ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’లో నేడు మరో చారిత్రక ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, సెప్టెంబర్ 11: జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టులో అంత్యంత కీలకమైన స్పిల్ వే నిర్మాణంలో అంతర్భాగంగా నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. రెండు మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తులో 1069.5 మీటర్ల పొడవున స్పిల్ వే లోపల సొరంగం తరహాలో నిర్మించిన ఈ గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, ఉన్నతాధికారులు తదితరులు సందర్శించనున్నారు.

స్పిల్‌వే గ్యాలరీ వలన ప్రయోజనాలు
జలాశయం నిండి, అదనంగా వచ్చే వరద నీటిని గేట్ల ద్వారా నది దిగువకు విడుదలచేయడానికి ఉపయోగపడే నిర్మాణమే స్పిల్‌వే. స్పీల్‌వేలో అంతర్భాగంగా నిర్మించే గ్యాలరీతో నాలుగు రకాల ప్రయోజనాలు చేకూరతాయి. జలాశయంలోని నిల్వవుండే నీరు భూమి అడుగు నుండి డ్యాం మీద కలిగించే ఊర్ధ్వపీడనం నుండి ఒత్తిడిని తగ్గించడానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. అలాగే కాంక్రీట్ నిర్మాణం నుండి చెమ్మ రూపంలో వచ్చే ఊట నీటిని బయటకు తోడటానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. డ్యాంకు సంబంధించిన వివరాలను సేకరించే పరికరాలను అమర్చడానికి కూడా గ్యాలరీ ఉపయోగపడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన డ్యాం భద్రతను తనిఖీచేయడానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది.
మొత్తం 56 బ్లాకులుగా ఉండే గ్యాలరీలో 48 బ్లాకుల నిర్మాణం పూర్తయ్యింది. 1వ బ్లాకు నుంచి 18వ బ్లాకు వరకూ సమాంతరంగా ఉంటుంది. అక్కడ నుంచి మెట్ల ద్వారా కిందకు దిగుతూ ఒక్కో బ్లాక్ దాటుకుంటూ 36వ బ్లాకు వరకూ వెళ్లిన తర్వాత తిరిగి మెట్లు ఎక్కుతూ 34వ బ్లాకుకు చేరుకుంటారు. 34వ బ్లాకు నుంచి 48వ బ్లాక్ వరకూ సమాంతరంగా ఉంటుంది. గ్యాలరీలో 13, 26, 34 బ్లాకుల వద్ద మధ్యలో బయటకు వచ్చే మార్గాలను ఏర్పాటుచేశారు. స్పిల్‌వే కాంక్రీటు నిర్మాణం కాబట్టి నీటిని పీల్చి బయటకు చెమ్మద్వారా గ్యాలరీలోనికి వదులుతుంది. అలా వచ్చిన నీరు 26వ డీప్ బ్లాకు వద్ద నిర్మించిన సంపులోనికి చేరుతుంది. 26వ బ్లాకుకు ఇరువైపులా ఉన్న గ్యాలరీలో నీరు సంపులోకి రావడానికి వీలుగా డ్రెయినేజీలు నిర్మించారు. సంపులోకి చేరిన నీటిని నాలుగు మోటార్లు ఏర్పాటుచేసి, అక్కడ నుంచి బయటకు స్పిల్లింగ్ బేసిన్‌లోకి పంపిస్తారు. 26వ బ్లాకు వద్ద నిర్మించిన సంపులోకి దిగడానికి మెట్లు నిర్మించారు. అలాగే మెట్ల పక్కనే లిఫ్ట్‌ను కూడా ఏర్పాటుచేస్తారని అధికారులు తెలిపారు.ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ అధికారులు గ్యాలరీలోకి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తుంటారు. గ్యాలరీ సొరంగంలా ఉంటుంది కాబట్టి అధికారులు అక్కడకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా స్పిల్‌వే పైనుంచి గ్యాలరీలోకి గాలి వచ్చేందుకు వీలుగా గొట్టాలను ఏర్పాటుచేశారు. అలాగే గ్యాలరీలను ప్రతిక్షణం పరిశీలించడానికి కెమెరాలు ఏర్పాటుచేసి, కంట్రోల్ రూంలో పరిశీలిస్తారు. ఈవిధమైన గ్యాలరీలు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో కూడా నిర్మించినట్టు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఈ గ్యాలరీలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో నడవనున్నారు.