ఆంధ్రప్రదేశ్‌

సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జనవరి 13:సంక్రాంతికి కోడి పందేలు నిషేధిస్తూ ఉన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పోలీసులు చెబుతుంటే, ఆరునూరైనా భోగి రోజు నుండి సంక్రాంతి నాలుగు రోజులూ కోడి పందాలు ఆడి తీరుతామని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వాహకులు చెబుతున్నారు. కోడి పందాలు నిర్వహించే ప్రదేశాలు గుర్తించి పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కూడా కోడి పందేలు అరికట్టేందుకు రంగంలోకి దిగారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ ఆదివారం జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్‌లోని రెండు సర్కిల్స్‌లోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోడి పందేలు, గ్యాంబ్లింగ్ నిర్వహించే ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ వాహనాలతో పెట్రోలింగ్ చేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. ధర్మాజీగూడెం, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే బరులు ధ్వంసం చేసినట్టు చెప్పారు. ఇంకా బరులు ధ్వంసం చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
కోడి పందేలు నిరోధించేందుకు సబ్ డివిజన్‌లోని పోలీసులకు సెలవులు రద్దుచేసినట్టు చెప్పారు. ప్రతీ పోలీసు విధి నిర్వహణలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. పలు మండలాల్లో పోలీసులు బరుల వద్దకు వెళ్ళి ఏర్పాట్లను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా నిర్వాహకులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదివారం రహస్య ప్రదేశాల్లో సమాలోచనలు సాగించారు. మండలంలో భారీ పందేలు జరిగే శ్రీనివాసపురంలో ప్రధాన బరిని వైసీపీ ఆధ్వర్యంలోను, బైపాస్ రోడ్డులో శ్రీనివాసపురం రోడ్డు జంక్షన్‌లోని తోటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోను, కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోను, జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేటలోని పామాయిల్ తోటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోను కోడి పందేలు నిర్వహించేందుకు ఒప్పందాలు కుదిరినట్టు తెలిసింది. మండలంలోని కేతవరం, పేరంపేట, ఎ.పోలవరం, గురవాయిగూడెం, తాడువాయి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోను, లక్కవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బరి, తెలుగుదేశం పార్టీ సహకారంతో వైసీపీ నేతలు మరొక బరి, నాగులగూడెంలో వైసీపీ ఆధ్వర్యంలో ఒక బరి నిర్వహించేందుకు ఒప్పందాలు కుదిరినట్టు తెలిసింది.
కోడి పందేలతోపాటు పేకాట, గుండాటలు వంటి గ్యాంబ్లిగ్‌కు కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి గ్యాంబ్లర్లు దిగినట్టు సమాచారం. భోగి రోజు ఉదయం 10 గంటలకు పందాలు వేసేందుకు సర్వసన్నద్ధంగా ఉంటామని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. బరుల వద్ద స్థలం రోలర్లతో చదును చేయించి, ట్యాంకర్లతో తడిపి, ఇనుప ముళ్లకంచె వేసేందుకు ఇనుప స్తంభాలు పాతడం కోసం గోతులు కూడా తవ్వి ఉంచారు. ఇనుప స్తంభాలు, ముళ్ల వైరు రహస్య ప్రదేశాల్లో ట్రాక్టర్లలో లోడు చేసి ఉంచారు. భోగిరోజు బరుల వద్ద నిఘా వున్న పోలీసులు వెళ్లిపోగానే అరగంటలో స్తంభాలు పాతి, ఫెన్సింగ్ వేసేందుకు, సీటింగ్ ఏర్పాట్లు చేసేందుకు వందలాది మంది కూలీలను కూడా సంసిద్ధంగా ఉంచారు. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా, రెవెన్యూ అధికారులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు జారీ చేసినా పందేలు ఆగవని పందాల రాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి పందాలకు కోళ్లను తీసుకువచ్చే బృందాలు ఇప్పటికే పట్టణంలోను, పరిసర గ్రామాల్లోని తోటల్లో కోళ్లతో మకాం చేశారు. పందేల రాయుళ్ల కోసం పట్టణంలోని లాడ్జి గదులన్నీ బుక్ అయిపోయాయి.
ఎప్పటిలా ఈ ఏడాది కూడా ఆనవాయితీగా కోడి పందేలు జరిగి తీరుతాయని రాజకీయ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. అలాగే మొగల్తూరు మండలంలో కోడి పందేలు నిర్వహించేందుకు పందేలరాయుళ్లు సన్నాహాలు చేస్తున్నారు. మొగల్తూరు స్టేషన్ పరిధి మొగల్తూరు కోట, రామన్నపాలెం చిల్లపెంకుల దిబ్బ, కెపి పాలెం నార్త్, పేరుపాలెం సౌత్, కాళీపట్నం గ్రామాలతో పాటు ఈ ఏడాది మండలంలోని వారతిప్ప గ్రామంలో కొత్త బరిలో పందేలు జరుగుతాయని సమాచారం.

చిత్రం..కోడి పందాల బరికోసం ఏర్పాటు చేసిన స్తంభాలను కూల్చివేస్తున్న పోలీసులు