డైలీ సీరియల్

పచ్చబొట్టు-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మరి తీసుకో’
‘‘నీ ఎత్తులు నాకు తెలియవా? అది ఎలా చేరాలో అలా నా దగ్గరకు చేరుతుంది. అదీ నీకు తెలిసేలా కాదు, ఒకసారి ఉపయోగించిన ఎత్తును ఏ తెలివైనవాళ్ళూ మళ్లీ ఉపయోగించరు. అందులో మీ లాంటి పోలీసాఫీసర్ల దగ్గిర’’.
‘‘గొప్పే’’
‘‘గొప్ప పనే చేశావ్ అనే్వష్. ఈ రోజు శివరాత్రి అయినా బాగుండేది. ఎంచక్కా ఫలితం దక్కేది. చక్కగా మళ్లీ ఎవరినో పట్టుకొని పేరు కొట్టేసేవాడివి. బాడ్‌లక్. పోనీలే. మరోసారి ఆ ఛాన్స్ కొట్టేద్దువుగాని’’
‘‘ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది’’
‘‘అలాగేం! చెల్లి పెళ్లి ఓ.కే చేశావుగా. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు.. నీ ముందుంటా’’
‘‘నీకు నేనంటే ఇష్టం. నాకు నువ్వంటే అంతకన్నా ఇష్టం. ఇది చాలదా నువ్వు నా ముందుకు రావటానికి’’.
‘‘అచ్ఛా’’ అంది చిలిపిగా.
‘‘సరే! రా ముందుకు’’
‘‘ఇపుడేగా చెప్పావు. తొందరలోనే వస్తాను. నీ ఆశ తీరుస్తాను. ఆ రోజుకోసం ఎదురుచూస్తూ ఉండు’’.
‘‘అదేంటి పట్టుకుంటానన్నావుగా?’’
‘‘నువ్వు దొరక్కపోతేగా’’
‘‘ఓకె అనే్వష్, ఇంతకుమించి నీతో మాట్లాడకూడదు. బాయ్.. స్వీట్ డ్రీమ్స్’’ అంటూ ఫోన్ పెట్టేసింది.
***
గోడలమీద పోస్టర్లు పడ్డ మరునాడు.. శ్రీకాళహస్తినంతా ఓ సోదిమ్మలా చుట్టబెట్టేసింది. ఓ ముసలమ్మ.. కర్ర సాయంతో వణుకుతూ... వంగుతూ.. నడుస్తూ.. సోదోయమ్మ సోది.. సోది చెబుతానంటూ వెళ్లి బియ్యం తీసుకొనేప్పుడు తనకు నచ్చిన ఆడవాళ్ళకు భద్రంగా ఓ బుల్లి పాకెట్ అందించింది. మూడో కంటికి తెలియకుండా ఊరంతా పంచేసింది. చివరగా ఇంటికి వెళ్లిపోతూ సినిమా టాకీస్ దగ్గర ఏదో గొడవ జరుగుతోందని వచ్చిన యస్‌ఐ అనే్వష్ దగ్గరకు వచ్చి ‘సోది చెప్పనా బాబూ!’ అంది.
‘‘వద్దమ్మా! నాకిలాంటి వాటిమీద నమ్మకం లేదు’’ అన్నాడు.
‘‘అయినా ఈ వయసులో నీకీ కష్టం ఏమిటి మామ్మా’’ జాలిగా చూస్తూ అన్నాడు.
‘‘నీతో వస్తా తీసుకుపోతావా?’’
‘‘తప్పకుండా రావమ్మా! మా ఇంట్లో పెద్ద దిక్కు లేదనే దిగులు పోతుంది నాకు’’ సిన్సియర్‌గా చెప్పాడు.
‘‘నా బాబే! నూరేళ్ళు చల్లంగా ఉండు. నా ఆయుష్షు కూడా పోసుకుని బ్రతుకు. నాకెవ్వరూ బువ్వ పెట్టని రోజున నీ దగ్గరకే వస్తాలే! వస్తా బాబూ. జ్ఞాపకం ఉంచుకో’’ అంటూ వెళ్లిపోయింది.
