ఆంధ్రప్రదేశ్‌

ఈ-రైతుతో వ్యవసాయానికి భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 12: రైతులు తమ పొలం నుంచే నేరుగా పంట దిగుబడులకు ప్రపంచంలో ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందుకోసం ఈ- రైతు ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో బుధవారం మాస్టర్ కార్డ్ సంస్థ రూపొందించిన ఈ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నెట్‌వర్క్ లింక్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమాచార సాంకేతికత ఒక విప్లవమని, దాని ఊతంతో ఎన్నో అద్భుత ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్నామని, ఈ స్థాయిలో ఐటీ, ఐవోటీలను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. భూగర్భ జలాల నుంచి పిడుగులు పడే సమాచారం వరకు రియల్‌టైమ్‌లో అందించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజసిద్ధ సేద్యపు విధానాలు కచ్చితంగా అనుసరించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని, మనం తినే తిండిలో సగానికి పైగా రసాయనాలు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం, గాలి, వాతావరణ కాలుష్యం పెరుగుతోందని, ఈ పరిస్థితిని గమనించి ముందుగానే మేల్కొన్నామని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్‌ను రాష్ట్రంలో నెలకొల్పుతున్నామని వెల్లడించారు. ఈ-రైతు డిజిటల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫాం ఏర్పాటు ఒక వినూత్న విప్లవమన్నారు. మాస్టర్ కార్డ్ నిర్వాహకులు ఎప్పుడు కలిసినా రైతులకు ప్రయోజనకారిగా ఉండే సాంకేతికతను తీసుకురావాలని కోరామన్నారు. ఆర్థిక, సాంకేతిక రంగంలో మాస్టర్ కార్డ్స్ ఉద్దండులని ప్రశంసించారు. రైతులకు ఉపయోగంగా ఉండే వేదికను పరిచయం చేయటం గర్వకారణమన్నారు. ఈ విధానం తొలిసారిగా ఏపీలో ప్రారంభించటం విశేషమన్నారు. సాగు వివరాలు, ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవటంతో పాటు ఈ-రైతు డిజిటల్ మార్కెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా పంటలు విక్రయించుకునే అవకాశం రైతులకు ఉంటుందన్నారు. రైతులకు మార్గదర్శిగా, సలహాలిచ్చే స్నేహితునిగా ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తూ వాటికి రెట్టింపు ఆదాయాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగం సమృద్ధిగా ఉండాలన్నారు. రైతులు రెట్టింపు ఆదాయంతో సంతృప్తితో జీవించాలని ఆకాంక్షించారు. అందుకే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి, మత్స్య, పశు పోషక రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆహార శుద్ధి పరిశ్రమలకు ఊతమిస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీటిని అందించాలనేది తమ ధ్యేయమన్నారు. ఈ-మార్కెట్లదే ప్రస్తుతం హవా అన్నారు. అలీబాబా, ఫ్లిప్‌కార్డ్, అమెజాన్, ఊబర్ విజయగాథలు మరెందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి దాయకమన్నారు. ఈ-రైతును మాస్టర్ కార్డ్ సంస్థ వ్యాపారం కోసం ప్రవేశపెట్టలేదన్నారు. రైతుల పట్ల శ్రద్ద, వ్యవసాయం పట్ల మక్కువతో ఈ ప్లాట్‌ఫాం తీసుకొచ్చామని వివరించారు. ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా సొంత నేల రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. జన్మభూమిపై ఉన్న సొంత మనుషులకు ఏదైనా చేయాలనే తపనతో ముందుకు రావాలన్నారు. ఈ-రైతు తరహా వినూత్న ప్రయోగాలకు సిద్ధం కావాలని సూచించారు. అలా ముందుకొచ్చే యువతకు స్టార్టప్స్ ఏర్పాటులో అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రగామిగా ఉందని, రానున్న కాలంలో రెండు కోట్ల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయాలని నిర్దేశించామన్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కార్యక్రమంలో మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కె ప్రసాద్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజవౌళి పాల్గొన్నారు.

ఈ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సభలో ప్రసంగిస్తున్న దృశ్యం