రాష్ట్రీయం

సమస్యల లోగిలి పోసాన్‌పల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఈ నిధులు అన్ని గ్రామాలకు చేరడం లేదని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో అభివృద్ధి కాస్తో, కూస్తో కనిపిస్తున్నప్పటికీ, ప్రముఖ వ్యక్తుల ప్రాతినిధ్యం లేని గ్రామాల్లో పరిస్థితి అతి దీనంగా ఉంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండంలోని పోసానిపల్లి గ్రామం ఇందుకు ఉదాహరణ. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోసానిపల్లి గ్రామం అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
సుమారు 250 గడపలున్న ఈ గ్రామంలో దాదాపు 700-800 జనాభా ఉంటుంది. గ్రామం పేదరికంతో మగ్గుతుండటంతో దాదాపు 80 శాతం ఇళ్లన్నీ పెంకుటిళ్లే. గ్రామంలో 90 శాతం పేదలే ఉన్నారు. వ్యవసాయమే ఈ గ్రామస్థులకు జీవనాధారం. పంటలు కూడా సరిగ్గా పండకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇక్కట్లలో జీవిస్తున్నారు. రైతులకు సర్కారు నుండి ఎలాంటి చేయూతా లభించడం లేదు. యువతీ యువకులు స్వయం ఉపాధి చేపట్టాలనుకున్నా వారికి సర్కారు నుండి ఎలాంటి సహాయం అందడం లేదు. స్వయం ఉపాధికి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిన విషయం కూడా గ్రామస్తులకు సరిగ్గా తెల్వదు. ఎస్‌సీలు ఎక్కువగా ఉంటున్న ఈ గ్రామంలో ఎస్‌సి సంక్షేమ పథకాలు ఏవీ ఏ ఒక్కరికీ చేరలేదు. బీసీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎస్‌సి ఫైనాన్స్ కార్పోరేషన్, ఎస్‌టి ఫైనాన్స్ కార్పోరేషన్, బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్లు ఉన్న విషయం కూడా గ్రామస్తులకు సమాచారం లేదు. ఈ కార్పొరేషన్ల నుండి ‘రూపాయి’ కూడా గ్రామస్తులకు అందలేదు.
పోసానిపల్లిలో చాలా వరకు మట్టిరోడ్లే ఉన్నాయి. రెండుమూడు సీసీ రోడ్లు ఉన్నాయి. గ్రామంలోని కేంద్ర ప్రాథమిక పాఠశాల పక్కనే రోడ్డు కాలువలా మారింది. వానపడితే ఈ రోడ్లు వాగులను తలపిస్తోందని, విద్యార్థులు తీవ్రమైన అవస్థలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. వృద్ధులు, గర్భిణులు ఈరోడ్డుపై నడవలేక జారి కిందపడుతున్నారు. ‘ఈ రోడ్డు బాగు చేయండి సారూ’ అంటూ సాయమ్మ అనే మహిళ కనిపించనవారినల్లా వేడుకుంటోంది. 2000 సంవత్సరంలో శ్రీసత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు ద్వారా ఈ గ్రామానికి తాగునీటి సరఫరా జరుగుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిన తర్వాత తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఏడాది నుండి సత్యసాయి నీళ్లు రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం బోర్‌వెల్ నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ఈ గ్రామానికి రాలేదు. మురుగునీటి పారుదల కాలువలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. గ్రామంలో ఎక్కడ చూసినా మురుగునీరే రోడ్లపై పారుతోంది.
