సబ్ ఫీచర్

పనిచేసే నేతకు ప్రజల కూలి ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టపడిన వ్యక్తికి ఆ పనికి తగ్గ కూలి ఇవ్వటం సర్వసాధారణం. సమా జంలో అది కనీస ధర్మం కూడా. కూలి ఇవ్వని పక్షంలో పని చేయించుకున్న వ్యక్తి లేదా యజమాని క్షమార్హుడు కాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ళ పరిపాలనలో తన కష్టానికి రాబోయే 2019 ఎన్నికల్లో తగిన కూలి ఇవ్వాలని జన్మభూమి గ్రామసభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన పనులు ఏమిటి? ఆయన పనిదినాలు ఎన్ని? ఏయై పనులను ఆయన చేపట్టారు? ఎన్ని పనులను పూర్తిచేశారు? ఇంకెన్ని పనులను ప్రస్తుతం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు జవాబులను ఆంధ్రా ప్రజలే నిర్ణయించాల్సి ఉంది. చేసిన ఆయా పనులను బట్టి సీఎంకు ఎంత కూలి ఇవ్వాలో కూడా సీమాంధ్రులే నిర్ణయించాల్సిన అంశం. గత నాలుగున్నరేళ్ళ కాలంలో చంద్రబాబు చేసిన, చేస్తున్న పనులను ఒకసారి పరిశీలిద్దాం.
2014 జూన్ 2వ తేదీన రాష్టప్రతి ఆమోదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా విడిపోయంది. జూన్ 8వ తేదీన చంద్రబాబు తన క్యాబినెట్ మంత్రులతో కలిసి విడిపోయిన నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అవరోధంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపేలా కేంద్ర ప్రభుత్వంచే ఆర్డినెన్స్ ఇప్పించారు. దీంతో పోలవరం నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన అడ్డంకి తొలగింది. వందేళ్ళ నాటి పోలవరం నిర్మాణ కలకు శ్రీకారం జరిగింది.
16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు విజయవాడలో ఒక చెట్టు కింద బస్సులో ఉంటూ తొలి పాలనకు శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ఋణమాఫీ హామీ కోసం రూ. 24,500 కోట్ల ఋణాలను 5 విడతలుగా మాఫీ చేసేందుకు నడుం కట్టారు. ఇప్పటికి 3 విడతల్లో దాదాపు 15,038 కోట్లను ఋణమాఫీ క్రింద 57.21 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 8 వేల కోట్ల రూపాయలను 2 విడతల్లో చెల్లించేందుకు సంసిద్ధతను ప్రకటించారు. 86.40 లక్షల మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ కింద రూ. 10 వేల కోట్లు చెల్లించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు వంటివారికి పింఛన్లను 5 రెట్లు పెంచారు. వీరితో పాటు చేతివృత్తులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులు, ట్రాన్స్‌జండర్‌లకు మొత్తం 51 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా నెలకు రూ. 1,000, రూ. 1,500, రూ. 2,500 వరకు ప్రతినెల మొదటి తారీఖు ఠంచనుగా చెల్లించటం గమనార్హం. రాష్ట్రంలో దాదాపు 54 లక్షల మందికి ఏటా రూ. 6 వేల కోట్లు పింఛన్లుగా అందించటం జరుగుతోంది.
ముఖ్యమంత్రి యువనేస్తం పథకంతో 4,01,008 యువతకు నెలకు రూ. 1,000 నిరుద్యోగ భృతితో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకు అల్పాహారం, భోజన సదుపాయం కల్పించారు. 35 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీసీ కులాల సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించి, దేశంలోనే తొలిసారిగా బిసి సబ్‌ప్లాన్, ఆదరణ-2 పథకం, 90% రాయితీతో ఆధునిక యంత్రాలు, పనిముట్లు అందచేస్తున్నారు. ఎస్సీల సంక్షేమానికి రూ.42,254 కోట్లు, ఎస్టీలకు రూ. 14,210 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉపకార వేతనాలు, ఫీజుల చెల్లింపు జరుగుతోంది. కాపు కార్పొరేషన్‌కు గత 4 ఏళ్ళలో రూ.3,100 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య, జాబ్‌మేళా, ఋణమేళాలు, నైపుణ్య శిక్షణ, కాపు భవనాల నిర్మాణం, కాపు రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ బిల్లు ఆమోదం వంటి పనులను చేశారు. 213 కోట్లతో చంద్రన్న పెళ్ళి కానుకలు ఇచ్చారు. బీసీలకు 35 వేలు, ఎస్టీలకు 45 వేలు, ఎస్సీలకు 50 వేలు, ముస్లింలకు దుల్హన్ పథకం కింద మరో 50 వేలు ఇస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గత 4 ఏళ్ళలో 285 కోట్లు కేటాయించారు. పేద బ్రాహ్మణులకు చదువు, ఉపాధితో ఆర్థిక సాయం, పింఛన్లు, స్వయం ఉపాధి కల్పించారు. 18 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, వికలాంగుల విద్యార్థులకు రూ. 11,342 కోట్లు స్కాలర్‌షిప్‌లుగా అందించారు. ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా 17.14 లక్షల మంది పేదలకు రూ. 4,758 కోట్లతో ఉచిత వైద్య సేవలు అందించారు. 2.5 కోట్ల అసంఘటిత కార్మికులకు 2 లక్షల నుండి 5 లక్షల వరకు చంద్రన్న బీమా భరోసా కల్పించారు. ఇప్పటికి 2 వేల కోట్లు చంద్రన్న బీమా క్లైయిమ్స్‌గా చెల్లించారు.
రాష్ట్రంలో ప్రతిగ్రామానికి సిసి రోడ్లు వేయాలనే లక్ష్యంతో రాష్ట్రం మొత్తం 24 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. క్రిస్టియన్, సంక్రాంతి, రంజాన్ పండుగల కానుకలను పెద్దఎత్తున అందచేశారు. ఎన్టీఆర్ హౌసింగ్ క్రింద 80 వేల కోట్లతో 30 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టి, ఇప్పటికి 10 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తిచేశారు. పట్టణ ప్రాంతాల్లో జి+3 ఇళ్ళను నిర్మిస్తూ ప్రభుత్వ, పోరంబోకు స్థలాల్లో లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేశారు. కృష్ణాజలాలు సకాలంలో రాకపోవటంతో 2016లోనే రూ. 1,600 కోట్ల వ్యయంతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపే పూర్తి చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా - గోదావరి నదులను అనుసంధానం చేశారు. రెండు ప్రధాన నదులు అనుసంధానం కావటం దేశంలో ఇదే మొదటిసారి. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్ళను కృష్ణాడెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయుకట్టుకు ఇచ్చి, శ్రీశైలం నుండి కృష్ణాజల్లాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు అందించారు. దీంతో కృష్ణాడెల్టాలో దాదాపు 10వేల కోట్ల పంట దిగుబడులను కాపాడారు. కరువు సీమలోని రైతుల కన్నీళ్ళను తుడవగలిగారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా 64% పూర్తి చేశారు. ఇప్పటికి రూ. 10,500 కోట్లు ఖర్చు చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉన్నా, ఆ నిధులను సక్రమంగా ఇవ్వకపోవటంతో రాష్ట్ర బడ్జెట్ నుండే నిధులను కేటాయించి, ప్రాజెక్టు పనులలో వేగం పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం ఖర్చుపెట్టిన ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 3 వేల కోట్లు బకాయిగా చెల్లించాల్సి ఉంది. స్పిల్‌వే పనులను కూడా పూర్తి చేసి 550 టన్నుల బరువు కలిగిన తొలి గేటును కూడా సిఎం చేతుల మీదుగా అమర్చారు. మరోప్రక్క ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అమరావతి ప్రాంతంలోని రైతులు అత్యంత ఖరీదైన 34 వేల ఎకరాల భూములను ఒక్క రూపాయి ఆశించకుండా రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. ఇంతటి అమూల్యమైన కానుకను రైతులు ఇవ్వటానికి ఉన్న ఏకైక కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షత, పరిపాలనా సమర్థత ఒక్కటే. పదేళ్ళపాటు ఏపికి కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్నా, తొలి అసెంబ్లీ సమావేశాలను కూడా హైదరాబాదులో కాకుండా ఎపి నుండే చంద్రబాబు మొదలుపెట్టారు. 2 ఏళ్ళలోనే తాత్కాలిక శాసనసభ నిర్మాణాన్ని పూర్తి చేసి అసెంబ్లీ సమావేశాలను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం వంటి నిర్మాణాలను వందల అడుగుల ఎత్తులో ప్రపంచం గుర్తించేలా పనులను చేపట్టారు. వీటితో పాటు కృష్ణానదిపై పవిత్ర సంగమం దగ్గర 1300 కోట్లతో కూచిపూడి నాట్య భంగిమతో ఐకాన్ బ్రిడ్జి, మరో2,200 కోట్లతో దాములూరు-వైకుంఠపురం వద్ద మరో బ్రిడ్జి పనులను చేపట్టారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనులను 90 శాతం పూర్తి చేశారు. విజయవాడ ప్రజలకు ఇసుమంత ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ పనులను సక్సెస్ చేశారు. కియా మోటార్స్, హీరో, అపోలో టైర్స్, ఇసుజు, అశోక్ లేల్యాండ్ వంటి దేశ విదేశీ కంపెనీల స్థాపనకు కృషి చేశారు. తద్వారా లక్షల ఉద్యోగాలకు మార్గం సుగమం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 43% పెంచారు. కృష్ణ, గోదావరి నదుల పుష్కరాలను ఘనంగా నిర్వహించారు.
ఇవన్నీ ఒక ఎతె్తైతే వీటన్నింటికి మించిన ధీరోధాత్తమైన యుద్ధాన్ని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన మోదీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తిరగబడ్డారు. విభజన చట్టంలోని ప్రతి హామీని నెరవేర్చాలని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పోరుబాటలో నడిచేందుకు సంకల్పం చేపట్టారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం 11 ధర్మపోరాట దీక్షలు చేశారు. ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను నవ్యాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా రోజుకు 18 గంటలు పనిచేశారు. ఇన్ని పనులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంత కూలీ ఇవ్వాలి? అనే నిర్ణయాధికారం సీమాంధ్ర ఓటరు మహాశయులదే. పనిచేసిన వ్యక్తి కూలి అడగటం ఎంత ధర్మమో, పనికి తగ్గ గుర్తింపు, గౌరవం ఇవ్వటం కూడా ప్రజలకు అంతే ధర్మం.

-పోతుల బాలకోటయ్య 98497 92124