మెయిన్ ఫీచర్

గాంధీతాత తెలుగు అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ’ అనే పుస్తకం- తెలుగు అకాడమీ ప్రచురణగా-1978లో వెలువడిన సంగతి మనలో చాలామందికి తెలుసు. తెలుగునాట గాంధీజీ చేసిన అనేక పర్యటనలకు సంబంధించిన విశ్వసనీయ చారిత్రక పత్రంగా దాని విలువ గురించి- నలభయ్యేళ్ళ తర్వాత-ఇపుడు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఈ చారిత్రక పత్రం పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో కూడా దుర్లభంగా మారిపోయిన వాస్తవం సయితం చదువురులందరికీ తెలిసిందే. గాంధీజీ నూట యాభయ్యో జయంతి నేపథ్యంలో ఇలాంటి పుస్తకాల కోసం కొత్తతరం పాఠకులు వెదుకులాడడం సహజం. తన జీవితమే తన సందేశమని గాంధీజీ చెప్పిన సంగతి మనకు తెలుసు. ఆ సందేశం వినాలని ప్రపంచమంతటా యువత చెవులు రిక్కించివున్న ఈ పూర్వరంగంలో, వాళ్లకి మనం అందించగల ప్రామాణిక, చారిత్రిక సమాచార పత్రాలు ఏమున్నాయి? వందలమంది రచయితలూ, పరిశోధకులూ, పత్రికా రచయితలూ గాంధీజీ జీవితం గురించి ఎనె్నన్నో రచనలు చేశారు. కానీ, వాటిల్లో తెలుగు ప్రజలతో గాంధీజీ పెంచుకున్న ఆత్మీయ అనుబంధం గురించి విశేషంగా వివరించిన సందర్భాలు అరుదు. దక్షిణాఫ్రికాలో ఉండిన రోజుల్లోనే గాంధీజీ తెలుగువాళ్లపట్ల ప్రత్యేకమైన అభిమానం ప్రకటించిన సంగతి చరిత్రకెక్కినదే. గుజరాత్‌ని మినహయిస్తే, ఆయన సంకీర్ణ మద్రాసు రాష్ట్రంలో సంచరించినంతగా మరెక్కడా తిరగలేదేమో! ఈ పూర్వరంగంలో, తెలుగు యువజనులకు గాంధీజీ తెలుగు ప్రజలపట్ల, తెలుగు ప్రాంతాలపట్లా ప్రదర్శించిన ప్రత్యేక అభిమానానికి తార్కాణంగా నిలిచే ఓ సమగ్ర గ్రంథం అందించాలనే ఆలోచనతో గుంటూరు నగరానికి చెందిన మిత్రులు కొందరు ముందుకు వచ్చారు. యువ పాఠకుల అవసరాలూ, అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ‘ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ’ పుస్తకాన్ని సంగ్రహ రూపంలో అచ్చు వెయ్యాలనుకుంటున్నామనీ, సంగ్రహపాఠం తయారుచేసే బాధ్యత నన్ను తీసుకోమనీ కోరారు. ప్రచురణకర్తల ఆలోచనలోని ఔచిత్యాన్నీ, సామంజస్యాన్నీ గ్రహించడం కష్టంకాదు. ఎందుకంటే గాంధీజీ ప్రజల మనిషి. ప్రజా జీవనంతో సంబంధం లేని జీవితమనేది ఆయనకి లేదు. అలా ఉండకుండా ఆయన చూసుకున్నారు. సత్యశోధనలో తన ప్రయోగాలు ఎంత వ్యక్తిగమయినవైనా, వాటిని పాఠకులతో పంచుకోవాలన్నదే ఆయన తపన. ఆ కారణం చేతనే, గాంధీజీ ప్రజాజీవన చరిత్రకి, మిగిలిన రచనలకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడిందని నా అభిప్రాయం. అయితే, నెలన్నర రోజుల వ్యవధిలో ఈ సంగ్రహ పాఠం తయారుచేసి, అచ్చుకు సిద్ధం చెయ్యడం పెనుసవాలనే వాస్తవాన్ని నా మూడున్నర దశాబ్దాల పత్రికీయ అనుభవం తక్షణమే నా దృష్టికి తీసుకురాకపోలేదు. నిజానికి, ఈ ప్రయత్నంలో అంతుమించిన సవాళ్లు మరెన్నో ఉన్నాయని కూడా నాకు అనిపించకపోలేదు. అయినప్పటికీ, ప్రచురణకర్తలకు నా సంసిద్ధత తెలియజేశాను.
నాలుగు దశాబ్దాల కిందట అకాడెమీ ప్రచురించిన ‘ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ’ పుస్తకానికి సంపాదక బాధ్యత వహించిన కొడాలి ఆంజనేయులు గొప్పకవి. ముద్దుకృష్ణ ఎంపిక చేసి, ప్రచురింపజేసిన భావకవితా సంకలనం ‘వైతాళికులు’లో ఆంజనేయులుగారి ఉత్తమ కృతులు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. విశ్వనాథతో కలిసి కవిత్వ సీమను ఔజ్జ్వల్యమానం చేసిన ప్రతిభామూర్తి కొడాలి. ‘సత్యాంజనేయ’ కవుల జంటగా ఈ మహాకవులు చెప్పిన ‘అవతార పరివర్తనము’ అనే రచనను బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించిన సంగతి కూడా చరిత్రకెక్కిన విషయమే. (తిలక్ అస్తమయం- గాంధీ అవతరణలే ఆ రచనకు ఇతివృత్తం కావడం కాకతాళీయం కాదు!) కొడాలి వారి పద్యాలు- ముఖ్యంగా ‘హంపీ క్షేత్రం’ కావ్యంలోనివి- చిన్నపుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకుని పెరిగిన తరానికి చెందిన వాణ్ణి నేను. అటువంటి కొడాలి దాదాపు దశాబ్దంన్నర కాలం శ్రమించి రూపొందించిన వెయ్యిపేజీల గ్రంథాన్ని మూడోవంతుకు తగ్గించి ఆధునిక పాఠకతరానికి అందించ తలపెట్టడం ఎంత దుస్సాహసమో, అందులో ఎంతటి శ్రమ ఇమిడి వుంటుందో అప్పటికి నాకు పూర్తిగా బోధపడలేదు. (‘సంగ్రహ’మనే మాటకి ఎత్తుకుపోవడం దొంగిలించడం అనే అర్థాలు కూడా ఉన్నాయని నిఘంటువులు చెప్తాయి. కొడాలి ఆంజనేయులుగారి కీర్తిప్రతిష్ఠల్ని నాలాంటి అర్భకుడు ‘సంగ్రహించ’లేడని నాకు తెలియనిదేం కాదు!) అయినప్పటికీ, ప్రచురణకర్తలకు నా సంసిద్ధత తెలియజేశాను కనుక చేతనయిన మేరకి ఈ పుస్తకాన్ని అచ్చుకు సిద్ధం చేసి మీకు అందిస్తున్నాను.
ఇందులో గ్రంథస్తమయిన విషయానికి సంబంధించిన రెండు మూడు ముఖ్యంశాలు మీ ముందుంచవలసి వుంది.
ఇందులో అర్ధ శతాబ్ది కాలంలో తెలుగునాట బాపూ చేపట్టిన పర్యటనల విశేషాలు ఉన్నాయి. 1896లో గాంధీ దంపతులు తొలిసారి మద్రాసు పర్యటనకు వచ్చేనాటికి, అది తెలుగు నగరంగా వర్ధిల్లుతోంది. అలాగే, 1946లో ఆయన చివరిగా పర్యటించిన అనేక ప్రాంతాలు- ఆనాటి నిజాం రాజ్యంలో భాగంగా ఉన్న ఖమ్మం లాంటి పట్టణాలు- సయితం తెలుగు ఊళ్లే. రాజకీయ సరిహద్దులను మించి, తెలుగు జాతి అనేక ప్రాంతాలకూ, రాష్ట్రాలకూ విస్తరించి వున్న వాస్తవం మాకు తెలియనిది కాదు. అలాగే, తెలుగు జాతిని అంతటినీ ఒకటిగా ముడివేసి వుంచగల బంధం మన భాషేననీ మాకు తెలుసు. కానీ, పుస్తక ప్రచురణకు పూనుకున్నప్పుడు- కృత్రిమమే అయినప్పటికీ- కొన్ని పరిమితులకు లోబడక తప్పదు. ఆ కారణం చేతనే, ఇప్పటి ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రంలో భాగమైన పల్లెలూ పట్టణాలలో గాంధీజీ చేసిన పర్యటనల గురించిన విశేషాలకు మాత్రమే ప్రస్తుత సంగ్రహ పాఠం పరిమితమైంది.
విభిన్న ప్రాంతాల్లో వివిధ జన సమూహాలు గాంధీజీకి సమర్పించిన సన్మాన పత్రాలూ, స్వాగత పత్రాలూ, వినతిపత్రాలూ, అర్జీల లాంటివి- మచ్చుకు ఒకటి రెండు తప్ప- ఈ సంగ్రహపాఠంలో చేర్చలేదు. అలా చేర్చితే దాన్ని ఆ పేరిట పిలవడం సార్థకంకాదనే ఉద్దేశంతోనే అలాచేశాం. ముందే చెప్పినట్లుగా ఈ సంగ్రహపాఠం లక్ష్యం, ఈతరం పాఠకుల అవసరాలను తీర్చడమే. ప్రచురణకర్తలు ఆ దృష్టితోనే ఈ పుస్తకంలోని భాషను సమకాలీన- ఆధునిక భావప్రకటనకు వాహికగా మార్చమని కోరారు. చదువరులకు పుస్తక పాఠం సహజంగా అనిపించే రీతిలో అలా చెయ్యవలసి వస్తే, మొత్తం పుస్తకాన్ని తిరగరాయవలసి వస్తుంది. అంచేత, వాడుకలోంచి తప్పుకున్న భావప్రకటనలను మాత్రమే సరిచేసి, పూర్వ పాఠానే్న కొనసాగించాం. ఇటువంటి ఆలోచనలు తుది పాఠం సిద్ధంచేసే దశలోనే తలెత్తుతూ ఉంటాయనీ, ఫలితంగా ఒక్కోసారి మొత్తం పాఠాన్ని తిరగదోడవలసి వస్తుందనీ విజ్ఞులకు తెలుసు. కాలపరిమితి విషయంలో మరికొంత వెసులుబాటు చిక్కివుంటే, నేనాపని- మొత్తం పుస్తకాన్ని ఆధునిక భాషలో తిరగరాసే పని-కచ్చితంగా చేసి వుండేవాణ్ణని ఈతరం చదువరులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
ప్రత్యక్షంగా ఈ పుస్తకంతో సంబంధం లేని ఒక విషయం ఇక్కడ ప్రస్తావించదల్చుకున్నాను. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉండిన రోజుల్లోనే తెలుగు, తమిళం ఒకమేరకు నేర్చుకున్నారు. ఆ రెండు జాతుల ప్రజలంటే తనకు ప్రత్యేకంగా అభిమానమని బహిరంగ సభల్లోనే ప్రకటించి వున్నారాయన. మరో సందర్భంలో బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలపై తనకు అపారమయిన ఆదరాభిమానాలున్నాయని కూడా గాంధీజీ పేర్కొన్నారు. వి.ఓ.చిదంబరంపిళ్ళై లాంటివారికి గాంధీజీ- 1915 ఆగస్ట్ నెలలోనే- తమిళంలో ఉత్తరాలు కూడా రాశారని చరిత్రకెక్కింది. ఇక, తెలుగు మాటలు ప్రయోగించి ఆంధ్ర మిత్రులను అలరించడం గాంధీజీకి ఎంతో మక్కువ కలిగించే కాలక్షేపమని ఆయన జీవిత చరిత్రను రాసినవారు పేర్కొన్నారు. తెలుగు ప్రజానీకంపై కూడా గాంధీజీ ప్రభావం అపారం. 1919లో గాంధీజీ పర్యటన ప్రభావంతో బెజవాడ, గుంటూరు, ఏలూరు, పెదపాలెం, నారాయణవనం, విశాఖపట్టణం, బరంపురం, రాజమహేంద్రవరం, చిరివాడ, గంపలగూడెం, సంగం, ఘంటశాల, గుడివాడ, కొవ్వూరు, సుబ్బారెడ్డిపాలెం, కోలవెన్ను, ఈమని, తుళ్లూరు, కోడూరు తదితర ప్రాంతాల్లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షలు జరిగాయి. వేలాది మంది స్వచ్ఛందంగా ఈ దీక్షల్లో పాల్గొన్నారు. 1929లో గాంధీజీ తెలుగునాట పర్యటించినప్పుడు, ఆయన దినచర్య పుస్తకం ఒకటి రాసుకున్నారు. దినచర్య పుస్తకాన్ని గుజరాతీ భాషలో ‘రోజ్‌నిశి’అంటారు. నవజీవన్ ట్రస్ట్ ఈ రోజ్‌నిశీని 2014లో మొట్టమొదటిసారిగా అచ్చువేసింది. ఒకేరోజున గాంధీజీ 27నుంచి 29 గ్రామాల వరకూ పర్యటించిన విషయం అందులో ఉంది. నిజానికి ఇది రెండు దినచర్య పుస్తకాల సంకలనం. గాంధీజీతోపాటుగా, కుసుమ్‌దేశాయ్ కూడా ఈ పర్యటనలో పాల్గొని, తానూ ఓ డయరీ రాసుకున్నారు. గాంధీజీ అంతేవాసుల్లో ఒకరయిన హరిలాల్ మానిక్‌లాల్ దేశాయ్ భార్య కుసుమ్. బరోడా హైస్కూల్‌లో ఫ్రెంచ్ భాషా బోధకుడిగా పనిచేస్తూ వుండిన హరిలాల్ దేశాయ్ సహాయ నిరాకరణ ఉద్యమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1927లో ఆయన కన్నుమూసిన తర్వాత కుసుమ్ సాబర్మతీ ఆశ్రమంలో చేరి, గాంధీజీకి సహాయకురాలిగా పనిచేశారు; అందులో భాగంగానే ఆమె 1929లో గాంధీజీతోపాటుగా ఆంధ్ర పర్యటనలో పాల్గొన్నారు. ఇంతవరకూ ఈ పుస్తకాలు తెలుగు భాషలోకి అనువాదమయినట్లు లేవు. ఆ పనికూడా చేసిన రోజున మాత్రమే, ఈ తరం పాఠకులకు గాంధీజీ గురించిన సమగ్ర సమాచారం అందించినట్లు అవుతుంది.
‘తెలుగునాట బాపూ బాట’ పుస్తకం తయారీలో నాకు సహకరించిన మిత్రుడు పి.వి.నరసింహారావుకు కృతజ్ఞతలు.

-మందలపర్తి కిషోర్ 81796 91822