డైలీ సీరియల్

పచ్చబొట్టు-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో పనివాళ్ళు ఉన్నా చేసి తినిపించేవాళ్ళు లేక ఆవిడ చెయ్యి కొట్టేసినట్లుంటోంది. కేజీల కేజీల వంటలు నిమిషాలలో తిప్పేసిన చెయ్యి ఆమెది.
‘‘ఒరేయ్! ఈ రోజు నా తృప్తి తీరా మీ ముగ్గురికి విందు భోజనం పెట్టాలి’’ అందావిడ మనస్ఫూర్తిగా.
వినీల్ పరిచయస్థుడే కాబట్టి మరోలా భావించలేదు. స్నేహితుడిగా వచ్చాడనుకొంది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆవిడ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.
‘‘అనే్వష్! మన దాయాదుల ఆస్తి ఒకటి ఎప్పటినుంచో కోర్టులో నడుస్తోంది. అది తిరిగి తిరిగి నానా మలుపులు చూసి మన గుమ్మం ముందు ఆగింది. దాని ద్వారా మనకు లక్షల సొమ్ము వస్తుంది. ముసలిదాన్ని. నేనేం చేసుకుంటాను. అదంతా నీకూ, విద్యకే.
అంత సొమ్ము వస్తోందంటే అనే్వష్‌కి ఆశ్చర్యం కలగలేదు కానీ ఆ సొమ్ము తనకొక్కడికే అనకుండా విద్యను కూడా కలపటం ఆనందాన్ని కలిగించింది. ఆడపిల్ల అంటే ఆ..డ.. పి..ల్ల.. అని అన్నింటా ఆమెను దూరంగా ఉంచటం అతనికి నచ్చేది కాదు. తమకు ఆస్థి లేదు కానీ ఉంటే చెల్లికి సగం ఇచ్చేవాడినని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు అనుకోకుండా తనకా అవకాశం వస్తోంది. ప్రభుత్వం ఆడపిల్లలకు సగం వాటా ఇవ్వాలని చెప్పినా ఆ ఊసే తెలియనట్లు ప్రవర్తించే తల్లిదండ్రులు ఇప్పటికీ ఎక్కువే. తాము కన్న పిల్లలోనే భేదభావాలు చూపటం.. ఏమిటో.. తననుకున్నట్లు చేస్తే తన తల్లి ఆత్మ కూడా సంతృప్తిపడుతుంది. విద్య ఎప్పుడూ వెళ్లిపోతుందన్నట్లే ఆమె గడిపేది.
అనే్వష్ ఆలోచనలు ఇలా ఉంటే వినీల్ పరిస్థితి మరొక రకంగా ఉంది. విద్య తనది అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న తనకి ఆ ఆశ నెరవేరదేమో అనే సంశయం పెరిగింది. ఇప్పటికే తనను, విద్యకివ్వరేమో అనుకొన్నాడు. ఇపుడు లక్షలు చేతిలో పడుతున్నాయంటే ఇచ్చిన మాట మరిచిపోతారేమో. ఈ కాలంలో మాట మీద నిలబడే వారు ఎవరు? అతని కళ్లలో అప్పటిదాకా ఉజ్జ్వలంగా వెలుగుతున్న ఆశాదీపం రెపరెపలాడటం ప్రారంభించింది.
ఒకవైపు వారిద్దరూ అలాంటి వారు కారని, డబ్బుకన్నా సంపన్న వ్యక్తిత్వం కల వారని అంతరంగం ఎంత నొక్కి చెబుతున్నా వినీల్‌కి ఎక్కటంలేదు.
‘‘నానమ్మా! నువ్వు మాకో మంచి వార్త చెప్పావు. మేము నీకో శుభవార్త అందించటానికి వచ్చాం!’’
‘‘ఏమిటిది?’’ ఆత్రంగా ముందుకు వంగుతూ అడిగింది.
