డైలీ సీరియల్

అనంతం-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మను చంపుకొని దళారీలతో రాజీపడుతూ శ్రమశక్తిని కారుచవుకగా దోపిడి వర్గాలకు ధారపోస్తూ క్షణమొక యుగంగా బ్రతుకులీడస్తున్నదా-
సంకటి ముద్దలకోసమే!
అలాంటి సంకటిభాండానే్న బ్రద్ధలు చేశాడు వాల్యా.
లక్ష్మీబాయికోపం కట్టలు తెంచుకుంది.
ఆవేశం అవధులు దాటింది.
ఉత్తుంగ తరంగాలుగా ఎగసిపడ్డ ఆగ్రహం ‘నిగ్రహం’ అనే చెలియలికట్టలు దాటి, పుత్ర వాత్సల్యాన్ని కూడా ముంచెత్తి-
వాల్యా వీపుమీద ‘దబీ దబీ’ బాదింది లక్ష్మీమాయి.
‘నాకు వరి బువ్వ కావాలి’’ అన్నాడు ఏడుస్తూనే.
ఇంకా బాదింది.
‘వరి బువ్వ కావాలి’’
మళ్లీ బాదింది.
‘‘వరి బువ్వ కావాలి... వరి బువ్వ కావాలి’’
బాదీ.. బాదీ లక్ష్మీమాయి అలసి పోతోంది కానీ, వాల్యా మాత్రం ఏడుపు కట్టిపెట్టలేదు.
ప్రతి లాఠీ దెబ్బకూ స్వాతంత్య్ర పోరాట యోధులు ‘‘వందే మాతరం.. వందేమాతరం’’ అన్నట్టు వాడు దెబ్బదెబ్బకూ ‘‘వరి బువ్వ.. వరి బువ్వ’’ అంటున్నాడు.
హృదయ విదారకంగా వున్న వాక్యా ఆకలి కేకలు తండా అంతా వినిపించి, క్రమంగా అడవితల్లి గర్భంలో కలిసి పోతున్నాయి.
అలాంటి ఏడుపులు అక్కడ మామూలే!
తండా వౌనంలో తల దాచుకుంది.
* * *
పగిలిన అద్దం పెంకులో అందాన్ని చూసుకూని తనలో తనే మురిసిపోతున్నది చాందనీ!
ఇంట్లో ఒక్కర్తే వుంది. తండ్రి నగ్గూరాం నాయక్ తండావాళ్లతో కలిసి అడవికి వెళ్లాడు. ప్రొద్దువాలే వేళకుకానీ తిరిగి రాడు.
వాల్యా ఏడుపు చాంద్‌నీకి వినిపించింది.
వాడంటే ఆమెకు చాలా ప్రేమ. రోజూ వాడితో కలిసి కొంతసేపైనా కాలం గడపందే చాంద్‌నీకి ప్రొద్దుపోదు.
వాల్యా అలా ఎందుకు ఏడుస్తున్నట్టు?
అద్దం పెంకును భద్రంగా దాచిపెట్టి హడావుడిగా బణావతు ఇంటికి పరుగుతీసింది.
‘‘లగెత్తుకొచ్చావూ’’ అన్నది లక్ష్మీబాయి నవ్వుతూ.
అలాంటి సమయంలో వాల్యాతో ఏడుపు మాన్పించే కిటుకు చాంద్‌నీకి మాత్రమే తెలుసని లక్ష్మీబాయికి తెలుసు.
‘నా తమ్ముడ్ని కొట్టే అతికారవ్ ఎవుడిచ్చిందడు నీకు?’’ అని లక్ష్మీబాయిమీద కోపం నటించి అమాంతం వాల్యాను ఎత్తుకుంది చాంద్‌నీ.
వాడు కిలకిలా నవ్వాడు.
తల్లివైపు గర్వంగా చూసాడు.
‘‘బువ్వదినవూ?’’ విషయం తెలుసుకుని వాల్యాను అడిగింది చాంద్‌నీ.
‘‘వరి బువ్వ కావాలి’’ అన్నాడు వాడు.
లక్ష్మీబాయి దీనంగా చూసింది. ‘‘పొద్దుగాల్నించి వాడి యవ్వారవ్ అట్టాగే వుంది. రాగి సంకటి కుండనే పగల్నూకాడా... నా తోన తన్నులే దిన్నాడా..’’ అన్నది బాధగా.
‘‘కొట్టినావా? ఇంకోపాలి వాల్యాని కొట్టినావంటే జాంపండ్లు పెట్టను జగరత’’ అని వెంటనే వాల్యా మొహంలోకి చూస్తూ ‘‘అమ్మతో మనకేంటిగానీ ఆడుకుందాం పద’’ అంటూ వాల్యాతో సహా బైటికి వెళ్లిపోయింది చాంద్‌నీ.
తుపాను వెలిసినట్టుంది. లక్ష్మీబాయి ఊపిరి పీల్చుకుంది.
వాల్యాను మాటలతో మభ్యపెట్టి సమస్యను చాంద్‌నీ వాయిదా వేసింది కానీ, ఏమిటి ప్రయోజనం?
వాల్యా మళ్లీ వరి బువ్వ కావాలంటే ఏం చెయ్యాలి?
లక్ష్మీబాయికి ఏమీ తోచలేదు. బాధగా, భయంగా వుంది.
బియ్యం గింజలమీద కొడుకు పేరు రాయనందుకు దేవుడ్ని ఆడిపోసుకుంటూ వౌనంగా కూర్చుంది, శూన్యాన్ని చూస్తూ
ఎంత సమయం గడిచిందో!
బాణావతు గౌరారం సంత నుంచి ఆపసోపాలు పడుతూ ఇంటికి చేరాడు.
కందిపప్పు రాగిపిండి ఉల్లిగడ్డలు బైటపెట్టి-
‘‘సరుకులు సదురుకో’’ అన్నాడు భార్యతో.
‘‘అంతోటి సరుకులు సదరనీకి తొందరేంటిది?’’ అన్నది.
లక్ష్మీబాయిని అప్పుడు పరీక్షగా చూసాడు బాణావతు!
ఆమె చిత్తడి కళ్లల్లో దైన్యం గూడు కట్టి కనిపించింది!!
‘‘ఏటయ్యింది?’’ అడిగాడు బాణావతు.
లక్ష్మీమాయి వౌనంగా వుంది.
‘‘రిబ్బన్ కోసరవా?’’
మాట్లాడలేదు లక్ష్మీబాయి.
‘‘శాకిరి శేరు లాభవ్ శటాకు! సంత బేరవ్ సంకనాకినట్లుంది. సరుకులకే సరి! రూపాయి మిగల్నేదు. మళ్లొచ్చే ఆదోరవ్ తెత్తానే్ల నీకు రిబ్బను.’’
‘‘నీ రిబ్బను ఒలుకుల్లోగాల’’ అని గయ్యిన లేచి-
‘‘సంత బేరవ్ సంకనాకితే నాకేంటిగ్గానీ, వాల్యాగాడి సంగతి సూడు’’ అన్నది లక్ష్మీబాయి.
‘‘ఏటయ్యిందేటి?’’
‘‘వరి బువ్వగావాల్నంట’’
‘‘యాడుందంట’’
‘‘సిన్నోడు. లోకవ్ తెలవనోడు. ఆడికేవిదెల్సూ?’’
‘‘ఐతే?’’
‘‘రాగి సంకటి వొద్దన్నడు’’
‘‘అంటే?’’
‘‘ఏడ్సిండు’’
‘‘ఏడిత్తే?’’
‘‘దబీ దిబీ బాదినానంతే’’
‘‘ఓస్... అంతేనా...’’
లక్ష్మీబాయి పెద్దగా ఏడ్చింది.
‘‘ఏంటికట్టా ఏడుత్తావ్?’’ బాణావతు అడిగాడు.
‘‘పాపిట్టిదాన్ని! బువ్వెట్టే సేతుల్తో బువ్వడిగిండని కొట్టాను’’
‘‘ఎవురివి నువ్వు?’’
జాలిగా చూసింది.
‘‘వాల్యాగాని అమ్మవి’’
‘‘అయితే కొట్టాల్నంటావా’’
‘‘తిక్కల్దాన! ఆడ్ని కడుపున మోసి జల్మనిచ్చింది నువ్వు. పాలిచ్చి పెంచింది నువ్వు. సిలువూ సీదరా భరించి పెద్ద జేస్తంది నువ్వు. పులులు సివ్వాలూ ఎట్టాగా కాపుగాసి సంపుతయ్యో.. ఆటల్లో జెప్పి, అడవి విద్దెలు నేరిపేది నవ్వు.
సింతపొండు గొట్టొద్దని, తేనెపట్లు పట్టొద్దని, కాయాగసురూ కొయ్యొద్దని, కట్టి మోపులు కట్టొద్దనీ ఎవురోగన్న మమ్మల్ని అతికారులు లాటీల్తో గొడతావుంటే, కడుపున బుట్టిన వాల్యాగాడ్ని గొట్టే అతికారవ్ లేదంటనే నీకు’’ అడిగాడు బాణావతు.
అప్పుడు నవ్వింది లక్ష్మీబాయి.
‘‘బాగా గొట్టావా?’’ అని అప్పుడు అడిగాడు.
‘‘నా సేతులిరగ.. రాచ్చసి ముండని’’ అని లక్ష్మీబాయి మళ్లీ ఏడువబోతే, వారించి-
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు