వినమరుగైన

కొత్త గడ్డ - నార్ల వెంకటేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపద ముంచుకొచ్చినపుడు అణాపైసలు లెక్కెయ్యదామె వాళ్లాయనలాగా. కూతురుకు జబ్బు చేస్తే పట్నం నుండి వచ్చిన కొడుకు కృష్ణమూర్తి డాక్టరును తెచ్చినా ప్రయోజనం కలగలేదు. కూతురు పోయిన దుఃఖం కంటే ‘‘ఏం చేస్తాం? ప్రారబ్దం’’ అనుకోవటమే ముఖ్యం ఆ ఇంటాయనకు!
దాంపత్యం నాటికలో చదువుకున్న భర్తత, చదువురాని భార్య అనే రెండు పాత్రలున్నా స్వీడిష్ రచయిత అగస్టీ స్ట్రిండ్‌బర్గ్ వలె ఒక్క పాత్రతోనే మాట్లాడించి రక్తికట్టిస్తారు నార్ల. భర్త ఎదురుగా ఉన్నపుడు అర్థంకాని అసూయతో కాగిపోయి ఆయన లేనపుడు జాలిపడే ఆమె స్వభావానికి కారణం ఏమిటి? దాంపత్యం సజావుగా సాగేందుకు చదువు అడ్డం నిలుస్తుందా? అదేమోలే గాని నార్ల ఆమెనోట పలికించిన పలకులు విని స్ర్తి సమస్యల్ని కేవలం స్ర్తిలే అర్థం చసుకోగలరనే విషయాన్ని సమర్థించలేం.
మాటమాటకూ ఒక సామెత వదుల్తూ ఇళ్ళమ్మట పడి కూరా, నారా, పెరుగూ, మజ్జిగా పోగేసుకుంటూ తిరిగే సీతాపతి ఓ శకునపక్షి. అటువంటి వాళ్ల సామెతలవల్ల ఒక్కొక్కసారి అవతలివాళ్లు ఎంతటి దుఃఖాన్ని పొందుతారో వాళ్లు గ్రహించలేరు. అర్ధం మీద శ్రద్ధ నిలుపక ధ్యాసంతా సామెతమీద నిలిపేవాళ్లను ఓ ఆటపట్టిస్తారు నార్ల శకునపక్షి నాటికలో.
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లో పని తెమలక చిర్రబుర్రులు ఒకళ్లపై ఒకళ్లకు విసుగు. కానీ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే విసుగును విసిరేసి అంతా సర్దుబాటే. ప్రేమ పంపకమే. పల్లె జీవితంలని ఈ బొమ్మా బొరుసే నార్ల తీర్చిదిద్దిన ఏకాంకిక వెలుగునీడలు.
కొత్తగడ్డ నాటికలో సగం ఎగతాళి, సగం ఆర్థికశాస్త్రం. మాటకారి తాత, మాటలు సరిగారాని మనుమడితో ‘‘శ్రీరాముని దయచేతను’’ అనే పద్యం పలికించాలని చూస్తే నార్లవారు పనిగట్టుకొని ‘‘్ఛ’’ కొట్టిస్తారు! మనుమడు పద్యాలొద్దు కతలే కావాలని మొండికెత్తితే తాతకు తప్పేదేముంది. ‘‘కాకి మాంసం ముక్క’’ కథ చెప్పసాగాడు. మనుమడి సందేహాలు ఒక తాతతో ఏమి ఎందరు తాతలు దిగొచ్చినా తీర్చగలిగేవి కావు! సరే ఆవలిస్తూ కూడా చిటికెలు వేస్తూ రామ సంకీర్తనలో మునిగితేలే తాతను ఆయన భార్య తటాలున సంసార లంపటంలోకి లాగుతూ వుంటుంది. ఆయన కొడుకుకు కొత్తగడ్డమీద మమకారం. ఆయనకు మాత్రం తరతరాలుగా సంక్రమించిన గడ్డమీదే. ఈ విషయంలో కొడుకునైనా వొదులుకునేందుకు సిద్ధపడ్డాడు కాని అసలుకంటె వడ్డీ ముద్దన్నట్లు మనవడికోసం తాతకు కొత్తగడ్డ వైపునకు పయనమవ్వక తప్పలేదు!
ఉన్న ఆరెకరాలు అప్పులకింద, పిల్లవాడి చదువులకిందా అమ్మివేసింది కాక డబ్బు చాలక పిల్లవాడు ఎక్కడేమి ఇబ్బంది పడతాడోనని పాలూ, పెరుగూ అమ్మి, పిడకలు చేసి, ఏకులు వడికి, కూలికి దంచి ఒక పూట తిని, ఒక పూట పస్తుండి తల్లి డబ్బులు పంపితే దర్జాలు వెలగబెట్టే కొడుకుల్ని ద్రోహులుగా తేల్చుతారు నార్ల ద్రోహం అనే ఏకాంకికలో.
ఏకాభిప్రాయం అనే ఏకాంకిక పల్లెటూరి పంచాయితీ రాజకీయాల బండారాన్ని బయటపెడుతుంది. ఇరు వర్గాలకూ అన్నీ భేదాభిప్రాయాలే. ఒక వర్గానికి చెందినవారైనా ఇద్దరూ ఒకే అభిప్రాయాన్ని ప్రకటించేందుకు ఒకే మాటను వాడరు. కాని వాళ్లందరూ మధ్యవర్తుల్నీ, మంచివాళ్లనీ శుంఠల క్రింద జమకట్టడంలో ఏకాభిప్రాయాలే! ఇందులో సంభాషణలు సరికొత్త తరహాలో నడుస్తాయి.
వెంకట్రామయ్య పల్లెటూరి రైతు. సత్యనారాయణ అతని అల్లుడు. పత్రికాఫీసులో పని. బి.ఏ వరకు చదివాడు. అయినా అల్లుడికంటే మామే రెండాకులు ఎక్కువ చదివినట్లు తెలివితో తూస్తే. సత్యనారాయణ ఉద్యోగం ఊడింది. అయినా సత్యనారాయణ అతని భార్య పట్నంలో కాపురం పెట్టాలని ఎత్తిన ఎత్తును వెంకట్రామయ్య చిత్తుచేయడమే భంగపాటు నాటిక.
వస్తాడే మా బావ అంటూ కలలుగనే కనె్నపిల్ల సుందరి. ఆమెపై సినిమా పాటల ప్రభావం అధికం. డబ్బు పోగేసుకొని బంధుత్వాన్ని దూరం చేసుకొనే సందరి మేనత్త రాజమ్మ. పరిస్థితులను చక్కగా అంచనా వేసుకుంటూ సర్దుకుపోయే సుందరి తల్లి సీతమ్మ. చీటికిమాటికి నోరు పారవేసుకోగల సుందరి నాయనమ్మ రంగమ్మలతో ఒక్క పురుష పాత్ర కూడా లేకుండా అన్నీ స్ర్తి పాత్రలతోనే నడిచిన నాటిక ఆడబ్రతుకు. ‘ఆడబ్రతుకే మధురం’ అనేది పాటలకే పరిమితమనీ, నిజ జీవితంలో ఆడబ్రతుకుకు ఎదురయ్యే సమస్యల చిత్రణ అద్భుతంగా జరిగింది.
పట్టణానికీ పల్లెకూ మధ్య వంతెన పడింది. సామాజిక పరివర్తన మొదలైంది. ఆర్థిక వెసులుబాటు వీలయ్యింది. మనుషుల్లో నాజూకుతనం రాకపోయినా వేషాల్లో నాజూకుతనాలొచ్చాయి. ఎంత వద్దనుకొన్నా వంతెనమీదుగా నడిచే బస్సులు అంటరానితనాన్ని మాయం చేయసాగాయి. ‘మండిన రోడ్డు పోయించి, మాయదారి వొంతినేయించి, ముదనష్టపు బస్సులు తెప్పించి’నందుకు భూషయ్యను తిట్టడం దేనికీ- అందువల్లనే నాలుగు డబ్బులు పోగేసుకొని కాస్త పచ్చపచ్చగా వుండే అవకాశం అందరికీ కలిగిందిగా! భూషయ్య ఆ వంతెనే గాదు మనుషులమధ్య కూడా వంతెనలు నిర్మించగలగటం వంతెన నాటికలోని విశేషం.
పురాణం చెప్పేవాళ్ళను నార్ల ఓ ఆట పట్టించినట్లు కన్పిస్తుంది. ఆశాపాశం నాటికలో ఉన్నదాంతో తృప్తిపడమని ఓ వైపు భాగవతం నుండి వామనావతార ఘట్టం చదివి వివరిస్తూ కూడా కృష్ణమాచార్యులు వంటచిచ్చుమాట మర్చిపోడే.. వంద పిడకలూ, మోపుడు పుల్లలూనట! గ్యాస్ సిలిండర్లు వచ్చాక అలాంటి వాళ్లు ఏమడుగుతున్నారో మరి! ఉన్నదాంట్లో మనం తిననూవచ్చు నలుగురికి పెట్టనూవచ్చు అనే సంతృప్తితో బతికే రైతును జనం అలా బతకనిస్తేగా! ఆశాపాశాన్ని గూర్చి అనర్గళంగా వివరించే ఆచార్యులుగాను మళ్లీ ఆశాపాశాన్ని భూషయ్యగారి మెడకు తగిలించే ప్రయత్నాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ తిత్తికాతిత్తే కాబోలు! అలాగే జ్యోతిషాలు చెప్పే వెంకటశాస్ర్తీ కూడా నగుబాటు పాలవుతాడు.
ఇలా ఈ డజను నాటికలు పల్లె జీవితాన్ని పెనవేసుకుని వుంటే మరో నాల్గు నాటికలు వేర్వేరు అంశాలపై దర్శనమిస్తాయి.
ఇంటిగుట్టు అనే నాటిక ఒక మధ్య తరగతి మందహాసం! పదిహేను రూపాయల ఇంక్రిమెంటు వస్తే పరమానందభరితుడవుతాడు శివరావు.
పెద్ద పెద్దవాళ్లను పార్టీకి పిలుస్తాడు. వాళ్లు రారు. వచ్చిన స్నేహితుడు కంటికి ఆనడు. ఏ డిప్టీ కలెక్టరు పనైనా కాకపోతుందా అనుకుంటే ఈ గుమస్తాగిరి దొరికిందని పెదవి విరిచే పెళ్లాం కృష్ణవేణి మన యెత్తు వాళ్లతో మనం ఉండాలిగాని, పైకెగరబోతే చతికిలబడతాం అంటూ హితబోధ చేస్తూనే వుంటుంది. అయినా ప్లీడరు గుమాస్తాగా బతికే శివరావు స్నేహితుడికి మాత్రం శివరావును చూస్తే ముచ్చట ‘పెద్ద పెద్దవాళ్లతో స్నేహాలు, రవ్వా రట్టూ లేకుండా గుట్టుగా సంసారం!’’ కాని ‘‘ఆ ఇంటి గుట్టు ఈశ్వరుడికెరుక!’’
ఇక భావకవి నాటిక విషయం చూస్తే ‘‘దుఃఖం, దైన్యం, దారిద్య్రం, కల్ల, కపటం, కాఠిన్యం-ఇదేగా లోకమంటే? ఈ పాడులోకం నుంచి ఎంత దూరానికి పారిపోగలిగితే అంత గొప్ప కవిగావొచ్చు’’ ఇదీ మోహనరావు అనే భావకవి భావన. అతని భార్య ఎంత గొప్ప సంగతినైనా ఇట్టే కూడు గుడ్డల లెవెల్‌కు దించేస్తుందని అతని కంప్లయింట్. భావకవులమీద ఈ నాటిక ఒక గొప్ప సెటైర్!
బ్లాక్ మార్కెట్ సంస్కృతిలో దొరలెవరుంటారు? అంతా దొంగలేగా! అయినా దొరికితే దొంగ, లేకుంటే దొర, దొంగ-దొర నాటిక టెక్నిక్ తెలుగు తెరకు కొత్తది. ఒక పాత్రను రంగస్థలంపై నిలిపి, రెండవ పాత్రను నేపథ్యంలో ఉంచి ఆడించిన నాటిక ఇది. యాజీనీ ఓనీల్ అనే అమెరికన్ నాటక రచయిత ఇటువంటి టెక్నిక్కుతోనే బిఫోర్ ది బ్రేక్‌ఫాస్ట్ అనే ఏకాంకికను సృజియించింది.
ఆర్థిక శాస్త్ర ఆచార్యులు రాధాకృష్ణకూ, ఆయన అర్థాంగి శ్యామలకూ మధ్య మానసిక ఘర్షణకు దర్పణం అర్థాంగి నాటిక. ఎంతటి ఆచార్యుడయినా ఒకరపు మగతనపు అనుమానం ఆయన్ని పీడిస్తుంది. మగనికోసం ఉద్యోగం మానేసిన మగువ జీవితంలో తానేమి కోల్పోయిందో తెలుసుకుని ఆత్మగౌరవం నిలబెట్టుకొనేందుకు ఉద్యోగానికి తిరిగి దరఖాస్తు పంపుతుంది. ఈ నాటికలోని పాత్ర వంటి ప్రొఫెసర్ ఎవరైనా రచయితకు తటస్థపడ్డారా అన్నంత సహజంగా నడిచింది నాటకం.
ఇలా నార్ల ఆలోచన ప్రధానంగా ఆనాటి అవసరాలకు అనుగుణంగా, తన హేతుబుద్ధికి ధీటుగా తన హాస్య ప్రియత్వాన్ని పెంపొందించుకుంటూ నాటికలు సృజియించి ప్రజల మనసుల్ని కొత్త పుంతలు పట్టించారు. కొత్తగడ్డను వారికి అందించారు. రైతు కుటుంబంలో జన్మించినందుకు రైతుల బాగుకోసం నాటికలు సృజియించిన నార్ల అభినందనీయుడు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-రావెల సాంబశివరావు