ప్రభుత్వం డబల్‌బెడ్ రూం ఇళ్ల పథకం గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటుండగా, పోసాన్‌పల్లికి డబల్ బెడ్‌రూం ఇల్లు ఒక్కటి కూడా రాలేదు. గత రెండు మూడు ఏళ్లల్లో కురిసిన భారీ వర్షాలకు ఈ గ్రామంలోని దాదాపు 20 మంది పైగా పేదల ఇళ్లు (పెంకుటిళ్లు) కూలిపోయాయి. ఇళ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదు. కమ్మరి నాగయ్య ఇల్లు సగానికిపైగా గత ఏడాదే కూలిపోయింది. వృత్తిపని సరిగ్గా లేకపోవడంతో ఆదాయం లేక జీవనం గడిపేందుకే కష్టమవుతోందని, ఈ స్థితిలో ఇంటిని బాగుచేసుకోలేకపోతున్నానని ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో నాగయ్య చెప్పారు. కొత్త ఇల్లు మంజూరు చేస్తే తలదాచుకునేందుకు నీడ ఉంటుందని నాగయ్యతో పాటు ఇళ్లు కూలిన ఇతరులు పేర్కొన్నారు.
అంగన్‌వాడీ ఉన్నప్పటికీ దీనికి భవనం లేదు. పాడుబడ్డ ఒక పెంకుటి ఇంటిలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఇల్లు శిథిలావస్థలో ఉండటంతో ఎప్పుడు కూలిపోతుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ ఇల్లు కూలితే అంగన్‌వాడీలో ఉండే పిల్లల ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్నది వీరి భయానికి కారణం. గ్రామంలో ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. రోగం వస్తే సంగారెడ్డికి కాని జోగిపేటకు గానీ వెళుతామని గ్రామస్తులు తెలిపారు.
సంగారెడ్డి-జోగిపేట పట్టణాల మధ్య ఉన్న చౌటకూరు అనే గ్రామం ఉంది. చౌటకూరు వరకు ఆర్టీసి బస్సులో వెళ్లి, అక్కడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోసానిపల్లికి నడిచి వెళ్లాలి లేదా ఆటోలో వెళ్లాలి. ఈ గ్రామానికి ఆర్టీసి బస్సు సౌకర్యం లేదు. పోసానిపల్లికే కాదు.. ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న బొమ్మారెడ్డి గూడెం, లక్ష్మీసాగర్, పోతిరెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి, లాల్‌సింగ్ తాండ, ఉమ్మానాయక్ తండా, ఎన్నతండాలకు కూడా బస్సులు వెళ్లవు. ఈ గ్రామాలకు ‘షేరింగ్ ఆటో’లే దిక్కవుతున్నాయి. ఆటోల్లో ప్రయాణం ప్రమాదకరమైనప్పటికీ, పోసాన్‌పల్లి తదితర గ్రామాల ప్రజలకు షేరింగ్ ఆటోలపై ఆధారపడక తప్పడం లేదు.
గ్రామంలో ఏడో తరగతి వరకు ‘కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాల’ ఉంది. ఏడు తరగతులు ఉన్నప్పటికీ నాలుగు గదులే ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు తాగునీటి సదుపాయం లేదు. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. గ్రామస్తులకు కమ్యూనిటీ హాల్ ఏమీ లేదు. ఎవరైనా ‘పెద్దలు’ గ్రామానికి వస్తే గ్రామం మధ్యలో ఉన్న చెట్టూ, దాని చుట్టూ కటిన అరుగు (చావిడీ) సమావేశాలకు దిక్కవుతోంది.
కొత్తగా పంచాయతీ
--------------
ప్రస్తుతం చౌటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పోసానిపల్లి కొత్తగా గ్రామ పంచాయతీగా మారింది. గ్రామ పంచాయతీకి భవనం ఏమీ లేకపోవడంతో చావిడీనే గ్రామ పంచాయతీగా ఉపయోగించాల్సి వసుందని గ్రామస్తులు శ్రీశైలం, బోయిని మల్లేష్ తదితరులు తెలిపారు. పోసానిపల్లి ఆందోల్ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌కు చెందిన బాబుమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాబూ మోహన్ 2014 ఎన్నికల సమయంలో వచ్చారని, ఆ తర్వాత తమ గ్రామంవైపు కనె్నత్తి కూడా చూడలేదని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పూనుకోవాలని వారు కోరుతున్నారు.

చిత్రం..గ్రామంలో మట్టిరోడ్డు