.... వాసుదేవరావు...!’’అంటూ అరిచాడు.
కార్తీక్ తండ్రి వాసుదేవరావు బెంచీ మీద నుంచి లేచాడు.
ఆయన ముఖం వాడిపోయి ఉంది. బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు.
చాయ్ దుకాణం దగ్గర నిలబడి ఉన్న వైకుంఠం ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షం అయింది. కాని అంతలోనే అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు