వినమరుగైన

ఎన్.జి.ఓ - ఆత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీ అన్న చేసిన పనిని సమర్థింపలేకపోయాడు. లంచం సొమ్ము తిప్పిచేస్తానంటాడు. చెయ్యి మించిపోయిందంటాడు రంగనాథం.
ఇది ప్రధానంగా మొదటి రంగంలో నడిచిన కథాంశం.
ఇకరెండవ రంగం..
రంగనాథం మిత్రుడైన డాక్టరు, గోపి బస్టాండు దగ్గర పండ్లపొడి పొట్లా అమ్ముతున్నట్లు రంగనాథానికి చెప్తాడు. రంగనాథం కోపంతో వళ్లు మరిచిపోయి తమ్ముడ్ని చావబాదాడు.
‘మన వంశం ఏమిటి- మన తాహతేమిటి? చెడపుట్టావు కదరా! ఇదెక్కడి అప్రతిష్ఠిరా?’ అంటూ ముసలాయన గోపీమీద విరుచుకుపడ్డాడు.
ఇంట్లో ఒకడు సంపాదిస్తుంటే నలుగురి తిని కూర్చునే మధ్య తరగతి మనస్తత్వాన్ని నిరసిస్తాడు గోపి.
గుప్త, శర్మ రంగనాథం ఇంటిమీదికొచ్చారు. శర్మ గోపిని అద్దె డబ్బులడిగాడు. ‘అద్దె వసూలు కోసం తాపత్రయం తప్ప కనీస వసతులు కల్పించాలన్న జ్ఞానం లేకపోతే ఎట్లా’ అని నిలదీశాడు గోపి. ఇష్టం వుంటే వుండండి, లేదా ఖాళీ చెయ్యండంటూ గుప్త గొడవ చేశాడు. మాట మాటా పెరిగింది. గుప్త కర్ర విసిరాడు. గోపీ తలకు పెద్ద దెబ్బే తగిలింది.
అయితే గోపీయే గుప్తను కొట్టి గాయపరిచాడని, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని వూరంతా పుకారు పెట్టారు. అది తెలిసి ఇంటికొచ్చిన రంగనాథానికి జరిగిన వాస్తవం సీత వెల్లడించింది.
రంగనాథం తను లంచంగా పుచ్చుకున్న డబ్బు సీతకు ఇవ్వబోతాడు. తీసుకోవడానికి ఆమె జంకుతుంది. ‘తిండికి లేనివాడు దొంగతనం చేసినట్టే తనూ కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని సుఖపెట్టడం కోసం లంచం తీసుకున్నట్లు’ సర్ది చెప్పబోతాడు.
పాపిష్ఠి సొమ్ము మనకక్కర్లేదు. ఇచ్చెయ్యమంటుంది సీత. డాక్టరు హడావుడిగా వచ్చాడు. పార్కు దగ్గర మీటింగ్ జరుగుతుంటే గోపీ యంయల్‌ఏని అడ్డదిడ్డపు ప్రశ్నలు వేసి రౌడీ వెధవలాగు ఫ్లాట్‌ఫారం మీదకెళ్లి ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని విమర్శిస్తూ కారుకూతలు కూశాడని రంగనాథానికి చెప్తాడు.
అదే సమయంలో ఇంటికి వచ్చిన గోపి మీద మండిపడ్డాడు రంగనాథం. ఈ ఉన్న ఉద్యోగం ఊడబీకితే ముష్టెత్తి బతకాల్సి వస్తుందంటూ తమ్ముడ్ని నిందించాడు. ముసలాయన చిన్నకొడుకును నానా మాటలన్నాడు.
పోలీసులు రానే వచ్చారు. లంచం తీసుకున్నందుకు రంగనాథాన్నీ, గుప్తాను కొట్టినందుకు, పబ్లిక్ మీటింగ్‌లో అరాచకాన్ని రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చినందుకు గోపీని అరెస్టు చేసి తీసుకెళ్తారు. అంతటితో నాటకం ముగుస్తుంది.
ఈ నాటకంలో ఆత్రేయ -ముఖ్యంగా చాలీ చాలని జీతాలతో, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న దిగువ మధ్యతరగతి ఉద్యోగుల జీవితాన్ని సానుభూతితో పరిశీలించినట్లు కనబడుతుంది. ఒక ఉద్యోగి నైతిక పతనానికి దారితీసే ఆర్థిక సమస్యని కళ్లకు కట్టినట్లు చూపాడు. అంటే ఒక వ్యక్తి పతనానికి ఆర్థిక, సామాజిక కారణాలుంటాయని రచయిత తెలియజేశాడు. ఉద్యోగుల కనీసావసరాలను తీర్చే విధంగా జీతభత్యాలు లేకపోవటాన్ని విమర్శనాత్మకంగా ఎత్తి చూపాడు. అలాగని లంచం తీసుకోవటాన్ని ఎక్కడా సమర్థించలేదు. బాహ్య పరిస్థితులు మనిషి ప్రవర్తనను నిర్దేశిస్తాయి అనే సత్యం ఈ నాటక వస్తువు ద్వారా తెలుస్తుంది. ఇది వాస్తవికతా వాదానికి చెందిన ఆలోచనా విధానం. ఆత్రేయ నాటకాల్లో ప్రధానంగా ఈ వాస్తవికతా వాదమే కన్పిస్తుంది.
మారుతున్న సమాజంలో ఆర్థిక విషయాలకు ఎంత ప్రాధాన్యం వుందో గోపి పాత్ర ద్వారా ఆత్రేయ వివరించారు. నిజానికి ఈ నాటకంలో ఆత్రేయ చేసిన సామాజిక విమర్శకు గోపి పాత్రే వౌత్‌పీస్.
‘‘్భమి పైసా చుట్టూ తిరుగుతుంది. కనుక ఆ పైసా మన చేతుల్లో వుంటే ఈ భూమి, అంటే ఈ ప్రపంచంలో వున్న మనుష్యులూ, మృగాలూ, వస్తువులూ అన్నీ మన చుట్టూ తిరుగుతాయి. ఇదీ సిసలైన కల్తీ లేని సత్యం’’ అని గోపి తన వదినతో అంటాడు.
ఈ వాక్యాలు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అన్న దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితను గుర్తుచేస్తాయి.
సమాజంలో ఆర్థిక ప్రాధాన్యం గురించే కాకుండా ఆర్థిక అసమానతల గురించి కూడా రచయిత అక్కడక్కడా చర్చించాడు. సమాజంలో కొందరు మనుషులు సుఖపడుతున్నది తెలివితేటలవల్లా, అర్హతవల్లా, కష్టంవల్లా కాదని కేవలం డబ్బుగలవాళ్లుగా పుట్టినందువల్లనేనని గోపి అంటాడు. రచయిత పేదల స్థితిగతులపట్ల సానుభూతి కలవాడని నాటకంలో మనకు అర్థమవుతుంది.
‘‘మేడల్లో కులికినా
గుడిసెల్లో కులికినా
కట్టెల్లో ఒకలాగె కాలిపోవాలి!
బూడిదలో ఒకటిగా కలిసిపోవాలి
వున్న నాలుగు నాళ్లు వుబ్బిపోకురా
కన్ను తెలియనిరీతి గర్వపడబోకురా!’’
అంటూ నాటకంలో ఒక బిచ్చగాడు పాడే పాట ఆర్థిక అసమానతలపట్ల రచయితకున్న దృక్పథాన్ని తెలియజేస్తుంది.
పనిచేసేవాడికే తిండి, డబ్బు, సుఖం వుండే కాలం వస్తుందని గోపీ మాటల ద్వారా ఆశిస్తాడు.
మధ్యతరగతి మనుషుల్లో వుండే ఫాల్స్ ప్రిస్టేజీని ఎన్‌జిఓలో నిశితంగా విమర్శించాడు ఆత్రేయ.
బజారులో గోపి పళ్లపొడి పొట్లాలు అమ్ముతున్నాడని తెలిసినప్పుడు రంగనాథం, ముసలాయన అతన్ని మందలిస్తారు. అందుకు సమాధానంగా గోపి..
‘‘మనం పస్తులున్నా పడి వుండాలి గాని ఇలాంటి పనులు మాత్రం చేయకూడదు. ఇదేగా మన ప్రెస్టేజీ! పిల్లలు రోగాలతో కుళ్లిపోతూండొచ్చు. అప్పులవాళ్లు నానా బూతులు తిట్టొచ్చు. ఈ మురుక్కాలవ కంపులో- ఈ కారు షెడ్‌లో బతకొచ్చు. నీతిని అమ్ముకోవచ్చు. కూలివాళ్లు మనకంటే నయం. నలుగురూ పనిచేస్తారు. తింటారు లేదా పస్తుంటారు. మనం అలా కాదు. ఒక్కడు సంపాయించాలి. ఇందరం బతకాలి. ఆడది ఇల్లు వదిలి పెట్టకూడదు. ఇంటి పని తప్ప వేరింకేం చెయ్యకూడదు. అంతేనా?’’ అంటూ మధ్యతరగతి భేషజాల్ని అవహేళన చేస్తాడు.
కథాకాలం నాడు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం యొక్క అవకతవక విధానాల్ని కమ్యూనిస్టు వ్యతిరేకతను సున్నితంగా, వ్యంగ్యంగా రచయిత విమర్శిస్తాడు.
కథాకాలం నాటికి ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించింది. దానిపై వ్యాఖ్యానిస్తూ గోపి, ‘‘మతిలేక తాగుడు తీసేశారు గాని నేనైతే ప్రతి లక్షాధికారికి కొంత కోటా ఏర్పరచి తప్పక తాగాలని రూలు పెట్టేవాడ్ని. వాళ్లు గనుక తాగకపోతే ఆ డబ్బు ఖర్చయ్యేదెట్లా? అసలీ డబ్బుగలాళ్లని బాగా తాగించాలి. అప్పటికన్నా వాళ్ల డబ్బు నలుగురి చేతుల్లోకి వస్తుందేమో!’’ అని వ్యాఖ్యానిస్తాడు. పెట్టుబడిదారుల డబ్బు ప్రజల పరం కావటానికి మద్యపానం సరైన మార్గమేమీ కాదు. ఈ సందర్భంలో గోపీ పాత్ర ద్వారా రచయిత చేసిన తార్కిక ప్రతిపాదన సక్రమంగా అనిపించదు.
తెలుగు నాటక వికాసము అనే గ్రంథంలో డాక్టర్ పోణంగి శ్రీరామ అప్పారావు ఆత్రేయ నాటక రచన గురించి ఈ విధంగా అన్నారు.
ఆత్రేయగారు సన్నివేశ చిత్రణమున అందెవేసిన చేయి; సంభాషణా నిర్వహణమున సిద్ధిపొందిన రచయిత, అసలు ఆత్రేయగారిని పీడిత ప్రజల పక్షమున గొంతెత్తి వాదించిన విప్లవవీరుడని చెప్పవచ్చును. వారి కలము విసిరిన ప్రతిమాట అనుక్షణము కుమిలిపోవుచున్న జనుల హృదయములోని అగ్నిజ్వాలలను వెలిగ్రక్కును. తాను నమ్మిన సిద్ధాంతము సాధారణము చేసికొని, దానిని నిష్కర్షగా, సూటిగా, నగ్నముగా ప్రదర్శించి, చేపట్టిన సమస్యకు న్యాయము చేకూర్చిన శిల్పి శ్రీ ఆచార్య ఆత్రేయ.
మొత్తంమీద ఆత్రేయ రచించిన ఎన్.జి.ఓ నాటకం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో సమాజంలోని దిగువ మధ్యతరగతి ప్రజల జీవిత వేదనకు ప్రతిబింబం.
తెలుగు నాటక రంగంలో ఆచార్య ఆత్రేయది ఎన్నటికీ చెరిగిపోని చిరునామా! నాటకం రచించినా, సినిమా సంభాషణలు రాసినా, పాటలు రాసినా ఆత్రేయ ముద్ర ఆత్రేయదే! -అయపోయంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వల్లూరి శివప్రసాద్