‘‘వినీల్ నీకు తెలుసుగా. అతన్ని విద్యకివ్వాలని... నీ ఆశీస్సులు కూడా తీసుకొందామని’’
‘‘చాలా సంతోషం నాయనా! వినీల్ బుద్ధిమంతుడు. అందరిలో కలిసిపోతాడు. ఇక్కడున్న పది రోజులలో నేనెన్నిసార్లు అనుకొన్నానో నాకే ఓ కూతురుంటే ఈ అబ్బాయికిచ్చేదాన్నని. కానీ విద్య గుర్తురాలేదు. ఆ పని నువ్వు చేసావ్! చాలా సంతోషం’’
‘‘నా దగ్గిర అందరూ చూసే ఆస్థి లేదు నానమ్మా’’ అన్నాడు వినీల్.
అనే్వష్ మాటలతో తన బుల్లి గుండె నిండా కొత్త ఊపిరి నింపినట్లవటంతో-
ఆ డబ్బు వస్తే ‘రామసత్య’ అని అమ్మా నాన్నల పేరున ఓ ట్రస్ట్ ఏర్పాటుచేసి, దానికి వినీల్‌ని చైర్మన్‌ని చేసి బీద సాదలకు సహాయం వినీల్ ద్వారానే చేయించాలని అనే్వష్ మనసులో నిశ్చయించుకున్నాడని తెలిస్తే...
‘‘డబ్బుదేముంది బాబూ! ఈ రోజు వస్తుంది. రేపు పోతుంది. శాశ్వతంగా ఉండాల్సింది అనుబంధమే’’
వినీల్‌కయితే ఆ నిముషాన హనుమంతుడిలా ఆ ముగ్గురిని ఎత్తుకొని ఆకాశంలో చిందులు వెయ్యాలని మహా కోరికగా వుంది.
‘‘ఈ లోకంలో ఇలాంటివాళ్ళు కూడా ఉన్నారా?’’ మనసు నమ్మటం లేదు కళ్ళెదురుగా అంతా జరుగుతున్నా!
నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు ఉండబట్టే భూదేవి అందరి స్వార్థపరులని భుజాలమీద తేలిగ్గా మోస్తోంది. ఈ సంఖ్య ఈ మాత్రం కూడా లేకపోతే ఆవిడ ఆ భారాన్ని ఎపుడో వదిలేసేదే!
ఆ భూదేవిలా ఎదురుగా ‘నానమ్మ’ కనిపించింది.
వెంటనే వినీల్ ‘‘నానమ్మా’’ అంటూ ఆమె కాళ్ళకు నమస్కరించాడు.
‘‘చల్లగా నూరేళ్ళు వర్థిల్లునాయనా’’ అంటూ ఆశీర్వదించింది.
‘‘అనే్వష్! నువ్వింటానంటే ఒక మాటరా!’’
‘‘చెప్పు నానమమ్మా!’’
‘‘తర్వాత నామీద కోప్పడకూడదు’’
‘‘లేదు.. లేదు.. మాటిస్తున్నాను’’
‘‘చిన్నప్పటినుంచీ ఆ ఒడిలో పెరిగారు. ఒకసారి నాననమ్మను ‘అండీ’ని గౌరవించాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏకవచనంతో దగ్గిరవ్వాలనిపిస్తుంది. అదేమిటో తమకే అర్థం కాదు. ఎలా పిలిచినా పలికే నానమ్మ.. తమ కోసమే బ్రతుకున్నాననే నానమ్మ.. అలాంటి నానమ్మ మాటను కాదంటాడా?’’
‘‘ఏం లేదురా! వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే ముందే నువ్వు పెళ్లిచేసుకుంటే బాగుంటుంది. అప్పుడు చెల్లికి ‘కన్యాదానం’ నువ్వే చేయచ్చు. ‘కన్యాదానం’ చేసే అదృష్టం అందరికీ వచ్చేది కాదురా!’’
ఆలోచనలో పడ్డాడు అనే్వష్ వీళ్ళిద్దరికీ ఎంత తొందరగా పెళ్లి చేసేద్దామా అని తను ఆలోచిస్తుంటే మధ్యలో ఈ తిరకాసు ఏమిటి?’’
‘‘సరే నానమ్మా! ప్రయత్నిస్తాను. వినీల్ దొరికినట్లు నాకూ ఓ అమ్మాయి దొరకాలిగా’’
‘‘అన్నయ్యా! పచ్చబొట్టును పట్టుకోరా! నీకు భార్యను చేసేస్తాను. అలాంటి వదిన దొరకటం మాటలు కాదురా!’’
‘‘పచ్చబొట్టును పట్టుకోవటంలో నేనూ నీకు సహాయం చేస్తాను’’ అన్నాడు వినీల్.
‘‘సిఐడీగానా?’’ నవ్వుతూ అన్నాడు అనే్వష్.
‘‘అలాగే అనుకో! ప్రభుత్వానికి కాదు. మన సంసారానికి’’ తనూ నవ్వుతూనే అన్నాడు వినీల్.
‘‘ఇంకేం? ఇద్దరూ హేమాహెమీలు బయలుదేరుతున్నారు బావమరుదులులా. పచ్చబొట్టు పట్టుబడినట్లే’’
‘‘ఏమోరా! రోజు రోజుకు నా నమ్మకం సడలిపోతోంది. దొరికినట్లే దొరికి జారిపోతోంది’’.
‘‘అలా నిరుత్సాహపడకు. దొరుకుతుందిలే’’ అంది విద్య ధైర్యం చెబుతూ.
‘‘అయితే మీ పెళ్లి వాయిదా పడినట్లేనా’’ అన్నాడు విద్య వంక చూస్తూ.
‘‘అంత తొందరేం వచ్చింది?’’’
‘‘నేననుకున్నది ఒకటి’’ సాలోచనగా అనే్వష్.
‘‘దానికీ మార్గం ఉంది. నిశ్చయ తాంబూలాలు పుచ్చేసుకుందాం. అంటే సగం పెళ్లి అయిపోయినట్లే. వినీల్‌కి మనింట్లోకి రావటానికి లైసెన్స్ వచ్చేస్తుంది’’.
దాంతో అందరి హృదయాలలో ఉత్సాహం పూలు పూస్తాయి.
సాయంత్రందాకా నానమ్మ దగ్గిరే గడిపి వెనుతిరిగారంతా.
‘తెట్టు’ దగ్గరికి వచ్చేటప్పటికి విద్యకు దాహం వేసింది. ఏదైనా జ్యూసు తాగుదామా అన్నయ్యా! అని అడిగింది.
విద్య అసలు ఏదీ నోరు తెరిచి అడగదు. అలాంటిది అడిగితే కాదంటాడా?
‘‘పదమ్మా! తాగుదాం! వినీల్! ఒక ప్రక్కగా ఆపు’’ అన్నాడు.
ముగ్గురు ఎదురుగుండా కనిపిస్తున్న ‘పార్లర్’లోకి వెళ్లి ‘జ్యూస్’ తాగారు.
రోడ్డు క్రాస్ చేద్దామనుకుంటుండగా ప్రక్క షాపులో కూరగాయలు కొంటూ ‘తృప్తి’ కనిపించింది. అనే్వష్ ఆశ్చర్యపోయాడు. ఆమె మళ్లీ ఇలా కనిపిస్తుందనుకోలేదు.
ఈలోపు విద్య కూడా చూసింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి పలకరించింది.
‘‘హాయ్! విద్య! బాగున్నారా!’’
‘‘ఆ! బాగున్నాం! మీరేంటి వస్తానని మళ్లీ కనిపించలేదు’’ విద్య అడిగింది.
‘‘కుదరక.. హాయ్! వినీల్ అన్నయ్యా! బాగున్నావా?’’ అడిగింది ఆప్యాయంగా చూస్తూ.
‘‘గుర్తుపడతావా లేదా అని చూస్తున్నాను’’ అన్నాడు వినీల్. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206