డైలీ సీరియల్

అన్వేషణ -35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అటెండర్‌నండి..’
‘‘ఇప్పుడు ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి రేట్లు?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘బాగా పెరిగాయండి..’’
‘‘ఎందుకని?..’’
‘‘ఎందుకంటే.. కారణం అంటూ ఉండదండి.. ఈళ్లు పెంచేత్తుంటారు.. అంతేనండి.. మీరేవన్నా కొందావనుకుంటున్నారా?’’
‘‘అవును.. అందుకే వచ్చాం..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘ఎవర్ని కలిస్తే సరైన వివరాలు చెబుతారు?..’’ కొండబాబు అడిగాడు.
‘‘రాగిణి మేడమ్‌ని కలవండి.. ఆమెగారు ఎంత చెబితే అంత మా బాస్‌కి..’’
‘‘ఎందుకని..?’’
‘‘ఎందుకంటే.. అంతేనండి మరి..’’ అని నవ్వేశాడు అతడు.
దాని భావం అనిరుధ్‌కి, కొండబాబుకి సగం అర్థమయ్యింది. ఆ వెంటనే కొండబాబుకి భార్య చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఆమె భర్తని వదిలేసిందని, క్యారెక్టర్ గురించి ఏవేవో చెప్పుకుంటారని.
‘‘ఆవిడ కమిషన్ తీసుకుంటుందా.. నువ్వేం ఇప్పించలేవా?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘నేనైనా ఆమెగార్నే అడగాలండి..’’
‘‘ఇప్పుడున్నారా ఆవిడ?.. పేరేంటన్నావ్?’’
‘‘ఉన్నారండి.. రాగిణి గారండి..’’ అని చెప్పి ఫ్లాస్కు తీసుకుని వెళ్లిపోయాడు అటెండర్
‘‘మీ ఆవిడ చెప్పిన కేండేటు ఆవిడేనా?’’ అనిరుధ్ అడిగాడు కొండబాబుని.
‘‘పేరు ఆమెకీ సరిగ్గా గుర్తులేదురా... ఉండు ఫోన్ చేసి కనుక్కుంటాను..’’ అంటూ ఇంటికి ఫోన్ చేశాడు కొండబాబు. భార్యని రాగిణి పేరు చెప్పి ఆమేనా అని అడిగాడు. అయ్యుండవచ్చునన్నదామె.
‘‘ఆమెకి పేరు సరిగ్గా గుర్తులేదు.. కానీ పేరు వైరైటీగా ఉంటుందన్నది సావిత్రి.. బహుశా రాగిణే కావచ్చు.. ఆఫీసుకు వెళ్లి పలుకరిద్దాం.. మా ఆవిడ పేరు చెప్పి ప్రయత్నిద్దాం.. ఒకవేళ ఆమె కనుక అయ్యుంటే పర్సనల్‌గా ఇంటికి వచ్చి మాట్లాడదాం అని చెబుతాం..’’ అన్నాడు కొండబాబు ఆమె ప్రవర్తన గురించి భార్య చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ.
ఇద్దరూ లేచి రియల్ ఎస్టేట్స్ ఆఫీసులోకి వెళ్లారు. ఆఫీసు గది చాలా అందంగా అలంకరించబడి ఉంది. గోడలకి వాళ్లు అంతకుముందు వేసిన వెంచర్లకు సంబంధించిన ఫొటోలున్నాయి. గదికి ఓమూల స్టూలుమీద గౌతమబుద్ధుని విగ్రహం ఉంది. ఆ విగ్రహంపైన గోడమీద ‘నమ్మకమే బలం.. అది కోల్పోయినవాడు మనిషిగా బ్రతకడం వ్యర్థం’ అన్న కొటేషన్ ఉంది. గదిలో పేపర్లు ఉన్నాయి. గదికి ఆగ్నేయంలో ఐదున్నర అడుగుల ఎత్తులో క్యాబిన్ ఉంది. దాని ముందు ఓ పెద్ద అందమైన టేబుల్ ముందు రివాల్వింగ్ ఛైర్‌లో ఒకావిడ కూర్చునుంది. ఆవిడ టేబుల్ నిండా ఫైళ్ళు, బ్రోచర్లు ఉన్నాయి. ఆవిడే ఆ ఆఫీసులో బాసు తర్వాత బాసు అంతటి వ్యక్తి. ఆమె కట్టుకున్న చీర చాలా ఖరీదైనదిలా ఉంది. ఎడమ చేతికి రెండు జతల బంగారు గాజలున్నాయి. కుడి చేతికి గోల్డ్‌కలర్ చైన్ ఉన్న రిస్టు వాచి ఉంది. మెడలో నానుతాడూ, మరో గొలుసూ ఉన్నాయి. చెవులకి పెట్టుకున్న దిద్దులూ తళుక్కున మెరుస్తున్నాయి. పాపిట మొదట్లో కుంకుమ అద్దింది. నుదుటను కందిబద్దకన్నా కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుంది.
అనిరుధ్, కొండబాబు లోపలికి రాగానే ఆవిడ చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించింది. తనకెదురుగా ఉన్న కుర్చీలు చూపించింది. ఇద్దరూ కూర్చోగానే అటెండర్ శుభ్రమైన గాజు గ్లాసులలో మంచినీళ్ళు తెచ్చి వాళ్లకెదురుగా పెట్టాడు.
‘‘చెప్పండి సర్..’’ అన్నదామె చిరునవ్వుతోనే.
‘‘ఒక ఫ్లాట్ తీసుకుందామని?..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘తప్పకుండా సర్.. ఎంత ఇనె్వస్టు చెయ్యగలరు?’’ అడిగిందామె ప్రస్తుతం తాము వేసిన వెంచర్ల గురించి వివరిస్తూ, అందుకు సంబంధించిన బ్రోచర్‌లను చూపించింది.
‘‘మీకు సావిత్రి తెలుసా?..’’ అడిగాడు కొండబాబు ఆమెను.
‘‘సావిత్రి?!.. ఏ సావిత్రి సర్?’’
తన భార్య సావిత్రి ఊరు, తన అత్తమామల పేరూ వివరంగా చెప్పాడు. ఆమె తన భార్య అని కూడా చెప్పాడు.
‘‘ఓఁ.. ఆ సావిత్రా.. తెలియకేం.. నాకు డిస్టెన్స్ రిలేటివండీ.. మీ వైఫా?.. సంతోషం అండీ.. మీ పెళ్లికి నేను రాలేకపోయాను.. ఇక్కడే ఉంటున్నారా.. ఎక్కడ?’’ తన భార్య గురించి ఆమె ఉత్సాహంగా మాట్లాడేసరికి కొండబాబు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. రాగిణితో తమ పని అవుతుందన్న ధీమా కలిగింది. మిత్రుడికేసి సంతృప్తిగా చూశాడు.
‘‘మీతో పర్సనల్‌గా మాట్లాడాలి.. మీరు ఉంటున్నది ఎక్కడ?’’ కొండబాబు అడిగాడు నెమ్మదిగా ఆమె ఎలా తీసుకుంటోందనన్న బెరుకుతో.
‘‘సైట్స్ గురించే కదా!.. రండి ఫర్వాలేదు.. సండే ఇంటి దగ్గరే ఉంటాను.. వచ్చే ముందు ఫోన్ చెయ్యండి.. సావిత్రిని కూడా తీసుకురండి..’’ అన్నదామె.
‘‘ఈ బ్రోచర్ నేను తీసుకుంటాను..’’ అన్నాడు అనిరుధ్.
‘‘ష్యూర్... తీసుకోండి.. మీకు నేను మాక్సిమమ్ డిస్కౌంట్ ఇప్పిస్తాను..’’
‘‘ఇంటికొచ్చి మాట్లాడతాం.. ’’ అంటూ లేచాడు కొండబాబు.
‘‘అలాగే.. అంటే రేపే వస్తారా మీరు..?’’
‘‘ఎస్.. రేపే.. లెవెన్ ఆ ప్రాంతంలో వస్తాం..’’ చెప్పి బయటికి వచ్చేశారిద్దరూ.
బైక్ స్టార్ట్ చేసి కొంతదూరం వెళ్లిన తర్వాత అన్నాడు అనిరుధ్: ‘‘ఈవిడ బాసు నారాయణకు బాగా కావాల్సిన మనిషనుకుంటానురా’’ అని.
‘‘అనుకుంటాను కాదు.. కావాల్సిన వ్యక్తే.. ఈమెను పట్టుకుంటే మన పని అవుతుందన్న నమ్మకం ఉంది నాకు.. ఎందుకంటే ఇలాంటివాళ్లు ఎంతకైనా తెగిస్తాను.. ఏ పనైనా చేయగలరు..’’ కొండబాబు చెప్పాడు.
‘‘అంతేనంటావా?’’ అనిరుధ్ అన్నాడు.
‘‘కచ్చితంగా అంతే.. మడిగట్టుకుని కూర్చునే మనిషి కాదు.. అంటే అర్థమయ్యిందా?.. బాసు నారాయణను వలలో వేసుకున్న మనిషిలా ఉంది. లేకపోతే ఆఫీసు ఆమె చేతిలో పెట్టి అలా వెళ్లిపోడుగా వాడు.. పైగా ఆమె షోకు చూశావుగా.. అదుర్స్...’’ కొండబాబు నవ్వుతూ అన్నాడు.
‘‘ఆమెతో మన పని అవ్వాలి మరి!’’ అనిరుధ్ అన్నాడు అనుమానంగా.
‘‘నాకు మాత్రం అవుతుందనిపిస్తోంది’’ కొండబాబు ధీమాగా చెప్పాడు.
‘‘ఎలా?..’’
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842