‘‘రహస్యం.. రహస్యం’’ అంటూ ఆ అవ్వ ఇచ్చిందేమిటా అని ఆడవాళ్ళు బెడ్‌రూమ్స్‌లోకి వెళ్లి కిటికీలు అన్నీ బంధించుకొని లైటు వేసుకొని చదువుకున్నారు. ఆనందంతో మురిసిపోయారు. అందులో..
ష్! గప్‌చిప్!
హాయ్ ఫ్రెండ్స్!
ఆడవారి నోటిలో నువ్వుగింజ నానదట. ఆ నానుడి మార్చే సమయం వచ్చేసింది. పచ్చబొట్టంటే ప్రాణం కదూ మీకు. తనకి ఊపిరి పొయ్యాలనుకుంటే ప్రభుత్వం పట్టుకోవాలని చూస్తున్న పచ్చబొట్టుకు సహకరించండి. మీరు ఓ పచ్చబొట్టుగా మారండి. మీ చుట్టుప్రక్కల వారిలో అమానుషంగా ప్రవర్తించే వాళ్ళున్నా, పెడదారిన ప్రవర్తించే మగవాళ్ళున్నా, మోసగాళ్ళున్నా వారిని శిక్షించండి. ఇన్నాళ్ళుగా మగవారివల్ల మోసపోబడుతున్న స్ర్తి జాతిని ఆ బానిసత్వం నుంచీ బయటపడేట్లు చెయ్యండి.
ఇందులోనే పచ్చబొట్టు పొడిచే విధానం, దానికి కావాల్సిన మందు, సూదులు అన్నీ ఉన్నాయి. వీటిని భద్రంగా దాచుకోవడం, అవసరమైనపుడు ఉపయోగించడమే మీ పని.
కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు బాధతోనో, అసూయతోనో, మీ మాట కాదన్నారనో, కక్షతోనో మంచివాళ్ళకు పచ్చబొట్టు పొడుస్తున్నారని ఏ మాత్రం తెలిసినా మీకు పచ్చబొట్టు పడిపోతుంది.
అన్యాయం చేసే వారు ఎవరైనా అది ఆడవారైనా సరే నేనూరుకోను. ముందు మగవారిలో మార్పు నాశించే నేనిదంతా చేస్తున్నాను!
భద్రం.. భద్రం.. ఈ విషయం మీకు తప్ప ఎవరికీ తెలియకూడదు. మత్తుమందిచ్చాక మీ ఆపరేషన్ ప్రారంభించండి! ఇదో గొలుసుకట్టు. ఒకరు బయటపడినా విషయం బయటపడిపోతుంది. తస్మాత్ జాగ్రత్త!
-మీ
పచ్చబొట్టు
ఈ దేశంలో వంటింటి ఛాయలకు కూడా రాని మగవాళ్ళెందరో? అందుకే ఆడవాళ్ళకు వంటిల్లు ఒక బ్యాంకు లాకర్. బియ్యం డబ్బాలో కొందరు, ఎండు మిరపకాయల క్రింద మరికొందరు, అటకమీద ఇంకొందరు.. ఎవరికి తోచిన చోట వాళ్ళు ఆ పేకెట్‌ని మరో సంచిలో పెట్టి దాచేసారు. అందులో సమాచారాన్ని మనసులో ముద్ర వేసుకున్నారు. ఇక అక్కడి నుంచీ పరిశోధన ప్రారంభించారు. పచ్చబొట్టు ఉదాహరణగా చూపినవి మనసులో పెట్టుకొని తమ వంతు కృషి చెయ్యాలని నిశ్చయించుకున్నారు. చెడ్డవాళ్ళు తమ కుటుంబంలో ఉన్నా నిస్వార్థంగా పచ్చబొట్టు పొడిచెయ్యాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. ఒకవేళ వేసినా అది పచ్చబొట్టు వేసింది అనుకుంటారు గానీ తామే వేసారు అనుకోరు అనే ధైర్యం. ఇంటి దొంగను ఈశ్వరుడుకూడా పట్టలేడుగా!
తనకు స్వచ్ఛందంగా సహాయం చేస్తామన్న వారందరినీ ఈ సమయంలో ఉపయోగించుకుంది. పేపరులో మీ ప్రకటన చూసాను. మీ స్పందనకు సంతోషించాను. ఉద్యమంలో మీరూ చేతులు కలపండి అంటూ ఊరి కొకళ్ళను సెలెక్ట్ చేసుకొని పేకెట్లు పంపింది. పచ్చబొట్టుకు సహాయపడటమే భాగ్యంగా భావిస్తున్నవారు తామే అందులో పాలు పంచుకోగలగటం అదృష్టంగా భావించారు.
రకరకాల వేషాలతో మూడో కంటికి తెలియకుండా చేర్చవలసిన గమ్యానికి పాకెట్లు చేర్చబడ్డాయి. స్ర్తిలు తలచుకుంటే సాధించలేనిది లేదని దీనంతో రుజువయింది. చాలు.. ఈ మాత్రం ప్రేరణ చాలు అని సంతోషపడింది ఆమె అంతరంగం.
ఆమె ఊహించని దానికంటే ఎక్కువగా పచ్చబొట్లు పడటం ప్రారంభమయ్యాయి. ఈ ఊరు, ఆ ఊరు అని లేదు, ప్రతిచోటా పచ్చబొట్టు ప్రత్యక్షం. రోజు రోజుకూ ఈ సంఖ్య పెరిగిపోతోంది. ఇదివరకు పదులలో వున్న సంఖ్య, నెమ్మదిగా వందల్లోకి, వేలల్లోకి మారిపోయింది.
ఎన్నిచోట్ల ఎంత నిఘా వేసినా ఈ విషయంలో సఫలీకృతులు కాలేకపోతున్నామని పోలీసులలో కలవరం పెరిగిపోతోంది. ఇదే కనుక జరిగితే ఈ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్లిపోతుంది. తమ అసమర్థత మరోసారి వెల్లడవుతుంది.
పచ్చబొట్టు విషయంలో ఒక్కరన్నా సహకరించకపోవటమే విచిత్రంగా ఉంది. ఎన్నో కేసులలో తమకు ఆధారాలు దొరికేది ప్రజల సహకారంతోనే. వారి సహాయం లేకపోతే తమ చేతులు కట్టేసినట్లే.
పచ్చబొట్టు వేసే మందు దొరికే చోట, సూదులు దొరికే చోట.. ఇలా ఒక చోట కాదు అన్నిచోట్లా నిఘా.. నిఘా.. ఫలితం మాత్రం శూన్యం. వీళ్ళ దగ్గిరకు ఎవరూ మందు కొనటానికి రావటంలేదంటున్నారు. మరి వీళ్ళకు సూదులు, మందులు ఎక్కడినుంచి వస్తున్నాయి?
అనుమానంతో ఎవరిని బంధిస్తారు? ఒక్కరు దొరికినా వాళ్ళను చిత్రహింసలు పెట్టయినా నిజాన్ని బయటకు తీసుకురావచ్చు. అయినా నిజం నిప్పులాంటిది. ఎన్నాళ్ళు దాచగలరు? ఏనాడో ఒకనాడు బయటకు రావాల్సిందే! లేకుంటే వాళ్ళే మాడి మసయిపోతారు. ఇది పోలీసుల ఉవాచ.
***
ఇక రోజు వీలు చూసుకొని ‘వినీల్’ని తీసుకొని నానమ్మ దగ్గరికి వెళ్ళారు విద్య, అనే్వష్. వాళ్ళు రావటం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206